Food

పాలు విరిగాయా… పారేయొద్దు!

Auto Draft

వేసవిలో తరచూ పాలు విరిగి పోతుంటాయి. వీటితో ప్రతి సారీ పనీర్‌ లాంటిదే కాకుండా ఇతర వంటకాలనూ ప్రయత్నించొచ్చు.

*రస్‌ మలై…
విరిగిన పాలను వడకట్టి ఓసారి నీటితో కడగాలి. ఆ తర్వాత చిల్లుల గరిటెలో వేసి పావుగంట ఉంచాలి. అందులోని నీళ్లన్నీ పోతాయి. ఇప్పుడీ పాల మిశ్రమంలో చెంచా మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే రస్‌మలై ఉండలు అంత బాగా వస్తాయి. పొయ్యి వెలిగించి కడాయి పెట్టి కప్పు చక్కెరకు నాలుగు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. అది కరిగి చిక్కగా మారే వరకు కలుపుతూ ఉండాలి. ఈ పాకంలో ఉండలను వేసి పదిహేను నిమిషాలు మరిగించాలి. దాంతో ఉండల పరిమాణం రెండింతలవుతుంది.

*రస్‌మలై జ్యూస్‌ కోసం…
పాన్‌లో అర లీటరు చిక్కటి పాలు పోసి వేడి చేయాలి. పావు కప్పు పాలలో ఒకట్రెండు కుంకుమపువ్వు రేకలు వేసి పక్కన పెట్టాలి. పాలు మరిగే సమయంలో చక్కెర, నానబెట్టుకున్న కుంకుమ పువ్వు రేకలు వేసి కలపాలి. చిన్న మంటపై ఓ పదినిమిషాలు మరిగించి కలుపుతూనే ఉండాలి.పాలను ఓ 20-25 నిమిషాలు మరిగించాక బాగా చిక్కగా మారతాయి. ఇందులో యాలకుల పొడి, పిస్తాలను వేసుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకంలోని రస్‌మలై బాల్స్‌ తీసి చేత్తో అదిమి ఈ మరిగించిన చిక్కటి పాలలో వేయాలి. ఈ పాలు కాస్త గోరువెచ్చగా ఉండాలి. ఈ మిశ్రమాన్ని అయిదారు గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి.

కలాకండ్‌…
మూడు కప్పుల విరిగిన పాలను సన్నని నూలు వస్త్రంలో పోసి చెనాను తీసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద పాన్‌ పెట్టి రెండు కప్పుల తాజా పాలను కాచాలి. దీంట్లో చెనాను వేసి బాగా కలపాలి. ఇవి కాస్త చిక్కగా అయ్యాక నెయ్యి, చక్కెర, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. బాగా దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్‌ తీసుకుని నెయ్యి రాసి దాని మీద సమానంగా పరవాలి. చల్లారిన తర్వాత నచ్చిన ఆకృతిలో కట్‌ చేసుకుని బాదం/కాజుతో గార్నిష్‌ చేసుకుంటే సరి.
చూశారుగా… ఈసారి పాలు విరిగితే ఈ రెండు స్వీట్లూ ప్రయత్నించి చూడండి.