DailyDose

పుటపుటలో పొద్దు

పుటపుటలో పొద్దు

ఒకప్పుడు పుస్తకాలు అద్దెకిచ్చే షాపులుండేవి. తోపుడు బండి మీద పుస్తకాలు అమ్మేవారు. విరివిగా సినిమాలు, కంప్యూటర్, ఇంటర్నెట్, ఫోన్లు అందుబాటులోకి రానంతకాలం పుస్తకం మాత్రమే అందుబాటులో ఉండే ఒక వినోద, విజ్ఞాన సాధనం. యద్దనపూడి లాటి నవలా రచయిత్రులకు పెద్ద పీట ఉండేది. మధుబాబు డిటెక్టివ్ నవలలు ఎక్కువమంది చదివేవారు. బాలమిత్ర, చందమామ పుస్తకాలు పిల్లలకు ప్రాణ స్నేహితులుగా ఉండేవి. హిగ్గిన్ బాథమ్స్ లాటి పుస్తకాలయాలు అప్పటి నుంచి ఇప్పటికీ పుస్తకాలను పాఠకులతో చదివిస్తూనే ఉన్నాయి. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ప్రింట్ మాధ్యమంలో చదవడానికి యువత ఆసక్తి చూపించడం తగ్గింది. అయితే ఇప్పుడంతా డిజిటల్ యుగం అయిపోయింది. ఇక పుస్తకమే లేదనుకోవడానికి వీలులేదు. ఏ రూపంలో ఉన్నా పుస్తకం సజీవంగానే ఉంది.

*మనదేశంలో గ్రామీణ యువతతో పోలిస్తే 31.2 శాతం పట్టణ యువత ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదువుతున్నారు. గ్రామీణ యువతలో ఐదవ వంతు మాత్రమే పాఠ్యాంశాలు కాకుండా వేరే పుస్తకాలు చదువుతున్నారు. 2014 పరిశోధన ప్రకారం మనవాళ్లు వారానికి 10 గంటలు పుస్తక పఠనానికి ఇస్తారట. దేశం మొత్తం మీద 25 శాతం యువత పస్తకాలు చదువుతున్నారు. దేశంలో ఇతర ప్రాంతాల కంటే నార్త్ ఈస్ట్ ప్రాంతంలో చదువరులు ఎక్కువ ఉన్నారు. అక్కడ ఎక్కువ మంది పుస్తకాలు చదివే అలవాటు చేసుకోడానికి కారణం, అక్కడ ల్రైబరీలు, బుక్ షాప్స్ అధికం. పుస్తక పఠనం గురించి టీచర్ల ప్రోత్సాహకం ఎక్కువ.

*మనదేశంలో 13 నుంచి 35 సంవత్సరాల వయసు యువత 332.7 మిలియన్ల మంది ఉంటే అందులో 41.7 శాతం కాల్పనిక కథలు చదువుతారు. 23.8 శాతం నాన్ ఫిక్షన్ చదువుతారు. 34.5 శాతం రెండూ చదువుతారు. చదువుకున్న యువతలో 26 శాతం మంది ప్రతిరోజూ పాఠ్యాంశాలు కాక ఇతర పుస్తకాలు చదువుతున్నారు. హిందీ భాషలో చదివేవారు 33.4 శాతం, మరాఠీ భాషలో 13.2 శాతం, బెంగాలీ శాతం 7.7 శాతం, ఇంగ్లీషులో 5.3 శాతం చదువుతారట. విద్యాధికులలో పుస్తక పఠన అలవాటు బాగా ఉంటుందనేది మాత్రం వాస్తవం. 39 శాతం మందికి పబ్లిక్ లైబ్రరీల్లో, 42.2 శాతం మందికి కాలేజ్/స్కూల్ లైబ్రరీల్లో, 14.7 మందికి ఇతర లైబ్రరీల్లో సభ్యత్వం ఉంది.

*ఇంకోటి, విద్యాధికులైన తల్లిదండ్రుల పిల్లల్లోనూ పుస్తకాలు చదివే అలవాటు ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రులు నిరక్షరాస్యులైనా తమ ఆనందం కోసం పుస్తకాలు చదివే యువత 17 శాతం మంది. ఫిక్షన్‌లో మూడు రకాలుంటాయి. కాల్పనిక కథలు, హాస్య కథలు, క్లాసిక్స్. శృంగార లేదా గ్రాఫిక్ నవలలు చదివే సంఖ్య చాలా తక్కువ. నాన్ ఫిక్షన్‌లో మతపరమైన పుస్తకాలు, బయోగ్రఫీలు, ఆటో బయోగ్రఫీలు కూడా వస్తాయి.

*పుస్తకాలు చదివే యువతలో 46 శాతం మంది పరిజ్ఞానం కోసం, రిలాక్సేషన్ కోసం 20 శాతం మంది, ఆనందం కోసం 19 శాతం మంది చదువుతారు. పైన చెప్పింది చదివేవారి విషయం అయితే, పుస్తకాలు చదవని వారు ఎందుకు చదవరనడానికి ఇవీ కారణాలు. ఆసక్తి లేకపోవడం, సమయం లేకపోవడం, పుస్తకాలు చదవక్కరలేకుండానే సమాచారం అందించే వేరే మార్గాలుండటం వలన, సరసమైన ధరలో పుస్తకాలు దొరకకపోవడం వలన చదవట్లేదు.

**పుస్తకాలు కూడా వైరల్ అవుతాయి
చైనా, రష్యా, ఇంకా ఇతర దేశాలతో పోలిస్తే మనదేశం చదువరుల జాబితాలో పైన ఉంది. అయితే అది అందరూ చేతిలో అచ్చు పుస్తకాలు పట్టుకుని చదువుతున్నారా అంటే సందేహమే. స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పుస్తకాలు, ఇలా ఎవరికి నచ్చిన పద్ధతి వాళ్లు ఎంచుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో కొత్త పోకడ ఏంటంటే, సామాజిక నెట్‌వర్క్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, మైక్రో బ్లాగింగ్ సైట్ల సమాచారం బట్టి కూడా చదువుతున్నారు. కొన్ని వీడియోలు, ట్వీట్లు వైరల్ అవడం సాధారణంగా చూస్తుంటాం కాని కొన్ని పుస్తకాలు కూడా వైరల్ అవుతాయి. 50 షేడ్స్ ఆఫ్ గ్రే అనే ఇంగ్లీషు నవలకి కేవలం ఒకరి నుంచి ఒకరికి మాట ద్వారా వచ్చిన పబ్లిసిటీ అమెరికా ఎల్లలు దాటి ప్రపంచం చుట్టేసింది. కుకూస్ కాలింగ్ అనే పుస్తకానికి కూడా అంతే ప్రాచుర్యం వచ్చింది. కొత్త తరం ఇతర పుస్తకాలు చదవడానికి వారికి సమయం, అభిరుచి రెండూ ఉండట్లేదు. ర్యాంకుల రేసులో పరిగెత్తడానికి, తరగతి పుస్తకాలు బట్టి పట్టడానికే సమయం సరిపోదు. ఇక పుస్తక పఠనం ఎక్కడ? ఎవరికి సాహిత్యం గురించి కాని పుస్తకాభిలాష కాని ఉన్నట్లు చూడట్లేదనేవారు కూడా ఉన్నారు.

**పుస్తకం అంతా చదివే ఓపిక లేక..
ఈ బుక్ చదువరులు పెరిగిన తర్వాత 3.3 రెట్లు పుస్తకాల కొనుగోలు పెరిగింది. ఆడియో పుస్తకాలను కూడా సిడిలు, ఎమ్‌పి3 ఫైల్స్‌గా మారుస్తున్నారు. ఇవైతే సులువుగా డౌన్‌లోడ్ చేయడానికి అనువుగా ఉంటుంది. ఇలా వైవిధ్యమైన ఫార్మాట్‌లో చదవడానికి మార్గాలు దొరకడంతో యువత సులువుగా చదువరులుగా మారుతున్నారు. ఇప్పుడంతా వేగవంతమైన జీవనశైలి. అన్నీ వేగంగా అయిపోవాలి. ఫలానా పుస్తకం బావుందని ఎవరన్నా చెప్తే అందులో ఒక్కో అక్షరం చదివి ఆస్వాదించే ఓపిక, తీరిక ఉండట్లేదు. సినాప్సిస్(సంక్షిప్తంగా)చదివేసేవాళ్లు చాలామందే ఉంటారు. తన పాఠకులకోసం ఇప్పుడు రచయితలు ఎక్కువ శ్రద్ధ కనబరుస్తున్నారు. తమ పుస్తకాలు చదివి అభిప్రాయాలు పంచుకోడానికి నెట్‌వర్కింగ్ సైట్లలో అందుబాటులో ఉంటున్నారు. పాఠకులతో మరింత స్నేహితంగా, సన్నిహితంగా ఉంటున్నారు. కొంతమంది రచయితలు కలిసి ఒక నెట్‌వర్క్‌గా ఏర్పడుతున్నారు. దానితో పాఠకులకు వారికి నచ్చిన రచయిత అందుబాటులో ఉంటున్నారు.

**పుట్టినరోజు కానుకగా పుస్తకం
పదేళ్ల పిల్లలకి పుట్టినరోజు కానుకగా ఐఫోన్ లేదా సెల్‌ఫోన్ కానుకగా ఇస్తున్నాం కాని పుస్తకం బహుమతిగా ఎంతమంది ఇస్తున్నాం. పుస్తకం చదవడంలోని ఆనందం ఒకసారి వాళ్లకి అలవాటు చేస్తే కంటికి, వంటికి చేటు చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ జోలికే పోరు. ఒకప్పుడు పిల్లలు చందమామ. బాలమిత్ర లాటి పుస్తకాలు చదివేవారు. కథా ప్రపంచంలో, ఊహాలోకంలో విహరించడం పిల్లల సృజనకు పదును పెడుతుంది. ఇప్పుడు పిల్లలు రాజు,రాణీలు, పల్లెటూరి కథలు చదవడం ఇష్టపడకపోవచ్చు. కాని ఇప్పటి తరానికి నచ్చే హ్యారీపాటర్ సీరీస్, నార్నియా సీరీస్, కామిక్ సీరీస్ లాటివి బహూకరించవచ్చు. గ్రంథాలయాలు, బుక్ స్టోర్‌లు, రీడింగ్ క్లబ్‌లు మనదేశంలో కూడా ఉండాలి.

**ఆ అనుబంధం జీవితకాలం
చిన్నప్పటి నుంచే పిల్లల్లో చదివే ఆసక్తిని ఎలా పెంచాలి? పుస్తకాలు పెద్దగా చదివి వారికి వినిపించాలి. అప్పుడు వాళ్లకి పుస్తక పఠనం మీద ప్రేమ ఏర్పడుతుంది. వారిని మంచి చదువరులుగా మారుస్తుంది. వారంలో కనీసం ఐదు రోజలు 6-17 సంవత్సరాల వయసున్న పిల్లలకు ఈ పద్ధతి ద్వారా పుస్తకాలు అలవాటు చెయ్యచ్చు అంటున్నారు నిపుణులు. ఒకసారి పుస్తకం చదవడం అంటూ అలవాటయితే ఏవిధమైన పుస్తకాలు చదువుతారనేది వారి అభిరుచి బట్టి ఉంటుంది. ఒకరకంగా అది పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య విలువైన సమయంగా మారుతుంది.

*వారి అనుబంధం కూడా బలపడుతుంది. 85 శాతం మంది పిల్లలకు కూడా అలా పైకి పుస్తకాలు చదివి వినిపించడం ఇష్టపడతారట. ఇంగ్లీషు పుస్తకాలు చదివితే పద విజ్ఞానం, భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి. నవ్వించే కథలు, కాల్పనిక కథలు పిల్లలు ఇష్టపడతారు. ఊహాలోకంలో విహరించడం వారికి మరింత ఇష్టం. సాహసోపేతమైన కథల్లో ఆ పాత్రల్లో వారిని ఊహించుకుంటారు. అది వారికి అద్భుతమైన అనుభూతిగా మిగిలిపోతుంది. అందుకే ఒకప్పుడు పిల్లలకు పెద్దవాళ్లు కథలు చెప్పేవారు. ఆవిధంగా పుస్తకాలతో వారికి కలిగే అనుబంధం వారి జీవితకాలం ఉంటుంది. చిన్నప్పుడు చదివిన పుస్తకాలు, అందులో అంశాలు హృదయానికి హత్తుకుంటాయి.

**ఏ పుస్తకం ముందుంది…
2016 లో ఏ పుస్తకాలకి ఎక్కువ డిమాండ్ ఉందో అమెజాన్, సర్వే చేసింది. బాగా పుస్తకాలు చదివేవారిలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంటే బెంగుళూరు, ముంబయ్ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. 2016 వార్షిక రీడింగ్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం దేశం మొత్తంలో పుస్తకాలు చదివేవారిని లెక్కిస్తే మొత్తం ఇరవై నగరాల్లో కర్నాల్, వడోదర, పాట్నాలు మొదటి స్థానంలో ఉన్నాయి. కోయంబత్తూరు, విశాఖపట్నం, లక్నోలు తక్కువ పుస్తకాలు అమ్ముతున్నాయి. 2016 కి గాను చేతన్ భగత్ రాసిన వన్ ఇండియన్ గర్ల్ అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం. దాని తర్వాత స్థానం జెకె రోలింగ్స్ పుస్తకం, హ్యారీ పాటర్ అండ్ ద కర్స్‌డ్ చైల్డ్-పార్ట్ 1,2 దక్కించుకుంది.

*మూడవ స్థానంలో నార్మన్ లూయిస్ రాసిన‘వర్డ్ పవర్ మేడ్ ఈజీ’. నాలుగవ స్థానంలో రాబిన్ శర్మ రాసిన ‘హు విల్ క్రై వెన్ యు డై’ నిలిచింది. కాల్పనిక కథల్లో భారతీయ రచయిత సుదీప్ నాగర్‌కర్ రాసిన ‘షి స్వైప్డ్ రైట్ ఇన్‌టు మై హార్ట్’ పుస్తకానికి అత్యధికంగా ఓట్లు దక్కాయి. సావి శర్మ రాసిన ‘ఎవ్రీవన్ హ్యాజ్ ఎ స్టోరీ’తర్వాత స్థానం ఆక్రమించుకుంది. హిందీ పుస్తకాల్లో సురేంద్ర మోహన్ పాఠక్ రాసిన ‘ముఝ్‌సే బురా కోయి నహీ’పుస్తకానికి ఎక్కువ ఓట్లు దక్కాయి. నాన్ ఫిక్షన్ వర్గంలో జోసీ జోసెఫ్ రాసిన ‘ఎ ఫీస్ట్ ఆఫ్ వల్చర్స్’, స్ఫూర్తి సహారే రాసిన ‘థింక్ అండ్ విన్ లైక్ ధోని’ పుస్తకాలు అత్యధికంగా అమ్ముడు పోయాయి. ఆత్మకథల్లో రుచిర్ శర్మ రాసిన ‘ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నేషన్స్’, ఇమ్రాన్ హష్మి పుస్తకం ‘ద కిస్ ఆఫ్ లైఫ్’ స్థానం దక్కించుకుంది.

**కంప్యూటర్ సర్ఫింగ్ చేసేది ఏడు శాతమే
అచ్చు పుస్తకాలు మాయం అయిపోయి ఈ పుస్తకాల కాలం వచ్చేసింది. అయితే ఈ రెండిటిలో ఏది ఉత్తమం అంటే ప్రింట్ పుస్తకాలే అంటున్నారు. ఎంత ఈ పుస్తకాలు వచ్చినా కాని ప్రింట్ పుస్తకాల స్థాయి అలానే ఉంది. ఇప్పటికీ చాలామందికి ఈ పుస్తకం చదవడం ఇష్టం ఉండదు. ప్రింట్ పుస్తకం చదివితేనే చదివినట్టు ఉంటుంది. ఆ ఆనందమే వేరు అనేవాళ్లున్నారు. 6-17 ఏళ్ల పిల్లలు కూడా 80 శాతం మంది ఈ పుస్తకాల కంటే ప్రింట్ పుస్తకాలు చదవడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారని సర్వే చెబుతోంది. భారతీయుల్లో చదివే అలవాటు గురించి చూస్తే ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు తక్కువ మనదేశపు అక్షరాస్యత(74.04 శాతం) వలన పబ్లిషింగ్ హౌస్‌లు, ఆన్‌లైన్ బుక్‌స్టోర్‌లు సవాళ్లను ఎదుర్కుంటున్నాయి. ఇంకోవైపు సాంకేతికత పెరిగిపోయింది. కంప్యూటర్ వాడకం ఎక్కువై ఆన్‌లైన్ రీడర్స్ పెరిగిపోయారు అంటున్నారు. కాని 7 శాతం భారతీయులు మాత్రమే రోజూ కంప్యూటర్ సర్ఫింగ్ చేస్తున్నారు. కాబట్టి డిజిటల్ మీడియా వచ్చి ప్రింట్ మీడియాను పడేస్తుంది అనడానికి ఎక్కడా పొంతన లేదు.

**డబ్బున్న చోటే చదువుండాలని లేదు
ఒక అమెరికన్ పాఠకులు ఏడాదికి వేల సంఖ్యలో పుస్తక పేజీలు చదువుతారట. కాని ఒక భారతీయ పాఠకులు చదివే పేజీల సంఖ్య వందల్లోనే ఉంది అని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే కేవలం ఆర్థికంగా బాగున్న చోటనే చదివే అలవాటు ఉంటుందా అంటే అది కూడా సరికాదు. కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఎక్కువమంది రీడింగ్ హ్యాబిట్ ఉన్నవారుంటారు. వాస్తవానికి అవి హర్యాణా, పంజాబ్ రాష్ట్రాలతో పోలిస్తే ఆర్థికంగా వెనకబడిన రాష్ట్రాలే.

**యువతకి నచ్చేట్టు రాస్తున్నారు
పుస్తకాలు చదివే అలవాటు మనదేశంలో ఎలా మారుతూ వచ్చింది?మూడు దశాబ్దాల కిందట ఇప్పటితో పోలిస్తే అక్షరాస్యత చాలా తక్కువ. చేతన్ భగత్, దుర్జయ్ దత్తా ఇంకా కొంతమంది రచయితలు రాసిన ఏ పుస్తకమైనా మార్కెట్లో హాట్ కేక్. కారణం, అతనికి యువత నాడి తెలుసు. వాళ్లకి నచ్చేట్టు రాస్తాడు. పుస్తకం పేరు కూడా అంతే ఆసక్తిని రేపేట్లుగా ఉంటుంది. అతనే కాదు, చాలామంది భారతీయ యువ రచయితలు ఇంగ్లీషు నవల్స్ రాస్తారు. వాళ్లకి యువతలో మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఏ తరానికి నచ్చేట్టుగా ఆతరంలో రాయడం కూడా రచయిత బాధ్యత. అప్పుడే రీడింగ్ హ్యాబిట్ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మనదేశంలో ఆన్‌లైన్ బుక్ మార్కెట్ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం గణనీయంగా పెరుగుతూ పోతోంది.

**ఏ రీడింగ్ అయితే ఉత్తమం?
డిజిటల్ బుక్ రీడింగ్ పద్ధతుల్లో ఒకటి ఈ-రీడర్స్. అమెజాన్ వారి కిండల్ అనే ఈరీడర్ మంచి మోడల్. చదువుకోడానికి పనికొచ్చే ఈ ఎలక్ట్రానిక్ బుక్ ప్రింట్ పుస్తకానికి మంచి ప్రత్యామ్నాయం. అయితే ఇందులో కేవలం చదువుకోడానికి మాత్రమే వీలుంటుంది. కొన్నిట్లో వెబ్ బ్రౌజ్ లాటి అదనపు ఫీచర్లుంటాయి. అయినా కాని ఈరీడర్స్ చదువరులకు కొన్ని పరిధులుంటాయి. కేవలం ఈపేపర్ స్క్రీన్ మీద పేజీ పేజీ కనిపించడం తప్ప ఇంకేం ఉపయోగం ఉండదు. దాదాపు ఆరేడు వేల రూపాయల ఖరీదులో ఇవి దొరుకుతాయి.

*ట్యాబ్లెట్లు ఈరీడర్స్ కన్నా ఖరీదైనవి. ట్యాబ్లెట్లను ఈమెయిల్, వెబ్ బ్రౌజ్, సామాజిక మాధ్యమాలు, వీడియోలు, ఆటలు లాటి ఇతర అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. ట్యాబ్లెట్లో పుస్తకం చదువుకోవడం కూడా మంచి అనుభూతి. పేజి పెద్దదిగా, స్పష్టంగా బొమ్మలతో కనిపిస్తుంది. మంచి ఈరీడర్ కావాలంటే సాంకేతిక పునస్సమీక్షకుల అభిప్రాయం తెలుసుకుని కొనడం మంచిది. కేవలం నిపుణుల మీద ఆధారపడితే 3 స్టార్, 5స్టార్ ఈరీడర్స్ ఏవో చెప్తారు కాని మీరు ఏవిధంగా చదవడానికి ప్రాముఖ్యతనిస్తారు అనేది చెప్పరు.

*కేవలం చదువుకోవడానికి ఉపయోగించేవారు, పిల్లలకు దాన్ని దూరంగా ఉంచేవారు ఈరీడర్ కొనుక్కోవచ్చు. మీరు ఏడాదికి ఎన్ని పుస్తకాలు చదవగలరు? మీరు కొనే ఈరీడర్ వెర్షన్ ఏంటి? అది ఎన్ని పుస్తకాలను సేవ్ చేయగలదు చూసుకుని కొనాలి. రెండువేల పుస్తకాలు అంతకన్నా ఎక్కువ పుస్తకాలకు కూడా ఈరీడర్‌లో అవకాశం ఉంటుంది. అన్ని పుస్తకాలను ఒక చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్‌లో దాచుకుని చదవడం సౌకర్యవంతమే. అయితే ఇప్పుడు అందరి పని కంప్యూటర్ల మీదనే.

*ఎల్‌సిడి స్క్రీన్ వంక అదే పనిగా చూస్తే కళ్లు పొడారిపోతాయి. ఈరీడర్స్ స్క్రీన్ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంటుంది. మళ్లీ అలాటి స్క్రీన్ వంకే చూస్తే కళ్లు పాడవుతాయని భయపడితే చదవడానికి సులువుగా ఉండే ట్యాబ్లెట్ కొనుక్కోవచ్చు. అది చదవడానికి రంగు స్క్రీన్‌తో సౌకర్యవంతంగా ఉంటుంది. పైగా నాన్ ఫిక్షన్ పుస్తకం చదివేటప్పుడు మరింత లోతుగా విశ్లేషణ, లేదా దాని గురించిన సమాచారాన్ని వెబ్ నుంచి పనిలో పనిగా చదవాలంటే ట్యాబ్లెట్ అయితేనే వీలు.