Sports

త్యాగాలు తప్పవు! – కష్టేఫలి అంటున్న తెలుగు అథ్లెట్‌ జ్యోతి

త్యాగాలు తప్పవు! – కష్టేఫలి అంటున్న తెలుగు అథ్లెట్‌ జ్యోతి

రెండుసార్లు జాతీయ రికార్డు అందినట్టే అంది చేజారినా పట్టు విడవకుండా ప్రయత్నించి సఫలీకృతమైన తెలుగమ్మాయి ఎర్రాజి జ్యోతి ఇది ఆరంభం మాత్రమే అంటోంది. ఇటీవల సైప్రస్‌ ఇంటర్నేషనల్‌ మీట్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డును బద్దలుకొట్టిన ఈ విశాఖ ఎక్స్‌ప్రెస్‌.. జీవితంలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలంటే కఠోర శ్రమ, కొన్ని త్యాగాలు తప్పవంటోంది.

*జాతీయ రికార్డును అధిగమించడం ఎలా అనిపిస్తోంది?
వాస్తవానికి రెండేళ్ల కిందటే ఈ రికార్డును అధిగమించా ల్సి ఉంది. దురదృష్టవశాత్తు రెండుసార్లు అందినట్టే అంది చేజారింది. ఎట్టకేలకు సైప్రస్‌ వేదికగా ఆ రికార్డు సొంతమైంది. నా కెరీర్‌లో ఇదొక పెద్ద మైలురాయి. అయితే, ఈ రికార్డుతో సంతృప్తి చెందడం లేదు. ఇంతకంటే వేగంగా పరిగెత్తగలిగే సత్తా నాలో ఉంది. మరిన్ని రికార్డులను సొంతం చేసుకునేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నా.

*భువనేశ్వర్‌లో కోచింగ్‌ ఎలా సాగుతోంది?
ప్రసుత్తం భువనేశ్వర్‌లోని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఒడిశా అథ్లెటిక్స్‌ హై పెర్ఫామెన్స్‌ సెంటర్‌లో వేల్స్‌ కోచ్‌ జేమ్స్‌ హిల్‌లైర్‌ దగ్గర సాధన చేస్తున్నా. అక్కడ సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి. కోచ్‌ జేమ్స్‌ విషయానికొస్తే నా శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రణాళికలతో నన్ను సిద్ధం చేస్తూ ఉంటారు. రెండుసార్లు జాతీయ ఉత్తమ టైమింగ్‌ నమోదు చేసినా వాటికి గుర్తిం పు రానప్పుడు నేను నిస్పృహకు లోనుకాకుండా ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ గమ్యం వైపు నడిపించారు.

*వ్యక్తిగత జీవితం గురించి..
మాది దిగువ మధ్యతరగతి కుటుంబం. నాన్న సెక్యూరిటీ గార్డు. అన్న డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈనెల 20న మా అన్నయ్య పెళ్లి ఉంది. వరుస పెట్టి ఈవెంట్స్‌ ఉండడంవల్ల ఆ పెళ్లికి నేను వెళ్లే అవకాశం లేదు. రెండేళ్లుగా ఏ పండుగనూ కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోలేదు. సాధనలో భాగంగా కఠినమైన ఆహార నియమాలు కూడా పాటించాలి. హైదరాబాద్‌ బిర్యానీని గతంలో వారానికి రెండుసార్లయినా తినేదాన్ని. ఇప్పుడు బిర్యానీతో పాటు పిజ్జాలు, జంక్‌ ఫుడ్‌ మొత్తం మానేశా.

*తదుపరి లక్ష్యాలేంటి?
రికార్డులను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడూ పరిగెత్తలేదు. బరిలోకి దిగిన ప్రతిసారీ నాతో నేనే పోటీపడతా. నిరుటి రేసుకంటే ఇంకా ఉత్తమ టైమింగ్‌ నమోదు చేయాలనే లక్ష్యంతోనే పరిగెత్తుతా. ఇక, వచ్చే 15 రోజుల్లో స్పెయిన్‌, బర్మింగ్‌హామ్‌తో పాటు యూర్‌పలో మరికొన్ని పోటీలు ఉన్నాయి. వాటిలో పాల్గొన్నాక స్వదేశానికి తిరిగి వస్తా. ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున పతకం సాధించాలనేది నా చిరకాల స్వప్నం.