NRI-NRT

ఈ నెల 17 నుంచి కీవ్‌లోని భారత ఎంబసీలో సేవలు ప్రారంభం

ఈ నెల 17 నుంచి కీవ్‌లోని భారత  ఎంబసీలో సేవలు ప్రారంభం

రష్యా యుద్ధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం గత కొన్నిరోజులుగా మూత పడిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నెల 17వ తేదీ నుంచి భారత ఎంబసీ కార్యాలయం తిరిగి తెరుస్తున్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. కాగా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మార్చి 13 నుంచి ఇండియన్ ఎంబసీ సేవలను పోలాండ్ రాజధాని వార్సా నుంచి కొనసాగిస్తోంది. తాజాగా కీవ్‌లో పరిస్థితులు కొంచెం అదుపులోకి రావడంతో తిరిగి ఎంబసీ కార్యాలయం విధులను పునరుద్ధరిస్తోంది. ఈ మేరకు మంత్రిత్వశాఖ శుక్రవారం కీలక ప్రకటన చేసింంది. “వార్సా(Poland) నుంచి తాత్కాలికంగా పనిచేస్తున్న ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం మే 17 నుంచి కీవ్‌లో కార్యాకలపాలను పునరుద్ధరిస్తుంది” అని తన ప్రకటనలో పేర్కొంది. ఇదిలాఉంటే.. ఫిబ్రవరి 24 నుంచి రష్యా సైనిక చర్య పేరిట ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. మొదట రాజధాని కీవ్‌ను ఆక్రమించుకోవాలని రష్యా ప్రయత్నించింది. కానీ, ఉక్రెయిన్ సైన్యాలు ప్రతిఘటించడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు మరియుపోల్ వంటి తీర ప్రాంత నగరాలే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తోంది. దీంతో కీవ్‌లో పరిస్థితులు కొంచెం మెరుగయ్యాయి. అందుకే భారత ఎంబసీ అక్కడి కార్యాలయంలో సేవలను తిరిగి ప్రారంభిస్తోంది.