Kids

KIDS: 18 కోట్ల పుస్తకాలను పిల్లలకు పంచింది..

18 కోట్ల పుస్తకాలను పిల్లలకు పంచింది..

‘180,548,415’ మీరిప్పుడు ‘ఇమాజినేషన్‌ లైబ్రరీ’ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే.. ఈ నెంబర్‌ మారిపోయి ఉండవచ్చు. ఇదేమీ మారిపోవడానికి స్టాక్‌మార్కెట్‌ అంకెల్లాంటిది కాదు. ప్రపంచవ్యాప్తంగా పిల్లలకు ఉచితంగా ఇస్తున్న పుస్తకాల సంఖ్య. అమెరికాలోని టేనస్సీకి చెందిన డాలీపార్టన్‌ పిల్లలకు పుస్తకాల పంపిణీనే జీవిత లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు ఆమె పద్దెనిమిది కోట్లకు పైగా పుస్తకాలను వివిధ దేశాల పిల్లలకు అందించిందంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకుముందు ఎవరూ ఇన్నేసి పుస్తకాలను కానుకలుగా ఇచ్చిన దాఖలాలు లేవు. ‘పిల్లల్లో పుస్తకపఠనం పెంచాలి. అప్పుడే సృజనాత్మకత పెరుగుతుంది. స్వతంత్ర వ్యక్తిత్వం అలవడుతుంది. జీవితం పట్ల ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. పుస్తకం మన ప్రపంచాన్ని విస్తృతం చేస్తుంది.. అని మా నాన్న చెప్పాడు. ఆయన కల నెరవేర్చడమే నా జీవిత ఆశయంగా పెట్టుకున్నాను’ అంటుంది డాలీ పార్టన్‌. అమెరికాలోని సేవియర్‌ కౌంటీకి చెందిన ఆమె 1988లో ‘డాలీ ఫౌండేషన్‌’ నెలకొల్పింది. అప్పట్లో తను ఉంటున్న ఊరిలో కూడా హైస్కూళ్లలో బడి మానేసే పిల్లల సంఖ్య ఎక్కువగా ఉండేది. అమెరికాలాంటి దేశంలో ఇలా డ్రాపౌట్స్‌ ఉండటమేంటి? ఇది దేశానికి మంచిది కాదని ఆలోచించిందామె. హైస్కూళ్లలోని పేదపిల్లలకు కొన్ని డాలర్లను అందించి.. బడి మానకుండా ప్రోత్సహించింది. 35 శాతం ఉన్న డ్రాపౌట్స్‌ ఆమె సాయం వల్ల ఆరు శాతానికి పడిపోయింది. ఇలా ఉన్నత పాఠశాలల్లో పిల్లల చదువు కోసం ఏటా పదిహేను వేల డాలర్లను అందించింది డాలీ.ఆ సాయంతోపాటు పిల్లలకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేసేందుకు ‘ఇమాజినేషన్‌ లైబ్రరీ’ని నెలకొల్పింది. 1995లో సేవియర్‌ కౌంటీలో కార్యక్రమం మొదలైంది. ఆ తరువాత కెనడా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌లకు విస్తరించింది. ఇప్పటి వరకు అమెరికాలో 18 కోట్లకు పైగా పుస్తకాలను పిల్లలకు అందించిన సంస్థ ఇదొక్కటే!. ‘తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతారు. పుస్తకాలు కూడా అంతే!. పఠనం లేని విద్యార్థులు సంపూర్ణ మానసిక వికాసం చెందలేరు. అందుకే నేను బతికున్నంత వరకు ప్రపంచానికి పుస్తకాలు అందిస్తూనే ఉంటా’ అంటున్న డాలీపార్టన్‌ ‘ఇమాజినేషన్‌ లైబ్రరీ’ అన్ని దేశాల్లో విస్తరించాలని ఆశిద్దాం.