Business

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు! – TNI వాణిజ్య వార్తలు

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు!   – TNI వాణిజ్య వార్తలు

* దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. 2020 తర్వాత తొలిసారిగా గత వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇలా వారం రోజుల పాటు నష్టాలతో కొట్టుమిట్టాడాయి. కానీ ఈ వారంలో వరుసగా ఆరు రోజులుగా కొనసాగిన నష్టాలకు స్టాక్‌ మార్కెట్లు చెక్‌ పెట్టాయి. దీంతో సోమవారం మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బిఎస్‌ఈ సెన్సెక్స్ 180 పాయింట్లుతో 0.34 శాతం పెరిగి 52,974 వద్ద ముగియగా, నిఫ్టీ 60 పాయింట్లతో 0.38 శాతం పెరిగి 15,842 వద్ద స్థిరపడింది. ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్‌,ఎన్టీపీసీ,యూపీఎల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌ బీఐ, మారుతి సుజికీ, బజాజ్‌ ఆటో, హీరో మోటో కార్ప్‌, కొటక్‌ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాలతో ముగియగా.. ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌,శ్రీ సిమెంట్‌, ఏసియన్‌ పెయింట్స్‌,ఐటీసీ, గ్రాసిం, దివిస్‌ ల్యాబ్స్‌,టెక్ మహీంద్రా, నెస్లే, టీసీఎస్‌ షేర్లు నష్టాల పాలయ్యాయి.

*భారత కార్పొరేట్‌ రంగంలో అతిపెద్ద టేకోవర్‌ చోటు చేసుకుంది. భారత్‌లో దిగ్గజ సిమెంట్‌ కంపెనీలైన ఏసీసీ, అంబుజా సిమెంట్‌ కంపెనీలు అదానీ గ్రూప్‌ గూటికి చేరనున్నాయి. ఈ రెండు కంపెనీల ఈక్విటీలో స్విట్జర్లాండ్‌కు చెందిన హోల్సిమ్‌ లిమిటెడ్‌కు ఉన్న మెజారిటీ వాటాను అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌తో కలిపి 1,050 కోట్ల డాలర్లకు (సుమారు రూ.81,360 కోట్లు) కొనుగోలు చేసింది. ఈ మేరకు హోల్సిమ్‌ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ గ్రూప్‌ వెల్లడించింది. భారత సిమెంట్‌ రంగంలోనే కాకుండా భారత కార్పొరేట్‌ రంగంలోనే దీన్ని అతిపెద్ద కొనుగోలుగా భావిస్తున్నారు. హోల్సిమ్‌ కంపెనీకి అంబుజా సిమెంట్‌ ఈక్విటీలో 63.19 శాతం, ఏసీసీ ఈక్విటీలో 54.53 శాతం వాటా ఉంది. ఇప్పుడు ఈ వాటా మొత్తం అదానీ గ్రూప్‌ పరం కానుంది.

* క్రిప్టోకరెన్సీలపై భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరోసారి తన భయాలు వ్యక్తం చేసింది. డాలర్లలో జరిగే వీటి లావాదేవీలు భారత ఆర్థిక వ్యవస్థలో కొంతభాగాన్ని డాలరీకరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇంకా ద్రవ్య చలామణిని దెబ్బతీయడం ద్వారా ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానాలకు కూడా ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక శాఖ మాజీ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా నేతృత్వంలోని పార్లమెంట్‌ స్థాయీ సంఘం సభ్యుల ముందు, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ విషయాలు స్పష్టం చేశారు. క్రిప్టోకరెన్సీలతో దేశ సార్వభౌమత్వానికి కూడా ముప్పు అని పేర్కొన్నారు.

*భారత స్టాక్‌ మార్కెట్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాల హోరు కొనసాగుతోంది. గత 15 సెషన్స్‌లోనూ ఈ సంస్థలు రూ.25,200 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. చమురు మంట, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు, జీడీపీ వృద్ధి రేటుపై అనుమానాలు ఇందుకు ప్రధాన కారణం. ఈ కారణాలతో సమీప భవిష్యత్‌లోనూ భారత మార్కెట్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు అంతంత మాత్రంగానే ఉంటాయని మార్కెట్‌ వర్గాల అంచనా. ఏప్రిల్‌తో ముగిసిన ఏడు నెలల్లోనూ ఎఫ్‌పీఐలు భారత స్టాక్‌ మార్కెట్‌ నుంచి రూ.1.65 లక్షల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.

*అదానీ గ్రూప్‌ మీడియా వ్యాపారంలోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా రాఘవ్‌ బహాల్‌ ప్రమోట్‌ చేసిన క్వింటిలియన్‌ బిజినెస్‌ మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (క్యూబీఎంఎల్‌) ఈక్విటీలో 49 శాతం వాటా కొనుగోలు చేసింది. గ్రూప్‌ ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్‌ ద్వారా ఈ వాటా కొనుగోలు చేసింది. అయితే ఎంత మొత్తానికి ఈ వాటా కొనుగోలు చేసిందీ రెండు కంపెనీలు వెల్లడించలేదు. క్యూబీఎంఎల్‌ ప్రస్తుతం ఒక బిజినెస్‌, ఫైనాన్షియల్‌ న్యూస్‌ పోర్టల్‌ నడుపుతోంది. ఏఎంజీ మీడియా నెట్‌వర్క్‌ ద్వారా అదానీ గ్రూప్‌ పెద్ద ఎత్తున మీడియా రంగ ప్రవేశానికి సిద్ధమవుతోంది.

*ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత ఎస్‌బీఐ రుణాల వడ్డీ రేట్లు మరింత ప్రియం కానున్నాయి. అదనపు నిధు ల సమీకరణ వ్యయం (ఎంసీఎల్‌ఆర్‌) ఆధారంగా నిర్ణయించే ఈ రుణాల వడ్డీ రేట్లను మరో 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతానికి సమానం) పెంచినట్లు భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ప్రకటించింది. దీంతో ఒక రోజు నుంచి మూడు నెలల కాల పరిమితి ఉండే ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాల వడ్డీ రేట్లు 6.75 శాతం నుంచి 6.85 శాతానికి పెరుగుతాయి. ఇదే విధంగా ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత ఆరు నెలల రుణాల వడ్డీ రేటు 7.15 శాతానికి, ఏడాది కాల పరిమితి ఉండే రుణాల వడ్డీ రేటు 7.2 శాతానికి, రెండేళ్ల రుణాల వడ్డీ రేటు 7.4 శాతానికి, మూడేళ్ల రుణాల వడ్డీ రేటు 7.5 శాతానికి పెరుగుతుంది. ఆదివారం నుంచే ఈ పెంపు అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది. ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై వడ్డీ రేటు పెంచడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి.

*నిఫ్టీ గత వారం నెగెటివ్‌ ట్రెండ్‌లో ప్రారంభమై వారం అంతా అదే ధోరణి కొనసాగించింది. కీలక మానసిక అవధి 16000 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమై చివరికి 630 పాయింట్ల నష్టంతో 15780 వద్ద వారానికి ముగింపు పలికింది. అలాగే వారం కనిష్ఠ స్థాయిల్లో ముగిసింది. గత నాలుగు వారాల్లో అథోముఖంగానే ట్రేడవుతూ 2200 పాయింట్ల వరకు కోల్పోయింది. టెక్నికల్‌గా మార్కెట్‌ స్వల్పకాలిక కరెక్షన్‌ ట్రెండ్‌లోనే ఉన్నా ఆర్‌ఎ్‌సఐ సూచీల ప్రకారం ఓవర్‌సోల్డ్‌ స్థితి ఏర్పడింది. 16000 వద్ద బ్రేక్‌డౌన్‌ కూడా ఏర్పడింది. ఇప్పుడు పుల్‌బ్యాక్‌కు ఆస్కారం ఉంది.

*ట్విటర్ కొనుగోలు వ్యవహారంలో మరో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్టు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించిన నేపథ్యంలో ట్విటర్ లీగల్ టీం స్పందించింది. ఎలాన్ మస్క్‌కు ఫోన్ చేసి మాట్లాడింది. ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందంలోని గోప్యత అంశాలను బయటపెట్టిన ఎలాన్ మస్క్‌ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడ్డారని లీగల్ బృందం వ్యాఖ్యానించింది. ట్విటర్ ఆటోమేటెడ్ యూజర్స్ పరిమాణం 100 అని బయటకు చెప్పడం సబబుకాదని, ఒప్పంద ఉల్లంఘేనని అసంతృప్తిని తెలియజేసింది. ఈ విషయాన్ని ఎలాన్ మస్కే ట్విటర్ వేదికగా స్వయంగా ప్రకటించారు.

* న్యూజిలాండ్‌కు చెందిన ద ఎనర్జీ కలెక్టివ్‌ (టీఈసీ)కి అనుబంధ సంస్థగా ఉన్న ఎనర్జీ టెక్‌ గ్లోబల్‌ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈసీఐఎల్‌లోని కేంద్ర కార్యాలయంలో, హైటెక్‌ సిటీలో ఉన్న శాటిలైట్‌ కేంద్రంలో అదనపు మాడ్యూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఎండీ కిషోర్‌ బొర్రా తెలిపారు. ప్రస్తుతం 250 మంది ఉద్యోగులుండగా ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్లు చెప్పారు.

*దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (క్యూ4)లో స్టాండ్‌ఎలోన్‌ ప్రాతిపదికన రూ.9,114 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2020-21 క్యూ4లో ఆర్జించిన లాభం రూ.6,451 కోట్లతో పోల్చితే ఇది 41.28 శాతం అధికం. కాగా మార్చితో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి లాభం 55.19 శాతం వృద్ధితో రూ.20,401 కోట్ల నుంచి రూ.31,676 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 15.26 శాతం పెరిగి రూ.31,198 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ 0.29 శాతం పెరిగి 3.40 శాతంగా నమోదైంది. స్థూల ఎన్‌పీఏలు 3.97 శాతానికి, నికర ఎన్‌పీఏలు 1.02 శాతానికి తగ్గాయి. క్యూ4లో ఎన్‌పీఏలుగా మారిన ఖాతాలు 0.43 శాతానికి తగ్గాయి.