Politics

లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై సీబీఐ కేసు

లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై సీబీఐ కేసు

కుటుంబ సభ్యులపైనా ఎఫ్‌ఐఆర్‌

బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. 2004–09లో రైల్వే శాఖలో గ్రూప్‌–డి ఉద్యోగాలు ఇప్పించినందుకు ప్రతిఫలంగా అభ్యర్థుల నుంచి బిహార్‌ రాజధాని పాట్నాలో లక్షకుపైగా చదరపు అడుగుల భూమిని లాలూ, కుటుంబ సభ్యులు తక్కువ ధరకే సొంతం చేసుకున్నట్లు సీబీఐ ఆరోపిస్తోంది.

లాలూ 2004–09లో యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న సీబీఐ ఆర్థిక నేరాల విభాగం ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. తాజా కేసు నేపథ్యంలో సీబీఐ అధికారులు ఢిల్లీ, పాట్నా, గోపాల్‌గంజ్‌లో లాలూ, కుటుంబ సభ్యులకు సంబంధించిన 16 చోట్ల సోదాలు ప్రారంభించారు. లాలూ ప్రసాద్‌ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, కుమార్తెలు మీసా భారతి, హేమా యాదవ్‌తోపాటు అక్రమంగా ఉద్యోగాలు దక్కించుకున్న మరో 12 మందిని నిందితులుగా చేర్చారు.

భూమికి బదులు రైల్వే ఉద్యోగాల కుంభకోణంపై సీబీఐ 2021 సెప్టెంబర్‌ 23న దర్యాప్తు ప్రారంభించింది. ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు మూడు సేల్‌ డీడ్‌ల ద్వారా భూమిని రబ్రీదేవికి, ఒక సేల్‌ డీడ్‌ ద్వారా మీసా భారతికి, రెండు గిఫ్ట్‌ డీడీల ద్వారా హేమా యాదవ్‌కు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ భూములను సొంతం చేసుకోవడానికి లాలూ కుటుంబం సదరు అభ్యర్థులకు కేవలం రూ.3.75 లక్షల నుంచి రూ.13 లక్షల దాకా చెల్లించినట్లు సీబీఐ చెబుతోంది.

నిజానికి ఆ భూముల విలువ రూ.కోట్లల్లో పలుకుతోంది. సంచలనం సృష్టించిన దాణా కుంభకోణంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు న్యాయస్థానం ఇటీవలే బెయిల్‌ మంజూరు చేసిన విషయం విదితమే. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల వ్యవహారంలో సీబీఐ కేసు నమోదు చేయడంపై రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) స్పందించింది. కేంద్రంలోని అధికార బీజేపీ సీబీఐని అడ్డం పెట్టుకొని బెదిరింపులకు దిగుతోందని, తాము భయపడే ప్రసక్తే లేదని ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్‌ కుమార్‌ ఝా తేల్చిచెప్పారు.

రబ్రీదేవి పట్ల అధికారుల అనుచిత ప్రవర్తన
బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి పట్ల సీబీఐ అధికారులు అనుచితంగా ప్రవర్తించారని, అసభ్యకర పదజాలంతో దూషించారని ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) ఆరోపించింది. భూమికి బదులు రైల్వే ఉద్యోగాల కేసులో సీబీఐ అధికారులు శుక్రవారం పాట్నాలో రబ్రీ దేవి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆమెను 12 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు.