Fashion

దేశంలోని నలుమూల‌ల దొరికే చీర‌ల‌ను తెప్పించి ఆన్‌లైన్‌లో అమ్ముతున్న డాక్ట‌ర‌మ్మ‌

దేశంలోని నలుమూల‌ల దొరికే చీర‌ల‌ను తెప్పించి ఆన్‌లైన్‌లో అమ్ముతున్న డాక్ట‌ర‌మ్మ‌

ఒక్కో రాష్ట్రానిది ఒక్కో చేనేత వస్త్రం. అన్నీ కొనాలంటే ఆల్‌ ఇండియా షాపింగ్‌ టూర్‌ ప్లాన్‌ చేసుకోవాలి. ఆ కష్టాన్ని తప్పించారు డాక్టర్‌ దివ్యశ్రీ. దేశంలో ప్రసిద్ధిగాంచిన ఫ్యాబ్రిక్స్‌ అన్నీ దివ్యశ్రీ స్టార్టప్‌ ఫ్యాక్టరీలో కొలువుదీరాయి. నిజానికి, దివ్య పెరిగిన వాతావరణానికి, చదివిన చదువుకు, చేస్తున్న వ్యాపారానికి సంబంధమే లేదు. అయితేనేం, ఈ డాక్టరమ్మ ఫ్యాషన్‌ నాడి పట్టేసింది. ఒక గోండుజాతి బిడ్డగా గుండెనిండా ఆత్మవిశ్వాసంతో తాను ఎదిగిన క్రమాన్ని వివరిస్తున్నది దివ్య..
Whats-App-Image-2022-05-20-at-10-04-26-AM
‘పుట్టిపెరిగింది మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో. నాన్న హెడ్‌ కానిస్టేబుల్‌, అమ్మ గృహిణి. ప్రాథమిక విద్య బెల్లంపల్లిలో పూర్తయింది. ఇంటర్‌ హైదరాబాద్‌లో చదివాను. ఆదివాసి గోండు జాతిబిడ్డనే అయినా చేనేత వస్త్రాలంటే ముందునుంచీ ప్రాణం. డాక్టర్‌ పట్టా చేతికొచ్చాక.. గత జూన్‌లో ‘మిస్‌ట్రైబ్‌’ (www.misstribe.in) పేరుతో ఓ స్టార్టప్‌ ప్రారంభించాను. అప్పటికి నా దగ్గర రెండు లక్షలు మాత్రమే ఉన్నాయి. ఎస్‌బీఐ ‘స్టాండప్‌ ఇండియా’ (యంగ్‌ ఆంత్రప్రెన్యూర్స్‌) పథకం కింద రూ.12 లక్షల రుణాన్ని మంజూరు చేసింది. ఆ మొత్తంతో నా వ్యాపారాన్ని విస్తరించాను. ‘మిస్‌ట్రైబ్‌’ అనేది ఆన్‌లైన్‌ చేనేత వస్త్ర ప్రపంచం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, నేనే సొంతంగా వెబ్‌సైట్‌ క్రియేట్‌ చేసుకున్నా. నా సంస్థకు నేనే బ్రాండ్‌ అంబాసిడర్‌, నేనే మోడల్‌. వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించిన వస్త్రాలలో ఒక్కో మోడల్‌ చీరను ధరించి మోడలింగ్‌ చేస్తాను. చీర నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తాను. సేకరణ నుంచి సేల్స్‌ వరకు అన్నీ నేనే చూసుకుంటున్నా. ప్రస్తుతం ఇద్దరు మహిళలకు ప్రత్యక్షంగా, మరో ముగ్గురికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నాను. జన్నారంలో ఆఫ్‌లైన్‌ స్టోర్‌ కూడా ఉంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నేత కళాకారులతో ఒప్పందాలు చేసుకున్నా. మార్కెట్‌తో పోలిస్తే, మా దగ్గర చీరల నాణ్యత చాలా ఎక్కువ. మిస్‌ట్రైబ్‌ ద్వారా కొనుగోలు చేస్తే 40 శాతం వరకూ డబ్బు ఆదా అవుతుంది.

ఒకేచోట అన్ని బ్రాండ్స్‌
నా స్టార్టప్‌ ప్రత్యేకత ఏమిటంటే.. దేశంలో పేరున్న చేనేత బ్రాండ్స్‌ అన్నీ ఒకేచోట లభిస్తాయి. తెలంగాణలో పోచంపల్లి ఇక్కత్‌, గద్వాల్‌.. ఆంధ్రాలో ఉప్పాడ పట్టు, మంగళగిరి.. తమిళనాడులో కంచి, బెంగాల్‌ ఖాదీ, లెనిన్‌.. వారణాసి కోర మస్లిన్‌ చీరెలు.. ఇలా భిన్న ప్రాంతాల బ్రాండ్స్‌ను మనవాళ్లకు పరిచయం చేయాలన్నది లక్ష్యం. ఇప్పటికే ఐదు రాష్ర్టాల చేనేతలు విక్రయిస్తున్నా. మార్కెటింగ్‌ స్కిల్స్‌ కోసం వీహబ్‌ను సంప్రదించాను. నా ప్రయాణంలో ఇదో మలుపు. నన్ను ‘వీహబ్‌ ఇన్‌క్యుబేషన్‌’ కార్యక్రమానికి ఎంపిక చేశారు. దీని ద్వారా నా బిజినెస్‌ అభివృద్ధికి తగిన శిక్షణ ఇస్తారు. అది పూర్తయితే పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయనే నమ్మకం ఉంది. మిస్‌ట్రైబ్‌ ద్వారా చేనేత కళాకారులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన చీర లభిస్తుంది. ఓ స్టార్టప్‌గా మాకూ ఎంతోకొంత లాభం వస్తుంది. కొంతమంది వ్యాపారులు వీవర్స్‌ వద్ద వెయ్యి రూపాయలకు కొని వినియోగదారులకు మూడు వేలకు విక్రయిస్తున్నారు. ఈ దోపిడీని అడ్డుకోవాల్సిందే.
Whats-App-Image-2022-05-20-at-10-04-26-AB
‘రెడీ టు వేర్‌’ చీరలు
మన దేశంలో చీరకట్టు అనేది కొన్నిసార్లు గంటలకొద్దీ సాగే ప్రక్రియ. ఈ తరం అమ్మాయిల్లో చాలామందికి చీరకట్టుకోవడం తెలియదు. మేం డిజైన్‌ చేసిన ‘రెడీ టు వేర్‌’ చీరలను ఒక్క నిమిషంలో కట్టుకోవచ్చు. అందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం. మీకు నచ్చిన చీరను మిస్‌ట్రైబ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆర్డర్‌ చేసి, జాకెట్‌, చీరల కొలతలు ఇస్తే.. మేమే తయారు చేసి ఇంటికి పంపిస్తాం. ఇతర రాష్ట్రాలతో పాటు, లండన్‌, అమెరికా, కెనడాలకూ కొరియర్‌ చేస్తున్నాం. ఫంక్షన్లకు, ఆఫీస్‌కు అనువుగా ఉండటంతో మంచి స్పందన వస్తున్నది. స్టార్టప్‌ ఒక దారికి వచ్చాక.. సొంతంగా క్లినిక్‌ పెట్టుకుంటాను. వైద్యురాలిగా ఆదివాసీలకు సేవ చేసుకుంటాను. వ్యాపారం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తే.. వైద్యం ఆత్మసంతృప్తినిస్తుంది.