Politics

మొదటి సారి జగన్ కు నో చెప్పిన నరేంద్ర మోడీ అమిత్ షా

మొదటి సారి జగన్ కు నో చెప్పిన నరేంద్ర మోడీ అమిత్ షా

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి సత్సంబంధాలే ఉన్నాయని చెప్పవచ్చు. వైసీపీ ఎన్డీయేలో లేనప్పటికీ మూడు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంతో స్నేహాన్ని కొనసాగిస్తోంది.రాష్ట్రానికి రావల్సిన ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలు మినహా మిగతా అన్ని విషయాల్లో కేంద్రం జగన్‌కు సహకరిస్తూ వస్తోంది. కానీ మొదటిసారిగా నరేంద్రమోడీ, అమిత్ షాలు ముఖ్యమంత్రి జగన్‌కు నో చెప్పారు.

ముందస్తు ప్రచారాన్ని ఖండించని జగన్‌
ముందస్తు ఎన్నికలకు వెళ్దామనే యోచనలో జగన్మోహన్‌రెడ్డి ఉన్నట్లు కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. దాన్ని ముఖ్యమంత్రి కూడా ఖండించకపోవడంతో ముందస్తు ఖాయమని అన్ని రాజకీయ పార్టీలు స్పష్టతకు వచ్చాయి. రాజకీయంగా ఈ మధ్య జగన్మోహన్‌రెడ్డి దూకుడు పెంచారు. ప్రతిపక్షాలపై, మీడియాపై దుమ్మెత్తి పోస్తున్నారు. జులైలో పార్టీ ప్లీనరీని నిర్వహించి బూత్ లెవల్ వరకు కమిటీలు ఏర్పాటు చేసి వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలకు వెళ్దామనే యోచనతో తమ అధినేత ఉన్నాడంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు చెప్పారు.

ఎన్నికల సంఘం చేతిలోనే అధికారాలు
రాష్ట్రంలో ప్రభుత్వం రద్దుచేస్తే ఆరునెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అధికారాలన్నీ ఎన్నికల సంఘం చేతిలో ఉంటాయి. కానీ కేంద్రంతో జగన్ సఖ్యతగా ఉండటంవల్ల ఒక ఏడాది ముందు ముందస్తుకు వెళ్దామనుకుంటున్నట్లు నరేంద్రమోడీకి, అమిత్ షాకు తెలియజేశారని, దానికి వారు నిరాకరించినట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.

బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణ
భారతీయ జనతాపార్టీ తమ తదుపరి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకుంది. ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలనే యోచనలో ఉంది. టీఆర్ ఎస్‌, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. కేసీఆర్ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. ముందస్తుకు వెళ్లి రాష్ట్రంలో మరోసారి అధికారం చేజిక్కించుకోగలిగితే లోక్‌సభ ఎన్నికలపై బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యేక దృష్టి సారించవచ్చనేది కేసీఆర్ ఆలోచనగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కేసీఆర్‌పై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలి
కేసీఆర్‌ను పూర్తిస్థాయి అధికారంలో ఉంచి అక్కడ నుంచి వ్వక్తమయ్యే భారీ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలనే యోచనలో బీజేపీ నేతలున్నట్లు చెబుతున్నారు. జగన్ ముందస్తుకు వెళితే కేసీఆర్ కూడా వెళతారు. కానీ బీజేపీ నేతలకు అది ఇష్టంలేదని అంటున్నారు. అసెంబ్లీని రద్దుచేయడం, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంద్వారా తాత్సారం చేసే ధోరణిని కనపరుస్తుందనే భావనలో తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలున్నాయి.జగన్ కోసం యస్ అనాలనివున్నా టీఆర్ఎస్ కోసం నో చెప్పారని సీనియర్ రాజకీయ వేత్తలు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు ముందస్తు అంటూ వార్తలే కానీ వీటిపై స్పష్టత మాత్రం రాలేదు. అందుకోసం కొన్నాళ్లు వేచిచూడక తప్పదు.!!