DailyDose

వైకాపా ఎమ్మెల్సీ ఉదయ్ బాబు కారులో డ్రైవర్ మృతదేహం – TNI నేర వార్తలు

వైకాపా ఎమ్మెల్సీ ఉదయ్ బాబు కారులో డ్రైవర్ మృతదేహం  – TNI  నేర వార్తలు

* కాకినాడ వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్‌ బాబు కారులో మృతదేహం కలకలం రేపుతోంది. మృతదేహం ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్‌ సుబ్రమణ్యందిగా గుర్తించారు.గురువారం ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్ బాబు తనతో పాటు డ్రైవర్‌ను బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రమాదం జరిగిందని డ్రైవర్ తమ్ముడికి ఉదయ్ బాబు సమాచారమిచ్చారు.
శుక్రవారం తెల్లవారుజామున 2గంటలకు తన కారులోనే మృతదేహాన్ని ఎమ్మెల్సీ ఉదయ్‌బాబు తీసుకొచ్చి అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం వేరే కారులో ఎమ్మెల్సీ వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదేళ్లుగా ఎమ్మెల్సీ వద్ద సుబ్రహ్మణ్యం డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. డ్రైవర్‌ను హత్య చేశారంటూ ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులతో మాట్లాడారు…
*తెనాలి మారిస్‎పేటలో దారుణ హత్య జరిగింది. 24వ వార్డు వాలంటీర్‎గా పనిచేస్తున్న సందీప్ (22)ను దారుణం హత్య చేశారు. తీసుకున్న అప్పు చెల్లించమన్నందుకు సందీప్‎పై దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై పోలీసులు తండ్రి, వెంకటేశ్వర్లు, కొడుకు రోహిత్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*అన్నవరం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అశోక్కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రుషికొండ ప్రైవేట్ లాడ్జిలో అశోక్కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అశోక్కుమార్ సూసైడ్ నోట్లో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఉద్యోగంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు లేఖలో వెల్లడైంది. తన చదువుకు, చేస్తున్న ఉద్యోగానికి పొంతన లేదని సూసైడ్ నోట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఐఏఎస్ కావాలనే కల నెరవేరకుండానే చనిపోతున్నట్లు వెల్లడించాడు. తన మొబైల్‌ను భార్యకు అప్పగించాలని లేఖలో అశోక్ తెలిపారు. ఢిల్లీలో ట్రైనింగ్ ఉందని మే 12న ఇంటి నుంచి అశోక్ బయటకు వచ్చాడు.
*బాపట్ల: జిల్లాలోని చీరాల ఫైర్ ఆఫీస్ గేట్ సమీపంలో రైలు పట్టాలపై యువకుని మృతదేహం లభ్యమైంది. మృతుని జేబులో గుర్తింపు కార్డు ఆధారంగా బీహార్‌కు చెందిన కుమార్ ప్రసాద్(33)గా పోలీసులు గుర్తించారు. రైలు నుండి నిద్రమత్తులో జారిపడి మరణించి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
*ఆంధ్రలోని సీలేరు నుంచి అక్రమంగా కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మూడు సంచులలో ఉన్న 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేసి.. నిందితులను పోలీస్ స్టేషన్‎కు తరలించారు.
*విజయవాడ నగర శివారు పాయకాపురంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్నకొడుకే తండ్రిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మద్యం మత్తులో ఇనుప రాడ్‌తో తండ్రి జాన్‌ని కొడుకు విజయ్ తలపై బలంగా కొట్టాడు. పాయకపురం ఏవీఎస్ రెడ్డి రోడ్డులో ఘటన జరిగింది. రూరల్ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*మచిలీపట్నం బలరామునిపేటలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు యువకుడి పీకకోసి హత్య చేశారు. ఈ ఘటన గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. బలరామునిపేటలోని రాజీవ్ నగర్ సమీపంలోని శ్మశానవాటికలో ఈ ఘటన జరిగింది. రక్తపు మడుగులో పడివున్న యువకుడిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు భోగేశ్వరరావు(గా పోలీసులు గుర్తించారు.
*నిద్రపోతున్న ఆ వ్యక్తి పైకి లేవకుండా రెండు కాళ్లపై ఇద్దరు బలమైన వ్యక్తులు కూర్చున్నారు. కదలకుండా గుండెలపైకి ఎక్కి మరోవ్యక్తి కూర్చున్నాడు. మరికొందరు వ్యక్తులు వికెట్లతో రెండు కాళ్లపై విచక్షణారహితంగా కొట్టారు. అప్పటికీ వారి ఆవేశం తగ్గలేదు. గుండెలపై కూర్చున్న వ్యక్తి జేబులో ఉన్న బైక్‌ తాళాలు తీసి గొంతుపై పొడిచాడు. అదృష్టవశాత్తు పక్కనే ఉన్నోళ్లంతా అతన్ని వెనక్కి లాగేశారు. అడ్డొచ్చిన మహిళలను దుర్భాషలాడుతూ, రేప్‌ చేస్తామని బెదిరించిన ఆ వ్యక్తులు.. మరోసారి ఆ యువకుడిపై దాడి చేశారు. చూస్తుంటే ఇదేదో పాత కక్షలనుకుంటే పొరపాటు పడ్డట్లే. ఏలూరులో కొందరు వడ్డీ వ్యాపారులు తమ వడ్డీ డబ్బులు వసూలు చేసుకునేందుకు చేసిన ప్రయత్నమే ఇదంతా. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
*కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలంలోని ఆలంకొండ గ్రామానికి చెందిన నలుగురు పిల్లలు ఈతకు వెళ్లి విద్యుత్‌ ప్రమాదానికి గురై మృతి చెందారు. ఈ ఘటన గురువారం జరిగింది. ఇందులో నక్క కార్తీక్‌(13), సంగాల సాయి(12), గుడిసె రాకేష్‌(12), షేక్‌ కమాల్‌ బాషా(12) గ్రామ సమీపంలోని నీళ్ల గచ్చులో ఈతకు వెళ్లారు. గచ్చులో షార్ట్‌ సర్క్యుట్‌ అయి ఉండటంతో పిల్లలు మృతి చెందారని గ్రామస్థులు తెలిపారు. సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఊరి సమీప బావుల దగ్గర వెతికారు. చివరకు నీళ్ల గచ్చులో రాత్రి 7గంటల సమయంలో నలుగురు పిల్లలు శవమై కనిపించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
*గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన తొమ్మిదో తరగతి విద్యార్థనిని కొందరు బీటెక్‌ విద్యార్థులు మాయమాటలతో లాడ్జికి రప్పించి సామూహిక అత్యాచారం చేశారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం ఈ దారుణం చోటుచేసుకుంది.
*పిడుగుల శబ్దం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పది నిమిషాల వ్యవధిలోనే తండ్రీ కొడుకులు మృత్యువాత పడ్డారు. కర్నూలు జిల్లా హొళగుందలోని బీసీ కాలనీ 7వ వార్డుకు చెందిన పింజారి సిద్దిక్‌ సాబ్‌ (71), కొడుకు హుసేన్‌సాబ్‌ (43) బుధవారం రాత్రి ఇంట్లో ఉండగా భారీ శబ్దంతో వీరి ఇంటి వద్ద పిడుగ పడింది. ఆ శబ్దానికి హుసేన్‌సాబ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తుండగానే పది నిమిషాల వ్యవధిలోనే మరో పిడుగు పడింది. ఆ సమయంలో భారీ శబ్దం రావడంతో సిద్దిక్‌ సాబ్‌ కూడా ప్రాణాలు వదిలాడు. అలాగే మండల పరిధిలోని పెద్దహ్యాట గ్రామంలో పిడుగుబాటుకు ఐదు మేకలు మృతి చెందాయి. కాగా ఉమ్మడి జిల్లాలోని 26 మండలాల్లో గురువారం కుండపోత వాన కురిసింది. హొళగుంద మండలంలో అత్యధికంగా 124.2 మి.మీ. వర్షం నమోదైంది. జిల్లాలో సగటు వర్షపాతం 19.8 మి.మీ. కురిసిందని, మే నెల సాధారణ వర్షపాతం 38.4 మి.మీ. కాగా, గురువారం నాటికి 65.8 మి.మీ. వర్షం నమోదైందని అధికార వర్గాలు తెలిపాయి.
*వైసీపీ నేతలకు ఒళ్లు బలిసి కన్నూ మిన్నూ కానరావడం లేదు. ప్రశ్నించిన రైతుని… రైతుని ఆపలేదని పోలీస్‌ అధికారిని… కవరేజ్‌ చేస్తున్న మీడియా ప్రతినిధిని నోటికొచ్చినట్లు మాట్లాడిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తీరు దారుణం’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. ‘‘విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో జరిగిన రైతు భరోసా కార్యక్రమంలో బ్రాహ్మణులను కించపరిచేలా ‘పంతులూ నీ సంగతి చూస్తా’ అంటూ పాత్రికేయుడు గణేశ్‌ను బె దిరించడం వైసీపీ నేతల అహంకారానికి నిదర్శనం. ఫ్రస్టేషన్‌లో మీడియా ప్రతినిధిని కులం పేరుతో దూషించడం, రైతును బూతులు తిట్టడం, ఎస్సైని ఒరేయ్‌ అంటూ చిందులు తొక్కడం చూస్తుంటే… వైసీపీ నేతలకు రోజులు దగ్గర పడినట్లే అనిపిస్తోంది’’ అని అన్నారు. అవంతి శ్రీనివాస్‌ తిట్టిన తిట్ల వ్యవహారానికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. మరోవైపు… ‘‘రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి చినజీయర్‌ వ్యాఖ్యలే నిదర్శనం. అధ్వాన్న పాలనకి ఉదాహరణగా పక్కరాష్ట్ర పాలకులు మన ఏపీని చూపిస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందన శూన్యం’’ అని లోకేశ్‌ విమర్శించారు.
*ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటనకు అనూహ్య స్పందన లభించింది. వెల్దుర్తి మండలం భూమిరెడ్డిపల్లె, డోన్‌ పట్టణాల్లో రోడ్‌ షోలకు అపూర్వ స్పందన వచ్చింది. ఎక్కడకు వెళ్లినా జనం జేజేలు పలికారు. షెడ్యూల్‌ ప్రకారం డోన్‌ రోడ్‌షో లేదు. అయితే.. చంద్రబాబును చూసేందుకు భారీగా జనం రావడంతో ఆయన రోడ్‌షో నిర్వహించి మాట్లాడారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా జనం ఆయన వెంట నడిచారు. జలదుర్గంలో బాదుడే బాదుడుకు పక్క గ్రామాల నుంచి కూడా భారీగా తరలి వచ్చారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకా్‌షరెడ్డి, ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్‌, బీటీ నాయుడు, నంద్యాల పార్టమెంట్‌ ఇన్‌చార్జి మాండ్ర శివానందారెడ్డి, నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులు బీసీ జనార్దన్‌రెడ్డి, కె.మీనాక్షినాయుడు, కోట్ల సుజాతమ్మ, బీవీ జయనాగేశ్వరరెడ్డి, గౌరు చరిత, భూమా బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ముకే్‌షకుమార్‌ మీనా గురువారం సచివాలయంలో కె.విజయానంద్‌ నుంచి బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఏపీజేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యోగ సంఘాల నేతలు సీఈవోకు అభినందనలు తెలిపారు.
*కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని వైసీపీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ కోరారు. గురువారం ఢిల్లీలో కేంద్ర జలసంఘం చైర్మన్‌ ఆర్కే గుప్తాకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 512 టీఎంసీల కృష్ణా జలాలను రాష్ట్రంలో అవసరమున్న ప్రాంతంలో ఎక్కడైనా వాడుకునే హక్కు తమకుందని ఎంపీ స్పష్టం చేశారు. కేఆర్‌ఎంబీకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు సభ్యులను నియమించడానికి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరారు. కృష్ణా నదికి గోదావరి జలాల మళ్లింపు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా.. జలవనరుల పార్లమెంటరీ కమిటీ చైర్మన్‌ సంజయ్‌ జైస్వాల్‌కు కూడా మాధవ్‌ వినతిపత్రం అందజేశారు.
*అమరావతి మాస్టర్‌ ప్లాన్‌, ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ (ఐఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌ వ్యవహారంలో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ మాజీ మంత్రి పి.నారాయణ, రామకృష్ణ హౌసింగ్‌ డైరెక్టర్‌ కె.పి.వి.అంజనీకుమార్‌, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలు గురువారం హైకోర్టులో విచారణకు వచ్చాయి. ఈ వ్యవహారంలో వివరాలు సమర్పించాలని సీఐడీని కోర్టు ఆదేశించింది. విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.మన్మథరావు గురువారం ఆదేశాలిచ్చారు. మాస్టర్‌ ప్లాన్‌ డిజైనింగ్‌లో అవినీతి చోటు చేసుకుందన్న ఆళ్ల ఫిర్యాదుతో ఈ నెల 9న చంద్రబాబు, అంజనీకుమార్‌, లింగమనేని రమేశ్‌ తదితరులను నిందితులుగా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
* విధి నిర్వహణలో జాప్యం చేశారన్న అభియోగంతో చిత్తూరులోని సహాయ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) సుజాతను రాష్ట్ర న్యాయ కార్యదర్శి సత్యప్రభాకర్‌రావు సస్పెండ్‌ చేశారు. పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణను ఏ-9 నిందితుడిగా చూపిస్తూ పోలీసులు ఈనెల 10న న్యాయమూర్తి వద్ద హాజరుపరిచిన విషయం తెలిసిందే. అదే రోజు నాలుగో అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టుకు ఏపీపీగా విధులు నిర్వహిస్తున్న సుజాతకు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఫోనుచేసి నారాయణను హాజరు పరుస్తున్న విషయం తెలియజేశారు. రిటర్న్‌ ఆర్గ్యుమెంట్‌తోపాటు పోలీసు కస్టడీ పిటిషన్‌ దాఖలు చేయాలని కోరారు. ఆమె అక్కడకు రాలేదు. దీనిపై న్యాయ కార్యదర్శికి ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో విధుల నిర్వహణలో జాప్యం వహించారంటూ సుజాతను సస్పెండ్‌ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతి లేకుండా జిల్లా కేంద్రం దాటి వెళ్లకూడదని ఆదేశించారు.
*కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ షరతులకు తలొగ్గి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రజలపై భారం మోపుతోంది. బీజేపీతో వైసీపీ స్నేహాన్ని కోరుకుంటోంది. అందువల్లే రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించేలా కేంద్రం వ్యవహరిస్తున్నా ప్రశ్నించడం లేదు’’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. విశాఖలో కొత్తగా నిర్మించిన అల్లూరి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్రం సూచించిన సంస్కరణలకు తలొగ్గి రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు ఏర్పాటు చేస్తోంది. విద్యుత్‌ చార్జీలు పెంపు, చెత్తపన్ను విధింపు వంటి విధానాలను అమలు చేస్తోంది. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తున్నట్టు కనిపించడం లేదు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు సంపాదించే లక్ష్యంతో వ్యవహరిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఉంది. స్టీల్‌ప్లాంట్‌ విషయంలో అధికార పార్టీకి దమ్ముంటే కార్మికుల పక్షాన నిలిచి పోరాటం చేయాలి.
*కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట సమీపంలో జాతీయ రహదారిపై పెళ్లి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా… పెళ్లి కొడుకు సహా 36మంది గాయపడ్డారు. బస్సు విజయనగరం నుంచి ఏలూరుకు వరుడితో మార్గంమధ్యలో గండేపల్లి నీలాద్రి రావు పేట పెట్రోల్ బంక్ సమీపంలో ప్రమాదం జరిగింది. ఒకరిపై ఒకరు పడడంతో పెళ్లి కొడుక్కి వరుసకు పెదనాన్న అయిన గుడిపాటి వెంకట కోదండరామయ్య అనే వ్యక్తి ఊపిరి ఆడకపోవడంతో బస్సులోనే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*విజయవాడ నగర శివారు పాయకాపురంలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్నకొడుకే తండ్రిని హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మద్యం మత్తులో ఇనుప రాడ్‌తో తండ్రి జాన్‌ని కొడుకు విజయ్ తలపై బలంగా కొట్టాడు. పాయకపురం ఏవీఎస్ రెడ్డి రోడ్డులో ఘటన జరిగింది. రూరల్ పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*ఆంధ్రలోని సీలేరు నుంచి అక్రమంగా కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మూడు సంచులలో ఉన్న 50 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో గంజాయిని తరలిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేసి.. నిందితులను పోలీస్ స్టేషన్‎కు తరలించారు.