DailyDose

సీఎం కేసీఆర్‌తో ముగిసిన అఖిలేష్‌ సమావేశం – TNI తాజా వార్తలు

సీఎం కేసీఆర్‌తో ముగిసిన అఖిలేష్‌ సమావేశం  –  TNI  తాజా వార్తలు

* సీఎం కేసీఆర్‌తో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ సమావేశం ముసింది. రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు పలు జాతీయ అంశాలపై చర్చించుకున్నారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించినట్లు సమాచారం. దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీలు సంతోష్‌ కుమార్‌, నామా నాగేశ్వర రావు, రంజిత్‌ రెడ్డి, వెంకటేష్‌ నేత పాల్గొన్నారు.సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్‌ సమావేశమవుతారు. అనంతరం కేజ్రీవాల్‌తో కలిసి రాజధానిలోని పలు ప్రదేశాలను సందర్శించనున్నారు. మొహల్లా క్లినిక్‌, దక్షిణ మోతీబాద్‌ సర్వోదయ పాఠశాలను సందర్శిస్తారు.
* తిరు‌మల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికె‌ట్లను తిరు‌మల తిరు‌పతి దేవ‌స్థానం (TTD) విడుదల చేసింది. జూలై, ఆగస్టు నెలలకు సంబం‌ధిం‌చి టికె‌ట్లను వెబ్‌‌సైట్‌ ద్వారా బుక్‌ చేసు‌కో‌వా‌లని సూచించింది. రోజుకు 25 వేల చొప్పున టికెట్లను అందుబాటులో ఉంచింది. కాగా, వేసవి సెల‌వుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టు‌కొని జులై 15 వరకు శుక్ర, శని, ఆది‌వా‌రాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనా‌లను రద్దు చేసి‌నట్టు అధికారులు తెలిపారు. వీఐపీ బ్రేక్‌ దర్శనా‌లను కేవలం ప్రొటో‌కాల్‌ ప్రము‌ఖు‌లకు పరి‌మితం చేసి‌నట్టు స్పష్టం‌చే‌శారు.
* ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపల్‌ ఏవో జానకీరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. మున్సిపల్‌ కార్యాలయంపై అధికారులు ఇవాళ దాడులు నిర్వహించారు. ఓ గుత్తేదారు నుంచి ఏవో రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పెండింగు బిల్లుల మంజూరుకు లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
* ఆపదలో వరాలిచ్చి ఆదుకునే అమ్మవారిగా ప్రసిద్ధికెక్కిన ఇంద్రకీలాద్రిపై ఆంక్షలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్వాహకుల వల్ల భక్తులు ఇబ్బందులు పడుతుండగా తాజాగా ఆలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది తప్పనిసరిగా ఆంక్షలు పాటించాల్సిందే అంటూ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం కలిగిస్తోంది.విజయవాడలోని దుర్గా ఆలయంలో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది ఇక నుంచి తెలుపు రంగు చొక్కా, పంచె ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. కట్టకపోతే రూ. 200 జరిమానా విధించారు. ఐడీ కార్డు లేకపోతే రూ. 100 జరిమానా విధిస్తామని ఈఓ బ్రమరాంబ ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు ఉల్లంఘించి మూడుసార్లు జరిమానాలు చెల్లించిన వారికి ఇంక్రిమెంట్ కట్ చేస్తామని ఆమె హెచ్చరించారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించడం, ఐడీ కార్డు ధరించడం, బయోమెట్రిక్ హాజరుపై ఈఓ అధికారికంగా సర్క్యులర్ జారీ చేశారు
* దేశంలో నేడు రెండు కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ బీఏ4వైరస్‌ తొలి కేసు తెలంగాణలో నమోదైంది. అలాగే రెండో కేసు తమిళనాడులో గుర్తించడం జరిగింది.ఈ వైరస్ సోకిన వ్యక్తి చెన్నైకి 30 కిలోమీటర్ల దూరంలోని చెంగల్పట్టు జిల్లాలోని నవలూర్ లో నివశిస్తున్నట్లుగా గుర్తించినట్లు తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ వెల్లడించారు.
తెలంగాణలో చూస్తే వైరస్ సోకిన వ్యక్తి హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి కాదని నిర్దారణ అయ్యింది. కేవలం మూడ్రోజుల పాటు ఐఎస్‌బీలో గెస్ట్ లెక్చర్ ఇచ్చేందుకు ఆ వ్యక్తి వచ్చినట్లుగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
* శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైకాపాలో ముసలం మొదలైంది. పార్టీ నియోజకవర్గ బాధ్యతలు స్థానికులకే అప్పగించాలంటూ ఆ పార్టీ నాయకులు రహస్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నందున స్థానికులకే పార్టీ బాధ్యతలు అప్పగించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది . మహమ్మద్ ఇక్బాల్ కు వ్యతిరేకంగా.. మండలాల వారీగా సమావేశం నిర్వహించి తమ అభిప్రాయాన్ని పార్టీ అధిష్టానానికి తెలిసేలా చేయాలని నిర్ణయించారు.ఈ సమావేశంలో వైకాపా నేతలు నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీతో పాటు మున్సిపల్ వైస్ ఛైర్మన్ బలరాం రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు . సమావేశం అనంతరం ఉయ్ వాంట్ లోకల్ అంటూ నినాదాలు చేశారు.
*మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అరెస్టును తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాయదుర్గం వెళ్తున్న కాల్వ శ్రీనివాసులును పోలీసులు అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏం వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య పేరుతో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం పరిపాటిగా మారిందని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు
*దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని రాజీవ్‌ స్మారక జ్యోతి సద్భావన యాత్ర శుక్రవారం ప్రారంభమైంది. తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ (టీఎన్‌సీసీ) ఆధ్వర్యంలో వంద ద్విచక్రవాహనాలతో చేపట్టిన ఈ యాత్రను కన్నియాకుమారి ఎంపీ విజయ్‌ వసంత్‌, టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శి కె.చిరంజీవి జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ జిల్లా నిర్వాహకులు కమలిక కామరాజ్‌, టీవీ భాస్కర్‌, కౌన్సిలర్‌ కీర్తి తదితరులు పాల్గొన్నారు. తొరువొత్తియూర్‌ నుంచి బయల్దేరిన ఈ యాత్ర రాయపురం, ఆర్‌కే నగర్‌, సైదాపేట, పోరూర్‌, పూందమల్లి మీదుగా శనివారం ఉదయం 6 గంటలకు శ్రీ పెరుంబుదూర్‌లోని రాజీవ్‌ స్మారక స్థలికి చేరుకుంటుంది. అక్కడ టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, పార్టీ నాయకులు స్వాగతం పలుకనున్నారు. అక్కడ నుంచి పలు రాష్ట్రాల మీదు గా మూడు నెలల అనంతరం ఢిల్లీ చేరుకొని ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి రాజీవ్‌ స్మారక జ్యోతి అందజేయను న్నట్లు కె.చిరంజీవి తెలిపారు.
*ప్రకాశం: జిల్లాలోని మార్కాపురంలో మున్సిపల్ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. మాగుంట సుబ్బరామిరెడ్డి పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిలా ఫలకం చర్చనీయాంశమైంది. శిలా ఫలకంలో ప్రొటోకాల్ ప్రకారం జిల్లా ఇంచార్జ్ మంత్రి మేరుగ నాగార్జున పేరును అధికారులు వేయాల్సి ఉంది. అయితే… ఇంచార్జ్ మంత్రి మేరుగ నాగార్జున పేరును మేరుగ నాగార్జునరెడ్డిగా తయారు చేయించారు. శిలాఫలకం చర్చనీయాంశంగా మారడంతో పేరు చివర ఉన్న రెడ్డికి నలుపు రంగు వేసి అధికారులు చేతులు దులుపుకున్నారు.
*ఏలూరు: జిల్లాలోని పెదపాడులో అర్థరాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాత దిమ్మెపై ఎన్టీఆర్‌ విగ్రహాన్ని అభిమానులు ఏర్పాటు చేశారు. అయితే ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తొలగించేందుకు పోలీసులు యత్నించారు. దీనిపై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని తొలగిస్తున్న పోలీసులను కార్యకర్తలు, అభిమానులు అడ్డుకున్నారు.
* వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో మాజీ డ్రైవర్ Dead Body దొరికిన ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. అసలేం జరిగిందో పోలీసులు తేల్చి.. ఎమ్మెల్సీని శిక్షించాలని ప్రజా సంఘాలు, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఘటనలో నిజానిజాలేంటని తెలుసుకోవడానికి టీడీపీ నిజనిర్ధారణ కమిటీ కాకినాడలోని జీజీహెచ్ (GGH) ఆస్పత్రికి వచ్చింది. మార్చురీ గదిలోకి చొచ్చుకుని వెళ్లేందుకు కమిటీ సభ్యులు యత్నించగా జీజీహెచ్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో టీడీపీ (TDP) శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు-టీడీపీ కార్యకర్తలు, కమిటీ సభ్యుల మధ్య తోపులాట జరిగింది. అయినప్పటికీ ఏ మాత్రం తగ్గకుండా బారికేడ్లు తోసుకుని మరీ టీడీపీ కార్యకర్తలు ముందుకెళ్లారు.
*నారా లోకేశ్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి స్పందించారు. లే అవుట్లలో అక్రమాల గురించి మాట్లాడిన లోకేశ్‌పై ఇష్టం వచ్చినట్లు వాగుతావా? అని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్లాడని ప్రశ్నించారు. అసలు లండన్‌లో ఏం పని ఉందన్నారు. చంద్రబాబు మినరల్ వాటర్ తాగాడని గతంలో నానా యాగి చేసిన మీరు.. ఇప్పుడు ప్రజల డబ్బుతో ముగ్గురే ముగ్గురు ఒక విమానంలో పోతారా? అని విమర్శించారు.
*హత్య కేసులో ఇరుక్కున్న వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ బరితెగింపులకు పాల్పడ్డాడు. హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి బెదిరింపులకు దిగాడు. హత్య కాదని చెప్పాలంటూ తన మనుషులతో ఒత్తిళ్లు తీసుకువచ్చాడు. భయానికి గురైన మృతుడి భార్య, తల్లిదండ్రులు ఇళ్లు ఖాళీ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తమకు ప్రాణహాని ఉందంటూ మృతుడి సోదరుడు ఏబీఎన్‌కు తెలియజేశాడు. మరోపక్క కుటుంబాన్ని దారికి తీసుకురాడానికి కాకినాడ కీలకనేత బేరసారాలు ఆడుతున్నారు. కోటి వరకు ఇస్తామని.. మృతిపై అనుమానాలు లేవని చెప్పాలంటూ కుటుంబంపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నారు.
* నారా లోకేష్‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో హత్యలు, అరాచకాలు జరిగిపోతున్నాయని నారా లోకేష్ ఆరోపించారని, టీడీపీ ప్రభుత్వంలో ఇదే నెల్లూరులో టీడీపీ నాయకులు రెండు మర్డర్లు చేయలేదా? అని ప్రశ్నించారు. సంతపేటలో జరిగిన మర్డర్ కేసులో A1 నిందితుడితో ప్రెస్ మీట్ పెట్టించుకునే అరాచక పార్టీ TDP అని అనిల్ వ్యాఖ్యానించారు. పదేళ్లలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే రెండు రాజకీయ హత్యలు జరిగాయని పేర్కొన్నారు.
*గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలకు అడుగడుగునా చేదు అనుభవాలు, నిరసనలు ఎదురవుతున్నాయి. తాజాగా కృష్ణాజిల్లా చల్లపల్లి మండలంలో గడపగడపకు కార్యక్రమంలో ప్రభుత్వ తీరును ప్రైవేటు స్కూల్ నిర్వాహకుడు ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తనయుడు వికాస్‌ను రేషన్, ధాన్యం డబ్బు, మంచినీటి సమస్యలపై గ్రామస్తులు నిలదీశారు. పార్టీ చూడం, కులం చూడమని చెప్పిన జగన్ ప్రభుత్వంలో మొత్తం వివక్షే కొనసాగుతోందంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఉపాధ్యాయుడు బయటపెట్టారు. వ్యవసాయ ఇన్సూర్యన్స్ లేకపోవటంతో 4 గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారని సాక్ష్యాలతో సహా నిలదీశారు. ప్రభుత్వ నిర్వాకంతో బస్తా ధాన్యాన్ని 690 రూపాయలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రేషన్ షాపుల్లో బియ్యం తప్పించి ఏమీ ఇవ్వటం లేదని మహిళలు ఫిర్యాదు చేశారు.
*మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అరెస్టును తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాయదుర్గం వెళ్తున్న కాల్వ శ్రీనివాసులును పోలీసులు అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏం వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య పేరుతో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం పరిపాటిగా మారిందని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.
* పెదపాడులో ఎన్‌టీ‌ఆర్ విగ్రహం తొలగించేందుకు అధికారులు యత్నిస్తున్నారు. బస్టాండ్ వద్ద రెండు రోజుల క్రితం ఎన్‌టీ‌ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే దీనిని తొలగించేందుకు అధికారులు యత్నించగా.. దీనిని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. విగ్రహం అలాగే ఉంచాలంటే ఈ నెల 28 లోపు అనుమతి తెచ్చుకోవాలని అధికారులు సూచించారు. అప్పటి వరకూ విగ్రహానికి అధికారులు ముసుగువేశారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
* దుర్గగుడి సిబ్బందికి ఈఓ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇంద్రకీలాద్రిపై పని చేసే ఉద్యోగులు, సిబ్బంది ఇక నుంచి తెలుపు రంగు చొక్కా, పంచె కట్టకపోతే 200 రూపాయలు జరిమానా విధించారు. ఐడీ కార్డు లేకపోతే 100 రూపాయలు జరిమానా విధించారు. విధులకు హాజరయ్యే సిబ్బంది పంచె, ఐడీ కార్డు ధరించి రావాలని ఈఓ బ్రమరాంబ ఆదేశాలు జారీ చేశారు. మూడుసార్లు జరిమానాలు చెల్లించిన వారికి ఇంక్రిమెంట్ కట్ చేస్తామని హెచ్చరించారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు డ్రెస్ కోడ్ పాటించడం, ఐడీ కార్డు ధరించడం, బయోమెట్రిక్ హాజరుపై అధికారికంగా ఈఓ సర్క్యులర్ జారీ చేశారు.
* ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఈనెల 31న రాష్ట్రం నుంచి మూడు జిల్లాలకు చెందిన ముగ్గురు ప్రతినిధులు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవనున్నారు. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ పథకాల లబ్ధిదారులతో ప్రధాని హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లా నుంచి నేరుగా మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా చేయాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం ఢిల్లీ నుంచి కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో (సీఎస్‌లతో) వీడియో సమావేశం నిర్వహించారు.
*రాష్ట్ర వైద్య, ఆరోగ్య అనుబంధ వృత్తుల పరిపాలన సంస్థను (హెల్త్‌కేర్‌ కౌన్సిల్‌) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిమ్స్‌ అదనపు ప్రొఫెసర్‌ డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ను ఈ కౌన్సిల్‌కు చైర్మన్‌గా నియమించింది. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, జీఎంసీ మంచిర్యాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సులేమాన్‌, గాంధీ మెడికల్‌ కళాశాల పాథాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ దేవోజీ మాలోతు నియమితులయ్యారు. కాగా హెల్త్‌కేర్‌ కౌన్సిల్‌ ఏర్పాటుపై ప్రభుత్వ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్ల సంఘం వ్యవస్థాపకుడు రవీందర్‌ హర్షం వ్యక్తం చేశారు.
* రాగల ఐదు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
*రాష్ట్రంలో స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి వినియోగించుకుంటోందని రాష్ట్ర పంచాయతీ చాంబర్‌, పంచాయతీ సర్పంచ్‌లు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. చాంబర్‌ వ్యవస్థాపకుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతా్‌పరెడ్డి, పలువురు సర్పంచ్‌లు శుక్రవారం విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ హరిచందన్‌ను కలిశారు. కేంద్రం 14, 15వ ఆర్థిక సంఘం నిధులను 2018 నుంచి 2022 వరకు రూ.7659.79 కోట్లను విడుదల చేసిందన్నారు.
*డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలు మిరప, నిమ్మ, తీగ పెండలం, కర్రపెండలం, చిలకడదుంప, తోటకూర, పందిరి చిక్కుడు పంటల్లో 10 రకాల కొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. మిర్చిలో ఎల్‌సీఏ- 657, 680, 684, 616 రకాలను సృష్టించారు. నిమ్మ పండ్లలో గజ్జి తెగులు తట్టుకునే టీఏఎల్‌-94114, తీగ పెండలంలో టీజీవై-14-11, కర్ర పెండలంలో పీడీపీ-19, చిలకడదుంపలో పీ ఎస్‌పీ-1, తోటకూరలో వీఆర్‌ఏ-1, పందిరి చిక్కుడులో వీఆర్‌ డీఎల్‌-2 రకాలను రూపొందించారు.
*ఇటీవల పలురకాల ఆరోపణలు ఎదుర్కొన్న ఇద్దరు అధికారుల అధికారాలకు దేవదాయశాఖ కోత పెట్టింది. ప్రమోషన్ల అంశంలో కమిషనరేట్‌లోని ఇన్‌చార్జ్‌ డిప్యూటీ కమిషనర్‌ రత్నరాజు ఉద్యోగులతో మాట్లాడిన ఫోన్‌ ఆడియోలు బయటకు రావడంతో ఆయన్ను ఇన్‌చార్జ్‌ డీసీ పోస్టు నుంచి తొలగిస్తూ దేవదాయ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఆదేశాలు జారీచేశారు. అలాగే కమిషనరేట్‌లో ఆర్టీఐ అధికారిగా ఉన్న శోభారాణి కమిషనరేట్‌లోనే మరో నాలుగు రకాల బాధ్యతలు అప్పగించడంతో పాటు 70కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుగంచిప్రోలు లక్ష్మీతిరుపతమ్మ ఆలయ ఈవో బాధ్యతలు కూడా ఇచ్చారు. దీంతో ఆమె ఆర్టీఐని పూర్తిగా నిర్వీర్యం చేశారు. విజిలెన్స్‌ ఫైళ్ల విషయంలోనూ ఆమెపై పలు ఆరోపణలు రావడంతో పెనుగంచిప్రోలు ఈవోగా తప్పించారు.
*ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును అందరూ వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ విశ్వ భూషణ్‌ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్‌ కుమార్‌ మీనా శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ఓటర్ల అవగాహన కార్యక్రమాలు కీలకమైనవని తెలిపారు.
*ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 31వ తేదీన హిమాచల్‌ ప్రదేశ్‌ రాజధాని సిమ్లా నుంచి ప్రధాని నరేంద్రమోదీ.. దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ కేంద్ర పథకాల లబ్ధిదారులతో నేరుగా మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించి జిల్లాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై శుక్రవారం ఢిల్లీ నుంచి కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించి, తగిన ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా హర్‌ ఘర్‌ జెండా విధానం కింద జాతీయ జెండా ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా అన్ని ప్రభుత్వ భవనాలు, సంస్థలు, విద్యాసంస్థలన్నింటిపైనా ఆరోజు జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. రాష్ట్రంలో విజయనగరం, కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి పీఎంతో ఇంటరాక్ట్‌ అయ్యేందుకు ముగ్గురు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు సీఎస్‌ సమీర్‌శర్మ తెలిపారు.
*గత ప్రభుత్వ హయాంలో వేసిన 2018 డీఎస్సీలో సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా వారు ఎంపికయ్యారు. మొత్తం పోస్టుల్లో రెండు శాతం స్పోర్ట్స్‌ కోటా ఉండడంతో, ఆ కోటా కింద రాష్ట్రవ్యాప్తంగా 48 మంది పరీక్షలో ఉత్తీర్ణులై అర్హత సాధించారు. ఇదే నోటిఫికేషన్‌లో ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌, పండిట్‌ తదితర అన్ని కేటగిరీలవారికీ పోస్టింగ్‌లు ఇచ్చేశారు. కానీ, స్పోర్ట్స్‌ కోటా కింద ఎంపికైన ఈ నలభై ఎనిమిది మందికి మాత్రం పోస్టింగ్‌ ఇవ్వకుండా కత్తి కట్టినట్లు వ్యవహరిస్తున్నారనే ఆవేదన అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. 2020 అక్టోబరు 27న జిల్లా విద్యాశాఖాధికారి(డీఈవో) కార్యాలయాల్లో సర్టిఫికెట్లను పరిశీలించారు. విద్యార్హత పత్రాలతో పాటు, స్పోర్ట్స్‌ సర్టిఫికెట్లను విద్యార్థులు తమ జిల్లాలోని విద్యాశాఖాధికారి కార్యాలయంలో చూపించారు. అది జరిగి రెండేళ్లయినా ఉద్యోగాలు మాత్రం ఇవ్వలేదు. మళ్లీ తిరగ్గా తిరగ్గా.. స్పోర్ట్స్‌ కోటాకు చెందినవారు కాబట్టి ఈ ఏడాది ఫిబ్రవరిలో శాప్‌ జిల్లా కార్యాలయాల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేశారు. అయినా ఉద్యోగాలు ఇవ్వలేదు. మళ్లీ అధికారుల చుట్టూ తిరగ్గా తిరగ్గా.. ఈసారి శాప్‌ రాష్ట్ర కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన చేయాలని చెప్పారు. లక్షల మంది రాసిన పరీక్షలో ఎంపికైన అభ్యర్థులను ఇలా నాలుగేళ్లుగా తిప్పడం, శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వ్యవస్థలకే మచ్చ తెచ్చేలా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
*ఏపీ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి, జస్టిస్‌ సంతోష్‌ రెడ్డి శనివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో వేర్వేరుగా ఆలయంలోకి వెళ్లిన వీరు ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు.
*రాష్ట్రంలో కీలకమైన ఏడు జాతీయ రహదారులను నాలుగు వరుసలుగా విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వాటిపై సమగ్ర ప్రాజెక్టు రిపోర్టులు(డీపీఆర్‌) సమర్పించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖను ఆదేశించింది. ఈ రహదారుల విస్తరణకు రూ.4,890 కోట్లు వ్యయం కానున్నాయి. ఏడు జాతీయ రహదారులు ప్రస్తుతం 2 వరుసల్లో ఉన్నాయి. వీటిలో మూడు రహదారులపై పరిమితికి మించిన ట్రాఫిక్‌ ఉంది. ఇటీవలి కాలంలో ఆయా రహదారులపై ట్రాఫిక్‌ ఒత్తిడి పెరగడంతో విస్తరించాలని ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్రం ఆ పనులను వార్షిక ప్రణాళికలో చేపట్టేందుకు అంగీకరించింది. ఇదిలావుంటే, మరో మూడు రహదారులను 38 కిలోమీటర్ల మేర రూ.200 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలకు కూడా కేంద్రం అంగీకరించింది.
*ఓఎంసీ డైరెక్టర్‌ బీవీ శ్రీనివాసరెడ్డికి రాయదుర్గం జూనియర్‌ సివిల్‌ కోర్టు జైలు శిక్ష విధించింది. అనంతపురం జిల్లా ఫారెస్టు అధికారి కల్లోల్‌ బిశ్వాస్‌ విధులను అడ్డుకుని, దాడికి యత్నించిన కేసులో నేరం రుజువు అయింది. దీంతో ఆయనకు జైలు శిక్షతో పాటు జరిమానాను కోర్టు విధించింది. డీ హీరేహాళ్‌ పోలీస్‌ స్టేషన్‌లో అటవీ శాఖ జిల్లా అధికారి కల్లోల్‌ బిశ్వాస్‌ ఫిర్యాదు మేరకు 2009 నవంబరు 1న కేసు నమోదు అయింది. క్రైం నంబర్‌ 75/2009, ఐపీసీ సెక్షన్లు 186, 188, 341, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎ-1గా రఘునాథరెడ్డి, ఎ-2గా బీవీ శ్రీనివాసరెడ్డిని పేర్కొన్నారు. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీలో అక్రమ తవ్వకాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు రావడంతో కల్లోల్‌ బిశ్వాస్‌ తనిఖీకి వెళ్లారు. ఆ సమయంలో ఎ-2 నిందితుడు బీవీ శ్రీనివాసరెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారని అటవీశాఖ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ నేరం రుజువు కావడంతో కోర్టు నాలుగు సంవత్సరాల ఒక నెల జైలు శిక్ష (49 నెలలు), రూ.8,500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. కాగా, ఎ-1 నిందితుడు రఘునాథరెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు.
*ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కారడ్‌ తెలిపారు. అమరావతిలో రిజర్వుబ్యాంకు, కాగ్‌తో పాటు ఆయా మంత్రిత్వ శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేయాలని గతంలో రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ విజ్ఞప్తి చేశారు. దానికి సమాధానంగా కేంద్ర మంత్రి ఆయనకు లేఖ రాశారు. కార్యాలయం ఏర్పాటు ప్రక్రియను ఇప్పటికే రిజర్వు బ్యాంకు ప్రారంభించిందని.. త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. ఇతర కార్యాలయాల ఏర్పాటు అంశాన్ని ఆయా శాఖలకు పంపించామని పేర్కొన్నారు.
*ఏపీలో మరో బాదుడుకు రంగం సిద్ధమైంది. భవన నిర్మాణాల విలువ భారీగా పెరగనుంది. ఇటీవల ప్రభుత్వం భూముల విలువను పెంచిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాణాల విలువను జూన్ 1 నుంచి పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రిజిస్టేషన్ ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది.
*తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను జూన్‌ 2న అట్టహాసంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకావిష్కరణ చేస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదరి సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇతర జిల్లాల్లో మంత్రులు, చీఫ్‌ విప్‌, విప్‌లు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు జెండాలు ఎగురవేస్తారని తెలిపారు. హైదరాబాద్‌ సహా ప్రతి జిల్లాలో తెలంగాణ అమరు ల స్మారక స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించాలని సూచించారు. ఆ రోజు ఉదయం 9గంటలకు అన్ని జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని, వేడుకలకు హాజరయ్యే ముఖ్యఅతిథిని సంబంధిత జిల్లా కలెక్టర్‌, సీపీ/ఎస్పీలు అనుసరించాలని పేర్కొన్నారు. శాసనసభ స్పీకర్‌, శాసనమండలి చైర్మన్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మేయర్లు, డీసీసీబీ చైర్మన్లు, మునిసిపల్‌ చైర్మన్లు, జిల్లాస్థాయి అధికారులంతా కలెక్టరేట్‌లో నిర్వహించే వేడుకల్లో పాల్గొనాలని సూచించారు. వివిఽధ జిల్లా శాఖల కార్యాలయాల్లో సంబంధిత అధికారులు ఉదయం 8.15 గంటలకే జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర అవతరణ దినోత్సవాలను నిర్వహించాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్‌ జెండాలను ఆవిష్కరించకూడదని సీఎస్‌ హెచ్చరించారు.
*కరీంనగర్: జిల్లాలోని తిమ్మాపూర్ మండలం మోగిలిపాలెం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
*హైదరాబాద్: నగరంలోని ఉస్మానియా మార్చురీ వద్ద కులనిర్మూలన సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కుల, మతాంతర వివాహాలు చేసుకున్న వారిని హత్య చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 71కి పైగా పరువు హత్యలు జరిగాయని తెలిపారు. సమాజంతో పాటు తల్లిదండ్రులు, యువతలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కుల, మత దురహంకారంతో ఇలాంటి హత్యలు చేస్తున్నారని మండిపడ్డారు. సక్రమమార్గం చూపించేవారు లేక యువత ఇలాంటి దారుణాలు వెళుతోందని కులనిర్మూలన సంఘం నేతలు వ్యాఖ్యానించారు. మరోవైపు కులోన్మాదానికి బలైన నీరజ్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి తరలించారు. మరికొద్దిసేపట్లో నీరజ్ డెడ్ బాడీకి వైద్యులు పోస్టుమార్టం చేయనున్నారు. పోస్టుమార్టం నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఉస్మానియా వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
*దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. శుక్రవారం ఢిల్లీలో మంత్రి ప్రశాంత్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ లోకసభ పక్ష నేత నామా నాగేశ్వర రావు పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఎండీపీ ఇన్‌ఫ్రా నిర్మాణ సంస్థకు నిర్మాణ బాధ్యతను అప్పగించామని, గడువులోగా పనులు పూర్తవుతాయని ప్రశాంత్‌ రెడ్డి చెప్పారు.
*దిశ హత్యాచారం కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారాన్ని హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది బూటకపు ఎన్‌కౌంటరని, 10 మంది పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ సీల్డ్‌ కవర్‌లో ఇచ్చిన నివేదికను హైకోర్టుకు పంపించింది. శుక్రవారం ఈ కేసుపై జస్టిస్‌ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. నివేదికను బహిర్గతం చేయవద్దని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. నివేదిక కాపీలను ఈ కేసులో ఇరుపక్షాలకు పంపించాలని ఆదేశించింది.
*తమ చరిత్రలో తొలిసారిగా శ్రీలంక రుణం ఎగవేసింది. రూ.607 కోట్ల వడ్డీ చెల్లించేందుకు ఆ దేశానికి ఉన్న 30 రోజుల అదనపు గడువు బుధవారంతో ముగియడంతో, దేశం అధికారికంగా రుణం ఎగవేసినట్లైందని దేశ రిజర్వు బ్యాంకు గవర్నర్‌ వీరసింఘే తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్దవైన రెండు క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. వివిధ దేశాలకు లంక రూ. 3.8లక్షల కోట్లు చెల్లించాలి.
*తమ చరిత్రలో తొలిసారిగా శ్రీలంక రుణం ఎగవేసింది. రూ.607 కోట్ల వడ్డీ చెల్లించేందుకు ఆ దేశానికి ఉన్న 30 రోజుల అదనపు గడువు బుధవారంతో ముగియడంతో, దేశం అధికారికంగా రుణం ఎగవేసినట్లైందని దేశ రిజర్వు బ్యాంకు గవర్నర్‌ వీరసింఘే తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్దవైన రెండు క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. వివిధ దేశాలకు లంక రూ. 3.8లక్షల కోట్లు చెల్లించాలి.
*కర్ణాటక రాష్ట్రంలో ఇనుప గనుల తవ్వకాలు, ఎగుమతులను పునఃప్రారంభించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ఈ-వేలానికి స్పందన తక్కువ ఉందని పేర్కొంటూ రాష్ట్రంలో ఇప్పటికే తవ్విన ఇనుప ఖనిజం నిల్వలను క్లియర్‌ చేసుకునేందుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు 2011లో జారీ చేసిన ఉత్తర్వులను సడలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కర్ణాటకలో ఇనుప ఖనిజం తవ్వకాలు, ఎగుమతులపై నిషేధం విధించాక పదేళ్ల తర్వాత మళ్లీ వీటికి మోక్షం లభించబోతుండడం గమనార్హం.
*భారత్‌లో దురాక్రమించిన ప్రాంతంలోనే చైనా వారధిని నిర్మించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ తెలిపారు. ‘‘ఇది సైన్యం సంబంధిత అంశం కాబట్టి నేను పెద్దగా విశదీకరించను. కానీ అది మన భూభాగంలోనిదేనని భారత్‌ విశ్వసిస్తోంది’’ అన్నారు. ఇన్నాళ్లూ చైనా నిర్మించిన తొలి వారధి అసలు వారధి కాదని, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన పెద్ద వారధి నిర్మాణం కోసం కట్టినదని రక్షణ శాఖ వర్గాలు వివరించాయి. మరోవైపు చైనా పదే పదే దురాక్రమణలకు పాల్పడుతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఉండటం వెనుక అర్థమేంటని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది.
* దిగ్గజ క్యాబ్‌ సేవల సంస్థలు ఓలా, ఉబెర్‌కు నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర వినియోగదారుల భద్రత సాధికార సంస్థ(సీసీపీఏ) వెల్లడించింది. వినియోగదారుల్లో సేవా లోపాలు, ఆమోదయోగ్యం కాని సేవలపై నోటీసులు ఇచ్చినట్లు, 15 రోజుల్లో సమాధానమివ్వాలని ఆదేశించినట్లు సీసీపీఏ చీఫ్‌ కమిషనర్‌ నిధి ఖారే తెలిపారు. జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌(ఎన్‌సీహెచ్‌)కు గత ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ నెల 1 వరకు ఓలాకు వ్యతిరేకంగా 770, ఉబెర్‌పై 2,482 ఫిర్యాదులు వచ్చినట్లు సీసీపీఏ తెలిపింది. ఈ నెల 10న అన్ని క్యాబ్‌ సేవల సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి, పటిష్ఠ ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.
*రెండేళ్లకుపైగా వాయిదా పడుతూ వస్తున్న బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) ఎన్నికలు ఇక నిర్వహించడం తప్పనిసరి అవుతోంది. రెండు నెలల్లో రిజర్వేషన్లు పూర్తి చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాలని సుప్రీంకోర్టు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. వార్డుల విభజనతోపాటు అన్ని ప్రక్రియలు పూర్తి చేయాలని పేర్కొంది. కొన్ని నెలలుగా వాయిదా పడిన పాలికె ఎన్నికలను జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ మాజీ కార్పొరేటర్‌ శివరాజ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏఎం ఖాన్‌ విల్కర్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది వార్డుల విభజన, రిజర్వేషన్‌ ప్రక్రియ జరపాల్సి ఉందని ధర్మాసనానికి వివరించారు. దీంతో రెండు నెలల్లోగా ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సూచించింది. సుప్రీంకోర్టు తీర్పును సీఎం బసవరాజ్‌ బొమ్మై స్వాగతించారు. ఎన్నికల ప్రక్రియను అమలు చేస్తామన్నారు. రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌ అశోక్‌ సుప్రీంతీర్పుపై స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తీర్పును స్వాగతిస్తోందని, ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజ్యసభ, విధానపరిషత్‌ ఎన్నికల ప్రక్రియ ముగియగానే బెంగళూరు పాలికె సమరంతో రాజకీయం వేడెక్కనుంది