Health

ఈ రంగురంగుల టీలతో ఆరోగ్యాన్ని పెంచుకుందాం!

ఈ రంగురంగుల టీలతో ఆరోగ్యాన్ని పెంచుకుందాం!

మనసు బాగోకపోయినా, ఉదయాన్నే శరీరానికి కాస్తంత ఉత్సాహాన్ని అందించాలన్నా, తలనొప్పి వేధిస్తున్నా.. ఓ కప్పు టీ పుచ్చుకుంటాం. అయితే ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ ఉన్న వారు సాధారణ టీకి బదులుగా ఆరోగ్యకరమైన టీలను ఎంచుకోవడం పరిపాటే! విభిన్న రంగుల్లో ఆకట్టుకునే టీలు ఇదే కోవకు చెందుతాయంటున్నారు నిపుణులు. రంగుతో పాటు రుచి కూడా కలగలిసిన ఈ ఛాయ్‌లలో బోలెడన్ని పోషకాలు దాగున్నాయని చెబుతున్నారు. అందుకే టీ టైమ్‌లో సాధారణ టీలకు బదులు వీటిని చేర్చుకుంటే అటు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఇటు టీ తాగామన్న సంతృప్తినీ ఏకకాలంలో పొందచ్చు. ‘అంతర్జాతీయ టీ దినోత్సవం’ (మే 21) సందర్భంగా అలాంటి కొన్ని కలర్‌ఫుల్‌ టీలు, వాటిలో దాగున్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకుందాం రండి..

ఆరోగ్యంపై స్పృహ ఉన్న వారు ఎప్పటికప్పుడు కొత్త కొత్త రుచుల్ని కోరుకుంటుంటారు. ఈ క్రమంలోనే తేనీరులోనూ మార్పులు చేర్పులు చేసుకుంటుంటారు. ఇలా ప్రస్తుతం రంగురంగుల టీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. గ్రీన్‌ టీ, బ్లాక్‌ టీ, వైట్ టీ, రెడ్‌ టీ (వూలుంగ్‌ టీ), యెల్లో టీ.. వంటివీ ఇవే కోవలోకి వస్తాయి. ఇవన్నీ Camellia Sinensis అనే టీ మొక్క ఆకులు/మొగ్గల నుంచే తయారవుతాయి. ఈ టీలన్నీ చూడ్డానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో.. అన్ని పోషకాలను తనలో నింపుకొని ఉంటాయి. సో.. వాటిని రోజూ తీసుకోవడం ద్వారా ఆ పోషకాలను శరీరానికి అందించచ్చు.

*బరువు తగ్గించే ‘గ్రీన్‌ టీ’!
Camellia Sinensis అనే మొక్కల ఆకులు, మొగ్గల నుంచి దీన్ని తయారుచేస్తారు. ఈ టీ మార్కెట్లో విడిగా లేదంటే టీబ్యాగ్స్‌ రూపంలోనైనా దొరుకుతుంది. ముందుగా నీటిని మరిగించి.. గ్రీన్‌ టీ బ్యాగ్‌ ఉంచిన కప్పులో ఈ నీటిని పోసి.. రెండు నిమిషాలు అలా వదిలేస్తే గ్రీన్‌ టీ తయారవుతుంది. ఇక టీబ్యాగ్స్‌తో కాకుండా విడిగా దొరికే గ్రీన్‌ టీతో తయారుచేసుకునే వారు కప్పు నీటిని మరిగించేటప్పుడే అందులో రెండు టీస్పూన్ల గ్రీన్‌ టీని వేస్తే సరిపోతుంది.. ఆపై దాన్ని వడకట్టుకొని తీసుకోవచ్చు. తీపి కోరుకునే వారు ఇందులో టీస్పూన్‌ తేనెని కూడా కలుపుకోవచ్చు.
* గ్రీన్‌ టీలో అత్యధికంగా ఉండే పాలీఫినోల్స్‌ వాపు తగ్గించడంలో, క్యాన్సర్‌ను నివారించడంలో తోడ్పడతాయి.
* ఈ టీలో కెఫీన్‌ ఉంటుంది.. కానీ కాఫీలో ఉన్నంత ఎక్కువగా ఉండదంటున్నారు నిపుణులు. ఇది మెదడు పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.. మనసునూ ప్రశాంతంగా ఉంచుతుంది.
* బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్‌ టీ చక్కటి ప్రత్యామ్నాయం అని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. జీవక్రియా రేటును మెరుగుపరిచి శరీరంలో పేరుకుపోయిన కొవ్వుల్ని తక్కువ సమయంలోనే కరిగించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుందట!
* యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ టీలను రోజూ తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్‌.. వంటి ప్రాణాంతక వ్యాధులకు దూరంగా ఉండచ్చట!
* ఈ టీలో ఉండే కేట్చిన్‌ సమ్మేళనాలు నోటి దుర్వాసనను దూరం చేసి నోటిలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయట!
* గుండె ఆరోగ్యానికి, మధుమేహాన్ని అదుపు చేసి టైప్‌-2 డయాబెటిస్‌ బారిన పడకుండా కాపాడడంలోనూ ఈ టీకి సాటి మరొకటి లేదంటున్నారు నిపుణులు.

*****‘బ్లాక్‌ టీ’తో బీపీకి చెక్‌!
గ్రీన్‌ టీ లాగే దీన్ని కూడా Camellia Sinensis అనే మొక్కల ఆకుల నుంచి తయారుచేస్తారు. ఈ ఆకుల్ని పూర్తిగా ఆక్సీకరణం చెందించడం ద్వారా బ్లాక్‌ టీ తయారవుతుంది. అరటీస్పూన్‌ ఈ టీని తీసుకొని రెండు కప్పుల నీటిలో వేసి మరిగించాలి. ఆపై వడకట్టుకొని అందులో రుచి కోసం బ్రౌన్‌ షుగర్‌ కలుపుకోవచ్చు. పేరుకు తగినట్లే చూడ్డానికి నలుపు రంగు (ముదురు ఎరుపు)లో ఉండే ఈ టీలో బోలెడన్ని పోషకాలున్నాయంటున్నారు నిపుణులు.
* బ్లాక్‌ టీలో ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రోజుకు మూడు కప్పుల బ్లాక్‌ టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 11 శాతం తగ్గుతుందని ఓ అధ్యయనంలో తేలింది.
* శరీరంలో చెడు కొవ్వును తగ్గించడంలో ఈ టీ సహకరిస్తుంది. తద్వారా బీపీ, గుండె సమస్యలకు చెక్‌ పెట్టచ్చు.
* ఈ టీలో ఉండే యాంటీ మైక్రోబియల్‌ గుణాలు, పాలీఫినోల్స్‌ పొట్టలో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసి జీర్ణసంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడతాయి. అలాగే రోగనిరోధక శక్తినీ పెంచుతాయి.
* రక్తంలో చక్కెర స్థాయులు అదుపు తప్పితే టైప్‌-2 డయాబెటిస్‌, స్థూలకాయం, మూత్రపిండాలు పనిచేయకపోవడం, డిప్రెషన్‌.. వంటి సమస్యలు తలెత్తుతాయి. మరి, వీటన్నింటికీ దూరంగా ఉండాలంటే రోజూ బ్లాక్‌ టీ తాగడం ఒక్కటే మార్గమంటున్నారు నిపుణులు.

*******వయసును దాచేసే ‘వైట్‌ టీ’!
లేలేత Camellia Sinensis అనే మొక్కల ఆకులు/మొగ్గల్ని సేకరించి వైట్‌ టీ తయారుచేస్తారు. రెండు టీస్పూన్ల ఈ టీ తేయాకుల్ని తీసుకొని వాటిని కప్పు మరిగించిన నీటిలో వేసి మూత పెట్టేయాలి. ఐదు నిమిషాలయ్యాక ఈ టీని వడకట్టుకొని తాగితే సరి! ఇందులో రుచి కోసం తేనె కూడా కలుపుకోవచ్చు. అయితే వైట్‌ టీని చల్లచల్లగా తాగడానికి ఇష్టపడే వారు ఈ టీ తయారయ్యాక పూర్తిగా చల్లారనిచ్చి ఆపై రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టి తీసుకోవచ్చు.
* కేట్చిన్స్‌, టానిన్స్‌, ఫ్లోరైడ్‌.. వంటివి అధికంగా ఉండే వైట్‌ టీ నోట్లో మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తుంది. తద్వారా నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. అలాగే దంతాల్నీ దృఢంగా ఉంచుతుంది.
* శరీరంలోని ఫ్రీరాడికల్స్‌, దీర్ఘకాలిక వాపు.. వంటివి ఆస్టియోపొరోసిస్‌కు కారణమవుతాయి. ఈ సమస్య రాకుండా నివారించుకోవాలంటే రోజూ వైట్‌ టీ తాగాల్సిందే! ఇందులోని పాలీఫినాల్స్‌, కేట్చిన్స్‌ ఈ సమస్యను దూరం చేసి ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
* ఎండ వేడి, వాతావరణ కాలుష్యం.. వంటివి చిన్న వయసులోనే వయసు పైబడినట్లుగా కనిపించేలా చేస్తున్నాయి. తద్వారా అందం దెబ్బతింటుంది. అదే రోజూ వైట్‌ టీ తాగడం, లేదంటే ఈ టీ తయారుచేశాక మిగిలిన పిప్పిని ముఖానికి రాసుకోవడం.. వంటివి చేస్తే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు సౌందర్య నిపుణులు. ముఖ్యంగా సూర్యకాంతి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు చర్మ ఆరోగ్యాన్ని పాడుచేయకుండా ఇందులోని ఎంజైమ్స్‌ కాపాడతాయట!

*******రెడ్‌ టీ’ రోజుకు ఎంత తాగాలి?
వూలుంగ్‌ టీగా పిలిచే దీన్ని Camellia Sinensis ఆకుల్ని పాక్షికంగా ఆక్సీకరణం చెందించడం ద్వారా తయారుచేస్తారు. కప్పు నీటిలో టీస్పూన్‌ రెడ్‌ టీ తేయాకును వేసి మరిగించాలి. ఆపై కప్పులో వడకట్టుకొని కాస్త చల్లారాక అరటీస్పూన్‌ తేనెను జతచేసుకోవాలి. దీన్ని ఇలా వేడిగానైనా తీసుకోవచ్చు.. లేదంటే పూర్తిగా చల్లారాక ఓ రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకొని చల్లగానైనా తాగచ్చు.
* వూలుంగ్‌ టీలో ఉండే పాలీఫినోల్‌ యాంటీఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయుల్ని అదుపులో ఉంచుతాయి. తద్వారా మధుమేహం దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు.
* ఈ టీలో ఉండే కెఫీన్‌, పాలీఫినోల్స్‌ శరీరంలో క్యాలరీలను పెంచి చెడు కొవ్వును కరిగిస్తాయి. తద్వారా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుంది.
* చర్మంపై అలర్జీలు, వాపు ఉన్న వారు రోజూ ఈ టీ తీసుకుంటే ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇందుకు దీనిలోని పాలీఫినోల్‌ యాంటీఆక్సిడెంట్లే కారణం.
* ఆరోగ్యకరం కదా అని ఈ టీని మరీ ఎక్కువగా తాగితే మాత్రం.. ఇందులోని కెఫీన్‌ తలనొప్పి, నిద్రలేమి, బీపీ, యాంగ్జైటీ.. వంటి సమస్యల్ని తెచ్చిపెడుతుందంటున్నారు నిపుణులు. అందుకే రోజుకు పది కప్పులకు మించి తాగొద్దట! ఇక గర్భిణులైతే మూడునాలుగు కప్పుల కంటే ఎక్కువ తాగకపోవడమే మంచిదంటున్నారు.

******ఈ టీ గర్భిణులకు మంచిదట!
Camellia Sinensis ఆకుల్ని పాక్షికంగా ఆక్సీకరణం చెందించడం ద్వారా యెల్లో టీని తయారుచేస్తారు. అమోఘమైన రుచి, వాసన కలిగిన ఈ టీని ఇంట్లో సులభంగా తయారుచేసుకోవచ్చు. కప్పు నీటిని ముందుగా బాగా మరిగించి.. ఆపై అందులో టీస్పూన్‌ యెల్లో టీ తేయాకుల్ని వేయాలి. మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆపై వడకట్టుకొని తేనె లేదంటే ఇతర ఆర్టిఫీషియల్‌ స్వీట్‌నర్స్‌ని కలుపుకొని తాగేయడమే!
* శరీరంలోని మలినాల్ని, విషతుల్యాలను తొలగించి జీవక్రియల పనితీరును మెరుగుపరిచే కాలేయాన్ని కాపాడుకోవాలంటే రోజూ యెల్లో టీ తాగడం మంచిదంటున్నాయి కొన్ని అధ్యయనాలు. ఇందులోని పాలీఫినోల్స్‌ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, హెపటైటిస్‌ (కాలేయ వాపు) సమస్యను దూరం చేయడానికి తోడ్పడతాయట!
* ఆకలిని పెంచే శక్తి యెల్లో టీకి ఉందంటున్నారు నిపుణులు. కప్పు యెల్లో టీని భోజనానికి గంట ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందట!
* గర్భం ధరించిన తొలి త్రైమాసికంలో ఈ టీ తాగడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. అయితే నిపుణులు సూచించినట్లుగా మోతాదుకు మించకుండా చూసుకోమంటున్నారు.
రంగు, రుచి కలగలిసిన ఈ టీలన్నీ ఆరోగ్యానికి ఎంత మంచివో తెలుసుకున్నారుగా! ఇవన్నీ సహజసిద్ధమైనవే కాబట్టి ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండకపోవచ్చు. అలాగని మోతాదుకు మించకుండా తీసుకోవడం మంచిది. ఈ క్రమంలో వీటి విషయంలో ఇంకేమైనా సందేహాలుంటే నిపుణుల సలహా తీసుకోవచ్చు.