NRI-NRT

కెనడా పార్లమెంటులో కన్నడలో ప్రసంగించిన భారత సంతతి పార్లమెంటు సభ్యుడు..

కెనడా పార్లమెంటులో కన్నడలో ప్రసంగించిన భారత సంతతి పార్లమెంటు సభ్యుడు..

పుట్టిన దేశం, మాతృభాష గొప్పదనాన్ని పరాయి గడ్డపైనా చాటాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ.. ఆ అదృష్టం అందరినీ వరించదు. అయితే..కెనడాలో భారత సంతతికి చెందిన శాసనసభ్యుడు చంద్ర ఆర్యకు తాజాగా ఈ అరుదైన అవకాశం దక్కింది. ఇటీవల ఆయన కెనడా పార్లమెంటులో తన మాతృభాష కన్నడలో కొద్దిసేపు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాతృభాషలో ప్రసంగించే అవకాశం లభించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కెనడాలో నివసిస్తున్న ఐదు కోట్ల కన్నడ ప్రజలకు ఇది గర్వకారణమని వ్యాఖ్యానించారు. ‘‘నువ్వు ఎవరైనా సరే.. ఎక్కడున్నా సరే.. కన్నడిగుడిగానే జీవించు’’ అంటూ ప్రముఖ కన్నడ కవి కువెంపు రచించిన పాట గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ భావోద్వేగ భరిత క్షణాలకు సంబంధించి ఓ వీడియోను కూడా ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నారు. మరో దేశ పార్లమెంటులో కన్నడ భాష వినపడడం ఇదే తొలిసారి అంటూ ఎమోషనల్ కామెంట్ జతచేశారు. ఇక.. కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డా. సీఎన్ అశ్వథ్‌నారాయణ ఈ వీడియోను రీట్వీట్ చేశారు. అంతేకాకుండా.. అక్కడి పార్లమెంటులో మాతృభాషలో ప్రసంగించిన చంద్ర ఆర్యపై పొగడ్తల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. కాగా.. చంద్ర ఆర్య 2015లో తొలిసారిగా కెనడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇక 2019లో జరిగిన ఎన్నికల్లోనూ విజయం సాధించి రెండో సారి పార్లమెంటులో అడుగుపెట్టారు.