Agriculture

నోరూరించే కొండ మామిడి.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

నోరూరించే కొండ మామిడి.. దీని ప్రత్యేకత ఏమిటంటే?

తూర్పు కనుమ అడవుల్లో ఈ కాలంలో ప్రకృతి సిద్ధంగా విరివిగా కనిపించే కొండమామిడి కాయలు అంటే ఇష్టపడని వారుండరు. ఇవి పక్వానికి వచ్చి పండుగా మారేందుకు మరో 20 రోజులు పడుతుంది. రైతులు సాగు చేసే సాధారణ రకాలకు సంబంధించి దిగుబడి గణనీయంగా పడిపోయింది. కలెక్టర్, బంగినపల్లి, రసాల రకాలకు చెంది కాపు ఏటా కన్నా ఈ ఏడాది బాగా తగ్గింది. అక్కడక్కడ కలెక్టర్‌ రకం కాయలు మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే అటవీప్రాంతంలో మాత్రం అడవి మామిడి చెట్లు మాత్రం విరగ్గాశాయి. పక్వానికి రాగానే వాటికవే చెట్ల పైనుంచి నేలరాలతాయి. మంచి సువాసనతో నోరూరించే ఈ పండ్లను తినేందుకు పిల్లలు పెద్దలు ఎంతో ఆసక్తి చూపుతారు.

పండ్లు కాయలు ఆకుపచ్చ రంగులోనే ఉండటం వీటి ప్రత్యేకత. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ మామిడి పండ్లకు స్థానికంగా మంచి గిరాకీ. ఏమాత్రం పచ్చిగా ఉన్నా నోట్లో పెట్టలేనంత పుల్లగా వుంటాయి. పీచు ఎక్కువ. గుజ్జు పసుపు రంగులో ఉంటుంది. వేసవిలో పిల్లలు ఈ చెట్ల కిందనే ఎక్కువ సమయం గడుపుతారు. మండలంలోని కిమ్మిలిగెడ్డ, అమ్మిరేఖల, కొత్తవీధి, లోదొడ్డి తదితర లోతట్టు ప్రాంతాల్లో కొండమామిడి చెట్లకు కొదవలేదు. కిమ్మిలిగెడ్డ సమీపాన రక్షిత అడవుల్లో ఇవి గుబురు గుబురుగా, ఎత్తుగా పెరిగి కనిపిస్తాయి.

ఆవకాయకు బహుబాగు
కొండమామిడి కాయలు ఆవకాయకు బాగుంటాయని చెబుతుంటారు. ఈ కాయలకు టెంక పెద్దది, గుజ్జు పీచు కట్టి ఉన్నందున ముక్కలు బాగా వస్తాయని, పులుపు ఎక్కువ కనుక ఆవకాయ పచ్చడికి శ్రేష్టమని గృహిణులు చెబుతారు. సాధారణ మామిడి రకాలు అందుబాటులో లేని కారణంగా ఈ ఏడాది ఇక కొండమామిడి కాయలపైనే ఆధారపడాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు.