NRI-NRT

భారతీయ అమెరికన్ చిన్నారులకు తీపి కబురు !

భారతీయ అమెరికన్ చిన్నారులకు తీపి కబురు !

*యూఎస్లో నివాస యోగ్యత కల్పించడానికి చురుగ్గా ప్రయత్నాలు

సాధికార అనుమతి పత్రాలు లేకుండా చిన్న వయసులోనే అమెరికాకు వచ్చి ఇక్కడే చదువుకుని పెరిగి పెద్దయిన విదేశీ బాలబాలికలు ఆ దేశ పౌరసత్వం లభించక ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇలాంటి వారికి చట్టబద్ధంగా నివాస హోదా కల్పించడానికి 2001 లో డెవలప్మెంట్, రిలీఫ్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఏలియన్ మైనర్స్ (డ్రీమ్) చట్టం పేరిట అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్)లో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపాదిత బిల్లు పరిధిలోకి వచ్చే పిల్లలను డ్రీమర్స్ అంటారు. వీరిలో చాలామంది భారతీయ అమెరికన్ల పిల్లలే. చట్టబద్ధంగా వలస వచ్చిన వారి పిల్లలు అమెరికాలోనే ఉండటానికి వీలు కల్పించే బాలల చట్టాన్ని పాలక, ప్రతిపక్ష సెనెటర్లు అలెక్స్ పాడిలా (డెమోక్రాట్), ర్యాండ్ పాల్ (రిపబ్లికన్) 2021 లో ప్రవేశపెట్టారు. అది త్వరగా ఆమోదం పొందేలా చూడటానికి పాడిలాతో సహా కొందరు డెమోక్రటిక్ పార్టీ సభ్యులు తాజాగా కృషి ప్రారంభించారు. అమెరికా ప్రజాప్రతినిధుల సభలో, సెనెట్లో బిల్లుకు మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు. బిల్లును త్వరగా ఆమోదించాలని భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు డాక్టర్ అమీ బేరా పిలుపు ఇచ్చారు. తమ సరిహద్దులను అక్రమంగా దాటివచ్చిన వారి పిల్లల విషయంలో ప్రతిపక్ష రిపబ్లికన్లు విముఖతతో ఉన్నప్పటికీ ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా చట్టబద్ధంగా అమెరికాలో ప్రవేశించిన భారతీయ అమెరికన్ పిల్లల విషయంలో సుముఖంగానే ఉన్నారు. కాబట్టి అమెరికా పిల్లల చట్టం కాంగ్రెస్ ఆమోదం పొందుతుందని ఆశాభావం.