DailyDose

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి – TNI నేర వార్తలు

ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి  – TNI  నేర వార్తలు

* ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున సిద్ధార్థ్‌నగర్‌ వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను గోరఖ్‌పూర్‌ దవాఖానకు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. వివాహ వేడుకకు వెళ్లివస్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నదని తెలిపారు. ప్రమాద సమయంలో కారులో 11 మంది ఉన్నారని వెల్లడించారు.

*కొండపోచమ్మ జలాశయంలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఈతకు జలాశయంలో దిగిన ఇద్దరు యువకులు హైదరాబాద్‎కి చెందిన అక్షయ్ వెంకట్(28), రాజన్ శర్మ(28) గుర్తించారు. గల్లంతైన యువకులు మృతి చెందినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. గల్లంతైన యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

*టేకులపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన దాస్‌తండా సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతులు ఎర్రాయిగూడెంకు చెందిన హనుమంతు, స్వామిగా పోలీసులు గుర్తించారు

*సింగరాయకొండ మండలం కలికివాయి సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బీర్ల లోడుతో వెళ్తున్న లారీని మరో లారీ ఢీకొట్టింది. దీంతో లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కన బోల్తా పడింది. రోడ్డుపై పడ్డ బీరు బాటిల్స్ కిందపడటంతో స్థానికులు బీరు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. శ్రీకాకుళం నుండి మదనపల్లికి బీరు లోడుతో వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

*వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్‌ భాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయ్యింది. సుబ్రహ్మణ్యం భార్యకు ఆర్థిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇక ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ ఉదయ్‌ భాస్కర్‌ను పోలీసులు ప్రధాన నిందితుడి(A1)గా చేర్చారు. మృతుడి కుటుంబీకుల స్టేట్‌మెంట్ ఆధారంగా ఉదయ్ భాస్కర్‌ను అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రత్యేక బృందాలతో అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నేడు ఎమ్మెల్సీ ఉదయ్‌ భాస్కర్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

*కడప జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మైలవరం మండలం కర్మలవారిపల్లి దగ్గర చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

*వరంగల్‌: జిల్లా బొల్లికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బొల్లికుంట వద్ద గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మరణించిన వారిని వర్ధన్నపేటకు చెందిన కూరగాయల వ్యాపారులుగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించడానికి సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.

* తన భార్య అనుకొని వేరొక మహిళను ఓ వ్యక్తి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. తిరువణ్ణామలై జిల్లా ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాళాల వద్ద ఉన్న ఇందిరానగర్‌ పరిధికి చెందిన దేవేంద్రన్‌ పశువుల వ్యాపారి. అతడి మొదటి భార్య రేణుకామ్మాళ్‌ రెండు సంవత్సరాల క్రితం మృతి చెందింది. అదే పరిధికి చెందిన సురేష్‌ చనిపోవడంతో ఆయన భార్య ధనలక్ష్మిని దేవేంద్రన్‌ ఐదు నెలల క్రితం రెండో వివాహం చేసుకొన్నాడు. దంపతులు అప్పుడప్పుడు గొడవ పడేవాడు. ఈ కారణంగా ధనలక్ష్మి ఇటీవల ఆంబూరులోని పుట్టింటికి వెళ్లింది. ఆంబూర్‌ కంబికొల్లై పరిధికి చెందిన వ్యక్తి జాన్‌ బాషా. అతడి కుమారుడు నవీద్‌ బాషా ఒక చోరీ కేసులో అరెస్టై వేలూర్‌ కేంద్ర కారాగారంలో ఉన్నాడు. ఇతడి భార్య గౌసర్‌. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ఆంబూర్‌ రైల్వే స్టేషను ఎదురుగా ఉన్న నేతాజీ రోడ్డులో పాదరక్షలు విక్రయించే దుకాణాలు ఉన్నాయి. ఆ దుకాణాల ఎదుట రాత్రి సమయాల్లో యాచకులు, నిరాశ్రయులు నిద్రిస్తుంటారు. ధనలక్ష్మి కూడా రాత్రి సమయాల్లో ఆ దుకాణాల ఎదుట నిద్రిస్తున్నట్లు దేవేంద్రన్‌కు సమాచారం అందటంతో శుక్రవారం రాత్రి అక్కడికి వచ్చాడు. ధనలక్ష్మి, గౌసర్‌, ఆమె అత్త పర్వీన్‌, పిల్లలు నిద్రిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆంబూరు వచ్చిన దేవేంద్రన్‌ చీకట్లో ధనలక్ష్మి అనుకొని గౌసర్‌ను కత్తితో గొంతుపై, ఛాతీభాగంలో పొడిచాడు. ఈ ఘటనలో గౌసర్‌ తీవ్రంగా గాయపడింది. ఆమె కేకలు వేయడంతో పక్కనే ఉన్న ధనలక్ష్మికి కత్తి పోటు పడటంతో ఆమె నిద్ర లేచింది. స్థానికులు దేవేంద్రన్‌కు దేహశుద్ధి చేసి ఆంబూర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చేసరికి గౌసర్‌ చనిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆంబూర్‌ ఆసుపత్రికి తరలించారు. ధనలక్ష్మిని వేలూర్‌ అడుకంపారై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.

*తెలంగాణ ఆర్టీసీ బస్‌లో ప్రయాణిస్తున్న మహిళ బ్యాగ్ నుంచి బంగారం, నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. ఓ శుభ కార్యక్రమం నిమిత్తం మహిళ రాజమండ్రి నుండి జంగారెడ్డిగూడానికి బస్సులో బయలుదేరారు. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్‌లో బస్ దిగి బ్యాగ్ చూసుకోగా ఖాళీగా వుండటంతో బాధితురాలు అవక్కైంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు బస్‌ను స్టేషన్‌కు తీసుకువచ్చి ప్రయాణికుల బ్యాగ్‌లను తనిఖీ చేస్తున్నారు.

*పాలకొడేరు మండలంలోని దేవాలయాలలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. వేండ్ర గ్రామంలో గబ్బల మంగమ్మ, కొండేపూడి గ్రామంలోని రామాలయంలో హుండీలు చోరీకి గురయ్యాయి. మూడు హుండీలను దొంగలు ఎత్తుకుపోయారు. వాటిలోని డబ్బంతా తీసుకుని.. హుండీలను రోడ్డు పక్కన, పంట కాలువల్లో పడేశారు. గ్రామాలలో వరుస దొంగతనాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

*చిత్తూరు: జిల్లాలోని సదుం మండలం జాండ్రపేటలో అక్కాతమ్ముడు దారుణ హత్యకు గురయ్యారు. అక్క రాధ, తమ్ముడు నరసింహులు హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. గత అర్ధరాత్రి హత్య జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే రాధ భర్తకు దూరంగా ఉంటోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

*పల్నాడు: జిల్లాలోని పిడుగురాళ్ళ రైల్వే క్వార్టర్‌‌లో రైల్వే హెడ్ కానిస్టేబుల్ సత్య వర్ధన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలు, అప్పుల బాధ తాళలేక రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 45 రోజుల క్రితం సత్య వర్ధన్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

*ఉద్యోగపరమైన ఒత్తిడితో పాటు తల్లిదండ్రులను విడిచి వెళ్లాల్సి వస్తుందనే బాధతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ ఎస్‌ఐ ఎల్‌.రామకృష్ణ కథనం మేరకు.. అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన నగిరెడ్డి నవీన్‌వెంకట్‌ (23)కు నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇప్పటివరకూ ఇంటి నుంచే పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌ రావాలని ఇటీవల కంపెనీ యాజమాన్యం సూచించింది. కొత్త ఉద్యోగంలో ఒత్తిడితో పాటు తల్లిదండ్రులను విడిచి వెళ్లడానికి ఇష్టపడని నవీన్‌వెంకట్‌ శనివారం తెల్లవారుజామున తల్లిదండ్రులు పై పోర్షన్‌లో నిద్రపోతుండగా కింద ఇంటిలో ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నవీన్‌వెంకట్‌ సున్నిత మనస్కుడని స్నేహితులు చెబుతున్నారు.

*ప్రేమించానని నమ్మించి, చివరికి మా అమ్మ ఒప్పుకోవటం లేదని ప్రియుడు మొఖం చాటేయటంతో ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన శనివారం మధ్యాహ్నం పలకలూరు రోడ్డులోని ఓ కళాశాలలో చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. చేబ్రోలు మండలం పాతరెడ్డిపాలేనికి చెందిన ఓ యువతి పట్టాభిపురంలోని ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ నగరంలోని ఓ కాలేజీలో డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతోంది. ఆమె అదే గ్రామానికి చెందిన మంచాల పవన్‌కుమార్‌ను మూడేళ్లుగా ప్రేమించింది. డిగ్రీ అయిన తర్వాత పెళ్లి చేసుకంటానని నమ్మించిన పవన్‌కుమార్‌ ఈనెల 23న మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.

*బొల్లికుంటలో వాగ్దేవి కాలేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా వర్ధన్నపేటకు చెందిన కూరగాయల వ్యాపారులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

*సేద్యపు నష్టాల నుంచి గట్టెక్కలేక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా గుడిబండ మండలం పీఎన్‌ పాల్యం గ్రామానికి చెందిన రైతు పీవీ శ్రీరంగప్ప (54)కు నాలుగు ఎకరాల పొలం ఉంది. పెట్టుబడులకు రూ.16 లక్షలు అప్పు చేశాడు. అప్పుతీర్చే మార్గంలేక దిక్కుతోచని స్థితిలో శనివారం తెల్లవారుజామున ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని నెరమెట్ల గ్రామానికి చెందిన నర్సిరెడ్డి(60) సొంత పొలానికి తోడు కొంత భూమిని కౌలుకు తీసుకున్నాడు. వ్యవసాయం కోసం చేసిన రూ.16 లక్షలు అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర ఒత్తిడికి లోనై శనివారం ఉదయం పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు.

* నిశ్చితార్థం ముగించుకుని స్వగ్రామానికి బంధుమిత్రులతో వెళ్తుండగా వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో 9 మంది దుర్మరణం చెందారు. కర్ణాటక రాష్ట్రం ధారవాడ జిల్లా పరిధిలోని బెనకనకట్టి (నిగది) గ్రామస్థులు అదే జిల్లా మన్సూరు గ్రామం లో నిశ్చితార్థం కోసం శుక్రవారం రాత్రి వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత క్రూయిజర్‌ వాహనంలో 21 మంది బంధుమిత్రులు తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి 1.30-2 గంటల మధ్య బాడ గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న వాహనం భారీ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు.

* మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్ర్మాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ట్యాంకర్‌ నుంచి లీకైన వంట నూనె కోసం ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది.వివరాల ప్రకారం.. ముంబై-అహ్మాదాబాద్‌ జాతీయ రహదారిపై పాల్ఘర్‌ జిల్లాలోని తవా గ్రామ సమీపంలో 12వేల ఆయిల్‌ తరలిస్తున్న ఓ ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా పడింది. గుజరాత్లోని సూరత్ నుంచి ముంబైకి నూనెను ట్యాంకర్లలో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ట్యాంకర్ నుంచి లీకైన నూనె కోసం ఎగబడ్డారు. బిందెలు, క్యాన్లలో వంటనూనెను నింపుకునేందుకు పోటీపడ్డారు. ఈ క్రమంలో రోడ్డుపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. పోలీసుల అధికారులు 3 గంటలపాటు శ్రమించి పరిస్థితిని చక్కదిద్దారు.