Politics

తెలంగాణ ప్రభుత్వం వ్యాట్‌ తగ్గిస్తే లీటర్‌ పెట్రోల్‌ రూ.80కే వస్తుంది – TNI రాజకీయ వార్తలు

తెలంగాణ ప్రభుత్వం వ్యాట్‌ తగ్గిస్తే లీటర్‌ పెట్రోల్‌ రూ.80కే వస్తుంది  – TNI రాజకీయ వార్తలు

* కేంద్రంలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆదివారం మీడియా సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ..లీటర్‌ పెట్రోల్‌పై తెలంగాణ ప్రభుత్వం రూ.30 పన్ను విధిస్తోందని, తెలంగాణ ప్రభుత్వం వ్యాట్‌ తగ్గిస్తే లీటర్‌ పెట్రోల్‌ రూ.80కే ఇవ్వొచ్చన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో చేసిందేమీ లేదు కానీ దేశాన్ని ఉద్ధరిస్తారటని ఎద్దేవ చేశారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా పంజాబ్‌ రైతులకు ఎందుకు సాయం చేస్తున్నారని సంజయ్ ప్రశ్నించారు. గొప్పల కోసమే ఇతర రాష్ట్రాల్లో కేసీఆర్‌ డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ ఏం సంచలనం సృష్టిస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. ఇక తన అక్రమాస్తులు కాపాడుకోడానికే మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటన చేస్తున్నారని ఆరోపణలు చేశారు. పెట్రోల్, డీజిల్‎పై ప్రభుత్వం వెంటనే వ్యాట్ తగ్గించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

* వాళ్లిద్దరినీ పొలిమేరలు దాటించాలి: రేవంత్‌రెడ్డి
కొడంగల్‌ అభివృద్ధిపై కేటీఆర్‌ చర్చకు రావాలంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఆదివారం ఆయన కొడంగల్ నియోజకవర్గం తుంకిమెట్ల లో కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ, మరణించిన ఒక్క రైతు కుటుంబాన్ని కూడా కేసీఆర్‌ పరామర్శించలేదని మండిపడ్డారు. ఐకేపీ కేంద్రాలు తెరిచి వడ్లు కొనే ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు. గత 8 ఏళ్లుగా పేదలకు ఎలాంటి సాయం అందలేదన్నారు. కేసీఆర్‌ కుటుంబం, బంధువులే కోటీశ్వరులయ్యారన్నారు.కేసీఆర్‌ చేతిలో మోసపోనివారు ఎవరైనా ఉన్నారా? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘కేసీఆర్‌, కేటీఆర్‌ రాష్ట్రంలో లేరు, ఒకరు ఢిల్లీ.. మరొకరు దావోస్‌ వెళ్లారు. వాళ్లిద్దరూ రాష్ట్రంలో లేకపోయేసరికి అందరి మొహాల్లో ఆనందం నెలకొంది. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలంటే వాళ్లిద్దరినీ రాష్ట్రం పొలిమేరలు దాటించాలంటూ’’ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

*తెలంగాణలోనే యాదవులకు సరైన గుర్తింపు : మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే యాదవుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన యాదవుల హక్కుల పోరాట సమితి మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయంగా, సామాజికంగా తెలంగాణ రాష్ట్రంలోనే యాదవులకు ప్రత్యేక గుర్తింపు లభించిందని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా యాదవులకు ఐదు ఎమ్మెల్యే సీట్లు, ఒక రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అంతేకాకుండా సంక్షేమ భవనం కోసం కోకాపేటలో 250 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమి, భవనం నిర్మాణం కోసం 5 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు.

*భగత్ సింగ్ పోరాటం చేసిన నేల పంజాబ్ : సీఎం కేసీఆర్
దేశం కోసం పంజాబ్ ఎంతో చేసిందని.. భగత్ సింగ్ పోరాటం చేసిన పంజాబ్ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చండీగఢ్ లో కేసీఆర్ మాట్లాడుతూ… చనిపోయిన వారిని మనం వెనక్కి తీసుకురాలేమన్నారు. మీ వెంట మేమున్నాం.. దేశమంతా ఉందన్నారు. మీ ఉద్యమం కారణంగానే కేంద్రం చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రోజుకు పది మంది రైతులు చనిపోయేవారన్నారు. కరెంట్ కోతలు తీవ్రంగా ఉండేవన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 24గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామన్నారు. 75ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దేశ పరిస్థితి చూస్తే దుఖం వస్తుందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గర సమస్యలున్నాయన్నారు. కేంద్రం ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కి తీసుకునేలా రైతులు పోరాడారన్నారు.

*టీఆర్‌ఎస్‌ హయాంలోనే వైద్య రంగం బలోపేతం : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే వైద్య రంగానికి పెద్దపీట వేశారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పెద్ద అదిరాల గ్రామంలో రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తూ ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేస్తున్నారన్నారు.పీహెచ్‌సీ నిర్మాణంతో పెద్ద అదిరాల, చిన్న అదిరాల, కొండెడ్, ఎక్వాయపల్లి, కోడ్గల్ గ్రామాలతో పాటు చుట్టూ ఉన్న తండాల ప్రజలకు వైద్య సహాయం అందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాలు ఎంతో మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.

*దళిత చైతన్యానికి ప్రతీక భాగ్యరెడ్డి వర్మ
జీవితమంతా దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్అ న్నారు.ఆదివారం కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతి ని పురస్కరించుకొని పాత ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర ఉన్న భాగ్యరెడ్డి వర్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ తో కలిసి పూలమాలలు వేసి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ కేంద్రంగా దళిత ఉద్యమానికి దారి చూపిన ఉద్యమకారుడు, హక్కుల కార్యకర్త, దళిత పాఠశాలలు స్థాపించి బాల్య వివాహాలు, అంటరానితనం వంటి దురాచారాలపై ఉద్యమించారన్నారు.

*తెలంగాణ ప్రభుత్వం కూడా తగ్గించాలి: Kishan Reddy
ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిందని, దేశంలోనే అత్యధికంగా సెస్సు వసూలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులను వదిలేసి.. కేసీఆర్ పంజాబ్ రైతులను ఆదుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంపై కేసీఆర్‌కు కనీస అవగాహన కూడా లేదన్నారు. కేసీఆర్ ప్రకటించిన కేజీ టు పీజీ ఉచిత విద్యపై ఆయనే స్పందించాలన్నారు. కేసీఆర్ అమెరికా అధ్యక్షుడిని కలిసినా, పాకిస్థాన్ అధ్యక్షుడిని కలిసినా తాము భయపడమన్నారు. కేసీఆర్ సంచలనాలు ప్రగతి భవన్, ఫాంహౌస్‌కే పరిమితమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల నుంచి కేసీఆర్ కుటుంబానికి చీదరింపు తప్పదన్నారు.

*ప్రజలు రాళ్లు వేస్తారు.. YCP leaders జాగ్రత్తగా ఉండాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి
మూడేళ్లలో ప్రభుత్వం నుంచి ప్రజలు అందుకున్న లబ్ధిని, సంక్షేమాన్ని ఇంటింటికి వెళ్లి చెప్పండని ‘గడపగడపకు మన ప్రభుత్వం’ పేరుతో వైసీపీ నాయకులను, కార్యకర్తలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ప్రజాప్రతినిధులను, నేతలను ప్రజల నిలదీస్తున్నారు. ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. వైసీపీ వైఫల్యం చెందింది కాబట్టే గడపగడప అంటోందని ఎద్దేవాచేశారు. గడపగడపకు వెళ్తే రాళ్లతో కొట్టే రోజులు త్వరలో వస్తాయని హెచ్చరించారు. వైసీపీ పాలనలో గుడికి వెళ్లేందుకు కూడా అనుమతి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శించారు. వైసీపీ నేతల బస్సు యాత్రకు పోలీసుల పహారా పెట్టుకోవాలని పేర్కొన్నారు. ప్రజలు రాళ్లు వేస్తారు.. వైసీపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. త్వరలో మాజీ కాల్వ శ్రీనివాస్‌తో కలిసి వెంకటరమణస్వామి ఆలయానికి వస్తానని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రకటించారు.

*ప్రశ్నిస్తే దాడులా?: Nara Lokesh
సంతపేట పోలీస్ స్టేషన్ సమీపంలో టీడీపీ నాయకురాలు రేవతిపై వైసీపీ గూండాలు దాడి చేయడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడటం.. వైసీపీ నాయకుల అభద్రతా భావాన్ని బయటపెడుతోందన్నారు. మాజీ మంత్రి అనిల్‌పై విమర్శలు చేశారనే అక్కసుతో రేవతి భర్తను పోలీస్‌స్టేషన్‌కి పిలిచి వేధించడం అన్యాయమన్నారు. స్టేషన్‌కి వెళ్ళిన రేవతిపై దాడి చేయడం చూస్తుంటే.. అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. రేవతిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు, ఆమె భర్తను వేధించిన పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.

*రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదు: అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల గురించి ఆలోచించడం లేదన్నారు. ఏపీని ప్రపంచ దేశాల్లో చిన్నచూపు చూసేలా చేశారని తెలిపారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.

*సుబ్రహ్మణ్యం హత్యపై సమగ్ర దర్యాప్తు జరపాలి: వర్ల రామయ్య
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరపాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ అక్రమాలు బయటపెడతాడనే భయంతోనే.. సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఘటనపై వాస్తవాలను డీజీపీ బయటకు తీయాలన్నారు. అనంతబాబు గుట్టును బయటపెట్టాలన్నారు. తక్షణమే అనంతబాబును అరెస్ట్‌ చేసి విచారించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేవరకు పోరాడుతామని వర్ల రామయ్య ప్రకటించారు.

*అనుమతులు ఉల్లంఘించి జగన్‌ లండన్‌ వెళ్లారు: పట్టాభి
కోర్టు అనుమతులు ఉల్లంఘించి సీఎం జగన్‌ లండన్‌ వెళ్లారని టీడీపీ నేత పట్టాభి తప్పుబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌తో పాటు విమానంలో అధికారులెవరూ వెళ్లలేదని తెలిపారు. ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టులో 2 గంటలు మాత్రమే పట్టిందన్నారు. జగన్‌, లండన్‌ వెళ్లాలని ముందుగానే నిర్ణయించుకున్నారని, మంత్రులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. విదేశీ పర్యటనకు జగన్ విలాసవంతమైన విమానంలో వెళ్లారని తప్పుబట్టారు. ముందస్తు ఎన్నికల ప్రచారం వేళ… దాచిన డబ్బు తేవడానికే జగన్‌రెడ్డి దావోస్‌ వెళ్లారని పట్టాభి ఆరోపించారు.

*ప్రభుత్వం మొద్దునిద్రపోతోంది: లంకా దినకర్
పెట్రోల్, డీజిల్‌పై ఏపీ సర్కార్‌ ఎంత వ్యాట్ తగ్గిస్తుందో చెప్పాలని బీజేపీ నేత దినకర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే కేంద్రం రెండుసార్లు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. జగన్ ప్రభుత్వం మొద్దునిద్రపోతోందని తప్పుబట్టారు. ప్రజలపై ధరల భారం తగ్గించే బాధ్యత ఏపీ ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ముందుకురాదా అని దినకర్ నిలదీశారు.

*అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు: చంద్రబాబు
టీడీపీ (TDP) అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలని చెప్పారు. బోస్టన్‌లో నిర్వహించిన మహానాడులో ఆన్‌లైన్‌లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోస్టన్‌లో 2,200 మందితో మహానాడు నిర్వహణ గర్వకారణమన్నారు. సీఎం జగన్‌ పాలనలో రాష్ట్రం కోలుకోలేనంతగా నష్టపోయిందని దుయ్యబట్టారు. తనతో పాటు కేసుల్లో ఉన్నవారికి జగన్‌ రాజ్యసభ సీటు ఇచ్చారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే ఇస్తామని ప్రకటించారు. టీడీపీని అధికారంలోకి తీసుకురావడంలో ఎన్‌ఆర్‌ఐలు కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

*ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌కు రంగం సిద్ధం!
అనేక ఉద్రిక్తతల మధ్య వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. పెదపూడి మండలం జి.మామిడాడలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. శరీరంపై గాయాలుండడంతో పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కొట్టి చంపినట్టు తేలిందని సమాచారం. మృతుడి భార్యకు ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా చేర్చారు. నేడు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మృతుడి కుటుంబీకుల స్టేట్‌మెంట్ ఆధారంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. అనంతబాబు కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

*ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్‌కు రంగం సిద్ధం!
అనేక ఉద్రిక్తతల మధ్య వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. పెదపూడి మండలం జి.మామిడాడలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. శరీరంపై గాయాలుండడంతో పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో కొట్టి చంపినట్టు తేలిందని సమాచారం. మృతుడి భార్యకు ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ కేసులో ఎమ్మెల్సీ అనంతబాబును ప్రధాన నిందితుడిగా చేర్చారు. నేడు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మృతుడి కుటుంబీకుల స్టేట్‌మెంట్ ఆధారంగా అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు. అనంతబాబు కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

*కాల్వ శ్రీనివాసులును అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏం వచ్చింది?: జేసీ
మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అరెస్టును తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాయదుర్గం వెళ్తున్న కాల్వ శ్రీనివాసులును పోలీసులు అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏం వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య పేరుతో టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడం పరిపాటిగా మారిందని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించారు.

*ఎమ్మెల్సీ ఘటనపై జగన్ సమాధానం చెప్పాలి
వైసీపీ ఎమ్మెల్సీ బరితెగించి హత్యకు పాల్పడుతుంటే సామాన్యులు ఎవరికీ చెప్పుకోవాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్సీ చేసిన ఘటనపై సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అడిగేవారు లేరని ఇష్టమొచ్చినట్లు చేస్తే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంపై వాస్తవాలు చెప్పిన దళిత మహిళ వెంకాయమ్మపై దాడి చేయటం సిగ్గుచేటని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు భయపడి తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా లేకపోవడంతో ఇప్పటికే ప్రజల్లో విశ్వాసం కోల్పోయారని తెలిపారు. గడపగడపకు ప్రభుత్వంకు ఎక్కడా స్పందన లేదన్నారు. ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో రక్షణ కోసం మళ్లీ బస్సుయాత్ర పెట్టారని చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో చంద్రబాబు పర్యటనకు ప్రజలలో అనూహ్య స్పందన వస్తోందన్నారు. జగన్‌ను ఇంటికి పంపించేందుకు యువత నుంచి వృద్ధుల వరకు సిద్ధంగా ఉన్నారని ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.

*అమ్మఒడి కూడా దశల వారీగా అటకెక్కించేస్తారా.
అమ్మఒడి కూడా దశల వారీగా అటకెక్కించేస్తారా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకంపై కూడా మాట తప్పి, మడమ తిప్పారన్నారు. ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసే అమ్మఒడికి రూ.13 వేలు మాత్రమే జమ చేయాలనుకోవటం తగదని అన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమ్మఒడి అమలు చేయలేదని తెలిపారు. మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో ఇప్పటికే రూ.1000 కోత విధించిన ప్రభుత్వం, ఇప్పుడు పాఠశాల మౌలిక సదుపాయాల నిర్వహణకు మరో రూ.1000 తగ్గించనుందన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం నిధులు విడుదల చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. అమ్మఒడి పథకం అమలులో కోతలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు మెలికలు పెట్టిందన్నారు. జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కోతలు లేకుండా, రూ.15 వేలు తల్లులు ఖాతాల్లో జమ చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

*జగన్‌ సర్కార్‌పై జనాగ్రహం: రఘురామ
జగన్‌ సర్కార్‌పై జనాగ్రహం తీవ్రంగా ఉందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. జగన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిపై కేసులు పెడతామంటే ఎవరూ భయపడరన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ-క్రాప్‌ అవకతవకలను ఎత్తిచూపిన వారిపై కేసులు పెడతామని పౌర సరఫరాల శాఖ మంత్రి బెదిరిస్తున్నారు. రైతుల వద్ద నుంచి మిల్లర్లు నేరుగా ధాన్యం కొనుగోలు చేయరాదు. అయినా కొనుగోలు చేస్తున్నారు. దీనికి ఎవరిపై కేసు పెడతారు? ముఖ్యమంత్రి పైనా? వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రుల పైనా?’’ అని ప్రశ్నించారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలను కక్షసాధింపు ధోరణితో వేధిస్తున్న తీరు పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా? దావోస్‌ సదస్సులో ఎవరైనా ప్రశ్నిస్తే జగన్‌ ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు.

*గడప గడపకు ప్రభుత్వం పేరుతో మరో మోసం: Sailajantht
గడప గడపకు ప్రభుత్వం పేరుతో వైసీపీ సర్కార్ మరో మోసానికి పాల్పడుతోందని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… బస్సుయాత్ర ద్వారా ప్రజలకు ఏం అభివృద్ధి చేసారని చెబుతారని ప్రశ్నించారు. దావోస్ సదస్సు పేరుతో ప్రజాధనం వృధా అంటూ మండిపడ్డారు. దావోస్ పర్యటన అని చెప్పి లండన్ పర్యటన ఆంతర్యం ఏమిటి అని నిలదీశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ద్రోహం, ధగా చేస్తోందని విమర్శించారు. పేరుకు పదవులు ఇచ్చి, వారికి పవర్ లేకుండా రబ్బరు స్టాంపులుగా మార్చిందని అన్నారు. దావోస్‌కని చెప్పి లండన్ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన పర్యటన వివరాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ స్వంత విహారయాత్రల కోసం వెళుతూ ప్రజా ధనాన్ని జగన్ రెడ్డి వృధా చేస్తున్నారని శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*సుబ్రహ్మణ్యంది మూమ్మాటికి హత్యే: శ్రవణ్‌
సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్‌భాస్కర్‌ మాజీ కారు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యంది మూమ్మాటికి హత్యేనని, ఈ ఘటనను తమ్మిని బమ్మిని చేసేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని జై భీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది జడ శ్రవణకుమార్‌ ఆరోపించారు. శనివారం కాకినాడ విచ్చేసిన ఆయన జీజీహెచ్‌ మార్చురీవద్ద బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక దళిత బిడ్డను చంపేసి, కారులో మృతదేహాన్ని తీసుకొచ్చి అతని ఇంటి ముందే వదిలేసిన ఘటనలో నిందితులపై 302 సెక్షన్‌ కింద ఎఫ్‌ఐఆర్‌ వేయకపోతే, కాకినాడలోకి ఒక వాహనాన్ని కూడా అనుమతించబోమని, హైవేను కూడా దిగ్భంధం చేస్తామని హెచ్చరించారు.

*ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్‌ చేయాలి: సీపీఎం
కారు డ్రైవర్‌ సుబ్రమణ్యం మృతికి కారణమైన ఎమ్మెల్సీ అనంతబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం ఈమేరకు ప్రకటన విడుదల చేశారు. దళిత యువకుడు సుబ్రమణ్యం అనుమానాస్పదంగా మృతిచెందినట్టు వచ్చిన వార్తలు తీవ్ర దిగ్ర్భాంతిని కలిగిస్తున్నాయన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు నష్టపరిహారం, రెండెకరాల భూమి, భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

*జగన్‌.. వ్యాట్‌ ఎంత తగ్గిస్తారో చెప్పాలి: లంకా దినకర్‌
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించడంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించనున్నదని బీజేపీ నాయకుడు లంకా దినకర్‌ తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద సబ్సిడీ ద్వారా గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ.200 తగ్గింపుతో 9కోట్ల కుటుంబాలకు ఊరట లభిస్తుందన్నారు. కేంద్రం ఇంతకుముందు పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించినా.. ఏపీ ప్రభుత్వం మిన్నకున్నదని, కనీసం ఇప్పుడైనా పెట్రోల్‌, డీజిల్‌పై ఎంత వ్యాట్‌ తగ్గిస్తారో జగన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

*అంబటివి బడాయి మాటలు: బుద్దా
‘‘మంత్రి అంబటి రాంబాబు పరిస్థితి కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టుంది. ఏ నది మీద ఏ ప్రాజెక్టు కడతారో తెలియని బడుద్దాయి బడాయి మాటలు మాట్లాడుతున్నాడు’’ అని టీడీపీ నేత బుద్దా వెంక న్న విమర్శించారు. ఆయన ట్విటర్‌లో మంత్రికి కౌంటర్‌ ఇచ్చారు. ‘‘పోలవరం నిర్మాణంలో మా తప్పు ఉంటే జగన్‌రెడ్డి మూడేళ్ల పాటు ఏం పీకాడు? ఒక్క పిల్ల కాలువ కూడా కట్టని మీ అధినేత, నువ్వు పోలవరం గురించి మాట్లాడితే ఫన్నీగా ఉంటుంది. కుర్చీ కోసం దిగజారే నైజం జగన్‌రెడ్డిది. సీఎంను చేయాలని సోనియా, రాహుల్‌ కాళ్లపై పడిన విషయం మరిచిపోయారా? కేసుల మాఫీ కోసం మోదీ కాళ్లపై పడిన ఘటన గుర్తు లేదా? అమ్మను, చెల్లిని రాజకీయం కోసం వాడుకుని ఎడమ కాలితో తన్నిన కన్నింగ్‌ పొలిటీషియన్‌ జగన్‌రెడ్డే. జగన్‌రెడ్డి సింగిల్‌గా వస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావు… కానీ అతను అందరూ వదిలివేసిన ఒంటరి వాడని నీకు త్వరలోనే అర్థమవుతుంది’’ అని బుద్దా వెంకన్న ట్వీట్‌ చేశారు.

*ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ: ఉత్తమ్‌
రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులతో పాటు కౌలురైతులకు ఏడాదికి రూ.15 వేల పంటసాయాన్ని అందజేస్తామన్నారు. భూమి లేని వారికి ఏడాదికి రూ.12 వేల చొప్పున బ్యాంక్‌లో జమచేస్తామని తెలిపారు. వరికి రూ.2500, మిర్చికి రూ.15 వేల మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ నుంచి ఎమ్మెల్యే సైదిరెడ్డి వరకు ఇసుక, భూమి, వైన్స్‌ వంటి వాటి నుంచి దొరికినంత దోచుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడి త్వరలో వారికి బుద్ధి చెబుతారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు.

*TDP కుటుంబంపై టీడీపీ దుష్ప్రచారం: మంత్రి బుగ్గన
సీఎం జగన్‌ కుటుంబంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తప్పుబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ దావోస్‌ పర్యటనపై నిస్సిగ్గుగా మాజీమంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. యనమలవి దిగజారుడు రాజకీయాలని తప్పుబట్టారు. సీఎం దావోస్‌ పర్యటన రహస్యమేమీ కాదన్నారు. శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయల్దేరిన తర్వాత.. సీఎం విమానం ఇంధనం కోసం ఇస్తాంబుల్‌లో ఆగిందని తెలిపారు. ఎయిర్‌ట్రాఫిక్‌ ఉండడంతో ఇంధనం నింపుకునే ప్రక్రియలో ఆలస్యమైందని చెప్పారు. దీనివల్ల లండన్‌ ఎయిర్‌పోర్టు (London Airport)కు చేరుకునేసరికి ఇంకా ఆలస్యమైందన్నారు. లండన్‌లో కూడా ఎయిర్‌ట్రాఫిక్‌ విపరీతంగా ఉందని, జురెక్‌లో ల్యాండవడానికి షెడ్యూల్‌ సమయం దాటిందని పేర్కొన్నారు. మళ్లీ ల్యాండింగ్‌ కోసం అధికారులు రిక్వెస్ట్‌ పెట్టారని, ఈ ప్రక్రియలో స్విట్జర్లాండ్‌లోని భారత ఎంబసీ అధికారులు పాల్గొన్నారని తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత జురెక్‌లో విమానాల ల్యాండింగ్‌ నిషేధమని, భారత ఎంబసీ అధికారులకు స్విస్‌ అధికారులు నివేదించారని చెప్పారు. వారు నేరుగా సీఎం వెంట ఉన్న అధికారులతో చర్చించి.. లండన్‌లోనే సీఎం జగన్‌కు బస ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. తెల్లవారుజామునే జురెక్‌ బయల్దేరేందుకు సీఎం బృందం సిద్ధంగా ఉన్నా.. డీజీసీఏ రూల్స్‌ ప్రకారం పైలెట్లకు నిర్ణీత గంటలు విశ్రాంతి తీసుకోవాలనే నింబంధన ఉందని పేర్కొన్నారు. నిజాలు ఇలా ఉంటే..సీఎంపై అసూయతో టీడీపీ (TDP) దుష్ప్రచారం చేస్తోందని బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు.

*పెంచిన ధరలకు నిరసనగా CPI మహా ఉద్యమం: రామకృష్ణ
పెంచిన ధరలకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో మహా ఉద్యమం చేపట్టనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అందులో భాగంగా ఈనెల 21 నుంచి 24 తేదీ వరకు అన్ని జిల్లాలలో సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 25, 26 తేదీల్లో పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులకు కరపత్రాల పంపిణీ చేస్తామని తెలిపారు. 30వ తేదీ అన్ని కలెక్టరేట్ల ముందు 10 వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామన్నారు. అధికారంలోకి రాగానే కరెంటు చార్జీలను తగ్గిస్తానని చెప్పిన జగన్.. 7 సార్లు పెంచాడని, ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పోలీసులను వెంట బెట్టుకుపోవడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

*గ్రామాల్లో తాగునీటికి జనం అల్లాడుతున్నారు: సోము వీర్రాజు
రాష్ట్రంలోని పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొందని, జనం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారని ఏపీ బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. జనం సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీఎం జగన్‌కు ఆయన లేఖ రాశారు. తాగు, సాగునీరు పుష్కలంగా ఉండే ఏలూరు జిల్లాలో ప్రభుత్వ చేతకానితనం వల్ల జనం దాహర్తితో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సత్యసాయి తాగునీటి పథకం 2008లో ప్రారంభించారని, ఈ పథకం ద్వారా పోలవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు పరిధిలోని 275 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. అయితే ఈ పథకం 285 రోజులుగా నిలిచిపోయిందని, కనీసం ఎందుకు నిలిపివేశారన్న విషయం కూడా ప్రభుత్వం చెప్పే పరిస్థితి లేదన్నారు. వెంటనే ఈ పథకానికి నిర్వహణ వ్యయం కేటాయించి, తాగునీటిని పంపిణీ చేయాలని జగన్‌ను కోరారు.

*Davos కోసం లండన్‌ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు: దేవినేని ఉమ
దావోస్ కోసం లండన్‌ దాకా వెళ్లాల్సిన అవసరం లేదని టీడీపీ నేత దేవినేని ఉమ తప్పుబట్టారు. దావోస్ వెళ్లాల్సిన సీఎం జగన్ లండన్‌లో ఎందుకు దిగారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబును ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని ప్రశ్నించారు. సీఎం అసమర్థత వల్లే పోలవరంపై సంబంధం లేని వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తారని పక్క రాష్ట్ర సీఎం అన్నప్పుడు.. జగన్ ఎందుకు నోరు మెదపలేదు? అని ప్రశ్నించారు. తప్పుడు పత్రాలతో రూ.కోట్లు చేతులు మారినట్లు కథనాలు వచ్చాయని తెలిపారు. వైసీపీ నేతలు నిర్వాసితుల సొమ్ము పందికొక్కుల్లా మింగుతున్నారని దుయ్యబట్టారు. అనంతబాబు, పోలవరంపై ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు

* జలకళ పథకమే తప్పు: వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి
‘జలకళ పథకం కింద ఎంత మందికి బోరు వేయాలి? ఎంత లోతు వేయాలని మాకు కూడా అర్థం కాలేదు. ఈ పథకమే తప్పు. ఒకరికి వేసి ఒకరికి వేయకుండా వస్తుంటారు’ అని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం ధర్మవరం మండలం సుబ్బరావుపేట గ్రామపంచాయతీలో ‘గుడ్‌మార్నింగ్‌ ధర్మవరం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జలకళ బోరు వేశారని, కరెంట్‌ ఇవ్వలేదని బాధితురాలు మల్లేశ్వరమ్మ ఎమ్మెల్యేకు విన్నవించారు. రేషన్‌ కార్డు కూడా తొలగించారని ఆమె వివరించగా.. పదెకరాల భూమి ఉండటంతో రేషన్‌కార్డు తొలగించారని వీఆర్వో లక్ష్మీనరసమ్మ సమాధానమిచ్చారు. పదెకరాల భూమి ఉంటే ‘జలకళ’ ఎలా వర్తిస్తుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆ భూమిని పంచుకున్నారని వీఆర్వో సమాధానమిచ్చారు.