NRI-NRT

ఏపీలో మద్య నిషేధం సాధ్యమేనా?.. అమెరికా నేర్పిన పాఠాలేంటి?

ఏపీలో మద్య నిషేధం సాధ్యమేనా?.. అమెరికా నేర్పిన పాఠాలేంటి?

అగ్రరాజ్యంగా పేరుకెక్కిన అమెరికాను చరిత్రలో రెండు ఘోర వైఫ్యల్యాలు కుదిపేశాయి. అవే మద్యపాన నిషేధం(1920-1933), వియత్నాం యుద్ధం (1955-1975). ఈ రెండింటిలో అమెరికా ఎందుకు విఫలమైందనే అంశం మీద ఆ దేశ మేధావులంతా తెగ పరిశోధనలు చేస్తున్నారు. టన్నుల కొద్దీ పుస్తకాలు రాస్తున్నారు.నిజానికి అమెరికాలో మద్యపాన నిషేధం ఎప్పుడో ఎనిమిది దశాబ్దాల కిందట జరిగింది. దాని గురించి ఈ తరానికి పెద్దగా తెలియదు. అయితే, ఈ అంశంపై ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి. పుస్తకాలు వస్తున్నాయి.ఇవన్నీ చెప్పిన, చెబుతున్న విషయం ఒక్కటే.. అదే అమెరికాలో మద్య నిషేధం ఒక విఫల ప్రయోగం అని.నిషేధం అక్కడి సమాజంలో తీవ్ర ఉద్రిక్తతలను తీసుకువచ్చింది. కొత్త చట్టాలు పోలీసు యంత్రాంగానికి విపరీతమైన అధికారాలను, బలాన్ని ఇచ్చాయి. మద్యం బాధితులకు మాత్రం చేయూత ఇవ్వలేకపోయాయి.పారిశ్రామిక ప్రగతి వల్ల పట్టణాల్లోకి వలస వస్తున్న పేద ప్రజలు, శ్వేతజాతీయేతరులు, అప్పుడప్పుడే ఉప్పొంగుతున్న జాజ్ సంస్కృతిని ఒక వైపు.. శ్వేతజాతి రైటిస్టులను మరొకవైపు ఈ నిషేధం నిలబెట్టింది.’ఈ రెండు పక్షాల మధ్య 13 సంవత్సరాల పాటు సాగిన యుద్ధమే అమెరికా మద్య నిషేధం’ అని ఈ పరిశోధనలన్నీ చెబుతాయి.

పేదల మీద, నల్లజాతీయుల మీద, వాళ్ల అల్పసంతోషాల మీద, వాళ్లు సరదాగా గుమిగూడే సెలూన్ల మీద పోలీసులు యుద్ధం ప్రకటించారు. వీళ్లకు ‘కు క్లక్స్ క్లాన్’ వంటి ప్రైవేటు సైన్యం తోడయింది.ఒక ఉన్నత లక్ష్యంతో మొదలైన సంక్షేమ పథకం విచ్ఛిన్నమైంది. నిషేధానికి మద్దతు ఇస్తున్న వర్గాల ఆలోచనలు, విశ్వాసాలు, దృక్పథాల ప్రకారం బలవంతంగా చట్టం అమలైంది తప్పితే.. పేదల జీవితాలకు, గృహిణులకు భద్రత దొరకలేదు. నిషేధ చట్టం వచ్చింది కాబట్టి మనుషుల్ని చంపైనా చట్టం అమలు చేస్తాం అనే ‘భద్రతా ఉగ్రవాద’ పరిస్థితి తలెత్తింది.

***కొందరికే శాపం
అందరినీ సమానంగా చూడాల్సిన చట్టం.. పేదలకు, శ్వేతజాతీయేతరులకు మాత్రమే శాపంగా మారింది. దాని అమలులో పలుకుబడి, అవినీతి చొరబడింది. దొంగ వ్యాపారం ద్వారా మద్యం ఏరులై పారింది. పేరుకు నిషేధమే కానీ, రాజకీయ నాయకులు, పోలీసులు, ధనవంతులు దర్జాగా ‘ప్రైవేటు’గా మందు సేవిస్తూనే ఉండేవారు. ‘ప్రైవేటు’ వసతి లేని పేదలు చట్టం బారిన, ‘కూ క్లక్స్ క్లాన్’ బారిన పడ్డారు. నిషేధంతో విసిగి వేసారి, చివరకు రాజకీయ నిర్ణయం తీసుకుని నిజమైన భద్రత కోసం డెమోక్రట్ల పంచన చేరారు.గాలివాటం చూసిన ఆ పార్టీ 1933 లో నిషేధం ఎత్తివేసి పేదలను కాపాడుతామని హామీ ఇచ్చింది. ఈ దెబ్బకి ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ అఖండ విజయం సాధించారు. నిషేధాన్ని ఎత్తివేసేందుకు చర్యలు తీసుకున్నారు.ఒక పవిత్రాశయంతో వచ్చిన చట్టం అమెరికా రాజ్యాంగ చరిత్రలో ఒక కామిక్ ట్రాజెడీ అయింది. నిషేధం ఎంతగా అభాసుపాలు అయ్యిందంటే, నిషేధం కోసం చేసిన రాజ్యంగ సవరణను (18వ సవరణ)ను మరొక సవరణ (21వ సవరణ) చేసి అమెరికా ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి తలెత్తడం అమెరికా చరిత్రలో అదే మొదటిసారి.సమస్య ఒక్కటే అయినప్పుడు పర్యవసానాలూ ఒకేలా ఉంటాయి. అందుకే ప్రపంచంలో మద్యపాన నిషేధం ఎక్కడ అమలవుతున్నా, అక్కడ అమెరికా అనుభవం వెక్కిరిస్తూ ఉంటుంది.అంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం విధించబోతున్నారు. అందుకే అమెరికా అనుభవాన్ని అధ్యయనం చేయడం ఇక్కడ అవసరం. చారిత్రకంగా భారతదేశంలో తొలి నుంచి ఉన్న మద్యపాన నిషేధ ఉద్యమం గురించి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

***ఆశయం ఒక్కటే సరిపోదు
ఒక చట్టం అమలుకావాలంటే మహోన్నత ఆశయం ఉండటం మాత్రమే చాలదని అమెరికా అనుభవం పాఠం చెబుతోంది. దాదాపు అదే సమయంలో బ్రిటిష్ ఇండియా రాష్ట్రాల్లో అమలైన మద్యపాన నిషేధం కూడా ఇదే విషయాన్ని వివరిస్తోంది.మద్యపాన నిషేధం రాజకీయ పలుకుబడి, మద్దతు లేని పేదల మీద ప్రతాపం చూపుతుంది. పోలీసు యంత్రాంగం బలం పెరిగిపోతుంది. పట్టణాల్లో డబ్బు, పలుకుబడి ఉన్నోళ్లకు మద్యం నేరుగా డోర్ డెలివరీ అవుతుంది. ఇలాంటి వైభోగం సాధ్యం కాని పేదలు అక్రమ మార్గాల్లో తాగుడును అలవాటు చేసుకుని కేసుల్లో ఇరుక్కుంటారు.అంతవరకు చట్టాన్ని గౌరవిస్తూ వచ్చిన వాళ్లు, నిషేధ కాలంలో రెండు గుక్కెల కోసం చట్టాన్ని ఉల్లంఘించాల్సి వస్తుంది. అమెరికాలో జరిగిందదే. భారత్‌లో ఇప్పుడు నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ జరుగుతోంది.ఆంధ్రప్రదేశ్‌లో 1995-1997 మధ్య నిషేధం అమల్లో ఉంది. అది ఎప్పుడూ పూర్తిగా అమలు కాలేదు.
నిషేధ సమయంలో బీర్ తప్ప అన్ని రకాల మందు పుష్కలంగా దొరికింది. బీరు అలవాటున్నవాళ్లు బీర్ నుంచి ఇతర హార్డ్ లిక్కర్స్‌కు మారారు. స్మగ్లింగ్ జోరుగా సాగింది. స్మగ్లర్లు వేల కోట్లు వెనకేసుకున్నారు. చాలామంది ప్రభుత్వ అధికారులు కూడా బాగా సంపాదించారు. పేదలు, గ్రామీణులు, పట్టణాల్లోని బస్తీ ప్రజలు నాసిరకాలైన మద్యానికి అలవాటుపడ్డారు. కల్తీ మద్యం తాగి, మృత్యవాత పడ్డారు.

**జాతీయోద్యమంలో భాగం
నిజానికి భారతదేశంలో మద్యాన్ని నిషేధించాలన్న డిమాండ్ స్వాతంత్ర్యపోరాట కాలంలోనే మొదలైంది. బ్రిటీష్ వాళ్లు అబ్కారీ చట్టం తీసుకువచ్చి, అన్ని రకాల మద్యం వ్యాపారాలను తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.1888-1920 మధ్య కాలంలో బ్రిటీష్ ప్రభుత్వం కల్లు, సారా వ్యాపారంతో పాటు విదేశీ మద్యం అమ్మకాలను తమ నియంత్రణలో ఉంచుకుని, బాగా ప్రోత్సహించింది. దుకాణాల లైసెన్స్‌ల మీద రాబడి బాగా ఉండటంతో మద్యం ప్రధాన ఆదాయవనరుగా మారింది.ఇదే కాలంలోనూ మద్యపాన నిగ్రహ ఉద్యమం కూడా మొదలయింది. ఈ కాలంలోనే ఒక వైపు విదేశీ మద్యం వ్యాప్తి పెరగడం, మరొకవైపు జాతీయోద్యమం బలపడటం విశేషం.జాతీయోద్యమ నాయకులు విదేశీ మద్యం వ్యాప్తిని భారత వ్యతిరేక మహమ్మారిగా ప్రచారం చేశారు. భారతీయత మీద దాడి అని అన్నారు. విదేశీ పాలన, అనైతికత, భారత వ్యతిరేకతకు మద్యం మారు రూపంగా ప్రచారం చేశారు.మహత్మాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ మద్యాన్ని నిషేధించాలని ప్రచారం మొదలుపెట్టింది. ‘దొంగతనం, వ్యభిచారం కంటే మద్యపానం అత్యంత నీచమైంది’, ‘ఒక గంటసేపు నేను భారతదేశ నియంత అయితే, ఎలాంటి పరిహారం ఇవ్వకుండా దేశంలోని అన్ని మద్యం దుకాణాలను మూసివేస్తాను’ అని గాంధీ వ్యాఖ్యానించారంటే.. ఆయన మద్యాన్ని గాంధీ ఎంతగా వ్యతిరేకించారో అర్థం చేసుకోవచ్చు.

మద్యపాన నిగ్రహ ప్రచారం మహాత్మ గాంధీ సూత్రీకరణతో భారత జాతీయోద్యమంలో కలిసింది. స్వదేశీ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమంలో మద్యపాన నిషేధం పిలుపు భాగమైంది.ఈ స్ఫూర్తితోనే బ్రిటిష్ ఇండియా రాష్ట్రాల్లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మద్యపాన నిషేధ చట్టాన్ని తీసుకువచ్చాయి. అయితే, దేశ వ్యాప్తంగా జాతీయోద్యమం పెద్ద ఎత్తున సాగుతున్నపుడు కూడా దేశంలో మద్యపానం తగ్గలేదు. దేశ జనాభాలో ఐదో వంతు మద్యం మత్తులో ఉన్నారని స్వయంగా అంబేడ్కర్ అంగీకరించారు.మద్రాసు రాష్ట్ర రెవిన్యూలో ఎక్సైజ్ వాటా 38% ఉంది. 1930-31 మధ్య శాసనోల్లంఘన ఉద్యమ కాలంలో నిషేధం కావాలనే వాళ్లకి, వద్దనే వాళ్లకి మధ్య కొట్లాటలు మొదలయ్యాయి. హింస కూడా చెలరేగింది. జాతీయోద్యమాన్ని ఉన్నత కులాల విశ్వాసాలకు అనుగుణంగా నడుపుతున్నారనే విమర్శ వచ్చింది.1935 భారత ప్రభుత్వ చట్టంతో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి రావడంతో అబ్కారీ చట్టాన్ని రాష్ట్రాలకు బదలాయించారు. మద్రాసు, బొంబాయి, యునైటెడ్ రాష్ట్రాల్లో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రయోగాత్మకంగా మద్య నిషేధం విధించాయి. మద్రాసు రాష్ట్రంలో మద్య నిషేధం బిల్లు తీవ్ర వ్యతిరేకత నడుమ పాసయ్యింది. సేలం జిల్లాలో మొదట అమలు చేసి, తర్వాత నార్త్ ఆర్కాట్, కడప చిత్తూరులకు విస్తరించారు.
రాజగోపాలాచారి వంటి పట్టుదల ఉన్నవారు అధికారంలో లేకపోవడం, ప్రజల్లో కూడా నిషేధానికి మద్దతు తగ్గిపోవడంతో 1943లో నిషేధం ఎత్తి వేశారు. ఈ మధ్య కాలంలో ఎక్సైజ్ రెవిన్యూ లేని లోటు పూరించుకునేందుకు రకరకాల పన్నులు విధించారు. చట్టం అప్రతిష్టపాలు అయిందనక తప్పదు.

**జనతా ప్రభుత్వ ప్రయత్నం
జాతీయోద్యమ స్ఫూర్తితో కూడా దేశంలో మద్య నిషేధాన్ని అమలు చేయడం కష్టమైందని ఈ చరిత్ర చెబుతుంది. జాతీయ స్థాయిలో మద్యపాన నిషేధం అమలు చేసేందుకు 1977లో ప్రధాని మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. జాతీయ మద్యపాన నిషేధ విధానం ప్రకటించింది. ఆ సమయంలో జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే నిషేధం అమలైంది.నిషేధం వల్ల రాష్ట్రాలో నష్టపోయే రాబడిని కేంద్రం భరిస్తుందని కూడా మొరార్జీ హామీ ఇచ్చారు. అవినీతి, దొంగవ్యాపారులు, రాజకీయ నేతల అపవిత్ర కూటమి వల్ల ఆ ప్రతిపాదన కూడా వీగిపోయింది. ఎందుకంటే, చివరకు దొంగ మద్యం ఆయుర్వేదిక్ మందుల రూపంలో కూడా మార్కెట్లోకి వచ్చింది.ఆ తర్వాత లక్షద్వీప్, గుజరాత్, బిహార్, నాగాలాండ్, మిజోరాం లాంటి రాష్ట్రాలు సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశాయి. కేరళ, తమిళనాడు రాష్ట్రాలు పాక్షిక నిషేధ చట్టాలను తీసుకువచ్చాయి. కొన్ని సందర్భాల్లో చట్టాలను సడిలించాయి. హరియాణా, అంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిషేధ చట్టాన్ని తీసుకువచ్చి, అమలుచేయలేక ఉపసంహరించుకున్నాయి.గాంధీ పుట్టిన నేల కాబట్టి, గుజరాత్‌లో నిషేధం తప్పనిసరిగా అమలు చేయాల్సివస్తోంది. అది మొక్కుబడిగానే జరుగుతున్నట్లు అక్కడి మీడియా వార్తలు చూస్తే అర్థమవుతుంది. చట్టం కేవలం కాగితం మీదే చాలా కఠినంగా కనబడుతోంది. తాహతు ఉన్నవాళ్లకి మద్యం డోర్ డెలివరీ జరగుతూ ఉంది. మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌ల నుంచి పెద్దమొత్తంలో మద్యం అక్రమ రవాణా అవుతోందని వార్తలు వస్తున్నాయి.అక్రమ మద్యం అందుబాటులో లేనివాళ్లు నాసిరకం మందు తాగున్నారు. ఫలితంగా 2009లో 149 మంది చనిపోయారు. అది కూడా అహ్మదాబాద్ వంటి మహానగరంలో. 1999-2009 మధ్య నమోదైన 70,899 మద్య నిషేధ కేసుల్లో శిక్ష పడింది కేవలం 9% మందికే. 2017లో ఓ పిటిషన్‌ను విచారణ సందర్భంగా నిషేధం సత్ఫలితాలు ఇవ్వడంలేదని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి పర్డివాలా చాలా స్పష్టంగా వాఖ్యానించారు.ఇక బీహార్‌లో 2016 ఏప్రిల్ 5 నుంచి నిషేధం అమలవుతోంది. అమలు తీరు ఇంకా శైశవ దశలోనే ఉంది. అయితే, నిషేధం సత్ఫలితాలను ఇస్తోందని పట్నా కేంద్రంగా పనిచేసే ఏషియన్ డెవెలప్‌మెంట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఏడీఆర్ఐ), డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ ఇన్స్టిట్యూట్(డీఎమ్ఐ) సంస్థలు చెప్పాయి.నిషేధం కారణంగా మద్యం ప్రియులు మందు మానుకోవడంతో నెలనెలా రూ.440 కోట్లు ఆదా అవుతున్నాయని ఈ సంస్థలు పేర్కొన్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఇది మరింత ఉత్సాహాన్ని ఇచ్చే ఫలితమే.

***ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు విఫలం
ఎన్టీ రామారావు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం 1995 జనవరిలో మద్యపాన నిషేధం తీసుకువచ్చింది. అయితే, 1997లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వమే నిషేధాన్ని ఎత్తివేస్తూ చట్టం తీసుకువచ్చింది. నిషేధం ఎత్తివేయడానికి ప్రభుత్వం చెప్పిన కారణం రూ.960 కోట్ల బడ్జెట్ లోటు. చట్టాన్ని కఠినంగా అమలుచేయలేకపోయామని ఉపసంహరణ బిల్లు మీద మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ మంత్రి నెట్టెం రఘురాం అంగీకరించారు.1995 జనవరి నుంచి 1997 ఏప్రిల్ దాకా ఆంధ్రప్రదేశ్‌లో నిషేధం ఘోరంగా విఫలమైంది. బహిరంగంగా మద్యం దుకాణాలు లేవు కానీ, తాగాలనుకున్న అందరికీ మద్యం దొరికింది. పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున అక్రమంగా రవాణా అయింది. రాజకీయ నాయకులకు, ప్రభుత్వంలో పలుకుబడి ఉన్నవారికి నిషేధమే లేదు.పేద వాళ్ల మీద మాత్రం చట్టం బలంగా పనిచేసింది. మద్య నిషేధం కోసం వచ్చిన ఉద్యమాలు నిషేధం ఎత్తివేస్తున్నప్పుడు రాకపోవడం గమనించాలి. నిషేధ సమయంలో మద్యం లభించే తీరును బట్టి ఏ రాష్ట్రం కూడా ప్రజలకు మద్యం అందకుండా సంపూర్ణ నిషేధం విధించలేదని అర్థమవుతోంది.దేశంలోనే అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన చేసిన చామ్లింగ్ ఎందుకు ఓడిపోయారు

***జగన్ ప్రభుత్వం చేస్తుందా
ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశలవారీగా మద్యనిషేధం అమలుచేస్తామని అంటున్నారు. వార్తలొస్తున్నాయి. అమలు చేసేముందు మద్యం మీద వస్తున్న రాబడికి ప్రత్యామ్నాయం ఏమిటి అన్నదే ఆయన తీవ్రంగా ఆలోచించాలి.ఎందుకంటే, 2018-19లో ఎక్సైజ్ శాఖ నుంచి వచ్చిన రాబడి 17,340 కోట్లు. అంతకు ముందు ఏడాది కన్నా ఇది 12.96% ఎక్కువ. 2015-16లో మద్యంపై వచ్చే ఆదాయం 12,474 కోట్లుగా ఉండేది.
నిషేధం అమలు చేస్తే ఈ రాబడి పోతుంది. సామాజిక సంక్షేమం ధ్యేయంగా పెట్టుకున్నపుడు ఈ మాత్రం త్యాగం తప్పేమీ కాదు. అయితే, 1995లో ఎన్టీరామారావు మద్యపాన నిషేధం విధించే నాటికి ఆంధప్రదేశ్ ఇంకా ఒక సంప్రదాయిక సమాజమే. మద్యాన్ని చాలా మటుకు తప్పుగా, అపవిత్రమైన అలవాటుగా చూసేవాళ్లు. ఈ రెండు దశాబ్దాల కాలంలో రాష్ట్రం చాలా ముందుకుపోయింది.దుకాణాలు, బార్లు, ఫ్యామిలీ రెస్టారెంట్లు బాగా పెరిగాయి. కుటుంబాల ఆదాయాలు అధికమయ్యాయి. మద్యపానానికి సామాజిక ఆమోదం బాగా పెరిగింది. మహిళా సమాజంలో కూడా మద్యపాన అలవాటు విస్తరించింది.

గత ప్రభుత్వాలు తీసుకువచ్చిన మద్య విధానాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో మద్యం దొరకని ప్రదేశమంటూ లేకుండా పోయింది. అయితే, సామాజిక ఆమోదం విస్తరించడంతో గతంలోలా మద్యం కారణంగా కుటుంబాల్లో గొడవలు జరిగే వాతావరణం ఇప్పుడు తగ్గిందని చెప్పొచ్చు. మద్యం దురాచారం అనే భావన పలుచబడుతూ ఉంది. ఈ నేపథ్యంలో చట్టాన్ని అల్పాదాయ వర్గాలు, పట్టణ మధ్య తరగతి మీద రుద్దడం ఎంతవరకు సబబు అనే విషయం కూడా చర్చనీయాంశం అవుతోంది. సమాజంలో మితంగా మద్యం సేవించేవారు కూడా ఉన్నారు. నిషేధం వల్ల ఈ వర్గంలో విపరీత ధోరణులు కలగకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలి.ప్రపంచంలో ఏ సమాజం కూడా మద్యాన్ని పూర్తిగా నిషేధించలేకపోయింది. మరి, ఆంధ్రప్రదేశ్‌లో అది సాధ్యమవుతుందా? మద్యం అక్రమ రవాణాను ఆపగలరా? నాసిరకం మద్యం అందుబాటులో లేకుండా చేయగలరా? ఇవన్నీ జగన్‌కు సాధ్యం అవుతాయా? చూద్దాం…