Business

జూన్‌లో బ్యాంకు సెలవులు ఇవే

జూన్‌లో బ్యాంకు సెలవులు ఇవే

జూన్‌లో బ్యాంకుల సెలవులను రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. దీనికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. వేర్వేరు రాష్ట్రాల్లో జరుపుకొనే పండగలు, ఇతర వేడుకల ఆధారంగా బ్యాంకులకు సెలవుల జాబితాను రూపొందించింది.రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలుపుకొని వచ్చేనెలలో మొత్తం 18 బ్యాంక్ సెలవులు రానున్నాయి. అన్ని జాతీయ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులకు ఈ సెలవుల జాబితా వర్తిస్తుంది.

ఈ సెలవులను ఆధారంగా చేసుకుని ఖాతాదారులు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాంకు సెలవులను మూడు కేటగిరీలుగా విభజిస్తుంటుంది రిజర్వు బ్యాంక్. స్టేట్-స్పెసిఫిక్ హాలిడే, రిలీజియస్ హాలిడే, ఇతర పండగలు. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల్లో ప్రత్యేకంగా సెలవులు వస్తుంటాయి. దీనికి ప్రత్యేకంగా తేదీ అనేది ఉండదు. ఇలాంటివన్నీ నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద మంజూరు అవుతాయి.

రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన జాబితా ప్రకారం.. జూన్ 2వ తేదీన తొలి హాలిడే వస్తుంది. ఆ రోజున మహారాణా ప్రతాప్ జయంతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. మహారాణా ప్రతాప్ జయంతిని పురస్కరించుకుని హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్‌లల్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆవిర్భావ దినోత్సవం అయినందున తెలంగాణలో బ్యాంకులకు హాలిడే ఉంటుంది. 3వ తేదీన గురు అర్జున్ దేవ్ వర్ధంతి కారణంగా పంజాబ్‌లో బ్యాంకులు పని చేయవు.

5వ తేదీన ఆదివారం, 11వ తేదీన రెండో శనివారం, 12వ తేదీన ఆదివారం సెలవులు ఉంటాయి. 14వ తేదీన సంత్ గురు కబీర్ జయంతిని పురస్కరించుకుని ఒడిశా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లల్లో సెలవులు. 15వ తేదీన గురు హర్‌గోబింద్‌ జయంతి సందర్భంగా ఒడిశా, మిజోరం, జమ్మూకాశ్మీర్ బ్యాంకులు పని చేయవు. 19న ఆదివారం, 22న ఖార్చీ పూజ వల్ల త్రిపుర, 25న నాలుగో శనివారం, 26న ఆదివారం సెలవులు ఉంటాయి. 30న స్థానిక పండగ వల్ల మిజోరంలో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.