Politics

మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు – TNI రాజకీయ వార్తలు

మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు  – TNI రాజకీయ వార్తలు

* టీడీపీ మహానాడుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… మహానాడుకు ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుంటూ చలానా కడితే ఇప్పుడు బస్సులు ఇవ్వమని అడ్డు చెబుతున్నారన్నారు. వేసవి రద్దీ అంటూ సాకులు చెప్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ వాహన యజమానుల్ని ఆర్టీవోలు బెదిరిస్తున్నారని తెలిపారు. మహానాడుకు వాహనాలు ఇస్తే వాటిని సీజ్ చేస్తామని భయపెడుతున్నారని చెప్పారు. అలా బెదిరించిన అధికారుల వివరాలు సేకరించామని… వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.

*మాట్లాకపోతే India చచ్చిపోతుంది: Rahul Gandhi
ఇండియా బతకాలంటే మాట్లాడాలని ఒకవేళ మాట్లాడకపోతే చచ్చిపోతుందని కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ అన్నారు. మాట్లాడనికి వీలులేకుండా ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారని, మీడియాను సైతం తమ గుప్పిట్లో పెట్టుకుని దేశాన్ని నిశ్శబ్దంగా ఉంచాలని చూస్తున్నారని, అయితే అది భారత్ కాదని, భారత్ అలా ఉండదని ఆయన అన్నారు. ప్రఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ లోని కార్పస్ క్రిస్టీ కాలేజ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఇండియా ఎట్ 75’ అనే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారత విద్యార్థులు అధికంగా ఉండే క్రిస్టీ కాలేజీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు అడిగే ప్రశ్నలకు రాహుల్ సమాధానాలు చెప్పారు.దేశంలోని ప్రజలను సమీకరించడంలో కాంగ్రెస్ పాత్ర, హిందూ జాతీయవాదం వంటి ప్రశ్నలకు భారత విద్యార్థులు రాహుల్‌కు సంధించారు. కాగా, రాహుల్ కార్యక్రమానికి కొంత దూరంలో ఉన్న విద్యార్థులు ‘రాహుల్.. మైనింగ్‌‌పై మీరిచ్చిన వాగ్గానాల్ని నిలబెట్టుకోండి’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా, విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడుతూ ‘‘దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలపై క్రమబద్ధమైన దాడి కొనసాగుతోంది. పార్లమెంట్, ఎన్నికల వ్యవస్థ ఇలా అన్ని సంస్థల్ని ధ్వంసం చేసుకుంటూ పోతున్నారు. మీడియాను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఇండియాలోని ఏ మీడియాలోనైనా మనం 30 సెకన్లకు మించి మాట్లాడలేము. దేశాన్ని నిశ్శబ్దంలోకి నెట్టాలని చూస్తున్నారు. కానీ అలా వెళ్తే అది ఇండియా అవ్వదు. ఇండియా మాట్లాడాలి. ఒకవేళ మాట్లాడకపోతే ఇండియా చచ్చిపోతుంది’’ అని అన్నారు.

*ముఖ్యమంత్రి బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడ్డారు- తానేటి
కాకినాడలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు విషయంలో ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేశామని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకులు దీన్ని రాజకీయలబ్ది కోసం వాడుకోవాలని చూస్తున్నారని హోంమంత్రి ఆరోపించారు. అనంతబాబును అరెస్ట్‌ చేసి పేదలు, బడుగు, బలహీన వర్గాల పక్షాన ముఖ్యమంత్రి నిలబడ్డారని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. నిందితులెవరైనా కఠినంగా శిక్షించాలని, నేరాన్ని నేరంగానే చూడాలన్నారు. రాజకీయాలకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు దీన్ని రాజకీయలబ్ది కోసం వాడుకోవాలని చూస్తున్నారని హోంమంత్రి ఆరోపించారు.

*రేవంత్‌ది ర‌చ్చ‌బండ కాదు.. లుచ్చా బండ‌ : మంత్రి మ‌ల్లారెడ్డి
తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ర‌చ్చ‌బండ పేరిట రేవంత్ రెడ్డి రాజ‌కీయాలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీఆర్ఎస్ఎల్పీలో మంత్రి మ‌ల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల‌ను మోసం చేసిన పార్టీ.. నేడు రైతుల గురించి మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. రేవంత్‌ది ర‌చ్చ‌బండ కాదు.. లుచ్చా బండ‌.. బ‌ట్టేబాజ్ బండ అని విమ‌ర్శించారు. రేవంత్ ఏ పార్టీలో ఉంటే మ‌టాష్ అని ఎద్దెవా చేశారు. ఆయ‌న ఏ పార్టీలో కూడా ఎక్కువ కాలం ప‌ని చేయ‌రు. రేపోమాపో రేవంత్ బీజేపీలో చేరినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు

*ప్ర‌తీ జిల్లాలో రేడియోల‌జీ ల్యాబ్ : మంత్రి హ‌రీశ్‌రావు
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 రేడియోలజీ ల్యాబ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నామ‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో అన్నీ రకాల వైద్య పరీక్షలు పేదలకు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని తెలిపారు. సిద్దిపేట జిల్లా ప్ర‌భుత్వ స‌ర్వ‌జ‌న ఆస్ప‌త్రిలో రేడియోల‌జీ హ‌బ్‌ను మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో జ‌డ్పీ చైర్మ‌న్ రోజాశ‌ర్మ‌, వైస్ చైర్మ‌న్ క‌న‌క‌రాజు, మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ రాజ‌నర్సు, మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ పాల సాయిరాం, సుడా డైరెక్ట‌ర్ మ‌చ్చ వేణుగోపాల్, డీఎంహెచ్‌వో కాశీనాథ్‌తో పాటు త‌దిత‌రులు పాల్గొన్నారు.ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచ‌న మేర‌కు ప్ర‌తి జిల్లా ఆస్ప‌త్రిలో టీ డ‌యాగ్నోస్టిక్ హ‌బ్‌, రేడియోల‌జీ హ‌బ్ ప్రారంభిస్తున్నామ‌ని చెప్పారు. ప్రతి పీహెచ్‌సీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వచ్చే వారికి 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తాం. ఈసీజీ, 2డీ ఈకో, ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, మెమెగ్రఫీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు. గ‌తంలో వివిధ ప‌రీక్ష‌ల కోసం ప్ర‌భుత్వ వైద్యులు.. ప్ర‌యివేటు ల్యాబ్‌ల‌కు పంపేవారు.. కానీ తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్పాటైన త‌ర్వాత అలాంటి ప‌రిస్థితి లేద‌న్నారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఏర్పాటు చేస్తున్న టీ డ‌యాగ్నోస్టిక్ హ‌బ్, రేడియోల‌జీ ల్యాబ్‌ల‌ను ప్ర‌జ‌లు వినియోగించుకోవాల‌ని మంత్రి సూచించారు.

*ఆ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వం బడులు: satyavathi rathod
తెలంగాణ ప్రభుత్వం వచ్చినా తర్వాత బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువు కోసం కృషి చేస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రైవేట్ స్కూలుకు పోటీగా ప్రభుత్వం బడులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఐఐటీ, ఐఐఎం శిక్షణ ఇస్తామన్నారు. స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ భవనాన్ని సాధ్యమైనత త్వరగా నిర్మిస్తామన్నారు. జిల్లాను సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు.

*జనాలు పిచ్చోళ్లనుకుని జగన్ ఏవేవో పిట్ట కథలు చెబుతున్నారు: రఘురామ
సీఎం జగన్ ముందస్తు ప్రణాళికలో భాగంగానే లండన్ వెళ్లారని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. జగన్‌ లండన్‌లో సొంత కార్యక్రమాలు చక్కబెట్టుకున్నారన్నారు. జనాలు పిచ్చోళ్లనుకుని ఏవేవో పిట్ట కథలు చెబుతున్నారన్నారు. దావోస్‌కి వెళ్లి జగన్ సాధించింది ఏమీ లేదన్నారు. దావోస్‌లో ఏపీ ఆరోగ్య రంగం గురించి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఇంకా రఘురామ మాట్లాడుతూ.. ‘‘నాపై అనర్హత పిటిషన్‌కు సంబంధించి ప్రివిలేజ్ కమిటీ ముందు చీఫ్ విప్ మార్గాని భరత్ చెప్పిన వాటిలో పస లేదు. జగన్‌ను నేను ఎప్పుడూ తూలనాడలేదు. పార్టీకి వ్యతిరేకంగా నేను ఎప్పుడూ మాట్లాడలేదు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడం తప్పు కాదు. ఒరిజినల్ వీడియోలను ప్రివిలేజ్ కమిటీకి అందజేశా. నిజాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి. పార్టీ అధ్యక్షుడిగా జగన్ ఇచ్చిన వాగ్దాలనాలను సీఎంగా ఉల్లంఘిస్తున్నారు. అందుకే జగన్ తప్పులను ఎత్తి చూపా. ఇందులో తప్పు లేదు. ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలను గుర్తు చేయడం ఎలా తప్పవుతుందో చెప్పాలి. నాకెప్పుడూ విప్ జారీ చేయలేదు. వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు అనర్హులు కారా? పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారు. హత్య కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్సీ అనంతబాబును వెంటనే బర్తరఫ్ చేయాలి. చంపిన తరువాత అనంతబాబు కొట్టినట్టు పోలీస్ అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉంది. అనంత బాబు ప్రాణాలకు ముప్పు ఉంది. జాగ్రత్తగా ఉండాలి’’ అని సూచించారు.

*‘ఈగోయిజం, శాడిజం, ఫ్యాక్షనిజం వ్యక్తి జగన్’
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక వైసీపీ కార్యకర్తలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ వ్యాపార సంస్థల్లో పనిచేసే వ్యక్తులకు ప్రభుత్వంలో ఉద్యోగాలిచ్చారన్నారు. 2024లో మళ్లీ సీఎం కావటం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు నడుపుతున్నారని మండిపడ్డారు. ప్రజలపై మోయలేని పన్నుల భారం మోపి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారన్నారు. నరేంద్ర మోదీ 130 సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జగన్ వాటిని నవరత్నాలుగా మార్చి అమలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈగోయిజం, శాడిజం, ఫ్యాక్షనిజం కలగలిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తప్ప ఎవరూ వ్యాపారాలు చేసేందుకు వీల్లేదన్నారు. ఇసుక, గనులు, మద్యం వ్యాపారాలతో సంపదను ఏకీకృతంగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైసీపీ గుండాలు దాడులు చేస్తున్నారంటూ కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

*ఉద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్‌ నిలబెట్టుకోలేదు: అశోక్ బా
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను జగన్‌ నిలబెట్టుకోలేదని ఎమ్మెల్సీ అశోక్‌బాబు పేర్కొన్నారు. చేసిన పనికి జీతం కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారన్నారు. ఏ వ్యవస్థను కదిపినా ఉద్యోగులు బలిపశువుల్లా మారుతున్నారన్నారు. సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగులకు సంబంధించిన బకాయిలపై.. ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ అశోక్‌బాబు డిమాండ్ చేశారు.

*జగన్‌ పాలనలో ఏపీకి ఒరిగిందేమీ లేదు: ఉండవల్లి
జగన్‌ పాలనలో ఏపీకి ఒరిగిందేమీ లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఓట్లేసిన వాళ్లకు అన్నీ చేసేద్దాం.. ఓట్లేయని వాళ్లను పక్కన పెట్టేద్దాం అన్నట్టుగా జగన్ పాలన ఉందన్నారు. ప్రజలను వైసీపీ మోసం చేసే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ, జనసేనలు బీజేపీకే మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. వీళ్లలో వీళ్లు తిట్టుకుంటారే కానీ బీజేపీని మాత్రం ఒక్కమాట కూడా అనరని ఉండవల్లి పేర్కొన్నారు. సీఎంలు మారినా ఏపీ సమస్యలు మాత్రం అలానే ఉన్నాయన్నారు. పోలవరం కింద రూ.30 వేల కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకే పోలవరం నిర్మాణానికి కేంద్రం ఆసక్తి చూపడం లేదన్నారు. కనీసం ప్రాజెక్ట్‌ పూర్తి చేయకపోయినా.. 41 మీటర్లు ఆనకట్టగా అయినా అభివృద్ధి చేయాలని ఉండవల్లి సూచించారు.

*రేవంత్ బట్టేబాజ్… డబ్బులిచ్చి టీపీసీసీ పదవి కొన్నాడు: మంత్రి Mallareddy
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కి మంత్రి మల్లారెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రేవంత్‌రెడ్డి ఓ బ్లాక్‌మెయిలర్‌ అని అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్‌ డబ్బులిచ్చి టీ.పీసీసీ పదవి కొన్నారని ఆరోపించారు. రేవంత్‌ చివరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ ను కూడా బ్లాక్‌మెయిల్‌ చేస్తారన్నారు. రేవంత్‌రెడ్డి దుర్మార్గుడని.. బట్టేబాజ్‌ అంటూ మంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.రేవంత్‌ది రచ్చబండ కాదని.. లుచ్చాబండ అంటూ దుయ్యబట్టారు. రేవంత్‌ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ మటాష్‌ అవుతుందన్నారు. ‘‘నేను ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా. టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్‌తో అనేక ఇబ్బందులు పడ్డా. టీడీపీలో ఉన్నప్పుడు నన్ను కూడా రేవంత్‌ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. నా కాలేజీలు మూసివేయిస్తానని బెదిరించాడు. మల్కాజ్‌గిరి సీటు రాకుండా అడ్డుకునేందుకు యత్నించాడు. చంద్రబాబు కు వాస్తవాలన్నీ చెప్పి సీటు తెచ్చుకుని..గెలిచా. రేవంత్‌ ఇప్పటికీ నన్ను విడిచిపెట్టకుండా అదే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు. ఇలా రేవంత్ నన్ను అడుగడుగునా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు’’ అని మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.

*రచ్చబండ పేరుతో రేవంత్ రాజకీయాలు చేస్తున్నారు: వివేక్ర
చ్చబండ పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే వివేక్ విమర్శించారు. టీపీసీసీ చీఫ్ హోదాలో చిల్లర రాజకీయాలు మానాలని హితవు పలికారు. టీపీసీసీ అంటే చీటర్స్ కమిటీగా మారిందన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్ కాగితాలకే పరిమితమైందన్నారు. డిక్లరేషన్ను కాంగ్రెస్ నాయకులే నమ్మడం లేదని వివేక్ పేర్కొన్నారు.

*రేవంత్ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు: దానం నాగేందర్టీ
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని టీఆర్ఎస్ నేత దానం నాగేందర్ విమర్శించారు. అభివృద్ధి రేవంత్‌కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రేవంత్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. రెడ్డిల చేతిలో అధికారం ఉండాలన్న రేవంత్ వ్యాఖ్యలపై భట్టి, వీహెచ్ ఇతర నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రేవంత్ తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దానం నాగేందర్ పేర్కొన్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ బోర్డ్ పెట్టాలని ఆనాడే తాము కోరామన్నారు. హైదరాబాద్‌కు సుంకిషాల నీళ్లు తేవాలంటే పట్టించు కోలేదన్నారు. ఇప్పుడు రేవంత్ వచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. పార్థ సారథి రెడ్డి మార్కెట్ రేట్ ప్రకారమే రెమిడెసివర్ ఇచ్చారన్నారు. ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని.. అలాంటి వ్యక్తి మీద జగ్గారెడ్డి బురద జల్లడం సరికాదని దానం నాగేందర్ హితవు పలికారు.

*రాజకీయాల కోసం జై హనుమాన్ అంటే.. దేవుడు క్షమించడు: Bandi sanjay
రాజకీయాల కోసం జై హనుమాన్ అంటే.. దేవుడు క్షమించడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… రామమందిర నిర్మాణానికి అనుకులమో లేదో అయ్యా, బిడ్డ చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ వల్లే.. తాను హిందువును అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారన్నారు. కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో అని పంజాబ్ రైతులకు అనుమానం ఉందని తెలిపారు. ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయటకు రావడమే అతిపెద్ద సంచలనమని వ్యాఖ్యానించారు. దేశ యాత్రలతో కేసీఆర్ సాధించింది ఏమీ లేదని బండి సంజయ్ పేర్కొన్నారు.

*వారు ఒక తట్ట మట్టి కూడా పోయలేదు: ajay kumar
కొందరు వలస పక్షులు వస్తున్నాయని ఆరోపణలు చేసి పోతున్నారని మంత్రి అజయ్ కుమార్ అన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధికి ఒక తట్టా మట్టి కూడా పోయాలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో పల్లెలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉన్నాయో ప్రజలకు తెలుసన్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ స్కామ్‌లు చేసిందన్నారు. ఏ రాష్టం ఐతే తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అన్ని అన్నారో, ఆ రాష్టంలో ఇప్పుడు కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతుందన్నారు. దావోస్‌లో ఒక్క రోజునే మంత్రి కేటీఆర్ వేయి కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తున్నారని చెప్పారు. అదే పక్క రాష్టంలో ఎవరు పెట్టుబడులు పెట్టటం లేదన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పరిపాలనా దక్షతకు నిదర్శనమన్నారు.

*కాంగ్రెస్ టీమ్‌లోకి ‘సునీల్ క‌నుగోలు’… ప్ర‌క‌టించిన అధిష్ఠానం
కాంగ్రెస్ పార్టీలో చేర‌డం కుద‌ర‌ద‌ని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ చెప్పిన కొన్ని రోజుల‌కు కాంగ్రెస్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పీకే ప్ర‌ధాన అనుచ‌రుడు, వ్యూహ‌క‌ర్త సునీల్ క‌నుగోలుకు కీల‌క బాధ్య‌త‌ల‌ను అప్ప‌జెప్పింది. సునీల్ క‌నుగోలుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ను ఛ‌రిష్మాటిక్ నేత‌గా ప్రొజెక్ట్ చేసే బాధ్య‌త‌లు అప్ప‌జెబుతార‌ని, ఎన్నిక‌ల వ్యూహానికి సంబంధించిన బాధ్య‌త‌లు కూడా క‌ట్ట‌బెడతార‌న్న ప్ర‌చారం చాలా రోజులుగా జ‌రుగుతున్న‌దే.తాజాగా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ టాస్క్‌ఫోర్స్ -2024 టీమ్‌ను ప్ర‌క‌టించింది. పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక ఉన్న ఈ టీమ్‌లో సునీల్ క‌నుగోలుకు చోటు ద‌క్కింది. ఈ మేర‌కు పార్టీ అధ్య‌క్షురాలు సోనియా ప్ర‌క‌టించారు. సునీల్ క‌నుగోలుతో పాటు ప్రియాంక గాంధీ, ముకుల్ వాస్నిక్‌, చిదంబ‌రం, జైరాం ర‌మేశ్‌, అజ‌య్ మాకెన్‌, కేసీ వేణుగోపాల్‌, ర‌ణ‌దీప్ సూర్జేవాలాకు సోనియా చోటు క‌ల్పించారు.రాబోయే ఎన్నిక‌ల్లో ఈ టాస్క్‌ఫోర్స్ క‌మిటీ కీల‌క పాత్ర నిర్వ‌హించ‌నుంది. ఈ క‌మిటీలోని స‌భ్యులంద‌రికీ ఒక్కో ప‌నిని అప్ప‌జెప్ప‌నున్నారు. సంస్థాగ‌త వ్య‌వ‌హారాలు, మీడియా వ్య‌వహారాలు, ఆర్థిక వ్య‌వ‌హారాల‌తో పాటు ఎన్నిక‌ల వ్య‌వ‌హారాలు అప్ప‌జెప్ప‌నున్నారు.

*ఖమ్మంలో గిరిజన భవన్‌ ను ప్రారంభించిన మంత్రులు
గత పాలకులు ఖమ్మం జిల్లాకు చేసిందేమీ లేదు. బడుగుల నోట్లో మట్టి కొట్టాలని రాజకీయ వలస పక్షులు వస్తున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ అన్నారు. ఖమ్మం నగరంలోని ఎన్‌ఎస్‌పీ క్యాంపులో రూ.1.10 కోట్లతో నిర్మించిన గిరిజన భవన్ ను గిరిజన శాఖ మంత్రి సత్వతి రాథోడ్‌తో కలిసి మంత్రి పువ్వాడ ప్రారంభించారు.అనంతరం ముఖ్యమంత్రి గిరివికాస పథకం కింద జిల్లా వ్యాప్తంగా మంజూరైన 243 మందికి బోర్ వెల్స్, ట్యూబ్ వెల్స్- 61 ఆయా లబ్ధఙదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో రెండో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ ను రఘునాథపాలెంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.అలాగే నీట్ కోచింగ్ కూడా ఇక్కడే ఇస్తామని స్పష్టం చేశారు. అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ ఇచ్చారు. త్వరలో సీఎం కేసిఆర్ చేతుల మీదుగా మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేస్తామన్నారు. కేటీఆర్ దావోస్ పర్యటనతో తొలిరోజే రాష్ట్రానికి రూ. 1000 కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ పథంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు.

*ఏపీలో అరాచక, తాలిబన్ల పాలన: Tulasi reddy
రాష్ట్రంలో అరాచక, తాలిబాన్ల పాలన సాగుతోందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ…ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేదన్నారు. వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ తన కారు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యాన్ని తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నా పార్టీ పరంగా ఆయనపై చర్యలు లేవని మండిపడ్డారు. వివేకానంద రెడ్డి హత్యపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ సిబ్బందిని ముసుగు మనిషి బెదిరించడం జరిగిందన్నారు. రాష్ట్రం నేరాంధ్ర ప్రదేశ్‌గా, మధ్యాంద్ర ప్రదేశ్‌గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్‌గా, గంజాయి అంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో నేరాల రేటు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ఇప్పటికైనా శాంతి భద్రతల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిందుతుడు ఉదయ భాస్కర్‌ను పార్టీ నుండి బహిష్కరించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.

*రాజ్యసభకు బీజేపీ నుంచి ఒకరికి చాన్స్‌?
రాజ్యసభలో బీజేపీ నుంచి ప్రాతినిధ్యం కరువైన తెలంగాణ నుంచి పార్టీ సీనియర్‌ ఒకరిని పెద్దల సభకు పంపే దిశగా అధినాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ విస్తరణే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ, రాజ్యసభలో ఒకరికి ప్రాతినిధ్యం కల్పించి రాష్ట్రానికి తామిస్తున్న ప్రాధాన్యతను చాటే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఆ పార్టీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని తమిళనాడు, కేరళ బీజేపీ నేతలకు ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు పంపింది. తమిళనాడు బీజేపీ నేత ఎల్‌.మురుగన్‌ను మధ్యప్రదేశ్‌ నుంచి, కేరళకు చెందిన మురళీధర్‌ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు పంపడంతో పాటు వీరిద్దరిని కేంద్రమంత్రులను చేసింది.కేరళ నుంచి సినీనటుడు సురేశ్‌ గోపిని రాష్ట్రపతి కోటాలో నామినేట్‌ చేసి రాజ్యసభకు పంపింది. ఇదే తరహాలో తెలంగాణ నేత ఒకరిని ఉత్తరప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పంపే ఆలోచనలు చేస్తోంది. బీజేపీ సీనియర్‌ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, మురళీధర్‌రావు, కె.లక్ష్మణ్, మాజీ ఎంపీలు విజయశాంతి, వివేక్, జితేందర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. వీరితో పాటే మరో ఒకట్రెండు పేర్లు పరిశీలనలో ఉన్నా సామాజిక సమీకరణలు, సీనియారిటీ, పార్టీకి చేసిన సేవలను అంచనా వేసుకొనే అభ్యర్థిని నిర్ణయించనున్నారని తెలుస్తోంది. ఈ నెలాఖరుతో రాజ్యసభ నామినేషన్‌ గడువు ముగియనుంది. దీంతో రెండు, మూడు రోజుల్లోనే దీనిపై బీజేపీ అధిష్టానం నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలున్నట్లు సమాచారం.

*కులవృత్తులను ప్రోత్సహించేందుకు కార్యక్రమాలు: Harish rao
గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం లోరాష్ట్ర పశుసంవర్ధక పాడి పరిశ్రమ మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, పథకాల అమలు పై సోమవారం మంత్రి హరీష్ రావు, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్లు సంయుక్తంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు

*కులాలతో మతాలతో గెలిచిన చరిత్ర లేదు: ఎమ్మెల్సీ పల్లా
అన్ని వర్గాల నాయకులకు కేసీఆర్ అవకాశం ఇస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రాజ్యాన్ని ఏలాలని కొంతమంది భావిస్తున్నారని చెప్పారు. కులం, మతం ఎత్తుకొని సమాజంలో చీడపురుగుల్లాగా ఉన్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ను వేలానికి పెట్టారని ఆరోపించారు. కులాల, మతాల మధ్య రేవంత్ రెడ్డి చిచ్చుపెట్టే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేస్తేనే గెలుపు ఉంటుందని, కులాలతో మతాలతో గెలిచిన చరిత్ర లేదన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టడం రేవంత్ రెడ్డికి తగదన్నారు. టీఆర్ఎస్‌లో కులాలు, మతాల పంచాయితీ లేదన్నారు.

*రైతుల పాలిట యముడిగా సీఎం మారారు: పొన్నాల లక్ష్మయ్య
దేశంలో 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు ఎగుమతి చేసిన ఘనత కాంగ్రెస్‎దేనని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఓ ప్రకటనలో అన్నారు. అధికారుల నిర్లక్ష్యంతో తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం కేసీఆర్ పంజాబ్ రైతులకు నష్టపరిహారం చెల్లించడానికి అక్కడికి వెళ్లారని పొన్నాల ఎద్దేవా చేశారు. తేమ శాతం,తాలు, తరుగు పేరుతో ధాన్యం కొనుగోలు చేసి ట్రాక్ షీట్లు ఇవ్వకుండా రైతులను అధికారులు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. 17 లక్షల మంది కౌలు రైతులకు పంట నష్టం, పెట్టుబడి సహాయం అందడం లేదన్నారు. తెలంగాణలో కౌలు రైతులకు సీఎం కేసీఆర్ రైతుబంధు ఇవ్వకుండా రైతుల పాలిట యముడిగా మారారని విమర్శించారు.

*వర్సిటీల్లో బోధనా పోస్టులు భర్తీ చేయాలి: షర్మిల
రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1869 బోధనా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైఎ్‌సఆర్టీపీ అధినేత్రి షర్మిల డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఈ పోస్టులను భర్తీ చేసే వరకూ తమ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. యూనివర్సిటీల్లోకి సీఎం కేసీఆర్‌ను అడుగు పెట్టనివ్వలేదని చెప్పి వాటిని ఆయన భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. చదువుకుంటే ఉద్యోగాలు అడుగుతారన్న ఉద్దేశంలో వర్సిటీను ఆగం పట్టించే కార్యక్రమం చేపట్టారని సోమవారం ఓ ప్రకటనలో ఆమె ఆరోపించారు.

*కేసీఆర్ సూచనలు తూచా తప్పకుండా పాటిస్తా: వద్దిరాజు రవిచంద్ర
తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ సూచనలు రాజ్యసభలో తూచా తప్పకుండా పాటిస్తానని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. టీఆర్ఎస్ తరపున ఆయనను సీఎం కేసీఆర్ రాజ్యసభ సభ్యుడిగా ఖరారు చేశారు. దీంతో సీఎం కేసీఆర్‎కు వద్దిరాజు రవిచంద్ర ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ తనకు చాలా పెద్ద గౌరవం ఇచ్చారని చెప్పారు. బీసీ సంఘాల జేఏసీ కమిటీల తరపున కూడా సీఎం కేసీఆర్‌కు తాను ధన్యవాదాలు చెబుతున్నానన్నారు.

*మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడిని జైలుకు పంపిస్తాం: రేవంత్ రెడ్డి
మంత్రి మల్లారెడ్డి పై పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడిని జైలుకు పంపిస్తామని ఆయన హెచ్చరించారు. గుండ్లపోచంపల్లిలో పార్క్‌ను తొలగించి రోడ్లు వేశారని మండిపడ్డారు. రెవెన్యూ చట్టాన్ని అడ్డుపెట్టుకుని వందలాది ఎకరాలు మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డిని జైల్లో వేస్తామన్నారు. మల్లారెడ్డి అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్‌తో విచారణ జరిపిస్తామని చెప్పారు. జవహర్‌నగర్‌లో ప్రభుత్వ భూమిని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

*మహానాడుకు అడ్డంకులు సృష్టిస్తే ఖబడ్దార్‌
మహానాడు సమావేశాలకు అడ్డంకులు సృష్టించాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరగనున్న ఈ సమావేశాల ఏర్పాట్లపై సోమవారం ఆయన సంబంధిత కమిటీలతో సమీక్ష నిర్వహించారు. మహానాడు సందర్భంగా నిర్వహి స్తున్న బహిరంగ సభ కోసం చేసే జన సమీకరణకు అధికార పార్టీ నేతలు ఆటంకాలు సృష్టిస్తున్నారని, రవాణా శాఖ అధికారులను అడ్డుపెట్టుకొని ఎవరూ వాహనాలు ఇవ్వవద్దని ఒత్తిడి తెస్తున్నారని కొందరు పార్టీ నేతలు ఈ సందర్భంగా ఆయనతో చెప్పారు. ‘‘అధికారులేమీ అధికార పార్టీ నేతల ప్రైవేటు ఉద్యోగులు కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు, సమావేశాలు పెట్టుకొనే హక్కుంది. జగన్‌ రెడ్డి ఏడాదిపాటు పాదయాత్ర చేశారు. అప్పుడు మనం ఇలాగే చేశామా? అనవసరంగా మనల్ని రెచ్చగొడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వాళ్ల బస్సు యాత్రలను మన శ్రేణులు అడ్డుకోలేవా? అదే గట్టిగా చెప్పండి. అధికారులు ఎవరైనా అతి చేస్తే వారిని గుర్తు పెట్టుకొంటాం. అధికారులైనా… ప్రభుత్వంలోని వారైనా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు’’ అని ఆయన అన్నారు. అయితే అతి చేయడం లేదా అసలు పట్టించుకోకపోవడం పోలీసు శాఖలో చూస్తున్నానని, తన రాయలసీమ పర్యటనలో కనీసం బందోబస్తు కూడా చేయకుండా గాలికి వదిలేశారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినంత మాత్రాన మహానాడు ఆగదని, దానిని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. అణిచివేతకు గురవుతున్న అనేక వర్గాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెల్లుబుకుతోందని, మహానాడు సమావేశాల్లో ఈ వ్యతిరేకత ప్రభంజనం కనిపించబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘మహానాడు తెలుగుదేశం పార్టీ పండుగ అయినా ఈసారి ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. మహానాడుకు సౌకర్యాల కల్పన, వేదిక నిర్మాణం, భోజనాలు, ఇతర వసతులు సమకూర్చడంలో భాగస్వాములు అయ్యేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.

*భూ ఆక్రమణలపై త్వరలో చట్ట సవరణ: కొట్టు
రాష్ట్రంలో దేవదాయ భూముల ఆక్రమణను పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు ఎండోమెంట్‌ చట్టసవరణకు రానున్న కేబినెట్‌లో ప్రతిపాదించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రూ.5 లక్షల ఆదాయంలోపు ఉన్న దేవాలయాలకు ఒక లక్షా 58వేల ఎకరాల భూములు ఉన్నాయని, ఆక్రమణల్లో ఉన్న 2 లక్షల ఎకరాల్లో లక్ష ఎకరాలు అర్చకుల యాజమాన్యంలో ఉన్నాయని తెలిపారు. దేవాలయాల్లో అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఐజీ స్థాయి అధికారితో ఒక విజిలెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు.

*కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలి: మంత్రి ఆదిమూలపు
రాజధాని అమరావతిలోని కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆదేశించారు. ఈ పనులను సీఆర్‌డీఏ అధికారులు, వాటర్‌ రిసోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు సమన్వయంతో పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. చెత్తు సేకరణ కోసం రంగులతో కూడిన మూడు గుట్టలు ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. 1.13 కోట్లు పంపిణీ చేయగా, మిగిలిన వాటిని కూడా త్వరలోనే అందచేస్తామని పేర్కొన్నారు. 123 మున్సిపాలిటీల్లో 22 చోట్ల ఎన్నికలు నిలిచిపోయిన విషయాన్ని మంత్రి దృష్టికి అధికారులు తెచ్చారు.

*వైసీపీ మంత్రులు ఇంకా కట్టు కథలు చెబుతున్నారు: శైలజానాథ్
రాష్ట్రంలో దళితులకు రక్షణ ఇదేనా? అని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ప్రశ్నించారు. మూడేళ్లలో దళితులకు జగన్ రెడ్డి చేసిన మేలు ఏంటో చెప్పే దమ్ము, ధైర్మం ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ మంత్రులు ఇప్పుడు ఏమంటారు? అని ఆయన ప్రశ్నించారు. దళిత ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులకు కొమ్ముకాయడం మాని బాధితులకు అండగా నిలవాలని సూచించారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే నిర్భీతిగా హత్యలు చేస్తుంటే దళిత మంత్రులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నా వైసీపీ మంత్రులు ఇంకా కట్టు కథలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు.

*మంత్రి బొత్సకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సవాల్మం
త్రి బొత్స సత్యనారాయణకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సవాల్ విసిరారు. నేడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీని అభివృద్ధి చేసింది కేంద్రమేనని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు వస్తారా? అని సవాల్ విసిరారు. ఏపీలో వైసీపీ సర్కార్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. వైసీపీ ప్రభుత్వం.. దోపిడీ ప్రభుత్వమని సోము వీర్రాజు పేర్కొన్నారు. రేషన్ బియ్యంలో ఏపీ రూ.2 పెడితే.. కేంద్రం వాటా రూ.30 అని తెలిపారు. రేషన్ పంపిణీ వాహనాలపై జగన్ ఫొటో ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల 40 ఏళ్ల కల విశాఖ రైల్వే జోన్ అని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్ కల నెరవేర్చిందని ప్రధాని మోదీ అని సోము వీర్రాజు తెలిపారు.

*ఆర్‌ కృష్ణయ్య ఎంపికపై మంత్రి బొత్స వ్యాఖ్యలు
ఆర్‌ కృష్ణయ్య ఎంపికపై మంత్రి బొత్స వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఉన్నా ఆంధ్రా ప్రజల తరుపునే గొంతు వినిపిస్తారని ఆయన తెలిపారు. కృష్ణయ్య జాతీయ నాయకుడు కాబట్టే ఎంపిక చేశామన్నారు. సామాజిక న్యాయం తెలియజేయటానికే మంత్రుల బస్సు యాత్ర చేపట్టారని తెలిపారు. సీఎం జగన్‌ దావోస్ పర్యటనతో ఏపీకి కంపెనీలు క్యూ కట్టనున్నాయన్నారు.

*బారెడు పెంపు… మూరెడు తగ్గింపు: తులసిరెడ్డి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరు ‘బారెడు పెంపు – మూరెడు తగ్గింపు.. ఇది మోదీ కనికట్టు’ అన్నట్లుందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన ఒక ప్రకటన చేశారు. కాంగ్రెస్‌ పాలనలో కేంద్ర ఎక్సైజ్‌ సుంకం లీటరు పెట్రోల్‌ మీద రూ.9.48, డీజల్‌పై రూ.3.56గా ఉండేదన్నారు. మోదీ ప్రభుత్వం దీనిని రూ.33కు, రూ.31.83కు పెంచిందన్నారు.

*అందుకే దావోస్‌ వెళ్లారా..!: లంకా దినకర్‌
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తుంటే దానిని సీఎం తన ఘనతగా దావో్‌సలో చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని బీజేపీ నాయకుడు లంకా దినకర్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దావో్‌సకు వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తారని అనుకుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు తనవిగా ప్రచారం చేసుకోవడానికి అంత దూరం వెళ్లారా? అని ఎద్దేవా చేశారు.

*శాంతిభద్రతలు దిగజారుతున్నాయి: బీజేపీ
‘‘రాష్ట్రంలో రోజు రోజుకూ శాంతి భద్రతలు దిగజారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేరాలకు పాల్పడుతున్నా సీఎం జగన్‌లో చలనం లేదు’’ అని బీజేపీ మండిపడింది. విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధికార ప్రతినిధి చందు సాంబశివరావు సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో భూ కబ్జాలు, హత్యలు అధికార పార్టీ ప్రజాప్రతినిధులే చేస్తుంటే అంతా సవ్యంగా ఉన్నట్లు సీఎం జగన్‌ వ్యవహరించడం బాధాకరమన్నారు.