DailyDosePolitics

‘అభివృద్ధిని విస్మరించి.. దావోస్​లో ఎన్ని అవాస్తవాలు చెప్పినా ప్రయోజనం ఉండదు’

‘అభివృద్ధిని విస్మరించి.. దావోస్​లో ఎన్ని అవాస్తవాలు చెప్పినా ప్రయోజనం ఉండదు’

ముఖ్యమంత్రి జగన్​ దావోస్​ పర్యటనపై జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ తీవ్ర విమర్శలు చేశారు. దావోస్ వేదికగా సీఎం చెప్పిన విషయాలను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని పవన్‌ అన్నారు. విదేశీయులకు ఏం చెప్పినా.. నిజాలు తెలియవనే ధీమాతో ముఖ్యమంత్రి అలా మాట్లాడి ఉంటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిని విస్మరించి దావోస్​లో ఎన్ని అవాస్తవాలు చెప్పినా ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.

దావోస్ వేదికగా సీఎం జగన్ చెప్పిన విషయాలను ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఏపీలో వైద్యారోగ్య రంగం వెలిగిపోతోందని.. కొవిడ్​ సమయంలో 44సార్లు ఇంటింటి సర్వేలు చేసి వైద్య సేవలు అందించామంటూ చెప్పినవన్నీ అవాస్తవాలేనని పవన్​ అన్నారు. విదేశీయులకు ఏం చెప్పినా నిజాలు తెలియవనే ధీమాతో ముఖ్యమంత్రి అలా మాట్లాడారని విమర్శించారు. కరోనా విపత్కర సమయంలో ఆక్సిజన్ కూడా అందించలేకపోయారని జగన్​పై మండిపడ్డారు. ప్రాణవాయువు అందకే తిరుపతి రుయా ఆసుపత్రిలో 30మంది చనిపోయారన్న విషయాన్ని గుర్తుచేశారు. కరోనా మొదటి వేవ్​లో ఆస్పత్రులకు కనీసం మాస్కులు, గ్లౌజులు కూడా ఇవ్వలేకపోయారని.. ఆ విషయం గురించి ప్రశ్నించినందుకే డాక్టర్​ సుధాకర్​ను వేధించి, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని ధ్వజమెత్తారు.

‘అంబులెన్సులు లేవు. ఆస్పత్రిలో చనిపోతే కనీసం మృతదేహాన్ని తరలించే వాహనాలు లేవు. ఇక వైకాపా ప్రభుత్వం చేస్తున్న వైద్య ఆరోగ్య సేవలు ఏమిటి ? రుయా ఆసుపత్రిలో పసిబిడ్డ మృతదేహాన్ని ఓ పేద తండ్రి బైక్ మీద తీసుకువెళ్లిన ఘటన. ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు కుట్లు వేసి, కట్లు కట్టిన సంగతినీ కూడా దావోస్ వేదికగా ఎందుకు చెప్పలేదు. 2020, 2021లో ఆస్పత్రులకు భోజనం సరఫరా చేసినవారికి బిల్లులు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు మందు, ఉపకరణాలు సరఫరాకు ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఎందుకు రావడం లేదు. ఈ అంశాలను దావోస్ వేదికగా వివరిస్తే బాగుండేది’ అని పవన్​ ఎద్దేవా చేశారు.
కరోనా మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయం రూ. 11 వందల కోట్లను దారి మళ్లించారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్​డీఐ)ను ఆకర్షించడంలో విఫలమైనట్లు కేంద్రం ఇచ్చిన నివేదిక స్పష్టంగా చెబుతోందని పవన్‌ విమర్శించారు. 2021-22లో దేశానికి వచ్చిన ఎఫ్​డీఐల్లో కేవలం 0.38శాతం మాత్రమే ఏపీ సాధించగలిగిందని గుర్తుచేశారు. ఇక్కడ ఉన్న ఆర్థిక అరాచకం, పీపీఏల రద్దు, అధికార పార్టీ నేతలు పారిశ్రామికవేత్తలను ఇబ్బందిపెట్టడం, ప్రభుత్వ విధానాల మూలంగానే రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ఎవరూ ముందుకురావడం లేదని మండిపడ్డారు. కరోనాను ఎదుర్కొనేందుకే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన రూ. 1500 కోట్లు ప్రత్యేక నిధులు, ఎంతోమంది దాతలు స్పందించి ఇచ్చిన విరాళాలను ఏ విధంగా ఖర్చు చేశారని ప్రశ్నించారు.

విశాఖ నుంచి వెళ్లిపోయిన లులూ సంస్థ.. ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెడుతోందని పవన్​ అన్నారు. ఇంకా అనేక విదేశీ సంస్థలు ఏపీకి ఇరుగుపొరుగున ఉన్న రాష్ట్రాల వైపు మొగ్గుచూపుతున్న మాట వాస్తవమని ఆక్షేపించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిని విస్మరించి ఆర్థిక అరాచకానికి పాల్పడితే.. పెట్టుబడులు ఏ విధంగా వస్తాయని ప్రశ్నించారు. వీటన్నింటిని విస్మరించి దావోస్​లో ఎన్ని అవాస్తవాలు చెప్పినా ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు.