DailyDose

FLASH: కోనసీమ జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన.. అమలాపురంలో ఉద్రిక్తత

FLASH: కోనసీమ జిల్లా పేరు మార్చవద్దని ఆందోళన.. అమలాపురంలో ఉద్రిక్తత

అమలాపురం రణరంగంగా మారింది. కోనసీమ జిల్లా పేరు మార్చవద్దంటూ గడియారం స్తంభం సెంటర్‌ వద్ద కోనసీమ జిల్లా సాధన సమితి చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులు అన్నివైపుల నుంచి అమలాపురంలోకి వచ్చారు. బస్టాండ్, ముమ్మిడివరం వైపు నుంచి.. ప్రదర్శనగా గడియారం స్తంభం వద్దకు చేరుకున్నారు. పోలీసులు వారిని అక్కడ నియంత్రించేందుకు యత్నించారు. ఓ దశలో లాఠీలతో చెదరగొట్టారు. ఆందోళనకారులను పోలీసులు వెంబడించారు. కొంతమంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకుని యువకులు.. కలెక్టరేట్ వైపు పరుగులు తీశారు. కలెక్టరేట్ వద్ద ఆందోళనకారులు బస్సును దగ్ధం చేయడంతో పాటు కలెక్టరేట్‌ వద్ద మరో బస్సును ధ్వంసం చేశారు.అమలాపురం ఆస్పత్రి వద్ద పోలీసు జీపుపై, పోలీసులపై ఆందోళనకారుడు రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆందోళనకారులను తరలిస్తున్న రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడి నుంచి ఎస్పీ సుబ్బారెడ్డి త్రుటిలో తప్పించుకున్నారు. రాళ్ల దాడిలో పలువురు పోలీసులు, యువకులకు గాయాలయ్యాయి. అమలాపురంలో ఎస్పీ సుబ్బారెడ్డి క్షేత్రస్థాయిలో బందోబస్తు నిర్వహించారు. ఆందోళనకారులను ఎస్పీ సుబ్బారెడ్డి చెదరగొట్టారు. నల్ల వంతెన వద్ద ఆందోళనకారులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. మరోవైపు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్తున్న నిరసనకారులను పోలీసులు నిలువరిస్తున్నారు.