NRI-NRT

ద్వైపాక్షిక చ‌ర్చ‌ల్లో పాల్గొన్న మోదీ, బైడెన్

ద్వైపాక్షిక చ‌ర్చ‌ల్లో పాల్గొన్న మోదీ, బైడెన్

జ‌పాన్‌లో క్వాడ్ స‌మావేశాలు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ ప్ర‌ధాని మోదీ, అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ ద్వైపాక్షిక చ‌ర్చ‌ల్లో పాల్గొన్నారు. వ్యాక్సిన్ ఉత్ప‌త్తి అంశంలో భార‌త్‌కు అమెరికా డెవ‌ల‌ప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ స‌హ‌క‌రిస్తోంద‌ని, దీనిపై అగ్రిమెంట్ కుదిరిన‌ట్లు బైడెన్ తెలిపారు. ఇండో యూఎస్ వ్యాక్సిన్ యాక్ష‌న్ ప్రోగ్రామ్‌ను పున‌ర్ ప‌రిశీలిస్తున్నామ‌ని ఆయ‌న అన్నారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడికి వెళ్లిన అంశాన్ని చ‌ర్చించామ‌ని, ఆ యుద్ధం వ‌ల్ల ప్ర‌పంచంపై ప్ర‌భావితం చూపుతున్న అంశాల‌ను చ‌ర్చించామ‌ని, ఆ నెగ‌టివ్ ప్ర‌భావాల‌ను ప‌రిష్క‌రించేందుకు రెండు దేశాలు కార్యాచ‌ర‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు బైడెన్ తెలిపారు. మ‌న రెండు దేశాలు క‌లిసిక‌ట్టుగా ఎంతో చేయ‌గ‌ల‌వ‌ని, ఇండో యూఎస్ భాగ‌స్వామ్యాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తాన‌ని బైడెన్ అన్నారు.

కీల‌క‌మైన క్వాడ్ స‌ద‌స్సులో పాల్గొన్నామ‌ని, పాజిటివ్ ఉద్దేశంతో ఆ భేటీ సాగింద‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. భార‌త్‌, అమెరికా మ‌ధ్య భాగ‌స్వామ్యం స‌రైన దిశ‌లో ఉంద‌ని, అది న‌మ్మ‌క‌మైన బంధంగా మారింద‌న్నారు. ఈ బంధం వ‌ల్ల రెండు దేశాల మ‌ధ్య విలువ‌లు మ‌రింత బ‌ల‌ప‌డిన‌ట్లు చెప్పారు. ఇండో ప‌సిఫిక్ బంధంలో రెండు దేశాల‌కు ఒకేర‌క‌మైన అభిప్రాయాలు ఉన్నాయ‌న్నారు. ఈ చ‌ర్చ‌ల‌తో ఇండో ప‌సిఫిక్ బంధాన్ని బ‌లోపేతం చేయ‌నున్న‌ట్లు మోదీ తెలిపారు. అమెరికా, భార‌త ప్ర‌జ‌ల మ‌ధ్య బంధం, రెండు దేశాల మ‌ధ్య ఆర్థిక స‌హ‌కారం చాలా విశిష్ట‌మైన‌వ‌ని మోదీ అన్నారు. వాణిజ్య‌, పెట్టుబ‌డుల సంబంధాలు కూడా నిల‌క‌డ‌గా పురోగ‌మిస్తున్నాయ‌ని, కానీ మ‌న సామ‌ర్థ్యం క‌న్నా త‌క్కువ స్థాయిలో ఉన్న‌ట్లు మోదీ తెలిపారు.