Politics

కాంగ్రెస్ బేజార్ బేజార్‌.. ఐదు నెలల్లో ఐదుగురు బైబై…

కాంగ్రెస్ బేజార్ బేజార్‌.. ఐదు నెలల్లో ఐదుగురు బైబై…

కాంగ్రెస్‌లో వేగంగా వికెట్లు ప‌డిపోతున్నాయి. కీల‌క‌మైన ప్లేయ‌ర్లు ఒక్కొక్క‌రుగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. నిజానికి జీ 23 గ్రూప్ కాస్త చ‌ల్ల‌బ‌డిన త‌ర్వాత కాంగ్రెస్‌లో ఇక అస‌మ్మ‌తి, అసంతృప్తులు ఉండ‌వ‌ని అధిష్ఠానం భావించింది. కానీ.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత పార్టీ ప‌రిస్థితి చిత్ర విచిత్ర‌మైపోతోంది.చింత‌న్ శిబిర్ పెట్టి… గంట‌ల‌కు గంట‌లుగా చర్చోప‌చ‌ర్చ‌లు చేసినా.. లాభం లేక‌పోయింది. ఒక్కొక్క‌రుగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు. 5 నెల‌ల్లోనే ఐదుగురు కీల‌క నేత‌లు బైబై చెప్పేశారు. తాజాగా పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి క‌పిల్ సిబ‌ల్ తాజాగా గుడ్ బై చెప్పి, కాంగ్రెస్‌కు షాకిచ్చారు.రాహుల్ గాంధీకి అత్యంత స‌న్నిహితుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు ఝ‌ల‌క్ ఇవ్వ‌డం ప్రారంభించారు. అప్ప‌టి నుంచి వ‌రుస‌గా ఒక్కొక్క‌రుగా జితిన్ ప్ర‌సాద‌, ఆర్పీఎన్ సింగ్‌, సునీల్ ఝాక‌ర్‌, హార్థిక్ ప‌టేల్‌, క‌పిల్ సిబ‌ల్ ఇలా అంద‌రూ నిష్క్ర‌మించారు.

క‌పిల్ సిబ‌ల్ :
పేరు మోసిన లాయ‌ర్. కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. చాలా ఏళ్లుగా గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ వ‌స్తున్నారు. ఇంత ఉన్నా.. చాలా లో ప్రొఫైల్‌గా ఉంటారు. కాంగ్రెస్‌పై అసంతృప్తితో జీ 23లో చేరిపోయారు.

హార్థిక్ ప‌టేల్ :
తాజాగా కొన్ని రోజుల క్రితం గుజ‌రాత్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న హార్థిక్ ప‌టేల్ కూడా కాంగ్రెస్‌కు ఝ‌ల‌క్ ఇచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పేశారు. త‌న‌ను గుజ‌రాత్ పీసీసీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ఎంత‌సేపూ చికెన్ స్యాండ్‌విచ్‌లు తింటూ వుంటార‌ని, నేత‌ల‌ను ప‌ట్టించుకోర‌ని, ధ్వ‌జ‌మెత్తుతూ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు.

సునీల్ ఝాక‌ర్ :
పంజాబ్ సీనియ‌ర్ నేత‌. పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగారు. మాజీ సీఎం చెన్నీని విమ‌ర్శించారు. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు చేశారంటూ ఆయ‌న‌కు హైక‌మాండ్ నోటీసులు ఇచ్చింది. ఆ త‌ర్వాత ఆయ‌న పార్టీకి గుడ్‌బై చెప్పేసి, బీజేపీలో చేరిపోయారు.

అశ్వ‌నీ కుమార్ :
కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. చాలా కాలం కాంగ్రెస్‌లో ఉన్నారు. ఫిబ్ర‌వ‌రిలో పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను నేరుగా సోనియాకే పంపించారు. గౌర‌వ ప్ర‌దంగా కాంగ్రెస్ నుంచి వ‌చ్చేశా. ఇక‌పై కాంగ్రెస్ ప‌త‌నం అంచుగా ప‌య‌నిస్తుంద‌ని, దాన్ని తాను చూస్తాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఆర్పీఎన్ సింగ్ :
కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. యూపీలో కీల‌క నేత‌. రాహుల్ కోట‌రీగా ముద్ర ప‌డ్డారు. 32 సంవ‌త్స‌రాలు పార్టీలో ఉన్నా.. లాభం లేకుండా పోతోందంటూ విమర్శ‌లు చేశారు. ఇక తాను కాంగ్రెస్‌లో ఇమ‌డ‌లేన‌ని నిష్క్ర‌మించారు.

జితిన్ ప్ర‌సాద :
రాహుల్ గాంధీకి అత్యంత స‌న్నిహితుడు. యూపీలో యువ నేత‌. బ్రాహ్మ‌ణ వ‌ర్గంపై మంచి ప‌ట్టున్న నేత‌. స‌రిగ్గా యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో జితిన్ ప్ర‌సాద పార్టీకి ఝ‌ల‌క్ ఇచ్చారు. పార్టీకి గుడ్ బై చెప్పేసి, బీజేపీలో చేరిపోయారు. ప్ర‌స్తుతం యోగి కేబినెట్‌లో మంత్రిగా వున్నారు.

జ్యోతిరాదిత్య సింధియా
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కీల‌క నేత‌. రాహుల్ గాంధీ కోట‌రీ. అత్యంత స‌న్నిహితుడు. మ‌రో సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్‌తో పొస‌గ‌క… కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేశారు. ఆ త‌ర్వాత బీజేపీలో చేరారు. ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు.