DailyDose

ప్రతి పాటా నాకో సవాలు

ప్రతి పాటా నాకో సవాలు

చిన్నప్పటి నుంచీ సంగీతమంటే ఇష్టం. వర్ణాల వరకూ నేర్చుకున్నాను. కానీ చదువు కొనసాగించడం కోసం సంగీతాన్ని పక్కన పెట్టక తప్పలేదు. బిటెక్‌ పూర్తి చేసి, 2009లో బిజినెస్‌ అనలి్‌స్టగా చెన్నైలో ఉద్యోగం చేశాను. ఆ తర్వాత పెళ్లై, పాప పుట్టడంతో, ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్‌ షిఫ్ట్‌ అయిపోయాను. హైదరాబాద్‌లో మా ఇంటి దగ్గరే సరస్వతీ సంగీత నృత్య శిక్షణాలయం ఉంది. ఖాళీగానే ఉన్నాను కాబట్టి భక్తి పాటలు నేర్చుకుందామనే ఆలోచనతో దాన్లో చేరిపోయాను. కానీ అక్కడి గురువు గారు ప్రతిమ శశిధర్‌ నాతో తిరిగి వర్ణాలు సాధన చేయించడం మొదలుపెట్టారు. ఆ సమయంలో నేను రెండోసారి గర్భిణిగా ఉన్నప్పటికీ, ఆవిడతో కలిసి త్యాగరాజ ఆరాధనలూ, కచేరీలకు వెళ్లేదాన్ని. అలా ఎనిమిదో నెల వరకూ సంగీత సాధన కొనసాగించినా, ప్రసవం తర్వాత మళ్లీ సంగీతానికి రెండేళ్ల పాటు దూరమయ్యాను.

గురువు గారి ప్రోద్బలంతో…
బాబు పుట్టిన తర్వాత 2014లో గురువు గారిని తిరిగి సంప్రతించి, వర్ణాలు కొనసాగిస్తానని అడిగాను. అప్పుడావిడ, కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ సంగీతాన్ని కూడా అంతే సీరియ్‌సగా తీసుకోవాలనీ, సంగీతాన్నే వృత్తిగా ఎంచుకోవాలనీ నాకు సలహా ఇచ్చారు. అలా ఆవిడ సూచన మేరకు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి కర్నాటక సంగీతంలో సర్టిఫికెట్‌ కోర్సు పూర్తి చేశాను. తర్వాత 2021లో డిప్లొమా కూడా పూర్తి చేశాను. అప్పటి నుంచి ఇప్పటివరకూ గురువు గారితో కలిసి, తోటి కళాకారులతో కలిసి ఎన్నో కచేరీలకు హాజరయ్యాను. అలాగే సరస్వతీ సంగీత నృత్య శిక్షణాలయం తరపున మన దేశంతో పాటు, దుబాయి, అమెరికా, ఖతార్‌లో విద్యార్థులకు ఆన్‌లైన్‌ సంగీత పాఠాలు నేర్పిస్తున్నాను. ఇక మా వారు అద్దంకి నాగసూర్య ప్రకాశ్‌ వెల్స్‌ఫార్గోలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. మాకిద్దరు పిల్లలు. పాప మధురిమ 8వ తరగతి, బాబు కార్తీక్‌ ఐదో తరగతి చదువుతున్నారు.

యాంకర్‌ను కూడా…
నాకు బ్లాగ్స్‌ పోస్ట్‌ చేయడం అలవాటు. అలా నా బ్లాగ్స్‌ నచ్చి యాంకర్‌గా అవకాశాలొచ్చాయి. ‘టౌన్‌ టాకీస్‌’ అనే యూట్యూబ్‌ ఛానల్‌లో డైరెక్టర్‌ వంశీ గురించిన స్నిప్పెట్‌ ఒకటి చేశాను. ఆ వీడియో ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. గవర్నమెంట్‌ ఆఫ్‌ తెలంగాణ పేరిణి నృత్యాన్ని ఇంట్రడ్యూస్‌ చేసినప్పుడు, ఒక పండుగలా సాగిన ఆ కార్యక్రమంలో మా ఇన్‌స్టిట్యూట్‌ కళాకారులు నృత్యాన్ని ప్రదర్శిస్తే, నేను వ్యాఖ్యాతగా వ్యవహరించాను. అప్పటి నుంచి యాంకర్‌ అవకాశాలు పెరిగాయి. ప్రసాద్స్‌లో ప్రీమియర్‌ షోలకూ, ఈనాడు లైవ్‌ ఈవెంట్స్‌, క్లయింట్‌ రిలేటెడ్‌ ఈవెంట్స్‌కు కూడా పని చేశాను. అలాగే యాంకరింగ్‌ వర్క్‌షాప్స్‌ కూడా నిర్వహించాను. అలాగే భక్తి టివిలో కూడా సంగీత కచేరీలు చేశాను. ఎన్‌టిఆర్‌ స్టేడియంలో కోటిదీపోవత్సవంలో పాల్గొన్నాను. ఇటీవలే హరేకృష్ణ గోల్డెన్‌ టెంపుల్‌లో జరిగే బ్రహ్మోత్సవాల్లో కచేరీ ఇచ్చాను.

తిరుమలలో…
నాద నీరాజనంనాద నీరాజనంలో పాల్గొనాలంటే పూర్వ కచేరీ అనుభవం కలిగి ఉండాలి. స్వరం, సృతి బాగుండాలి. లైవ్‌ ఈవెంట్‌ కాబట్టి పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదు. ఇలా ఆ అర్హతలన్నీ ఉన్నవాళ్లు నాద నీరాజనానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలా ఎస్‌వీబీసీ అనుమతితో తిరుమలలో నాదనీరాజనంలో గురువు గారితో కలిసి పాల్గొన్నాను. నాదం ద్వారా నీరాజనం అర్పించే నాదనీరాజనంలో పాల్గొనడం మరిచిపోలేని అనుభవం. ఎస్‌వీబీసీ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారమయ్యే ఆ కార్యక్రమం గంటన్నర పాటు సాగుతుంది. అలాగే దిండిగల్‌లోని సచిదానంద స్వామి ఆశ్రమంలో పాటలు పాడాను. చిన జీయర్‌ ఆశ్రమంలో స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ ఇనాగరేషన్‌ సమయంలో కూడా పాటలు పాడాను. అయితే రామానుజాచార్య పాటలే పాడాలని చెప్పడంతో ఆ పాటల గురించి తెలుసుకుని, నేర్చుకుని పాడి వచ్చాను.

పొరపాట్లకు ఆస్కారం లేదు…
కచేరీలో పొరపాట్లకు ఆస్కారం ఉండకూడదు. పాటలు ఎంత బాగా రిహార్సల్‌ చేసినా, ఆర్కెస్ర్టాతో కలిసి రిహార్సల్‌ చేయడానికి అన్నిసార్లూ వీలుపడదు. కొందరు ఆర్కెస్ట్రా వాళ్లు రిహార్సల్‌కు రాకుండా, నేరుగా ప్రోగ్రామ్‌కే వచ్చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఒకేసారి ప్రదర్శనలో ఆర్కెస్ర్టాతో కలిసి పాడే సమయంలో, తాళం తప్పకుండా పాడడం ఒక సవాలుగానే ఉంటుంది. అయినా తప్పుల్లేకుండా, గురువుగారికి చెడ్డ పేరు రాకుండా, ఒళ్లు దగ్గర పెట్టుకుని పాడవలసి ఉంటుంది. ఇలా గుంపులో పాడినా, సోలోగా పాడినా ప్రతి పాటా నాకో సవాలులాంటిదే!