NRI-NRT

అమెరికాలో మన మధుబని

అమెరికాలో మన మధుబని

అమెరికాలోని న్యూయార్క్‌ నగరం. ఓ బస్‌ షెల్టర్‌. అక్కడికి వచ్చిన వారంతా తాము ఎక్కాల్సిన బస్సు ఎక్కకుండా.. బస్‌ షెల్టర్‌లో ఉన్న ఓ కళాఖండాన్ని చూస్తూ ఉండిపోతున్నారు. కరోనా విలయాన్ని కళాత్మకంగా ప్రదర్శించింది ఎవరా అని ఆరాలు తీస్తున్నారు. ఆ కళాకారిణి పేరు పుష్పకుమారి. బిహార్‌కు చెందిన 53 ఏండ్ల పుష్ప.. మిథిల (మధుబని – Madhubani art) చిత్రకళలో నిపుణురాలు. ఆ పురాతన కళను నేటి ప్రపంచానికి కొత్తగా పరిచయం చేస్తున్నది. భారతీయ సంప్రదాయాలను, జానపదుల సంస్కృతిని తన బొమ్మలలో అద్భుతంగా ఆవిష్కరిస్తున్నది. ఇప్పుడు పుష్ప గీసిన చిత్రాలు అంతర్జాతీయ నగరాల్లో మధుబని కళ గొప్పదనాన్ని చాటుతున్నాయి. అమెరికాకు చెందిన ‘గ్లోబల్‌ పొజిషనింగ్‌’ అనే పబ్లిక్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 20 కళాఖండాలను ఎంపిక చేసింది. అందులో పుష్పకుమారి గీసిన ‘వసుధైక కుటుంబం’ ఆర్ట్‌ కూడా ఉంది. ఈ ఘనతను సాధించిన ఏకైక భారతీయురాలు ఆమే. కరోనా బీభత్సం, వ్యాక్సిన్‌ రూపంలో దొరికిన ఉపశమనం, లాక్‌డౌన్‌ సడలింపులకు తనదైన రీతిలో రూపం ఇచ్చింది. పుష్ప గీసిన ఆ కళాఖండం అమెరికాలోని న్యూయార్క్‌, బోస్టన్‌, చికాగో నగరాల్లోని బస్‌షెల్టర్లలో ప్రదర్శనకు ఉంచారు. అక్కడికి వచ్చినవారంతా ఆ కళా విన్యాసాన్ని చూసి ‘అద్భుతః’ అని మెచ్చుకుంటున్నారు. పుష్ప మాత్రం అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నది.