Devotional

జాపాలి తీర్థం @ తిరుమల

జాపాలి తీర్థం   @ తిరుమల

హనుమంతుడు పుట్టి పెరిగిన ప్రదేశం మన తిరుమల శేషాచల కొండలలో అంజనాద్రి పైన జపాలీ తీర్థం.
తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలలో జాపాలి తీర్థం ఒకటి.ఇక్కడ వెలసిన హనుమంతుడు కి చాలా పురాణ ప్రాముఖ్యత కల్గిన చరిత్ర ఉంది. ఈ ప్రదేశం లో ఎందరో మహాత్ములు, యోగులు, సాధువులు సిద్ధి పొంది తరించారు. దేవతలు నడయాడిన ప్రదేశం ఈ జాపాలి. సాక్షాత్తు హనుమంతుడి కోసం తల్లి అంజనాదేవి తప్పస్సు చేసిన పవిత్ర ప్రదేశం. కేవలం దర్శనమాత్రముచే పంచమహా పాతకములు, భూత,ప్రేత పిశాచాది బాధలు నుండి విముక్తులవుతారని స్కాందపురాణం లోని వేంకటాచలమహత్యంలో తెలుపబడినది.
284096528-5327509143977800-2606995981790033707-n
జాపాలి_తీర్థం :
దట్టమైన అటవీ ప్రాంతంలో, ఏపుగా పెరిగిన వృక్ష సంపదతో, చుట్టూ చక్కటి జలపాతాలతో,దివ్య తీర్థలిలతో,పక్షుల కిలకిలారావాలతో,బెట్లుడుతల ఉయ్యాలాటలతో,దివ్య సుగంధాలతో,ఔషధీ మూలికల సంపదతో,కారణ జన్ముల కర,పాద స్పర్శతో తిరుమలకు వాయవ్యంగా సుమారు 5కి.మీ దూరంలో పాపవినాశం పోయే దారిలోఉన్నఒక సుందర చరిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం,ప్రసిద్ధ హనుమత్ క్షేత్రం.
284120897-5327508527311195-6645501522090819685-n
ఈ తీర్థ మహిమ వరాహ,స్కాంధ పురాణాలలో వర్ణితం.33కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహా విష్ణువు,రామావతారం దాల్చినప్పుడు, రుద్రుడు శ్రీరామదూతగా అన్ని శక్తులతో,దేవతలందరితో కలిసి వానర రూపంలో అవతరించుటకు నిశ్చయించుకొనెను.అప్పుడు జాపాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం గావించుకొనుటకు ఎన్నో ప్రదేశాలలో తపస్సు చేసుకుంటూ కడకు శ్రీ వేంకటాచలంలో అనగా తిరుమలలో జప,హోమాలు చేయసాగెను.అతని భక్తికి మెచ్చి భగవంతుడు తనయొక్క రాబోవు హనుమంతుని రూపాన్ని(ప్రస్తుతమున్న సింధూరకవచంలేని రూపాన్ని) స్వయంభువుగా అవతరించి చూపించెను.జపంవల్ల అవతరించినందున ఈ స్థలం ‘జాపాలి’ అయింది.అప్పుడు అన్ని తీర్థరాజములు వచ్చి చేరినందున జాపాలి తీర్థం అని పేర్కొనబడుచున్నది. ఇక్కడికి అతి సమీపంలో ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారానకు సంకల్పించినది.హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతంగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లున్నది.అలా మారిన శేషగిరిపై శ్రీ వేంకటేశ్వరస్వామి తన అభయ హస్తములతో చరణదాసుడైన హనుమంతుని చూపుతున్నట్లుగా అర్చావతారంగా నిలిచాడు.
284213901-5327508610644520-5715133670364362074-n
అయోధ్యకాండలో జాపాలి ఋషి తనయొక్క ధర్మవిరుద్ధమైన మాటలకు వాక్కుదోషాన్ని మూటగట్టుకొని, జపాలి తీర్థములో తపస్సుచేసి రామగుండములో స్నానమాచరించి వాక్కుదోష విముక్తుడయ్యెను.శ్రీరామచంద్రుడు రావణుని సంహరించి అయోధ్య వెడుతూ సీతాసమేతంగా ఈ తీర్థములోనే స్నానమాచరించెను.అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థం రామగుండంగా ,సీతామాత స్నానం చేసిన తీర్థం సీతాగుండమనే పేర్లతో అలరారుతున్నాయి. భక్త ధ్రువుడు మొట్టమొదట ఇచ్చోటనే తపమాచరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధ్రువతారయై వెలుగొందుతున్నాడు. ఇందుకు ప్రతీకగా నేటికీ ధ్రువతార అనేక ఔషధ గుణములతో నిరంతరాయంగా ప్రవహించుచూ ధ్రువతీర్థమనే పేరుతో ప్రసిద్ధి పొందింది. ఈ నీటిని ఆంజనేయస్వామి నిత్య కైంకర్యాలకు వాడటం జరుగుచున్నది. పంచమహాపాతకములు,భూతప్రేత పిశాచాది బాధలు,బ్రాహ్మణత్వం కోల్పోయినవారు,బ్రహ్మరాక్షసి పట్టినవారు ఈ తీర్థములో స్నానమాచరించడం వల్ల కష్టాలు తీరుతాయని స్కాంధ పురాణంలోని వేంకటాచల మహాత్మ్యములో చెప్పబడినది.
284066347-5327508423977872-7663071824184236119-n
ఎటువంటి కష్టమైనా స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తప్పక కష్టాలు తీరుతాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న సత్యం.జన్మ శనిగలవారు వారి పుట్టిన రోజున స్వామివారికి పూజ మరియు అభిషేకం చేస్తే శనిగ్రహం వల్ల కలిగే అనేకానేక విపత్తులు కలుగవు.శ్రీశ్రీశ్రీ హథీరాంజీ బావాజీవారు ఇక్కడే తిరుగుతూ తపస్సు చేసుకుంటూ బాలాజీ కృపకు పాత్రులయ్యారు. ప్రస్తుతం ఈ స్థలం మహంతు శ్రీశ్రీశ్రీ 1008 అర్జునదాసుగారి పర్యవేక్షణలో ఉన్నది. పూజారి 108 శ్రీ రామదాసు బాలాజీ(88 సంవత్సరములు) ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి విచ్చేసి సరైన దారులు, వసతులు లేని సమయం నుంచి శ్రీ జపాలి ఆంజనేయున్ని కొలుస్తూ ఆంజనేయస్వామి ప్రభావాన్ని భక్తులకు తెలియజేస్తూ సేవ చేస్తున్నారు. ఈ చోటు ఎందరో మహాత్ములు,సాధువులు,యోగులు సిద్ధిపొందిన చోటు.దేవతలు నడయాడిన చోటు. ఇంకా ఎన్నో లీలావిశేషాలకు, అశోకవనంలో ఆంజనేయుడు సీతమ్మ వారిని సంతోషపరచినట్లు ఎందరో జీవితాలలో ఆనందాన్ని నింపుతున్న చోటు. నేడు ఎంతోమంది ఉన్నత స్థానములలో ఉన్న చాలా మంది ఈ స్వామి భక్తులే. వారి జాబితాకు అంతే లేదు.జాపాలి తీర్థమందు జై సీతారామ్ నామాన్ని స్మరించండి. మనస్సును స్వామియందే లగ్నం చేయండి. జపాలి ప్రకృతిని వీక్షించండి. నిశ్శబ్దం వల్లే ఇది సాధ్యం. జపాలి పర్యావరణాన్నిపరిరక్షించండి. సాధువుల ఆశీర్వాదాన్ని పొందండి.
282564408-5327509370644444-4097479101598828865-n