Politics

తెలంగాణలో అడుగుపెట్టగానే ఆ విషయం అర్థమైంది

తెలంగాణలో అడుగుపెట్టగానే ఆ విషయం అర్థమైంది

తెలంగాణ గడ్డపై అడుగుపెట్టగానే ఇక్కడి గాలి కాషాయంవైపే వీస్తోందనే విషయం అర్థమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడి ప్రజల్లో మార్పు మొదలైందని తెలిపారు. తెలంగాణ గడ్డపై భాజపా జెండా ఎగరడం ఖాయమనిపిస్తోందని చెప్పారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత సభలో మోదీ ప్రసంగించారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన షురూ అయింది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా ఓసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం తరఫున సీఎస్ సోమేశ్ కుమార్‌ మోదీని ఆహ్వానించారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా భాజపా నేతలు బేగంపేట ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మోదీ.. భాజపా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘పట్టుదలకు, పౌరుషానికి మారుపేరైన తెలంగాణ ప్రజలకు నమస్కారం’ అంటూ ప్రధాని మోదీ ప్రసంగం మొదలుపెట్టారు. తాను ఎప్పుడు తెలంగాణకు వచ్చిన ఇక్కడి ప్రజలు తనకు అపూర్వ స్వాగతం పలికారని మోదీ అన్నారు. తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత ఎండలోనూ తనకు స్వాగతం పలకడానికి వచ్చిన కాషాయ శ్రేణులకు మోదీ ధన్యవాదాలు చెప్పారు.

“భారత దేశ ఐక్యత కోసం సర్దార్‌ పటేల్‌ ఎంతో కృషి చేశారు. టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ ఎదుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో వేల మంది అమరులయ్యారు. ఒక ఆశయం కోసం వేల మంది ప్రాణత్యాగాలు చేశారు. అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరటం లేదు. ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యింది. నిరంకుశ తెలంగాణలో ఎవరి ఆశయాలు నెరవేరటం లేదు. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష.”- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

తెలంగాణలో మార్పు మొదలైందనే విషయం ఇక్కడి భూమ్మీద అడుగు పెట్టగానే అర్థమైందని మోదీ అన్నారు. తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం పక్కా అని ధీమావ్యక్తం చేశారు. కుటుంబ పాలనలో బంధీ అయిన తెలంగాణ తల్లికి విముక్తి కలిగిస్తామని చెప్పారు. కుటుంబ పార్టీలను తరిమిస్తేనే.. రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత పోరాటమైనా చేస్తామని స్పష్టం చేశారు.