Politics

వచ్చే నెల్లో కాంగ్రెస్‌ ఎన్నికల టీమ్‌

వచ్చే నెల్లో కాంగ్రెస్‌ ఎన్నికల టీమ్‌

వచ్చే నెలాఖరులో కాంగ్రెస్‌ పార్టీ పదవుల పందేరాన్ని చేపట్టబోతోందనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డిని నియమించి ఏడాది పూర్తవుతుండడం, అసెంబ్లీ ఎన్నికలకు కూడా మరో ఏడాది సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో టీపీసీసీ కార్యవర్గాన్ని నియమించనున్నట్టు తెలుస్తోంది.

వరంగల్‌ డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ఈనెల 21 నుంచి వచ్చే నెల 21 వరకు పల్లె పల్లెకు కాంగ్రెస్‌ పేరుతో నిర్వహిస్తోన్న రైతు రచ్చబండ కార్యక్రమం ముగిసిన వెంటనే రేవంత్‌ ఈ నియామకాలపై దృష్టి పెట్టనున్నారు. అందులో భాగంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యుల నియామకం, పనితీరు సరిగా లేని జిల్లా పార్టీ అధ్యక్షుల మార్పుతో పాటు పార్టీ అనుబంధ సంఘాలకు పూర్తి స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేయనున్నారు.ఈ మేరకు ఇప్పటికే కొంత కసరత్తు చేసిన రేవంత్‌ పక్కాగా ఎన్నికల టీమ్‌ను ప్రక టించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. జూన్‌ నెలాఖరు కల్లా పదవుల పందేరాన్ని పూర్తి చేసిన తర్వాత రాష్ట్రంలో బస్సు, పాదయాత్రలపై దృష్టి సారించనున్నట్టు సమాచారం.

క్రియాశీలకంగా వ్యవహరించే వారికే..
పార్టీ పదవుల విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించడంతో పాటు ఎన్నికల సమయంలో క్రియాశీలకంగా వ్యవహరించగలిగిన నాయకులకే అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో పీసీసీ అధ్యక్షుడు ఉన్నట్లు సమాచారం. ప్రజలను కచ్చితంగా ప్రభావితం చేయగల నాయకులకే పార్టీ పదవులు ఇవ్వాలని, గతంలో ఉన్న మూస విధానానికి స్వస్తి పలకాలని ఆయన భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎన్నికలకు సరిగ్గా ఉపయోగపడే టీంను ఆయన నియమిస్తారని, జిల్లా పార్టీ అధ్యక్షుల మార్పు కూడా ఉంటుందని చెబుతున్నారు. అనుబంధ సంఘాల కార్యవర్గంలో కూడా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా ఉన్న వారికే అవకాశం ఇచ్చే దిశలో రేవంత్‌ ఇప్పటికే కసరత్తు పూర్తి చేశారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించి, పీఏసీ ఆమోదం తీసుకున్న అనంతరం ఈ జాబితాలను ఏఐసీసీకి పంపి ఆమోద ముద్ర వేయించుకుంటారని, ఈ ప్రక్రియ అంతా జూన్‌ నెలాఖరుకు పూర్తవుతుందని తెలుస్తోంది.