NRI-NRT

కేటీఆర్ యూకే, దావోస్ ప‌ర్య‌ట‌న‌.. తెలంగాణకు రూ. 4,200 కోట్ల పెట్టుబ‌డులు

కేటీఆర్ యూకే, దావోస్ ప‌ర్య‌ట‌న‌.. తెలంగాణకు  రూ. 4,200 కోట్ల పెట్టుబ‌డులు

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగిసింది. యూకే, దావోస్‌లో ప‌ది రోజుల పాటు ప‌ర్య‌టించిన కేటీఆర్.. రాష్ట్రానికి కోట్ల విలువ చేసే పెట్టుబ‌డుల‌ను తీసుకొచ్చారు. యూకే, దావోస్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా 45 వాణిజ్య‌, 4 రౌండ్ టేబుల్, 4 ప్యానెల్ స‌మావేశాల్లో పాల్గొన్న‌ట్లు కేటీఆర్ ప్ర‌క‌టించారు. రూ. 4,200 కోట్ల‌కు పైగా పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్ పేజీలో వెల్ల‌డించారు. యూకే, దావోస్ ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతం అయ్యేందుకు కృషి చేసిన త‌న బృందానికి కేటీఆర్ ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఈ నెల 18 నుంచి 22 వరకు ఆయన లండన్‌ పర్యటన సాగింది. లండన్‌లో భారత హైకమిషన్‌ సమావేశంతోపాటు ప్రవాస భారతీయులు, యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. పలు ప్రతిష్ఠాత్మక సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) సదస్సు కోసం మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ మే 22న సాయంత్రం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌ నగరానికి చేరుకున్నారు. ఆ సదస్సులో వివిధ దేశాల రాజకీయ, అధికార, వ్యాపార ప్రముఖులతో సమావేశం అయ్యారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ ద్వారా సామాన్యులకు మెరుగైన సేవలు అన్న అంశంపై ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో కేటీఆర్‌ ప్రసంగించారు. ప‌లు అంత‌ర్జాతీయ కంపెనీల‌తో కేటీఆర్ స‌మావేశ‌మై తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు ఉన్న అవ‌కాశాల‌ను వివ‌రించారు.