DailyDose

తెలంగాణను చూసి ఓర్వలేని కేంద్రం – TNI తాజా వార్తలు

తెలంగాణను చూసి ఓర్వలేని కేంద్రం  –  TNI  తాజా వార్తలు

*70 ఏళ్లలో బీజేపీ, కాంగ్రెస్ చేయనిది.. 7 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం మెదక్ జిల్లా మనోహరబాద్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించి.. లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ.. గీతారెడ్డి మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో తాగడానికి మంచి నీళ్లు కూడా లేవు అని చెప్పారు. కేసీఆర్ వచ్చాక తాగు, సాగు నీళ్ల కొరత లేదు, కరెంట్ కొరత లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతారు. 70 ఏళ్లల్లో రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేక పోయారని మండిపడ్డారు. ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి మోదీ వచ్చి రాష్ట్రం గురించి ఒక్క మాట అయినా చెప్పారా.. రాష్ట్రం కోసం ఏమైనా మాట్లాడారా.. అని నిలదీశారు.

* ముందస్తు అంచనా ప్రకారం మరో 48 గంటల్లో(శుక్రవారం) నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. నాలుగైదు రోజుల నుంచి కేరళ పరిసరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న ఐదు రోజుల వరకు కేరళ, లక్షద్వీప్‌లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, ఈ నేపథ్యంలో 27కల్లా కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ అధికారి ఒకరు తెలిపారు. రానున్న 48 గంటల్లో నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రం, మాల్దీవులు, కామరూన్‌ ప్రాంతం, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వివరించారు. ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. కేరళలోకి 27 నాటికి రుతుపవనాలు ప్రవేశించినా ముందుకు పురోగమించడానికి మరికొద్ది రోజుల సమయం పట్టవచ్చునని కొందరు నిపుణులు అంచనావేశారు.

*ఓ మహిళ కడుపు నుంచి 74 రాళ్లను తొలగించారు. బోయిన్‌పల్లికి చెందిన ఓ మహిళ(44) కడుపునొప్పితో బాధపడుతూ బోయిన్‌పల్లిలోని వీఆర్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయింది. ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ నందకిషోర్‌, డాక్టర్‌ భరత్‌ కుమార్‌తో పాటు వైద్యుల బృందం గురువారం ఆమెకు శస్త్ర చికిత్స చేసి కడుపులోని గాల్‌బ్లాడర్‌లో ఉన్న 74 చిన్నరాళ్లను తొలగించారు. ఒక్కొక్క రాయి రెండు గ్రాములు ఉంటుందని వైద్యులు తెలిపారు. ఆరోగ్యం మెరుగుకావడంతో ఆమెను డిశ్చార్జి చేశారు.

*నాగార్జున సాగర్‌ స్పిల్‌వేతో పాటు బకెట్‌ పోర్షన్‌లో మరమ్మతుల కోసం సర్కారు రూ.16.54 కోట్లను మంజూరు చేసింది. టెండర్లు పిలుస్తూ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. జూన్‌ 1వ తేదీలోపు టెండర్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. జూన్‌ రెండో వారం కల్లా టెండర్లు ఖరారు చేస్తే పనుల పూర్తికి రెండున్నర నెలల సమయం సరిపోతుందని భావిస్తున్నారు.

*గోధుమల ఎగుమతులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, దీని వల్ల ఉత్పత్తిదారులు రూ.80 వేల కోట్లు నష్టపోయారని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్‌ నారాయణ అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఇండియన్‌ బ్యాంక్‌ రిటైర్డ్‌ అసోసియేషన్‌ ద్వైవార్షిక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అనేక రాష్ట్రాలు విచక్షణారహితంగా అప్పులు తీసుకుంటున్నాయని ఆరోపించారు. రాష్ట్రాలు రుణాలు తీసుకోవాలంటే భారత ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఓట్ల కోసం ఉచిత తాయిలాలివ్వడం సరికాదని, దేశంలో ఇదే కొనసాగితే శ్రీలంక పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇండియన్‌ బ్యాంకులో పదవీ విరమణ చేసిన 300 మంది ఉద్యోగుల పెన్షన్‌ అప్‌డేట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

*గతేడాది యాసంగి సీజన్‌కు సంబంధించిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) డెలివరీ గడువును మరో నెల రోజులు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ గురువారం లేఖ రాసింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినా రైస్‌మిల్లర్లు సకాలంలో ఎఫ్‌సీఐకి బియ్యం డెలివరీ ఇవ్వలేదు. దీంతో మరో ప్రయత్నంగా పౌరసరఫరాల సంస్థ లేఖ రాసింది. ఈనెలాఖరునాటికి డెలివరీ చేయలేమని, జూన్‌ నెలాఖరు వరకు సీఎంఆర్‌ టార్గెట్‌ పూర్తి చేస్తామని లేఖలో విజ్ఞప్తి చేశారు.

*ఒడిసా రాజధాని భువనేశ్వర్‌లో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం ఉదయం శాస్ర్తోక్తంగా మహాసంప్రోక్షణ జరిగింది. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర, స్థానిక సలహామండలి చైర్మన్‌ దుష్మంత్‌ కుమార్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తిచేసే క్రమంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మాట్లాడుతూ.. భువనేశ్వర్‌లో శ్రీవారి ఆలయం నిర్మించడంతో తిరుమలకు వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకోలేకపోయామనే నిరుత్సాహం ఇక ఎవరికీ ఉండదన్నారు.

*తిరుమల శ్రీవారికి మరోసారి హుండీ ఆదాయం భారీగా లభించింది. మంగళవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించగా రూ.5.43 కోట్లు లభించినట్టు టీటీడీ గురువారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. కరోనా తర్వాత అత్యధికంగా లభించిన హుండీ ఆదాయం ఇదే. శ్రీవారిని బుఽధవారం 76,148 మంది భక్తులు దర్శించుకున్నారని, 39,208మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

*రాష్ట్రంలో ఏ ప్రైవేటు ఎయిడెడ్‌ కళాశాలలోనైనా మిగులు ఉపాధ్యాయ పోస్టులుంటే… వారిని మరో ఎయిడెడ్‌ కళాశాలకు కాని, ప్రభుత్వ పాఠశాలలకు కానీ బదిలీ చేస్తారు. అదే విధంగా ఏ ప్రైవేటు ఎయిడెడ్‌ పాఠశాల అయినా రెండేళ్లపాటు వరుసగా నిర్ణీత సంఖ్యలో విద్యార్థులు లేక, ఇతర కారణాలతో మూతపడే పరిస్థితి వస్తే… అందులోని ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేయాలి. ఎయిడెడ్‌ పాఠశాలలను ఆస్తులతో ప్రభుత్వానికి అప్పచెప్పడం, లేకుంటే ఆస్తుల్లేకుండా ఎయిడెడ్‌ సిబ్బందిని మాత్రమే అప్పచెప్తే… ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం గెజిట్‌ విడుదల చేసింది.

*సీపీఎస్‌ రద్దు చేస్తామన్న హామీని నెరవేర్చకుండా సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతల్ని అదుపులోకి తీసుకోవడం, అరెస్టులు, కేసులు తగవని ఆంధ్రప్రదేశ్‌ కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అప్పలరాజు, పార్థసారథి అన్నారు. శ్రీకాకుళంలో మంత్రుల సామాజిక న్యాయ బస్సు యాత్ర కార్యక్రమం ముందస్తు చర్యల్లో భాగంగా ఏపీసీపీఎ్‌సఈఏ శ్రీకాకుళం జిల్లా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ వీవీ రాజుని పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని వారు ఖండించారు.

*తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత వైభవంగా జరుపుకునే పసుపు పండుగ మహానాడు మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. శుక్ర, శనివారాల్లో ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెంలో జరిగే ఈ వేడుకకు అవసరమైన అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత వారంరోజులుగా జరుగుతున్న పనులను ఇక్కడి జిల్లా నేతలతో కలిసి రాష్ట్ర నేతలు నిరంతరం పరిశీలించారు. ఎక్కడా ఇబ్బందులు ఎదురుకాకుండా ఆయా కమిటీలు తమ పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. కాగా గురువారం మధ్యాహ్నానికే పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంగోలుకు చేరుకున్నారు. నగరంలో మునుపెన్నడూ లేనివిధంగా, టీడీపీ నిర్వహించే అతిపెద్ద మహోత్సవం మహానాడు కావడంతో అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాయి.

*తాము పార్టీలో ఉన్నా ఉపయోగం లేదు. తమ రేషన్‌ కార్డును తొలగించారు. తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా కార్డు మాత్రం రాలేదని మాజీ సర్పంచ్‌ బొల్లేపల్లి ఆంజనేయులు భార్య రమణమ్మ.. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కురిచేడు మండలం పెద్దవరం సచివాలయం పరిధిలోని బయ్యవరంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను చుట్టుముట్టారు. అడుసుమల్లి నాగలక్ష్మి తన భూమి 17ఏళ్లుగా ఆన్‌లైన్‌ కాలేదని, ఎన్నిసార్లు తహసీల్దార్‌ కార్యాలయానికి తిరిగినా పరిష్కరించలేదని తెలిపింది.

*టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి పి.నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. రాజధాని కేసులో ఆయనతోపాటు రామకృష్ణ హౌసింగ్‌ డైరెక్టర్‌ కేపీవీ అంజనీకుమార్‌, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్‌ విషయంలో జూన్‌ 9 వరకు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశించింది. గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌ 9కి వాయిదా వేసింది. రాజధాని అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్మెంట్‌ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని, అవినీతి చోటు చేసుకుందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మే 9న సీఐడీ అధికారులు పలువురిపై కేసు నమోదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు నారాయణ తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నారాయణ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. సీఐడీ తరఫు న్యాయవాది టీకే చైతన్య వాదిస్తూ.. ఈ వ్యవహారంలో అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తారని తెలిపారు. అనారోగ్యంతో ఆయన హాజరు కానందున వాయిదా వేయాలని కోరారు. పిటిషనర్ల తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లను సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేసే ప్రమాదం ఉందన్నారు. సీఐడీ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. అరెస్ట్‌ చేస్తామనే ఆందోళన పిటిషనర్లకు అవసరం లేదన్నారు. ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోమని తెలిపారు.

*ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పెద్ద ఎత్తున మరణాలు సంభవించాయి. 2020 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలు, వాటి వల్ల సంభవించిన మరణాల్లో దేశంలోనే 7వ స్థానంలో ఏపీ నిలిచింది. 2016-2020 మధ్య రాష్ట్రంలో 1,16,591 రోడ్డు ప్రమాదాలు సంభవించగా, 39,180 మంది మరణించారు. ఒక్క 2020 సంవత్సరంలోనే 19,509 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, అందులో 7,039 మంది మరణించారు. కేంద్ర రహదారులు, రవాణా పరిశోధన విభాగం రూపొందించిన ‘‘భారత్‌లో రోడ్డు ప్రమాదాలు-2020’’ నివేదికను గురువారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2020లో ఓవర్‌ స్పీడ్‌ వల్ల జరిగిన ప్రమాదాల్లో అత్యధికంగా 5,227 మంది మరణించారు. దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 11.3 శాతం ఏపీలోనే సంభవించాయి

* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న ఏ-5 దేవిరెడ్డి శంకర్‌రెడ్డి కడపలో తన కుమారుడి ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వచ్చారు. కుమారుడు దేవిరెడ్డి చైతన్యకుమార్‌రెడ్డి ఏర్పాటుచేసిన శంకర్‌ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు న్యాయస్థానం శంకర్‌రెడ్డికి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనుమతిచ్చింది. ఆయనను కలుసుకోడానికి ఉదయం 10 గంటల నుంచే ఆస్పత్రి వద్దకు పులివెందులకు చెందిన వైసీపీ నేతలు, శంకర్‌రెడ్డి అనుచరులు తరలిరావడం మొదలైంది.

*సామాజిక న్యాయభేరి పేరుతో బస్సుయాత్ర చేపట్టాలని వైసీపీ నిర్ణయించడం హాస్యాస్పదమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం వేంపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బస్సుయాత్ర చేపట్టడం ద్వారా గడప గడప కార్యక్రమం పూర్తిగా వైఫల్యం చెందినట్లు ప్రభుత్వమే ఒప్పుకున్నట్లయిందన్నారు. బస్సు యాత్ర కూడా తుస్సుమనక తప్పదన్నారు. సమాజంలోని వివిధ వర్గాల మధ్య లడాయి పెడుతూ, ద్వేషభావాలు రగిలిస్తూ సామాజిక న్యాయం గురించి వైసీపీ నేతలు మాట్లాడం హాస్యాస్పదమన్నారు.

*రాజ్యాంగంపై, అంబేడ్కర్‌పై సీఎం జగన్‌కు గౌరవముంటే కడప జిల్లాకు అంబేద్కర్‌ పేరు పెట్టాలని జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ విశాఖలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాల పేర్లు మార్చడం నిరంతర ప్రక్రియ అని చెప్పారని, అందువల్లే తాము ఈ ప్రతిపాదన చేస్తున్నామన్నారు. కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని జనసేన ఎప్పుడో వినతిపత్రం ఇచ్చిందని, అటువంటి పార్టీ అల్లర్ల వెనుక ఉందని నింద వేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. కోనసీమలో జనసేన ప్రాబల్యాన్ని దెబ్బతీయడానికే అల్లర్లు సృష్టించి తమపై నెడుతున్నారని ఆరోపించారు. వైసీపీకి దళితులు, కాపులు, బీసీలు దూరమవుతున్నారని, ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు కుల చిచ్చురేపి అరాచకాలు చేస్తున్నారని ఆరోపించా రు. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పులివెందుల కేంద్రంగా భీమ్‌రావ్‌ పేరిట జిల్లాను ఏర్పాటు చేయాలని జనసేన అధికార ప్రతినిఽధి పోతిన వెంకట మహేశ్‌ విజయవాడలో డిమాండ్‌ చేశారు. అంబేడ్కర్‌ పేరును వివాదంలోకి లాగి ఆయన ఖ్యాతిని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కోనసీమలో అల్లర్లకు వైసీపీ ప్రభుత్వ నిర్ణయమేనన్నారు.

*టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో వైసీపీ సామాజిక న్యాయ బస్సు యాత్రపై చర్చించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు, టీడీపీ 40 ఏళ్ల ప్రస్థానంపైనా చర్చించారు. టీడీపీ, ఎన్టీఆర్ గొప్పతనంపై ఏడాది పాటు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. మహానాడులో 16 తీర్మానాలు ప్రవేశపెట్టాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. 12 ఏపీ, 3 తెలంగాణ, ఒకటి అండమాన్‌కు సంబంధించిన తీర్మానాన్ని మహానాడులో పెట్టనున్నారు. తీర్మానాలపై చర్చల్లో యువతకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. 9 మంది వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఒక్కరూ లేరని, 9 మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు జగన్ సహ నిందితులు ఉన్నారని, ముగ్గురు ఇతర రాష్ట్రాల వాళ్లు ఉన్నారని, ఇదెక్కడి సామాజిక న్యాయమని పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రశ్నించారు.