DailyDose

రాయదుర్గం గ్రీన్‎బావర్చి హోటల్‎లో భారీ అగ్నిప్రమాదం. – TNI నేర వార్తలు

రాయదుర్గం గ్రీన్‎బావర్చి హోటల్‎లో భారీ అగ్నిప్రమాదం. – TNI  నేర వార్తలు

*రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రీన్‌బావర్చి హోటల్‌లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హోటల్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలముకుంది.ఒక్కసారిగా హోటల్ నుంచి మంటలు ఎగిసిపడుతుండటంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. భయంతో హోటల్‌ నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

*ఓ విషపూరిత పాము కాటుకు ఆడ సింహం బలైంది. ఒడిశా భువనేశ్వర్లోని నందన్కనన్ జూ పార్క్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఓ ఎన్క్లోజర్లో ఉన్న ఆడసింహం గంగను.. శుక్రవారం కోబ్రా జాతికి చెందిన ఓ విషసర్పం కాటేసినట్లు అధికారులు తెలిపారు. సింహానికి సమీపంలోని ఓ వాటర్ ట్యాంక్ వద్ద విషపూరిత పాము ముడుచుకొని ఉందని, అదే కాటేసి ఉంటుందని భావిస్తున్నారు.

*రాజస్థాన్ జైపుర్ రూరల్లో సామూహిక ఆత్మహత్యలు కలకలం రేపాయి. ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారుల శవాలు నరేనా రోడ్ సమీపంలోని బావిలో కనిపించాయి. సమాచారం అందుకొని దుదూ స్టేషన్ పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ముగ్గురు మహిళలు అక్కాచెల్లెళ్లు అని పోలీసులు తెలిపారు. వీరిని కాలీ దేవి(27), మమతా దేవి(23), కమ్లేశ్ మీనాగా(20) గుర్తించారు. మే 25న ఇంట్లో నుంచి వారు బయటకు వెళ్లిపోయారని చెప్పారు. చనిపోయిన చిన్నారుల్లో నాలుగేళ్ల బాలుడు హర్షిత్, 20 రోజుల శిశువు ఉన్నట్టు వెల్లడించారు.

*కర్నూలు జిల్లా వెల్దుర్తి సీఐ మహేశ్వరరెడ్డిపై పోలీసు అధికారులు వేటు వేశారు. రెండు రోజుల క్రితం సీఐ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో రూ. 40 వేలు లంచం తీసుకుంటూ ఏఎస్‌ఐ ఖాదర్‌వలి పట్టుబడ్డాడు.

*జ‌గిత్యాల జిల్లా మెట్‌ప‌ల్లి మండ‌లం జ‌గ్గ‌సాగ‌ర్‌లో విషాదం నెల‌కొంది. చేప‌ల వేట‌కు వెళ్లిన మ‌త్య్స‌కారుడు ఆర్మూర్ న‌ర్స‌య్య (44) నీట‌మునిగి మృతిచెందాడు.వివరాల్లోకెళితే, ఆర్మూర్ న‌ర్స‌య్య చేప‌లు ప‌ట్టేందుకు ఊరిచెరువులోకి దిగాడు .అయితే, ప్ర‌మాద‌వ‌శాత్తూ చేప‌ల‌వ‌ల త‌ట్టుకొని నీటిలో మునిగి చ‌నిపోయాడు. గ‌మ‌నించిన గ్రామ‌స్తులు అత‌డిని ఒడ్డుకు చేర్చి, పోలీసుల‌కు స‌మాచారం అందించారు. సంఘ‌టనా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృతుడి వివ‌రాలు అడిగి తెలుసుకొని, మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి త‌ర‌లించారు. న‌ర్స‌య్య‌కు భార్య‌, ఇద్ద‌రు కొడుకులు, ఒక కూతురున్నారు.

* ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన జరిగింది. పొజిచలూరు ప్రాంతంలోని ఒక ఇంట్లో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి, అతడి భార్య, ఇద్దరు పిల్లలు శనివారం ఉదయం అనుమానాస్పదంగా చనిపోయారు. పొరుగు కుటుంబాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటికి వెళ్లి పరిశీలించారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు.

*హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్‌కి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు. శనివారం పురాని హవేలీ, సౌత్ జోన్ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీపీ మీడియాకు వివరాలు వెల్లడించారు. కరుడుగట్టిన చైన్ స్నాచర్ ఫైసల్ షా అలీ జబ్రితో పాటు రిసీవర్ ఖలీల్‌ను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఫైసల్ షా అలీపై గతంలో శాలిబండ, సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిల్లో మూడు చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఫైసల్ షా అలీ జబ్రిని అరెస్ట్‌తో మూడు చైన్ స్నాచింగ్ కేసులు చేధించినట్లు చెప్పారు.నిందితుల నుంచి లక్ష80వేల రూపాయల విలువ చేసే 120 గ్రాముల గోల్డ్ చైన్ & ఒక పల్సర్ బైక్ సీజ్ చేశామన్నారు.ఈ నెల 21న శాలిబండ ప్రాంతంలో సుజాత అనే ప్రైవేట్ టీచర్ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఫైసల్ షా అలీ జబ్రి పుస్తెల తాడు లాకెళ్లాడని చెప్పారు.ఫైసల్ షా అలీ జబ్రికి 2006 నుంచి నేర చరిత్ర ఉందన్నారు. ఫైసల్ షాపై ఆయా పోలీస్ కమిషనరేట్ పరిధిల్లో 135 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.గతంలోనూ రెండు సార్లు పీడీ యాక్ట్ పై జైల్‌కి వెళ్లాడన్నారు. జైల్ నుంచి ఫైసల్ షా విడుదల కాగానే రిసీవర్ ఖలీల్ ఇద్దరు కలిసి మళ్లీ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారని చెప్పారు. ఫైసల్ షా అలీ జబ్రి & ఖలీల్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించామని సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య తెలిపారు.

*బందరులాకుల్‎లో లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నిద్రిస్తున్నయాచకులపై లారీ దూసుకెళ్లింది. అదే రోడ్‎లోకి రివర్స్‎లో వచ్చిన లారీ రోడ్డుపై నిద్రస్తున్న వ్యక్తి తలపైకి లారీ ఎక్కింది. దీంతో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని లారీ డ్రైవర్‎ను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు.

*చీడికాడ మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కొనాం వద్ద బొలెరో వాహనంలో అక్రమంగా 2500 కేజీల గంజాయిని తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. గంజాయి తరలిస్తున్న 11 మందిని నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‎కు తరలించారు.

*అనంతపురం జిల్లాలో మహిళా ఆటో డ్రైవర్ పట్ల తోటి ఆటో డ్రైవర్లు అరాచకానికి పాల్పడ్డారు. మాంగళ్య షాపింగ్ మాల్ స్టాండ్‌లో ఆటో పెట్టుకోవద్దంటూ మహిళా ఆటోడ్రైవర్ విజయను తోటి ఆటో డ్రైవర్లు బెదిరించారు. ‘‘ఏం చేస్తామో తెలియదు… మా కంటికి కనపడవద్దు’’ అంటూ హెచ్చరించారు. దీంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని ఆశ్రయించిన విజయ… తన గోడును వెల్లబోసుకుంది. భర్తను కోల్పోయి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నానని… కూరగాయల వ్యాపారంలో నష్టం రావడంతో నాలుగు లక్షలు అప్పు చేసి ఆటో కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఆటో డ్రైవర్ల నుంచి తనను కాపాడాలంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి విజయ కోరారు. మహిళా డ్రైవర్ ఆవేదన, ఆటో డ్రైవర్ల ఆరాచకాన్ని సీఐ జాకీర్ హుస్సేన్ దృష్టికి ఏబీన్ ఆంధ్రజ్యోతి తీసుకువెళ్లింది. అన్ని విధాలా రక్షణ కల్పించడంతో పాటు ఆటో డ్రైవర్లపై చర్య తీసుకుంటామంటూ మహిళ ఆటో డ్రైవర్ విజయకు సీఐ జాకీర్ హుస్సేన్ ధైర్యం చెప్పారు.

*ఆయన తిరుపతిలోని ఎస్వీ వేదిక్‌ వర్శిటీ రిజిస్ట్రార్‌.. ఉన్నత చదువులు చదివి.. గొప్ప స్థాయిలో ఉన్న ఆయన.. మూఢ విశ్వాసాలను నమ్మి తన 16 ఏళ్ల కుమారుడికి బాల్య వివాహం జరిపించారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారం రోజుల కిత్రం తిరుపతిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లాకు చెందిన వెంకట రాఽథేశ్యామ్‌ తిరుపతిలోని ఎస్వీ వేదిక్‌ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. భార్య శ్రీదేవి, ఇద్దరు కుమారులతో కలిసి ఖాదీకాలనీలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నారు. తిరుపతికి చెందిన వెంకటేశ్వర్లు, శ్రావణికుమారి ఆర్‌ఎస్‌ గార్డెన్‌లో ఉంటున్నారు. ఈ రెండు కుటుంబాలు తమ పిల్లలకు చిన్నవయసులోనే వివాహం జరిపించాయి. రిజిస్ట్రార్‌ కుమారుడు కౌషిక్‌ శంకర్‌ (16)కు, వెంకటేశ్వర్లు కుమార్తె కామేశ్వరి (10)కి ఈ నెల 21న సింగాలగుంటలో మఠంలో పెళ్లి జరిగింది. వివాహ కార్యక్రమం ముగిసిన తర్వాత విషయం అలిపిరి పోలీసులకు తెలిసింది. గురువారం రాత్రి వారు ఇరు కుటుంబాలను విచారించారు. వివాహానికి సంబంధించిన ఫొటోలు పరిశీలించి, సాక్షులతో మాట్లాడిన మీదట బాల్యవివాహాన్ని జరిపించినట్టు రూఢీ కావడంతో.. అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులతోపాటు వివాహానికి పెద్దరికం వహించిన మరో ఇద్దరిపైనా బాల్యవివాహాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.

*వారిద్దరూ పెద్దగా చదువుకోలేదు. సాంకేతిక పరిజ్ఞానంపైనా అంతగా అవగాహన లేదు. అయినా పోలీసులకు చిక్కకుండా వరుస దొంగతనాలు చేస్తుంటారు. దానికోసం వారు ఫోన్లు, సొంత బైక్‌లూ వాడరు. ఎక్కడో బైక్‌ చోరీ చేసి, దానిపైనే వెళ్లి ఇళ్లలో దొంగతనాలు నిర్వహించి, కొంత దూరం వెళ్లాక బైక్‌ను వదిలి వెళ్లిపోతారు. చివరికి చిత్తూరు జిల్లా యాదమరి పోలీసులకు గురువారం పట్టుబడ్డారు. ఆ వివరాలను ఎస్పీ రిషాంత్‌రెడ్డి శుక్రవారం చిత్తూరులో మీడియాకు వివరించారు. యాదమరి మండలం గాండ్లకొత్తూరుకు చెందిన తవరాజ్‌ గత నెల 24న ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి చిత్తూరు వచ్చారు. దీంతో ప్రకాశం జిల్లా పొదిలి మండలం సలకనూతనకు చెందిన తిరుపతిస్వామి అలియాస్‌ వంశీ(29), నీరుగట్ట గణేష్‌(28) ఆ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు చిత్తూరు వెస్ట్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ ప్రతా్‌పరెడ్డి దొంగల కోసం గాలింపు చేపట్టారు. గురువారం మోర్దానపల్లెలో ఆంధ్రాబ్యాంకు ఏటీఎం వద్ద నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించారు. తెలంగాణతో పాటు రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో 57 కేసులలో నిందితులుగా ఉన్నట్లు తేలింది. వారి నుంచి రూ.15 లక్షల విలువ చేసే 207 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండుకు తరలించారు.

*తమిళనాడులోని రామేశ్వరంలో ఓ మత్స్యకార మహిళ (45)పై సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఆరుగురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఒడిశాకు చెందినవారని, వీరు రొయ్యల చెరువులో పని చేయడానికి ఇక్కడికి వచ్చారని తెలిపారు.

*బెల్లంపల్లిలో దారుణ హత్య జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు బాలాజీ థియేటర్ సమీపంలో అతి దారుణంగా హత్య చేశారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*బందరులాకుల్‎లో లారీ బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నిద్రిస్తున్నయాచకులపై లారీ దూసుకెళ్లింది. అదే రోడ్‎లోకి రివర్స్‎లో వచ్చిన లారీ రోడ్డుపై నిద్రస్తున్న వ్యక్తి తలపైకి లారీ ఎక్కింది. దీంతో వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని లారీ డ్రైవర్‎ను అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు.

* ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. జిల్లాలోని శెట్టూరు మండలం ములకలేడులో ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలిపోయింది. దీంతో నలుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శిధిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

*నాంపల్లి మండలం కేతేపల్లి వద్ద ఓ ఆలయం సమీపంలో శనివారం ప్రమాదం సంభవించింది. శ్రీరామ రథోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. రథాన్ని రథశాలకు చేర్చుతుండగా కరెంట్‌ తీగలు తగిలాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చౌటుప్పల్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతిచెందిన ముగ్గురిలో ఇద్దరు పొగాకు మోహనయ్య, రాజమౌని యాదయ్యగా గుర్తించారు.