Politics

బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడిపై బీజేపీ ఆరోప‌ణ‌లు అర్ధ‌ర‌హితం – TNI రాజకీయ వార్తలు

బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడిపై బీజేపీ ఆరోప‌ణ‌లు అర్ధ‌ర‌హితం  – TNI రాజకీయ వార్తలు

* త‌మిళ‌నాడులో బ‌ల‌వంత‌పు మ‌త మార్పిడిపై బీజేపీ చేస్తున్న ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత పీ చిదంబ‌రం తోసిపుచ్చారు. రాజ్య‌స‌భ సీటుకు నామినేష‌న్ దాఖ‌లు చేసిన అనంత‌రం చిదంబ‌రం సోమ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. తాను ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి కాలేజ్ వ‌ర‌కూ క్రైస్త‌వ విద్యా సంస్ధ‌ల్లో చ‌దివాన‌ని, కాషాయ పార్టీ చేస్తున్న బ‌లవంత‌పు మ‌త‌మార్పిడుల ఆరోప‌ణ‌లు హేయం, అస‌త్యాల‌ని స్ప‌ష్టం చేశారు.త‌మిళ‌నాడులోని తంజావూరు క్రైస్త‌వ పాఠ‌శాలలో బాలిక మృతి నేప‌ధ్యంలో బీజేపీ త‌మిళ‌నాడు శాఖ ఈ ఆరోప‌ణ‌ల‌ను ముందుకు తెచ్చింది. త‌మిళ‌నాడులో బ‌ల‌వంత‌పు మ‌త‌మార్పిడి జ‌రుగుతోంద‌ని బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామ‌లై ఆరోపించారు. క‌న్యాకుమారిలోని క‌న్న‌తువిలైలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల బాలిక ఏప్రిల్‌లో ఇచ్చిన ఫిర్యాదే ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ‌ని అన్నారు. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌ను చిదంబ‌రం తోసిపుచ్చుతూ వేలాది మంది విద్యార్ధులు ఎప్ప‌టినుంచో క్రైస్త‌వ పాఠ‌శాల‌ల్లో చ‌దువుకుని జీవితంలో పైకి ఎదిగార‌ని ఏ ఒక్క‌రూ మ‌త‌మార్పిడికి ప్ర‌య‌త్నించ‌లేద‌ని అన్నారు.

*వైసీపీ భవిష్యత్‌ను తలుచుకుంటే భయమేస్తుంది : ఎంపీ రఘురామరాజు
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామరాజు మరోసారి వైఎస్‌ జగన్‌ పనితీరుపై విరుచుకుపడ్డారు. రోజువారి రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మూడేండ్ల జగన్ పాలనపై తీవ్రంగా స్పందించారు. 95శాతం హామీలు అమలు చేశామని సీఎం చెప్పిన మాటల్లో ఎలాంటి నిజాలు లేవని 95 శాతం నెరవేర్చలేదని వ్యాఖ్యనించారు.

*ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 96 శాతం అమలు చేశాం: పెద్దిరెడ్డి
ముఖ్యమంత్రిగా.. జగన్‌ బాధ్యతలు చేపట్టి నేటితో మూడేళ్లు పూర్తైన సందర్భంగా అధికార వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్టీ కార్యాలయాల్లో జెండా అవిష్కరించి కేట్ కట్ చేసి వేడుక చేసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 96 శాతం అమలు చేశామని.. వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.జగన్‌.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేపట్టి ఇవాళ్టితో మూడేళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో మూడేళ్ల వేడుకలు చేసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి.. తన కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్‌ కట్‌ చేసి పార్టీ శ్రేణులతో ఆనందం పంచుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 96 శాతం అమలు చేశామని మంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు ప్రభుత్వం, సామాజిక న్యాయభేరి కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు.అనకాపల్లి జిల్లా చోడవరంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సంబరాలను ప్రారంభించారు. వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించిన అనంతరం.. కేక్‌ కట్‌ చేసి వేడుకలు చేసుకున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలవ్యాప్తంగా.. వైకాపా శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. పార్వతీపురంలో ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. వీరఘట్టంలో వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. విజయనగరం జిల్లా గజపతినగరం, నెల్లిమర్లలో ఎమ్మెల్యేలు అప్పలనరసయ్య, అప్పలనాయుడు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. విజయనగరంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి.. చీరలు పంపిణీ చేశారు.

*పల్లె ప్రగతిని విజయవంతం చేయాలి : మంత్రి వేముల
సీఎం కేసీఆర్ మేధో మథనం నుంచి పుట్టిందే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్‌లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ..పల్లెలు, పట్టణాలు బాగు చేసుకోవాడనికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ఆదర్శవంతమైనా కార్యక్రమం లేదన్నారు. కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు సమానంగా గ్రామ, పట్టణాలకు నిధులు ఇస్తున్నది సీఎం కేసీఆర్‌ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. పల్లెలకు ప్రభుత్వం ఇలా అదనపు నిధులు ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు.సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు జూన్ 3 నుంచి 18 వరకు 4వ విడత పల్లె ప్రగతి,3వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇందులో ప్రధాన భూమిక పోషించాలని మంత్రి సూచించారు. సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో తెలంగాణలో ఈ ఏడాది వరకు 7.5 శాతం పచ్చదనం పెరిగిందన్నారు. దేశంలో ఎక్కడా గ్రీనరీ ఇంతలా పెరగలేదన్నారు.దేశంలో అటవీ విస్తీర్ణం పెంచడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. కేవలం తెలంగాణలోనే రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపు పై దృష్టి సారించిందన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి,సంరక్షించే ప్రోత్సాహించాలన్నారు. అలాగే జూన్3వ తేదీ లోపు గత ఏడాది ప్రణాళికలో మిగిలిన పనులపై అవగాహన చేసుకుని వాటిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ విఠల్ రావు, ఎమ్మెల్యే గణేష్ గుప్తా, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి ఉన్నారు.

*వైసీపీ మంత్రులు నోరులేని మూగజీవులు : అచ్చెన్నాయుడు
వైసీపీ మంత్రులు నోరులేని మూగ జీవులని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో నలుగురు రెడ్లు రాజ్యాధికారం చెలాయిస్తున్నారని, బీసీ మంత్రులకు అధికారాలు, సామాజిక న్యాయం ఎక్కడ అమలవుతుందని ప్రశ్నించారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మూడేండ్ల వైసీపీ సంబురాలపై మాట్లాడారు. ఏ ప్రభుత్వమైనా మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడితే జగన్ విధ్వంసాలతో మొదలు పెట్టారని వెల్లడించారు.

*పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు ఎప్పుడు వేస్తారు?: Jagga Reddyt
ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలను ఎప్పుడు వేస్తారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. డబ్బులు జమచేసే వరకు తాము ఇలానే ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ వచ్చినప్పుడు తెలంగాణ అభివృద్ధికి స్పెషల్ ప్యాకేజి అడిగే ప్రయత్నం చేసారా? అని బండి సంజయ్‌ని ప్రశ్నించారు. బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొడుతుంటే..ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్, దేశాన్ని మోదీ అప్పుల పాలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, హిందు, ముస్లిం, క్రైస్తవుల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు.

*రెంటచింతల రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరం: సోము వీర్రాజు
పల్నాడు జిల్లా రెంటచింతలలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. టాటా ఏస్ వాహనంలో ప్రమాద సమయంలో 38 మంది ఉన్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. ఇది రాష్ట్రంలో రవాణా శాఖ అధికారుల పనితీరును ప్రతిబింబిస్తోందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని సోము వీర్రాజు కోరారు.

*గడప గడపతో వైసీపీ గడప కొంచెం కదిలినట్టుంది: అశోక్ గజపతిరాజు
గడప గడప కార్యక్రమంలో వైసీపీ గడప కొంచెం కదిలినట్టుందని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. మంత్రుల బస్సు యాత్రకు విజయనగరంలో వరుణదేవుడు కూడా అవకాశం ఇవ్వ లేదన్నారు. జైలు జీవితం గడిపిన జగన్ రెడ్డి ప్రజల కోసం జైలుకెళ్లారా?.. లేదంటే అవినీతి కేసుల్లో వెళ్లారా అనేది ప్రజలు గమనించాలని అశోక్ గజపతిరాజు సూచించారు.

*వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉంది: Dastagiri
వైసీపీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ వివేకా హత్య కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరి కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తొండూరు పోలీసులు తనపై అక్రమ కేసులు పెట్టారని ఆయన ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా తొండూరుకు చెందిన పెద్ద గోపాల్ తరచూ తనను లక్ష్యంగా చేసుకుని గొడవ పడుతున్నారని, ఏదో విధంగా తనను అంతం చేయాలని చూస్తున్నారని దస్తగిరి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్నాననే ఉద్దేశంతో తనను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ ఫిర్యాదులో తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టిన విషయాన్ని సీబీఐ ఎస్పీ రాంసింగ్‌కు కూడా వివరించినట్లు దస్తగిరి తెలిపారు.

*సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర నిర్వహించడానికి మంత్రులకు సిగ్గుండాలి: Harshakumar
వైసీపీ మంత్రులపై మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర నిర్వహించడానికి మంత్రులకు సిగ్గుండాలని అన్నారు. అసలు బస్సు యాత్ర చేసే అర్హత మంత్రులకు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ మూడేళ్ల పాలనలో దళితులకు చెందిన 22 పథకాలు రద్దు చేశారని ఆరోపించారు. అనంతబాబు డ్రైవర్ హత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతబాబును రక్షించేందుకు పోలీసులు, ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కోనసీమ వివాదంలో ప్రభుత్వమే ప్రథమ ముద్దాయని, అమలాపురం రణరంగంపై సీబీఐతో విచారణ జరిపించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.

*ఆరోగ్యశ్రీ పేరుతో ఆస్పత్రి చార్జీలు పెంచేశారు: దేవినేని ఉమ
ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌.. దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రజలను ఎడాపెడా బాదేశారని మాజీ మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అని మాట్లాడిన జగన్‌.. ఇప్పుడు ఇష్టారాజ్యంగా ధరలను పెంచేశారన్నారు. టీడీపీ హయాంలో ఇసుక ఉచితంగా ఇస్తే.. జగన్‌ సర్కార్‌లో రూ.లక్ష ఇస్తేనే గానీ లారీ ఇసుక దొరికే పరిస్థితి లేదన్నారు. ఆరోగ్యశ్రీ పేరుతో ఆస్పత్రి చార్జీలు పెంచేశారన్నారు. ఎన్టీఆర్‌ సమయంలో పక్కా ఇల్లు నిర్మిస్తే.. దానికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో రూ.10 వేలు వసూలు చేస్తున్నారని దేవినేని ఉమ పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. బాదుడే బాదుడే చేస్తున్న జగన్‌రెడ్డిని తిరిగి బాది క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌, బ్రింగ్‌ బాబు నినాదంతో చంద్రబాబును తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని దేవినేని ఉమ కోరారు.

*ఆఖరికి రికార్డింగ్ డ్యాన్స్‌లతో.. ప్రజలను కూర్చోబెట్టే స్థాయికి దిగజారారు: అనితt
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. తిప్పికొడితే మూడేళ్లు కాలేదు.. అప్పుడే ప్రజలు రావట్లేదని ఎద్దేవా చేశారు. ఆఖరికి రికార్డింగ్ డ్యాన్స్‌లు చూపించి.. ప్రజలను కూర్చోబెట్టే స్థాయికి దిగజారిపోయారన్నారు. మూడేళ్ల పాలన సుపరిపాలన అయితే.. మీకు ఈ ఖర్మ ఎందుకు పడుతుందని ట్వీట్‌లో అనిత ప్రశ్నించారు.

*దక్షిణాది రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే ధరలు ఎక్కువ: Ramakrishnat
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మోసపూరిత మాటలతో పాలన చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కనీసం వైఫల్యాలను సరి దిద్దుకునే పరిస్థితిలో కూడా లేరన్నారు. పెట్రోల్, డీజిల్ సెంచరీ దాటినా మోదీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో జగన్ కూడా మోదీతో పోటీ పడి ధరలు పెంచారన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీలో ఉన్న ధరలు మరెక్కడా లేవని తెలిపారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక కన్నా ఏపీలోనే పెట్రోల్ ధర ఎక్కువన్నారు. పన్నులు తగ్గించాలని కోరినా స్పందన లేదని, విద్యుత్ ఛార్జీలు, ఆస్తి పన్నులు పెంచేశారని అన్నారు. ఎన్ని రూపాలలో ఆందోళన చేసినా ఈ ప్రభుత్వాలు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అన్ని వామపక్ష పార్టీలు కలిసి ఆందోళన చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికీ మార్పు రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం కొనసాగిస్తామని రామకృష్ణ స్పష్టం చేశారు.

*agan కోసం నేను ఆత్మాహుతి దళం సభ్యునిగా మారుతా..: MLC Duvvada
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టెక్కలి రోడ్లపై అచ్చెన్నాయుడుని గుడ్డలూడదీసి కొడతా… అలా కొట్టకపోతే తాను దువ్వాడనే కాదన్నారు. అచ్చెన్నను తన్నటానికి ఒక్క నిమిషం చాలన్నారు. దిక్కుమాలిన టీడీపీకి గత్యంతరం లేక అచ్చెన్నాయుడును అధ్యక్షుడిని చేశారని విమర్శించారు. జగన్ కోసం తాను ఆత్మాహుతి దళం సభ్యునిగా మారతానన్నారు. మహానాడు వేదికపై మాట్లాడిన ప్రతి ప్రేలాపనకూ సమాధానం చెబుతానన్నారు. ఆకాశ లక్కవరం, వడ్డీతాండ్ర గ్రామాలకు వెళ్లలేని దుస్థితి అచ్చెన్నదని, నోరు అదుపులో పెట్టుకోకపోతే ఆహుతి సినిమాలో విలన్ని కొట్టినట్టు తరిమి తరిమి కొడతానని దువ్వాడ అన్నారు.

*మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ.. చెప్పులు, రాళ్ళు విసిరిన జనం
ఘట్‌కేసర్‌ ‘రెడ్ల సింహ గర్జన’ సభలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సభలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. సీఎం కేసీఆర్‌ను పొగుడుతుండగా మంత్రి మల్లారెడ్డిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందనడంతో మండిపడ్డారు. పదేపదే టీఆర్‌ఎస్, కేసీఆర్‌ పేరెత్తడంతో చెప్పులు, రాళ్ళు విసిరేశారు. దీంతో మంత్రి మల్లారెడ్డి మధ్యలోనే ప్రసంగం ఆపేసి వెళ్లిపోయారు. అయితే మల్లారెడ్డి వెళ్తున్న సమయంలో కూడా కాన్వాయ్‌పై బాటిళ్లు, కుర్చీలు విసిరేశారు. మల్లారెడ్డి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

*వారి తప్పిదాల వల్లే చిన్నారులు అర్హత కోల్పోయారు.. Kishan Reddy
తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా మంది పిల్లలు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకానికి అర్హత కోల్పోయారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కరోనాలో ఎంతమంది చనిపోయారో నిర్ధారించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉందని తెలిపారు. కిషన్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. కేంద్రం ఇవ్వాల్సినవన్నీ రాష్ట్రానికి ఇస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రూల్డ్ అవుట్ అయ్యిందని, ఉక్కుఫ్యాక్టరీ పెడితే నష్టాలే తప్ప లాభాలుండవన్నారు. పోలవరం ప్రాజెక్టు విభజన చట్టంలో ఉన్నందున కేంద్రం నిధులిచ్చిందని చెప్పారు. ఏయిమ్స్ వైద్య కళాశాల మంజూరు చేస్తే.. అధికారికంగా ఇప్పటి వరకు భవనాలు అప్పగించలేదన్నారు. సైనిక్ స్కూల్ మంజూరు చేసినా.. స్థలం కేటాయించలేదని, సైన్స్ సిటీకి తెలంగాణ ప్రభుత్వం స్థలం ఇవ్వడం లేదని తెలిపారు. వాటికి కేంద్ర ప్రభుత్వ స్థలాలను వెతుకుతున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల తీరు వల్ల శ్రీలంక పరిస్థితి వచ్చే అవకాశం ఉంది.

*ఏడు పాయల ఆలయం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం:Raja singh
తెలంగాణలో సుప్రసిద్ధమైన దేవాలయం ఏడుపాయల ఆలయం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.ఆదివారం పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వన దుర్గా మాతనురాజాసింగ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గ మాత ఆలయానికి కోట్ల రూపాయలు లతో అభివృద్ధి చేస్తున్నామంటూ సీఎం కేసీఆర్(kcr) డప్పు కొడుతున్నారని,కానీ చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని విమర్శించారు.దేవాదాయశాఖ మంత్రి దున్నపోతులాగా కార్యాలయంలో పడుకోవడం కాదు, ఏడుపాయల వచ్చి చూస్తే భక్తుల బాధ తెలుస్తుందని అన్నారు.ఏడుపాయల దేవాలయ కమిటీ లో ముస్లిం, క్రిస్టియన్ లకు అవకాశం ఇవ్వద్దని రాజాసింగ్ పేర్కొన్నారు. ఒక వేళ ఇస్తే ఎలా తొలగించాలన్నవిషయం మాకు తెలుసు అని అన్నారు.

*సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్: MP Santhosh Kumar
‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్, సేవ్ సాయిల్ ఉద్యమం’ సంయుక్తంగా హైదరాబాద్‌ శిల్పారామంలో ‘లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ – మట్టి కోసం మనం’ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ముఖ్య అతిథిగా తెలంగాణ పార్లమెంట్ సభ్యులు జె. సంతోష్ కుమార్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం చాలా ఏళ్లుగా మొక్కల పెంపకంపై అవగాహన కల్పిస్తోందని, సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించామని చెప్పారు. మట్టి కోసం మనం కార్యక్రమంలో భాగంగా ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ సద్గురు దేశంలోని 9 రాష్ట్రాల్లో బైక్ రైడ్‌ను కొనసాగిస్తారని, హైదరాబాద్‌కు జూన్ 15వ తేదీన వస్తారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. గాయకులు మంగ్లీ, రామ్ మిరియాల, రమ్య బెహ్రా, సాహితీ చాగంటి, శ్రీ లలిత సందీప్‌ పాడిన పాటలు అలరించాయి. కార్యక్రమంలో పద్మశ్రీ వెంకటేశ్వరరావు, ఆర్గానిక్ రైతు నాగరత్నం నాయుడు పాల్గొన్నారు.

*ఎన్నికలప్పుడే రాజకీయాలు..మిగతా అంతా అభివృద్ధి మీదే: Gangula
ఎన్నికలప్పుడే రాజకీయలని..మిగతా సమయంలోఅభివృద్ధిపైనే ధ్యాస వుంటుందని బీసీ,పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్అ న్నారు. కొత్తపల్లి మండలం అసిఫ్ నగర్ లో బీజేపీ నుండి పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరికల కార్యక్రమనికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1956 నుండి చరిత్ర చుస్తే ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలవలేదు.పోటీ కూడా చేయలేదు.మీ ఆశీర్వాదం తో మూడు సార్లు గెలిచానని అన్నారు.తెలంగాణ రాక ముందు ఈ ప్రాంత పరిస్థితి ఏందో మీరే చూసారు.ఎక్కడ కూడా అభివృద్ధి కి నోచుకోలేదని,తాగునీరు, సాగునీటి కి అరిగోస పడ్డామని గుర్తు చేశారు.ప్రజలకు ఏమి కావాలి అని ఆనాడు ఏ ప్రభుత్వం ఆలోచించ లేదని..కానీగ్రామాలు ఆర్ధికంగా ఎదగాలని టీ ఆర్ ఎస్ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.మండుటెండలో నీరు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వనికి దక్కిందని అన్నారు.కరెంట్ కావాలని ఆనాడు నేనే స్వయంగా రైతులతో కలిసి ఉద్యమం చేస్తే మాపై కేసులు నమోదు చేశారని అన్నారు.మన ప్రాంత అభివృద్ధి చూసి వందల పరిశ్రమలు వచ్చాయని,రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు.ఇది మన అందరి కుటుంబ పార్టీ.మాకు అండగా ఉండండి..మీపై ఈగ వాలనివ్వము.అన్ని వేళలా అందుబాటులో ఉంటాము.త్వరలోనే గ్రామ..గ్రామన తిరుగుతా..మీ అందరి వద్దకు వస్తానని అన్నారు.

*దాని ఫలితమే కోనసీమ అల్లర్లు: Potina Mahesh
కులాల మధ్య చిచ్చు లేపి రాజకీయ లబ్ది పొందాలని వైసీపీప్రభుత్వం చూస్తోందని, దాని ఫలితంగా కోనసీమ అల్లర్లు జరిగాయని జనసేన నేత, పోతిన మహేష్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టడం సీఎం జగన్‌ కు వెన్నతో పెట్టిన విద్యని, అందుకే దావోస్‌లో ఉన్న ఆయన కోనసీమ అల్లర్లపై మాట్లాడలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి దావోస్‌కు వెళ్ళింది.. ఏపీకి పెట్టుబడుల కోసం కాదని.. సీఎం ఫ్యామిలీ టూర్ అని ఆరోపించారు. సొంత వ్యాపార విస్తరణ కోసం ముఖ్యమంత్రి ఫ్యామిలీతో దావోస్ వెళ్లారన్నారు. కోనసీమ ఘటనకు జగన్ బాధ్యత వహించకపోతే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. సామాజిక బస్సు యాత్రను అమలాపురం వైపు ఎందుకు తిప్పలేదని ప్రశ్నించారు. బస్సులో తిరగడం.. బిర్యానీ తినడం సామాజిక బస్సు యాత్ర లక్ష్యమని విమర్శించారు. తిరుమలను రాజకీయ వేదికగా మారుస్తున్న మంత్రి రోజా హిందువులకు క్షమాపణ చెప్పాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు

*Mahanaduకు ప్రభుత్వం అడ్డంకులు పెట్టింది: Kollu Ravindra
మహానాడుకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు పెట్టిందని టీడీపీ నేత, మాజీమంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు జరిగిన అన్యాయంపై మహానాడులో చర్చ జరిగిందన్నారు. గన్నవరంలో ఎన్టీఆర్
విగ్రహం కనబడకుండా ఫ్లెక్సీ కట్టిన వంశీ చరిత్రహీనుడని దుయ్యబట్టారు. సామాజిక న్యాయానికి సమాధి కట్టి వైసీపీ నేతలు బస్సు యాత్ర చేయడమేంటని ప్రశ్నించారు. ఆంధ్రవాళ్లు దోచుకుంటున్నారని మాట్లాడిన తెలంగాణ వ్యక్తి ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చారని, ఇది సామాజిక న్యాయం అంటే తాము నమ్మాలా? అని కొల్లు రవీంద్ర నిలదీశారు.

*ప్రభుత్వంలో వణుకు మొదలయింది: దేవినేని ఉమ
ఎన్టీఆర్ జిల్లా: మహానాడు విజయవంతం కావడంతో ప్రభుత్వంలో వణుకు మొదలయిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన మంత్రులు బస్సు యాత్ర పేరుతో రోడ్లపై తిరుగుతూ పరిపాలనను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. మంత్రులు యాత్రకు ప్రజా స్పందన కరువైందన్నారు. సీఎం దావోస్ పర్యటన కుటుంబ పర్యటనగా మారిందని విమర్శించారు. పెట్టుబడులు తీసుకురాకుండా విహారయాత్ర చేసి వచ్చారన్నారు. పోలవరం నిర్వాసితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం పై సీఎం ఇంత వరకు ఎందుకు స్పందించలేదని దేవినేని ఉమా ప్రశ్నించారు.

*YCPని ఇక నుంచి బొక్కలో పార్టీ అని పిలవాలి: బుద్దా వెంకన్న
మహానాడుకు మహాదరణ వచ్చిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. 2054 వరకు నారా కుటుంబం అధికారంలో ఉంటుందని, 2024 ఎన్నికల్లో YCP పూర్తిగా మునిగిపోవడం ఖాయమని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు. వైసీపీని ఇక నుంచి బొక్కలో పార్టీ అని పిలవాలని బుద్దా వెంకన్న సూచించారు. జగన్, విజయసాయిరెడ్డి బొక్కలో ఉన్నప్పుడు వైసీపీని మూసేయాలని ఎమ్మెల్యేలు నిర్ణయించారని బుద్దా వెంకన్న ఆరోపించారు. జగన్ తల్లి, చెల్లి రోడ్ల మీదకు వచ్చి పార్టీని నిలబెట్టారని, అధికారంలోకి వచ్చాక అదే తల్లి, చెల్లిని వెన్నుపోటు పొడిచారని వెంకన్న విమర్శించారు. మంత్రుల బస్సుయాత్రతో ప్రజలకేం ఉపయోగమని, జగన్, వైసీపీ నేతలు దోచుకున్న సొమ్మును చంద్రబాబు కక్కిస్తారని బుద్దా వెంకన్న తెలిపారు.