NRI-NRT

ఆస్ట్రేలియా కాన్సులేట్‌ ఏర్పాటు చేయండి

ఆస్ట్రేలియా కాన్సులేట్‌ ఏర్పాటు చేయండి

తెలంగాణ, ఆస్ట్రేలియా మధ్య విద్య, వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెరుగుతున్నందున ఆస్ట్రేలియా కాన్సుల్‌ జనరల్‌ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు.క్రికెట్‌తో పాటు అనేక అంశాల్లో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య బలమైన బంధం ఉందన్నారు. ఇండియా ఎకనామిక్‌ స్ట్రాటజీ-2035 అంశంపై ఆస్ట్రేలియా కాన్సులేట్‌ సోమవారం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌, చెన్నైలోని ఆస్ట్రేలియా కౌన్సిల్‌ జనరల్‌ సారా కిర్లే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. పెట్టుబడులకు తెలంగాణ అద్బుతమైన కేంద్రమని, ఆస్ట్రేలియా వ్యాపారవేత్తలు ముందుకు రావాలని ఆహ్వానించారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు 2014లో విడుదల చేసిన పారిశ్రామిక విధానంతో రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో 19వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. 35 బిలియన్‌ డాలర్ల విలువగల పెట్టుబడులు వచ్చాయని, 16 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయన్నారు. 15 రోజుల్లో పారిశ్రామిక అనుమతులు ఇవ్వడం టీఎ్‌సఐపాస్‌ విధానమని, జాప్యం చేసిన ఉద్యోగికి రోజుకు రూ.వెయ్యి చొప్పున జరిమానా కూడా విధించడం ఈ విధానం ప్రత్యేకత అని తెలిపారు. లైఫ్‌ సైన్సె్‌సతో పాటు ఫుడ్‌ ప్రాసెసింగ్‌, టెక్స్‌టైల్‌ మరో 14 రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు విశేష అవకాశాలున్నాయని మంత్రి తెలిపారు. ఆస్ట్రేలియా కౌన్సిల్‌ జనరల్‌ సారా కిర్లే మాట్లాడుతూ.. ఆస్ట్రేలియాలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోందని, ఇందులో భాగంగా తెలంగాణలోనూ పెట్టుబడులకు అవకాశముందని చెప్పారు. ప్రస్తుతం ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌, అపొలో ఆస్పత్రులతో ఒప్పందాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బిఎ్‌స.మూర్తి తదితరులు పాల్గొన్నారు.