Business

లగ్జరీ కార్లకు సంపన్నుల పరుగులు

లగ్జరీ కార్లకు సంపన్నుల పరుగులు

దేశంలో లగ్జరీ కార్లకు డిమాండ్‌ బాగా పెరిగింది. మెర్సిడెస్‌, ఆడి, బీఎండబ్ల్యూ ప్రీమియం ఎండ్‌ కార్లకు ఇటీవల కాలంలో డిమాండ్‌ బాగా పెరిగిందని ఆయా కంపెనీల సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. ఈ కంపెనీల ఇతర మోడల్‌ కార్లతో పోల్చితే ప్రీమియం ఎండ్‌ కార్ల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి ఏర్పడిందని వారంటున్నారు. సాధారణంగా ఈ కార్లు కొనే వారిలో పారిశ్రామికవేత్తలు, క్రీడా ప్రముఖులు, నటీనటులు ఉంటారు. డిమాండ్‌ పెరగడంతో పాటు సెమీ కండక్టర్ల కొరత, రవాణా నౌకలు అందుబాటులో లేకపోవడం, ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం వల్ల ఈ కంపెనీలు తీవ్రమైన సరఫరా అవరోధాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్ధం వరకు సరఫరా విభాగంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని వారంటున్నారు. మొత్తం మీద టాప్‌ ఎండ్‌ ప్రీమియం కార్ల కోసం కస్టమర్లు కనీసం నాలుగు నెలల నుంచి గరిష్ఠంగా ఏడాది వరకు వేచి ఉండాల్సి వస్తోంది.

ఆడి ఇండియా:
గత ఏడాది ప్రారంభమైన ఈ ట్రెండ్‌ గత రెండు నెలల్లో మంచి వేగం అందుకుందని, రూ.70-75 లక్షల శ్రేణిలోని సీ,డీ సెగ్మెంట్‌ కార్లకు డిమాండ్‌ బాగా పెరిగిందని ఆడి ఇండియా హెడ్‌ బల్బీర్‌ సింగ్‌ థిల్లాన్‌ తెలిపారు. ప్రధానంగా విద్యుత్‌ కారు ఈ-ట్రాన్‌ను (క్యూ8 ఎస్‌యూవీ) తాము రూ.1 కోటికి పై ధరలోనే విక్రయిస్తున్నామని, అవి ఇంకా భారత మార్కెట్లోకి అడుగు పెట్టకుండానే కోటా మొత్తం పూర్తిగా అమ్ముడుపోయిందని ఆయన చెప్పారు. గతంలో ఈ కారుకు వెయిటింగ్‌ కాలపరిమితి ఒకటి, రెండు నెలలుండగా ఇప్పుడది నాలుగు నుంచి ఆరు నెలలకు పెరిగిపోయిందని ఆయన తెలిపారు.

మెర్సిడెస్‌ బెంజ్‌:
తమ జీఎల్‌ఎస్‌, జీఎల్‌ఈ (ఎస్‌యూవీలు) కార్లకు ప్రపంచవ్యాప్తంగా అధిక డిమాండ్‌ ఉన్నదని, ఈ కారణంగా తాము ప్రాధాన్యతా క్రమంలో పెట్టి కనీసం ఏడాది లోగా కస్టమర్‌కు అందించే ప్రయత్నం చేస్తున్నామని మెర్సిడెస్‌ బెంజ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ మార్టిన్‌ ష్వెంక్‌ అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికం నాటికి తమ చేతిలో 4,000 కార్లకు ఆర్డర్‌ పెండింగ్‌లో ఉన్నదని ఆయన చెప్పారు. 2021లో రూ.1 కోటి పైబడిన ధరలోని టాప్‌ ఎండ్‌ కార్లు 2,000 విక్రయించామని ఆయన తెలిపారు. ఈ కార్లలో ఎస్‌-క్లాస్‌ మేబాక్‌, జీఎల్‌ఎస్‌ మేబాక్‌, టాప్‌ ఎండ్‌ ఏఎంజీ, ఎస్‌-క్లాస్‌, జీఎల్‌ఎస్‌ ఎస్‌యూవీ ఉన్నాయి. కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈ కార్ల వాటా 30 శాతం ఉంది. ఈ ఏడాది వాటి డిమాండ్‌ 20 శాతం పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది.

బీఎండబ్ల్యూ:
బీఎండబ్ల్యూ కూడా ఇదే ధోరణి ఎదుర్కొంటోంది. టాప్‌ ఎండ్‌ ప్రీమియం కార్ల అమ్మకాల డిమాండ్‌ వేగంగా పెరుగుతోంది. ఎక్స్‌3, ఎక్స్‌4, ఎక్స్‌7 వంటి స్పోర్ట్స్‌ యాక్టివిటీ వాహనాల (ఎస్‌ఏవీ) విభాగంలో తాము చాలా పటిష్ఠంగా ఉన్నామని, మొత్తం కార్లలో వాటి వాటా 50 శాతం ఉండగా గత ఏడాది ఈ కార్లకు డిమాండ్‌ 40 శాతం మేర పెరిగిందని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవా తెలిపారు. రూ.61 లక్షలు పైబడిన ధరల శ్రేణిలోని ఈ కార్ల డిమాండ్‌ తొలి త్రైమాసికంలో 40 శాతం పెరిగి 1,345 కార్లు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం 2,500 కార్లకు ఆర్డర్‌ ఉంది. కాంపాక్ట్‌ లగ్జరీ విభాగంలోని మినీకి 3 నెలలు వేచి ఉండాల్సి వస్తోంది. జనవరి-మార్చి త్రైమాసికం ఈ కంపెనీకి అత్యుత్తమ త్రైమాసికాల్లో ఒకటిగా నిలిచింది. 25.3 శాతం వృద్ధితో 2,815 కార్లు విక్రయించింది.

హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్లపై మారుతి ఫోకస్‌
దేశంలో అతి పెద్ద కార్ల ఉత్పత్తిదారైన మారుతి నానాటికీ డిమాండ్‌ పెరుగుతున్న ఎస్‌యూవీ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని భావిస్తోంది. అమ్మకాల్లో ఈ విభాగం 50 శాతం వాటా దక్కించుకునేందుకు అతి చేరువలో ఉంది. ఇంధన సామర్థ్యం పెంచడానికి హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్‌ వంటి కొత్త టెక్నాలజీలపై దృష్టి సారించాలని భావిస్తున్నట్టు కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఇవి డీజిల్‌ కార్ల కన్నా మెరుగ్గా ఉంటాయని ఆయన తెలిపారు. 2018-19లో కార్ల మార్కెట్లో తమకు గల 51.22 శాతం వాటా తిరిగి సాధించేందుకు అన్ని రకాల అవకాశాలను పూర్తిగా వినియోగించుకుంటామని ఆయన చెప్పారు. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మార్కెట్‌ వాటా నిరుత్సాహపూరితంగా 43.38 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా నాన్‌ ఎస్‌యూవీ విభాగంలో కంపెనీ 67 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది.