Politics

అవినీతి పరుడే.. అవినీతిని అరికడతాడంట! – TNI రాజకీయ వార్తలు

అవినీతి పరుడే.. అవినీతిని అరికడతాడంట! – TNI రాజకీయ వార్తలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ముఖ్యమంత్రి జగన్‌ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అత్యంత అవినీతి పరుడై సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటోన్న జ‌గ‌న్‌రెడ్డి అవినీతిని అరికడతామంటూ యాప్ ఆవిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని అప‌హాస్యం చేయ‌డ‌మేనన్నారు. యాప్‌కి 14400 నెంబ‌ర్‌ కాకుండా, 6093 అయితే యాప్ట్‌గా ఉండేదన్నారు. ‘‘అవినీతి చూస్తూ ఉండొద్దు, అవినీతి గురించి వింటూ ఉండొద్దు, అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పండి అంటూ లెక్చర్ ఇస్తున్న అవినీతి అనకొండ జగన్ రెడ్డి గారూ.. అవినీతిపై ఈ నేతిబీరకాయ క‌బుర్లు మాని.. మీపై ఉన్న అవినీతి కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చెయ్యాలని కోరే దమ్ముందా?’’ అని లోకేష్ సవాల్ చేశారు

*బంగారు తెలంగాణ దిశగా పయనిస్తున్నాం
తెలంగాణ ప్రజలు కలలు కంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా పయనిస్తున్నామని బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ ఎనిమిది ఏళ్లలో బలమైన అడుగులు వేయగలిగామన్నారు. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ది సంక్షేమ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుచూపుతో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతుల ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నామన్నారు .గురువారం రాష్ట్రావతరణ దినోత్సవాలు కరీంనగర్ లో ఘనంగా జరిగాయి.

*నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడి 8 ఏళ్లు పూర్తి: Thulasi Reddy
రాష్ట్ర విభజన జరిగి.. నవ్యాంధ్ర ప్రదేశ్ ఏర్పడి సరిగ్గా గురువారం నాటికి 8 ఏళ్లు పూర్తి అయ్యాయని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ 8 ఏళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ, వైసీపీల వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. విభజన సంధర్భంగా కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నవ్యాంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, ఐఐటి, ఎన్‌ఐటి లాంటి 13 కేంద్రీయ సంస్థల ఏర్పాటు… ఇలా 25 వరాలు ఇచ్చిందన్నారు. ఈ వరాలు అమలై ఉంటే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అయి ఉండేదన్నారు. 2014 లేక 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి ఈ వరాలన్నీ అమలై ఉండేవన్నారు. కానీ దురదృష్టవశాత్తూ 2014, 2019లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో 2014లో టీడీపీ, 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో పై వరాలు అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తులసి రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

*జగన్ రెడ్డి సామాజిక న్యాయం మాటలకే పరిమితం: Yanamala
వ్యవస్థలను దోచేసిన వ్యక్తి లంచాలు తీసుకోవడం నేరమని మాట్లాడటం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ రెడ్డి సామాజిక న్యాయం మాటలకే పరిమితమైందని మండిపడ్డారు. మూడేళ్లలో విద్యారంగం పతనావస్థకు చేరుకుందన్నారు. అమ్మఒడి ఇవ్వకపోవడంతో కాలేజీల్లో అడ్మిషన్లు ఇవ్వడం లేదని, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతోందని ఆందోళన చెందారు. ప్రజల వినిమయ వ్యయం పూర్తిగా పడిపోయిందని తెలిపారు. దావోస్ పర్యటనతో ఒరగబెట్టింది ఏంటో చెప్పకుండా లంచం అంశంతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.

*జగన్ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం దివాళా: DL Ravindrareddy
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… ఏపీలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. జగన్ మూడేళ్ల రివర్స్ పాలనతో రాష్ట్రం దివాళా తీసిందని తెలిపారు. దావోస్కు జగన్ సొంత పనుల మీద వెళ్లి మూడు కంపెనీలతో ఫేక్ అగ్రిమెంట్లు చేసుకున్నారని అన్నారు. వైఎస్ వివేకాను చంపింది ఎవరో జగన్కు తెలుసన్నారు. కోడి కత్తిలాగా రాజకీయ లబ్ధి కోసమే వివేకా హత్యను ఉపయోగించుకున్నారని డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

*అవినీతి గురించి జగన్ మాట్లాడం విడ్డూరంగా ఉంది: బుద్దా వెంకన్న
అవినీతి గురించి సీఎం జగన్ మాట్లాడం విడ్డూరంగా ఉందని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న పేర్కొన్నారు. రూ.42వేల కోట్లు ఈడీ జప్తు చేస్తే.. 16 నెలలు జైలులో ఉన్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. ఏపీలో అవినీతికి కేరాఫ్ అడ్రస్ జగన్ మారారన్నారు. లిక్కర్, ఇసుక అక్రమాల ద్వారా రూ.కోట్లు జగన్కు చేరుతున్నాయని ఆరోపించారు. ఈ అక్రమాలపై ఎవరికి ఫిర్యాదు చేయాలో జగనే చెప్పాలన్నారు. ఉద్యోగులపై కక్ష సాధించేందుకే యాప్ అని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

*ప్రతి నెలా.. 75 వేల ఇళ్ల నిర్మాణం పూర్తికావాలి: సీఎం జగన్
పెండింగ్‌లో ఉన్న అప్రోచ్‌రోడ్ల నిర్మాణం, లెవెలింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. టిడ్కో ఇళ్లను ఈ నెలాఖరుకల్లా లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారం రోజుల్లో నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి నెలా కనీసం 75 వేల ఇళ్ల నిర్మాణం పూర్తికావాలన్నారు.’పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న లేఅవుట్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అప్రోచ్‌రోడ్ల నిర్మాణం, లెవెలింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలి. వాటికి కావాల్సిన రూ.700 కోట్ల నిధులను వారం రోజుల్లో విడుదల చేస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ జిల్లా కలెక్టర్లకు తెలిపారు. ప్రతి నెలా కనీసం 75 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్నారు. కోర్టు కేసుల వల్ల పంపిణీ చేయని ఇళ్ల పట్టాల విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులు సమీక్షించి ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేస్తారని చెప్పారు. స్పందన కార్యక్రమం, ఉపాధి హామీ, గ్రామ, వార్డు సచివాలయాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, పేదలకు ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణం వంటి వివిధ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. 90 రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి కొత్తగా 2,11,176 మంది లబ్ధిదారులను గుర్తించగా… 1,12,262 మందికి పట్టాల పంపిణీ జరిగిందని, మిగతా 98,914 మందికి అవసరమని భూమిని త్వరలోనే గుర్తించి పట్టాలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. టిడ్కో ఇళ్లను ఈ నెలాఖరుకల్లా లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ అంశాలపై సీఎం పలు ఆదేశాలిచ్చారు.జాప్యాన్ని సహించను:* గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు, బీఎంసీలు, ఏఎంసీల భవనాల నిర్మాణంలో జాప్యాన్ని సహించేది లేదు. రుతుపవనాలు ముందుగా వస్తే వ్యవసాయ పనులు ఊపందుకుంటాయి. ఉపాధి హామీ పనులకు సంబంధించి ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.

*నేను బాధపడను… నా సేవ తెలంగాణ ప్రజలకు అందిస్తున్నా: Tamilisai
రాష్ట్రానికి సేవ చేయడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు అవకాశం కల్పించారని గవర్నర్ తమిళిసై అన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రానికి సేవ చేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ‘‘నేను బాధపడను.. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న నా సేవ తెలంగాణ ప్రజలకు అందిస్తున్నా. రాష్ట్రానికి గవర్నర్ కాదు…. మీ అంద

*తెలంగాణలో శ్రీలంక మాదిరి పరిస్థితులు రాబోతున్నాయ్: Bandi sanjay
కుటుంబ పాలనతో శ్రీలంక మాదిరి పరిస్థితులు తెలంగాణలో రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) ఎనిమిదేళ్ల పాలన భేష్ అని అన్నారు. మోదీ సుపరిపాలనను తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని తెలిపారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి తెలుగు ప్రభుత్వం దిగజారిపోయిందని విమర్శలు గుప్పించారు. 60 ఏళ్ళల్లో కాంగ్రెస్ సాధించిన దానికంటే.. ఎనిమిదేళ్ళల్లో మోదీ రెట్టింపు అభివృద్ధి చేశారని చెప్పుకొచ్చారు. సీఎం‌ కేసీఆర్‌ రైతు ద్రోహి అని… సీఎం మూర్ఖత్వంతో కనీస మద్దతు ధర కూడా రావటం లేదని ఆయన మండిపడ్డారు.

*AAP మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ జైల్లో వేయండి: BJPకి కేజ్రీ సవాల్
ఢిల్లీ హోంమంత్రి సత్యేంద్ర జైన్‌ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తుండడంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇలా ఒక్కరొక్కర్ని అరెస్ట్ చేయడం కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి అరెస్ట్ చేసి జైల్లో వేయమండంటూ భారతీయ జనతా పార్టీ కి ఆయన సవాల్ విసిరారు. నిజానికి విజ్ఞప్తి పూర్వకంగానే అడుగుతున్నట్లు కేజ్రీ చెప్పినప్పటికీ ‘‘ఏం కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. విచారణ చేసుకోండి’’ అంటూ గట్టిగానే చెప్పారు. ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ విచారణ పేరు మీద సమయం వృధా అవుతోందని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఇది ఆటంకంగా మారుతోందని, అందుకే ఒకేసారి అందరినీ అరెస్ట్ చేసి విచారిస్తే.. ఆ తర్వాత తాము తమ పని నిర్వర్తించుకుంటామని కేజ్రీ వివరణ ఇచ్చారు.

*కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర సాధన లక్ష్యాలు సాధ్యం: భట్టి విక్రమార్క
తెలంగాణ వస్తే అన్ని వర్గాల వారు బాగుంటారని అందరూ ఆశించారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు అవుతుందని.. అయినా ఇప్పటికి తెలంగాణ ఆశయాలు సాకారం కాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధన లక్ష్యాలు సాధ్యమయ్యాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ పోయి..అప్పుల పాలైందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

*రైతులను మోసగిస్తున్న కేసీఆర్‌కు బుద్ధిచెప్పాలి
రైతులను మోసగిస్తున్న కేసీఆర్‌కు బుద్ధిచెప్పాలని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల పిలుపు ఇచ్చారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో కొనసాగింది. కొత్తకుప్పెనకుంట్లలో నిర్వహించిన రైతుగోస ధర్నాలో ఆమె మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా రైతులను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేస్తానని ఇంతవరకు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకుని వడ్డీలకు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందన్నారు. తన తండ్రి వైఎ్‌సఆర్‌ హయాంలో రైతులకు మద్దతు ధరతో పాటు బోన్‌సలు కూడా ఇచ్చి పంట కొనుగోలు చేశారని గుర్తుచేశారు. సాయంత్రం గంగదేవిపాడులో మాటాముచ్చట కార్యక్రమంలో మాట్లాడారు. బంగారు తెలంగాణ అంటున్న ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయన్నారు. తాము అధికారంలోకి వస్తే అర్హులందరికీ పింఛన్‌ ఇస్తామని, ప్రతి కుటుంబానికి మహిళల పేరుతో పక్కా ఇల్లు ఇస్తామని చెప్పారని, ఏదీ అమలుచేయలేదని విమర్శించారు.

*రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పం: జగదీష్‌రెడ్డి
ప్రతి రైతును లక్షాధికారిగా మార్చడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ అహర్నిశలు శ్రమించేది రైతుల కోసమేనని స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు లాభదాయక పంటల వైపు దృష్టి సారించాలని కోరారు. 2014 సంవత్సరానికి ముందు ఏ పరిస్థితుల్లో ఉన్నామో మననం చేసుకోవాలన్నారు. విద్యుత్తు, నీళ్లు, పెట్టుబడి సాయం అందించిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. 2018 తర్వాత సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 24గంటల విద్యుత్తు సరఫరా చేస్తుంటే, కాసేపైనా విరామం ప్రకటించాలని రైతులు విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఈ ఘటనతో విద్యుత్‌ రంగంలో ఎలాంటి అద్భుతాలు సృష్టించామో అర్థమవుతుందని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు.

*తెలంగాణ ఉత్సవాలు సరే.. ఇచ్చిన హామీల మాటేమిటి?: వినోద్‌కుమార్‌
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తామంటోందని, కానీ విభజన చట్టంలో ఇచ్చిన హామీల మాటేమిటని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు ప్లాంట్‌, పసుపుబోర్డు, కాజిపేట రైల్వేకోచ్‌ వంటి వాటిపై వైఖరిని కేంద్రమంత్రి అమిత్‌షా స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నోసార్లు కోరినా పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చే అప్పులు ఉత్పాదక రంగానికే కేటాయిస్తోందన్నారు. అవగాహన లేకుండా ఎవరో రాసిచ్చిన స్ట్ర్కిప్టు చదువుతూ బీజేపీ రాష్ట్ర అధ్యకుడు బండి సంజయ్‌కుమార్‌ నవ్వుల పాలవ్వుతున్నారని వినోద్‌కుమార్‌ ఎద్దేవాచేశారు.

*సోనియా, రాహుల్కు ఈడీ నోటీసులను ఖండిస్తున్నాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
సోనియా, రాహుల్కు ఈడీ నోటీసులను ఖండిస్తున్నామని తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. గాంధీ కుటుంబం తప్పు చేసిందని ప్రచారం చేసే కుట్ర ఇదని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఆమోదించరని, బండి సంజయ్వి అన్నీ పిచ్చి మాటలని ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణను కేసిఆర్ అప్పుల కుప్పగా మార్చారని, తెలంగాణ దోపిడీ దొంగల వ్యవస్థగా మారిందని ఉత్తమ్ దుయ్యబట్టారు

*అల్లర్లు వైసీపీ ఓట్ల రాజకీయమే: సోము
‘‘కోనసీమ గొడవలు ఓట్ల రాజకీయంలో భాగంగా అధికార వైసీపీ చేయించినవే. అంబేడ్కర్‌ పేరు పెడితే గొడవలు ఎందుకు జరిగాయో ప్రభుత్వం చెప్పాలి. మేకపాటి గౌతమ్‌రెడ్డి అంటే మాకు గౌరవమే. అయితే కుటుంబ పార్టీలకు బీజేపీ వ్యతిరేకం. అందుకే ఆత్మకూరులో పోటీ చేస్తుంది’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. విజయవాడలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. రాజమహేంద్రిలో ఈ నెల 7న నిర్వహించే బహిరంగ సభకు జేపీ నడ్డా వస్తారని చెప్పారు.

*పొత్తులపై పవన్‌దే నిర్ణయం: Nagababu
పొత్తులపై తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ నిర్ణయం తీసుకుంటారని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు స్పష్టం చేశారు. వైసీపీ పాలన ఎలా ఉందో ప్రజలకే బాగా తెలుసని పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాలవారీగా నాగబాబు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం గడపగడపకు వెళ్తున్న వైసీపీ నాయకులకు ఎటువంటి పరిణామాలు ఎదురవుతున్నాయో అందరికీ తెలుసు. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాం. త్వరలో అన్ని నియోజవర్గాలకు ఇన్‌చార్జిలను నియమిస్తాం. ఉత్తరాంధ్రలో జనసైనికుల్లో జోష్‌ నింపేందుకు వచ్చాను. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నా. నియోజకవర్గాలవారీ పార్టీ శ్రేణులతో చర్చించిన అంశాలను మా పీఏసీ దృష్టికి తీసుకువెళతాం’’ అని నాగబాబు తెలిపారు.

*మహానాడును చూసి TDP తెగ సంతోషపడుతోంది: సజ్జల
మహానాడును చూసి టీడీపీ తెగ సంతోషపడుతోందని ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో విజయం సాధించినట్లు పొంగిపోతున్నారని ఎద్దేవాచేశారు. మహానాడులో టీడీపీనేతలంతా అబద్ధాలే చెప్పారని మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే మహానాడు నిర్వహించినట్టుందన్నారు. బీసీ మంత్రుల బస్సుయాత్రను చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ దావోస్‌ పర్యటనపై విషప్రచారం చేశారు చేస్తున్నారని, తమపై విమర్శలు చేయడమే టీడీపీ పనిగా పెట్టుకుందని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.

*వైకాపా మంత్రులంతా చరిత్రహీనులే: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
పదవులు, అధికారం కోసం సొంత వర్గాలను పాలకులకు తాకట్టుపెడుతున్న వైకాపా మంత్రులంతా చరిత్రహీనులేనని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. సామాజిక విద్రోహానికి పాల్పడిన వైకాపా ప్రభుత్వం, సామాజిక న్యాయంపై మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. సామాజిక విద్రోహానికి పాల్పడిన వైకాపా ప్రభుత్వం, సామాజిక న్యాయంపై మాట్లాడటం హాస్యాస్పదమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. దళిత, బీసీ, మైనారిటీలను జగన్మోహన్ రెడ్డి అణచివేస్తున్నది వాస్తవం కాదా అని ఆయన నిలదీశారు. కొద్దిమందికి మంత్రి పదవులిచ్చి, ఆయా వర్గాలకు చెందిన మిగిలిన వారిని ఇబ్బందులకు గురి చేయడం ప్రభుత్వ సామాజిక న్యాయమా అని ధ్వజమెత్తారు. అణగారిన వర్గాల అణచివేతపై వైకాపా ‎ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రిని ఎందుకు ప్రశ్నించలేదని విమర్శలు చేశారు. ఇది సామాజిక ద్రోహం కాదా అని నిలదీశారు. వైస్ ఛాన్సలర్ పదవుల్లో జగన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మొండిచెయ్యి చూపారన్నారు. పదవులు, అధికారం కోసం సొంత వర్గాలను పాలకులకు తాకట్టుపెడుతున్న మంత్రులంతా చరిత్రహీనులేనని కొల్లురవీంద్ర ధ్వజమెత్తారు.దువ్వాడ శ్రీను తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుకు మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు దుయ్యబట్టారు. ఒక రౌడీషీటర్ని మండలికి పంపిస్తే ఇలానే ఉంటుందని ఆయన అన్నారు. మహానాడు విజయవంతం కావటంతో వైకాపా నేతల మూర్ఖత్వం పరాకాష్టకు చేరిందని విమర్శించారు. దువ్వాడ శ్రీను తీరు మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని మంతెన సత్యనారాయణరాజు హెచ్చరించారు

*నష్టాలను సాకుగా చూపి.. జెన్‌కో అదానీ పరం చేసే యత్నం: సోమిరెడ్డి
నెల్లూరు జిల్లా నెలటూరులోని థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటు పరం చేయాలని ప్రయత్నిస్తున్నారని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. నష్టాలను సాకుగా చూపి జెన్‌కోను అదానీ పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరు శ్రీదామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణకు కుట్రలు పన్నుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత సాంకేతిక ప్రమాణాలతో థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించామన్నారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.నష్టాలను సాకుగా చూపి జెన్కోను అదానీ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. యాష్ పాండ్ సకాలంలో శుభ్రం చేయకపోవటమే ప్రమాదానికి కారణమన్నారు. ప్రమాదంపై ప్రభుత్వం విచారణ జరిపించి.. త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. వీలైనంత త్వరగా విద్యుదుత్పత్తిని ప్రారంభించాలని సోమిరెడ్డి సూచించారు.

*గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చే హక్కు లేదా?: రామకృష్ణ
సీపీఐ, దళిత సంఘాల నేతల అక్రమ అరెస్టులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులను, హత్యలను నిరసిస్తూ జూన్‌ 2న చలో రాజ్‌భవన్‌కు పిలుపునిచ్చామన్నారు. జిల్లాల్లో పోలీసులు సీపీఐ, దళిత సంఘాల నేతలను ముందస్తుగా అరెస్టులు చేయడం దుర్మార్గం అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపి, గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చే హక్కు కూడా లేదా? అని ఆయన ప్రశ్నించారు.

*దావోస్‌ వెళ్లి రాష్ట్రానికి తెచ్చిందేమీలేదు: తులసిరెడ్డి
‘‘ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పెట్టుబడుల కోసం దావోస్‌కు వెళ్లాడు.. వచ్చాడు. అంతేకాని రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబడులు తేలేదు’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. దావోస్‌కని చెప్పి రహస్యంగా లండన్‌ వెళ్లడం దాచిపెట్టే అంశం కాదన్నారు. తన కూతుళ్లు లండన్‌లో చదువుతున్నారు కాబట్టే లండన్‌ కెళ్లానని చెప్పవచ్చన్నారు. జగన్‌ పర్యటన మాత్రం తాను సంపాదించిన మొత్తాన్ని దాచుకోవడానికో, లేక అక్కడ దోచుకోవడానికో వెళ్లాడనే సందేహం కలుగుతుందన్నారు. సీఎం టూర్‌ ప్రోగ్రామ్‌తో రాష్ర్టానికి ఒరిగిందేమి లేదన్నారు.

*అలాగైతే కాంట్రాక్టర్లు సర్వనాశనం: బీజేపీ
ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్టర్లు ‘ఇచ్చినప్పుడే బిల్లుల మొత్తం తీసుకోవాలి. వాటి కోసం కోర్టులకు వెళ్లకూడదు’ అని జల వనరుల శాఖ కొత్తగా పెట్టిన నిబంధనను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు తీవ్రంగా ఖండించారు. ‘‘నాకు కాంట్రాక్టర్‌గా 40 ఏళ్ల అనుభవం ఉంది. ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి నిబంధనతో టెండర్లు ప్రభుత్వ శాఖలు పిలవడం చూడలేదు. ఇది ప్రభుత్వం దివాళాకోరు తనానికి నిదర్శనం. ఫలానా సమయంలోగా బిల్లు ఇస్తామని చెప్పకుండా, ఇచ్చినప్పుడే తీసుకోవాలని చెప్పడం తగదన్నారు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లడం కాంట్రాక్టర్ల ప్రాథమిక హక్కు. దానిని హరించడం తగదు. తక్షణమే ఆ షరతులను ఉపసంహరించుకోవాలని బీజేపీ తరఫున డిమాండ్‌ చేస్తున్నాం’’ అని విష్ణుకుమార్‌రాజు అన్నారు.

*చంద్రబాబు భ్రమల్లో ఉన్నారు: సజ్జల
మహానాడు తర్వాత అధికారంలోకి వచ్చేసినట్లుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు భావిస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘మ హానాడులో వైసీపీని తిట్టడమే పనిగా చంద్రబాబు పెట్టుకున్నారు. మహా నాడును ఎందుకు నిర్వహించారో అర్థం కావడం లేదు’’ అని సజ్జల అన్నారు

*తొందరపడకుండా ఉండాల్సింది: దివ్యవాణి
తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి బుధవారం ఇక్కడ ఆ పార్టీ అధినేత చంద్రబాబుని కలిశారు. ముందు రోజు తన రాజీనామాకు కారణమైన పరిస్థితులను వివరించారు. తర్వాత ఆమె అక్కడే మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘నకిలీ పోస్టింగులు చూసి నేను తొందరపడి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పోస్టు పెట్టాను. తొందరపడకుండా ఉండాల్సింది. చంద్రబాబు కూడా అదే చెప్పారు’’ అని దివ్యవాణి తెలిపారు.