Politics

తెలంగాణ.. దేశానికి దిశ చూపే కరదీపిక

తెలంగాణ.. దేశానికి దిశ చూపే కరదీపిక

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశానికే దిశానిర్దేశం చేసే రాష్ట్రంగా తెలంగాణ మారిందని తెలిపారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రజలందరికీ రాష్ట్రావిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఎనిమిదేళ్లలోనే ఐటీ, పారిశ్రామిక రంగాల్లలో దేశానికే ఆదర్శంగా నిలిచామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే దేశానికి దిశానిర్దేశం చేసే కరదీపికగా మారామని వెల్లడించారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్.. జాతీయ పతాకాన్నిఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాష్ట్రావతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

దేశంలోనే అగ్రస్థానం:
ఎనిమిదేళ్లలో వృద్ధిరేటులో దేశంలోనే అగ్రస్థాయిలో నిలిచాని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలో అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించామని వెల్లడించారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించామని.. ప్రస్తుతం 4,400 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రకటించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టి అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో బిందెల కొట్లాట, తాగునీటి కోసం యుద్ధాలు లేవన్నారు. తెలంగాణ వచ్చాక రైతు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించామని.. రాష్ట్రం సజల, సుజల, సస్యశ్యామల తెలంగాణగా మారిందని కేసీఆర్‌ పేర్కొన్నారు.
“2014-19 మధ్య 17.24 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థాయిలో నిలిచాం. విద్యుత్‌ రంగంలో స్వయం సమృద్ధి సాధించాం. మిషన్‌ భగీరథ పథకం అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. రాష్ట్రంలో బిందెల కొట్లాట, తాగునీటి కోసం యుద్ధాలు లేవు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు మెరుగుపరిచాం. దేశంలో అత్యుత్తమ వైద్యసేవలు అందించే తొలి 3 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్షా 35వేల ఉద్యోగాలు భర్తీ చేశాం.. మరో 90వేలు భర్తీ చేస్తున్నాం. స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నాం.” – కేసీఆర్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి

సాగునీటి ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేశాం:
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశామని.. కోటి ఎకరాలకు పైగా సాగునీరు అందించడమే లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 15 లక్షలకు పైగా ఎకరాలను స్థిరీకరణ చేసుకున్నామని వెల్లడించారు. దళితుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. దళితబంధు ద్వారా అనేకమంది ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. దళితబంధు కోసం బడ్జెట్‌లో రూ.17,700 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.సొంతింటి కల సాకారం చేస్తున్నాం: రాష్ట్రంలో గూడు లేని నిరుపేదల సొంతింటి కల సాకారం చేస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 975 గురుకుల విద్యాలయాలు ఉన్న ఏకైక రాష్ట్రం మనదేనని తెలిపారు. మనఊరు-మనబడి ద్వారా పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళా, అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

తొలి 3 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి..:
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్దఎత్తున మౌలిక వసతులను మెరుగు పరిచామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింత పెరిగేలా మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా ఇప్పటివరకు 13 లక్షలమందికి పైగా లబ్ధి చేకూరిందన్నారు. బస్తీ దవాఖానాల ద్వారా పట్టణాలు, నగరాల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ నలుమూలలా 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఒక్కో ఆస్పత్రిలో వెయ్యి పడకలు ఉంటాయని.. నిమ్స్‌ ఆస్పత్రిలో మరో 2 వేల పడకలు పెంచుతున్నట్లు ప్రకటించారు. వరంగల్‌లో హెల్త్‌సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి చర్యలో మానవీయ కోణమే కనిపిస్తుందని సీఎం పేర్కొన్నారు. దేశంలో అత్యుత్తమ వైద్యసేవలు అందించే తొలి మూడు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని సీఎం కేసీఆర్ అన్నారు.లక్షా 35 వేల ఉద్యోగాలు భర్తీ: రాష్ట్రం వచ్చాక లక్షా 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు. ప్రస్తుతం మరో 90 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక అభ్యర్థులకు 95 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అవకాశమున్న ప్రతిచోటా చేపల పెంపకం చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. మత్స్యకారుల జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని.. చెరువులు, జలాశయాల్లో చేపల పెంపకం పెరిగిందని తెలిపారు. మద్యం దుకాణాల్లో గౌడ సోదరులకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించామని సీఎం అన్నారు. ప్రభుత్వ చర్యలతో అన్ని వృత్తులవారి ఆదాయం పెరిగిందని పేర్కొన్నారు. మా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 192 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేసిందని వెల్లడించారు.

భూ రికార్డుల్లో పారదర్శకత:
భూ రికార్డుల్లో పారదర్శకత కోసం ధరణి పోర్టల్‌ తెచ్చామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. కొత్త జిల్లాలు, మున్సిపాలిటీలు, మండలాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. అన్ని తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చామని స్పష్టం చేశారు. హైదరాబాద్​లో 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సచివాలయం నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో యాదాద్రిని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం మన హైదరాబాద్‌లో 1,500 ఐటీ కంపెనీలు ఉన్నాయని.. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో 21 లక్షల ఉద్యోగాలు వచ్చాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు.