Health

మందార టీతో ఆరోగ్యం

మందార టీతో ఆరోగ్యం

మన ఇళ్ల దగ్గర విరివిగా లభించే మందారలో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మందార టీలో సి, ఎ విటమిన్లతో పాటు జింక్‌, ఇతర ఖనిజ లవణాలు, యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మందారతో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం.. నిత్యం మందార టీని తాగుతుండడం వల్ల అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. నూట్రియెంట్లు, ఫ్లేవనాయిడ్లు, మినరల్స్‌ ఎక్కువగా ఉండే మందారతో ఒంట్లో కొవ్వు తగ్గుతుంది. యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వలన మెటబాలిజం పెరిగి ఊబకాయం తగ్గుతుంది.మందారలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామెటరీ గుణాల వల్ల బిపి నియంత్రణలో ఉంటుంది. యూరినేషన్‌ పెరుగుతుంది. తద్వారా రక్తపోటు అదుపులో ఉంటుంది.మందార యాంటీ డిప్రసెంట్‌గా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో ఫ్లేవనాయిడ్లు మనలో ఉండే నెగెటివ్‌ థింకింగ్‌ను దూరం చేస్తాయి. బాధలో ఉన్నప్పుడు గానీ, ఒత్తిడిలో ఉన్నా గానీ కప్పు మందార టీ తాగితే ప్రశాంతంగా అనిపిస్తుంది.మందార టీలో ఎక్కువగా ఉండే విటమిన్‌ సి ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫ్లూలాంటి సమస్యలు దరిచేరవు. ఇందులోని యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామెటరీ గుణాల కారణంగా ఆయుర్వేదంలో ఇది ఎంతో విలువైన ఔషధం.మందారలో ఉండే ఎమినో యాసిడ్లు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మందార టీని క్రమం తప్పకుండా తాగితే జుట్లు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు, తెల్ల వెంట్రుకలు సమస్యలూ తగ్గుతాయి. అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం నుంచి చర్మానికి రక్షణ ఇస్తుంది. చర్మంపై ముడతలను తగ్గిస్తుంది.

*టీ తయారీ ఎలా :
మందార పువ్వులను ఎండలో ఆరబెట్టి నిల్వచేసుకోవాలి. రెండు లేదా మూడు టీ స్పూన్ల మందార రేకులను రెండు కప్పుల నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. వడగట్టిన తర్వాత రుచి కోసం కాస్త తేనె, నిమ్మరసం కలుపుకుంటే సరి. ఈ టీ కోసం తాజా పూలనూ ఉపయోగించొచ్చు. మరిగించిన నీటిలో రెండు మూడు పూవులను వేయగానే రంగును కోల్పోతాయి. వాటిని తీసేసి టీ తాగొచ్చు.