Movies

అంతకంటే అదృష్టమా?

అంతకంటే అదృష్టమా?

అగ్ర కథానాయిక సమంత సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన విశేషాల్ని పంచుకోవడంతో పాటు ఫిజికల్‌ వర్కవుట్స్‌ తాలూకు వీడియోలను తరచుగా షేర్‌ చేస్తుంటుంది. ఇటీవల ఎక్కువగా తాత్విక భావాలు స్ఫురించే కొటేషన్స్‌ ను పోస్ట్‌ చేస్తూ తన అంతరంగాన్ని అభిమానుల ముందుంచే ప్రయత్నం చేస్తున్నది. సోషల్‌మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్‌ ను ఏమంత సీరియస్‌గా తీసుకోదు సమంత. అవసరమైతే కాస్త వ్యంగ్యాత్మక ధోరణిలో తన స్పందన తెలియజేస్తుంటుంది. తాజాగా ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చేసిన కామెంట్‌కు అదే రీతిలో సమాధానమిచ్చింది. తన పెంపుడు కుక్కలతో తీసుకున్న ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది సమంత. దీనిపై ఓ నెటిజన్‌ ‘నీ ఒంటరి జీవితం మొత్తం వీటితోనే అంతమైపోయేటట్లు ఉంది’ అని కామెంట్‌ చేశాడు. ‘అదే జరిగితే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది?’ అంటూ సమంత అతనికి సమాధానమిచ్చింది. వ్యంగ్యంతో కూడిన ఆ మాటలతో సమంత సదరు నెటిజన్‌కు గట్టిగా కౌంటర్‌ ఇచ్చిందని ఆమె అభిమానులు సంతోషపడుతున్నారు. ప్రస్తుతం సమంత తెలుగులో ‘యశోద’ ‘ఖుషి’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.