NRI-NRT

ప్రవాసులకు తీపి కబురు.. ఉపాధి వీసా ఫీజులు భారీగా తగ్గింపు!

ప్రవాసులకు ఒమన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉపాధి వీసా జారీ, పునరుద్ధరణ ఫీజులను భారీగా తగ్గించింది. ఇక ఒమానిజేషన్ పాలసీకి కట్టుబడి ఉన్న కంపెనీలకు ఈ తగ్గింపు అనేది ఏకంగా 85 శాతం వరకు ఉంటుందని ఆ దేశ కార్మిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. సుల్తాన్ హైతం బిన్ తారిక్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఫస్ట్‌క్లాస్ ప్రొఫెషన్‌కు చెందిన వర్క్ పర్మిట్ల ఫీజును 301 ఒమన్ రియాల్(రూ.60వేలు)గా నిర్ణయించింది. ఇంతకుముందు ఇది 2001 ఆర్ఓగా(రూ.4లక్షలు) ఉండేది. ఒకవేళ ఒమానిజేషన్ శాతానికి కట్టుబడి ఉంటే ఈ రుసుము కేవలం 211 ఆర్ఓ(రూ.42) చెల్లిస్తే సరిపోతుందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

ఇక ప్రత్యేక, సాంకేతిక స్థానాలకు వీసా ఫీజును 251 ఆర్ఓ(రూ.51వేలు)కు తగ్గించింది. ఇంతకుముందు ఇది 1001 ఆర్ఓగా(రూ.2లక్షలు) ఉండేది. కంపెనీల ద్వారా ఒమానిజేషన్ రేషియో కలిసినట్లయితే రేటు 30 శాతం తగ్గి ఆర్ఓ 176కి(రూ.35వేలు) చేరుతుంది. ఇకపోతే నైపుణ్యం లేని ఉద్యోగాలకు సంబంధించిన వీసా ఫీజు ఆర్ఓ 210కి(రూ.42వేలు) తగ్గించింది. ఇంతకుముందు ఇది ఆర్ఓ 301(రూ.60వేలు)గా ఉండింది. ఒకవేళ ఒమానిజేషన్ శాతాన్ని సంతృప్తిపరిస్తే కేవలం ఆర్ఓ 141(రూ.28వేలు) చెల్లించాల్సి ఉంటుంది.