DailyDose

వెంటాడి తెగ నరికారు.. తెదేపా కార్యకర్త దారుణ హత్య! – TNI నేర వార్తలు

వెంటాడి తెగ నరికారు.. తెదేపా కార్యకర్త దారుణ హత్య!  – TNI  నేర వార్తలు

*పల్నాడులో మరో ఘాతుకం చోటుచేసుకుంది. తెలుగుదేశం కార్యకర్త జల్లయ్యను…. ప్రత్యర్థులు కిరాతకంగా హత్య చేశారు. 2019 తర్వాత వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక అధికార పార్టీ నేతల దాడులను తట్టుకోలేక… పల్నాడులో చాలా మంది తెలుగుదేశం సానుభూతిపరులు స్వగ్రామాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. హతుడు జల్లయ్య కూడా స్వగ్రామం దుర్గి మండలం జంగమేశ్వరపాడు వదిలి గురజాల మండలం మాడుగులలో తలదాచుకుంటున్నారు. కుటుంబంలో పెళ్లి నేపథ్యంలో బ్యాంకు పనినిమిత్తం, శుభలేఖలు పంచేందుకు ఆయన దుర్గి వచ్చారు. అక్కడి నుంచి బొల్లాపల్లి మండలం రావులాపురానికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో జంగమేశ్వరపాడు మీదుగా వస్తారని తెలుసుకున్న ప్రత్యర్థులు….గ్రామ సమీపంలోని మించాలపాడు అడ్డరోడ్డు వద్ద కాపు కాశారు.

*కాకినాడ జిల్లా సామర్లకోట-పెద్దాపురం ఏడీబీ రోడ్డులో అపర్ణా సిరామిక్ సమీపాన యూ టర్న్ తిరుగుతున్న లారీని వెనుక నుంచి మరో లారీ అతి వేగంగా ఢీకొన్న ప్రమాద సంఘటనలో ఢీకొన్న లారీ డ్రైవర్ ఎండీ అబ్రహం(35) కాబిన్ లోనే చిక్కుకుని కాళ్ళు నుజ్జు నుజ్జు అయ్యి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో తుడు లారీ డ్రైవర్ అబ్రహం కృష్ణా జిల్లా గుడివాడ కు చెందిన వ్యక్తిగా పెద్దాపురం పోలీసులు గుర్తించారు. కాకినాడ నుంచి ఏడీబీ రోడ్డులో అపర్ణా సిరామిక్ సంస్థకు వెళుతున్న లారీని కాకినాడ నుంచి గుడివాడ వెళుతున్న లారీ వెనుక నుంచి అతివేగంగా ఢీకొంది. డ్రైవర్ అబ్రహం మృతదేహం లారీ క్యాబిన్ శకలాలల్లో ఇరుక్కుపోవడం తో పెద్దాపురం పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చేందుకు ఎంతో శ్రమించాలిసివచ్చింది. మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి డ్రైవర్ అబ్రహం కుటుంబ సబ్యులకు సమాచారమందించారు. కేసు పెద్దాపురం పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*కాకినాడ జిల్లా తృటిలో తప్పిన ఘోర ప్రమాదం. తుని జాతీయరహదారి పై తృటిలో పెను ప్రమాదం తప్పింది. భారీ లోడుతో వెళ్తున్న ఐచర్ వ్యాను అదుపుతప్పి డాల్ఫిన్ ఆర్టీసీ బస్సు పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇరువురి డ్రైవర్లకు తీవ్ర గాయాలు అవ్వగా బస్సులో ఉన్న కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఏసీ బస్సు కావడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు చాలా ఆందోళనకు గురయ్యారు. ప్రయాణికులు భయాందోళన తో బస్సు అద్దాలు పగలగొట్టుకుని బయటకి వచ్చారు. ఈ బస్సు విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తుండగా తుని తాండవ బ్రిడ్జి మీద ఈ ఘటన చోటుచేసుకుంది.

*ఉత్తర్ప్రదేశ్, హాపుడ్ జిల్లాలోని ధౌలానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ రసాయన పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగింది. బాయిలర్ పేలుడుతో పెద్ద ఎత్తున మంటలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా… పలువురు మంటల్లో చిక్కుకున్నట్లు స్థానికులు తెలిపారు. 10 మందికిపైగా గాయపడినట్లు చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం.. ఆరు అగ్నిమాపక యంత్రాలతో సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తోంది.

* హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ పబ్‌కు వచ్చిన 17 ఏళ్ల బాలికతో పరిచయం చేసుకుని ఇంటికి తీసుకెళ్తామని నమ్మించి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో.. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న ఒకరిని అదుపులోకి తీసుకోగా.. ఇవాళ ఉదయం మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బాలికపై సామూహిక అత్యాచార ఘటనపై రాజకీయంగా దుమారం రేగింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ప్రతిపక్షాలు ధర్నాలు చేశాయి.

*చైనాలో బుల్లెట్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. ఈ ఘ‌ట‌న‌లో ఆ రైలు డ్రైవ‌ర్ మృతిచెందాడు. మ‌రో ఏడు మంది ప్ర‌యాణికులు గాయ‌ప‌డ్డారు. గుయాంగ్ నుంచి గువాంగ్‌జూకు వెళ్తున్న డీ2809 రైలు గుజావు వ‌ద్ద ప‌ట్టాలు త‌ప్పింది. రైలుకు చెందిన రెండు కోచ్‌లు ప‌ట్టాలు త‌ప్పాయి. మ‌ట్టిచ‌రియ‌లు విరిగిప‌డ‌డం వ‌ల్ల ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు భావిస్తున్నారు. రైలు ఇంజిన్ ప‌ట్టాలు త‌ప్పి రాంగ్‌జియాంగ్‌ ఫ్లాట్‌ఫామ్ మీద‌కు దూసుకువెళ్లింది. ట్రైన్ ఇంజిన్ పూర్తిగా ధ్వంస‌మైంది. గ‌జావు గ‌త కొన్ని రోజుల నుంచి వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప‌ట్టాల మీద‌కు మ‌ట్టి, రాళ్లు కొట్టుకువ‌చ్చాయి. అయితే బుల్లెట్ రైలు వెళ్తున్న స‌మ‌యంలో ఆ మ‌ట్టికుప్ప ప‌ట్టాల‌పై ప‌డిన‌ట్లు భావిస్తున్నారు.

*నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండలంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి శవమై తేలాడు. అయిటిపాములకు చెందిన రాజశేఖర్ (27) అనే యువకుడు గత నెల 31వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. కాగా, శనివారం ఉదయం రామచంద్రగూడెం శివారులో అతని మృదేహాన్ని పోలీసులు గుర్తించారు. తోటి స్నేహితుడే హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రాజశేఖర్‌ను హతమార్చినట్టు సమాచారం. హత్య అనంతరం నిందితుడు మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*వైసీపీ చేతిలో దారుణ హత్యకు గురైన టీడీపీ నేత జల్లయ్య అంత్యక్రియలకు వెళుతున్న తెలుగుదేశం నేతల అరెస్టులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. ఆసుప్రత్రి నుంచి మృతదేహాన్ని ఎక్కడికి తరలించారో కుటుంబ సభ్యులకు కూడా చెప్పరా? అని ప్రశ్నించారు. మృతునికి సొంత గ్రామంలో దహన సంస్కారం చేసే అవకాశం కూడా బంధువులకు ఇవ్వరా? అంటూ మండిపడ్డారు. ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారన్నారు. హత్యల వెనుక ఎమ్మెల్యే పిన్నెల్లి హస్తం ఉందని ఆరోపించారు. ప్రత్యేక కోర్టు పెట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

*హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన బాలిక రేప్ కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఇక్కడి వ్యవస్థపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ప్రభుత్వ నిర్లిప్తత వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మర్డర్, రేప్‌లు జరుగుతున్నా దోషులను పట్టుకోవడం లేదని, వారు బయట దర్జాగా తిరుగుతున్నారని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

*కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్లలో కరెంటు తీగలు లారీకి తగలడంతో ఒక వ్యక్తి మరణించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో విద్యుత్ షాక్ కావటంతో లారీలో ఉన్న పదిహేను మంది కూలీలకు స్వల్ప గాయలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులు పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు గ్రామానికి చెందిన వారని తెలుస్తోంది.

*మర్రిపాడు మండలంలోని నందవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయగిరి రహదారిపై కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు..ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేత జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబును పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రిలోకి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అరవింద్ బాబును అరెస్ట్ చేసే సమయంలో పోలీసులతో వాగ్వాదం తోపులాటలు జరిగాయి.

*కారంచేడు మండలంలో వైసీపీ ఎంపీపీ వాసు రేషన్ బియ్యం దందా నిర్వహించారు. కారంచేడు మండలం స్వర్ణలో అనుమతి లేకుండా ఎంపీపీ రైస్ మిల్లులు నడుపుతున్నారు. రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 517 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. మిల్లు యజమాని వైసీపీ ఎంపీపీ వాసు సహా మరో నలుగురిపై 6ఏ కేసుతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

*పత్తికొండ మండలం ఛందోలిలో ప్రియుడు మోసం చేశాడని అతని ఇంటి ముందు దళిత యువతి బైఠాయించింది. రవి అనే యువకుడు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మొహం చాటేశాడని హోలాగుంద మండలానికి చెందిన యువతి ఆందోళనకు దిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

*నంద్యాల: జిల్లాలోని శ్రీశైలం మండలం సున్నిపెంటకు చెందిన కాంట్రాక్టర్ రమణ ఇంటి గృహప్రవేశంలో విషాదం చోటు చేసుకుంది. నూతనంగా నిర్మించిన ఇంటికి విద్యుత్ అలంకరణ పనులు చేస్తుండగా యువకుడికి విద్యుత్ షాక్ తగిలింది. రవితేజ అనే 26 సంవత్సరాల యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా… చంద్రశేఖర్ అనే మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు.

* మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సాలిపేట గేట్ వద్ద చిన్నారి మహేశ్వరి(6)ను లారీ ఢీ కొట్టింది. లారీ చక్రాల కింద చిన్నారి శరీరము చిద్రమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.

*త్తరప్రదేశ్ అరాచక రాజ్యంగా మారిపోయింది. మహిళలపై, దళితులపై, మత మైనార్టీలపై దాడులు, అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ దమనకాండలో కొన్నిచోట్ల‌ పోలీసులు హస్తం కూడా ఉండటం ఆందోళన కలిగించే అంశం. ఓ యువతిని పోలీసులు లైంగికంగా వేధించడంతో నిన్న ఆమె ఆత్మహత్య చేసుకొని మరణించింది. యూపీలోని బుదౌన్ జిల్లా బినావర్ లో ఓ 19 ఏళ్ల యువతిని, ఆమె తల్లిని పోలీసులు తీవ్రంగా వేధించారు. బుధవారం తమ ఇంటికి వచ్చినప్పుడు స్నానం చేస్తుండగా బాత్‌రూమ్‌లో ఉన్న ఆమె తల్లిని కూడా పోలీసు సిబ్బంది వేధించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. మహిళ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…. మే 9న ఆ కుటుంబానికి వారి బంధువులతో గొడవ జరిగింది. ఘటనపై అదే రోజు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని యువతి తల్లి ఆరోపించారు. ” మే 13 న మళ్ళీ గొడవ జరిగింది. దానిపై మా బంధువులు ఫిర్యాదు చేయడంతో ఆ రోజు నుంచి పోలీసులు మా ఇంటికి రావడం ప్రారంభించారు” అని తల్లి తెలిపింది. “బినావర్ పోలీస్ స్టేషన్‌లోని పోలీసులు దాదాపు ప్రతిరోజూ మా ఇంటికి వచ్చేవారు. వారు నా కుమార్తెను కొట్టి వేధించారు” అని తల్లి ఆరోపించింది. “బుధవారం సాయంత్రం పోలీసులు మా ఇంటికి వచ్చి నేను స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ నుండి నన్ను నగ్న స్థితిలో బైటికి లాగారు. వారు నన్ను, నా కుమార్తెను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, సాయంత్రం తర్వాత తిరిగి పంపించారు. పోలీసుల తీరుతో నా కూతురు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది” అని తల్లి తెలిపింది.ఈ దుర్మార్గంలో బినావర్ పోలీస్ స్టేషన్లోని సబ్-ఇన్‌స్పెక్టర్ సంజయ్ గౌర్, ఇతర పోలీసు సిబ్బంది ప్రమేయం ఉందని ఆమె ఆరోపించింది.వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. కాగా మరణించిన యువతి కుటుంబీకుల ఆరోపణలను సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఓపీ సింగ్ తోసిపుచ్చారు.“చనిపోయిన మహిళ కుటుంబ సభ్యులకు నేర నేపథ్యం ఉంది. ఆమె సోదరుల్లో ఒకరు తీహార్ జైలులో ఉన్నారు. అతని తండ్రి, బంధువులపై పలు కేసులు నమోదయ్యాయి. పాత కేసులో అరెస్ట్ చేసేందుకు పోలీసులు వారి ఇంటిపై దాడి చేశారు. పోలీసు సిబ్బంది ఏ విధంగానూ అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, ”అని ఆయన అన్నారు. మరి పోలీసులు ఏ విధమైన అనుచిత ప్రవర్తన లేకుండా , చాలా మర్యాదగా ప్రవర్తించినప్పటికీ ఆ 19 ఏళ్ళ యువతి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అనే విషయం తేలాల్సి ఉంది…!!

* ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్‌ జిల్లాలోని పెగ్రాపల్లి వద్ద జవాన్లే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. దీంతో సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా దళానికి చెందిన నిరంజన్‌ కుమార్‌ పాశ్వాన్‌ అనే కమాండో తీవ్రంగా గాయపడ్డారు. పెగ్రాపల్లిలోని బద్గిచెరు అటవీ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు.

*టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు స‌త్య మృతి చెందాడు. గురువారం సాయంత్రం ఆక‌స్మికంగా గుండెపోటు రావ‌డంతో కుటుంబ స‌భ్యులు, ద‌గ్గ‌ర్లో ఉన్న ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతుండ‌గానే సూర్య తుది శ్వాస విడిచాడు. ఈయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు.

*సరదాగా తోటి పిల్లలతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లి ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్ ఐ రాజేందర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

*పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు.వైసీపీ వర్గీయులు దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డ జల్లయ్య అనే టీడీపీ కార్యకర్త చికిత్సపొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. దుర్గి మండలం జంగమహేశ్వరపురానికి చెందిన ముగ్గురు టీడీపీ కార్యకర్తలు బ్యాంక్ పనిపై దుర్గికి వాహనంపై బయలు దేరారు. గమనించిన వైసీపీ ప్రత్యర్థులు వారిపై వేటకొడవళ్లతో దాడి చేసి గాయపరిచారు.వీరిలో జల్లయ్య నరసారావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

*వైసీపీ వర్గీయుల దాడిలో టీడీపీ నాయకుడు చనిపోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన పల్నాడు జిల్లా దుర్గి మండలం మించాలపాడు వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. దుర్గి మండలంలో జంగమహేశ్వరపురానికి చెందిన ఆవుల మల్లయ్య, కంచర్ల బక్కయ్య, జాలయ్య (35)లు టీడీపీ నాయకులుగా వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణలు జరగడంతో వీరంతా గ్రామం విడిచి వెళ్లి గురజాల మండలం మాడుగులలో ఉంటున్నారు. మల్లయ్య కుమారుడుకి ఈ నెల 11న పెళ్లి నిశ్చయం కావడంతో నగదు కోసం వీరు శుక్రవారం దుర్గి వచ్చారు. అక్కడ బ్యాంకులో రూ.5 లక్షలు డ్రా చేసుకొని రావులపాలెం బయలుదేరారు. వారంతా మించాలపాడు సమీపంలోకి రాగానే అప్పటికే కాపుకాచి ఉన్న వైసీపీకి చెందిన 15 మంది ఒక్కసారిగా రాడ్లు, గొడ్డళ్లతో దాడికి దిగారు.

*పాకిస్తాన్‌లోని లాహోర్‌లోని గుల్బర్గ్‌లోని ది చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌లో శనివారం భారీ అగ్నిప్రమాదం చోటుచోసుకుంది. మూడో అంతస్తులోని ఫార్మసీ స్టోరేజీలో మంటలు చెలరేగడంతో లక్షలాది రూపాయలు ఖరీదు చేసే విలువైన మందులు దగ్ధమయ్యాయని అధికారులు తెలపారు. అయితే ఈ ఘటనలో ఇప్పటి వరుకు ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదని తెలిపారు. 40 మంది రెస్క్యూసిబ్బంది మమ్మురంగా సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత గల కారణాలపై దర్యాప్తు జరుపుతామని పోలీసులు తెలిపారు.

*వైసీపీ మూక‌ల చేతిలో హత్యకు గురైన టీడీపీ బీసీ నాయకుడు జల్లయ్య‌ కుటుంబ సభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ఫో న్‌లో పరామర్శించారు. జల్లయ్య భార్య, తండ్రి, తల్లితో ఫోన్లో మాట్లాడిన లోకేష్… వారిని ఓదార్చారు. జగన్ రెడ్డి చేస్తోంది సామాజిక అన్యాయమని మండిపడ్డారు. ఒకపక్క సామాజిక న్యాయ భేరి అంటూ బస్సు యాత్రలు చేస్తూ మరోపక్క బీసీ నాయకుల్ని పక్కా ప్రణాళికతో హత్యలు చేయిస్తున్నారని టీడీపీ నేత ఆరోపించారు. బీసీలు తనవైపు లేరనే కక్షతోనే తన సామాజిక వర్గం నేతల్ని బీసీ నాయకుల్ని మట్టుపెట్టాలని జగన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారన్నారు. జ‌గ‌న్‌రెడ్డి బినామీ పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి నియోజ‌క‌వ‌ర్గం మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్యచేశారని తెలిపారు

*జూబ్లీహిల్స్‌ అత్యాచారం ఘటనపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలికపై అత్యాచారం చాలా దారుణమన్నారు. ఈ దారుణానికి ఒడిగట్టిన కొందరు అధికార పార్టీ నాయకుల కొడుకులపై పోలీసులు చర్యతీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ కేసులో హోం మంత్రి మనవడు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం ఉందని వార్తలు వస్తున్నాయని, పోలీసులు వాస్తవాలను ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. ఘటన జరిగి వారం రోజులు అయినా నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.