Movies

ఆ వారం వస్తే… నన్నెవరూ ఆపలేరు

ఆ వారం వస్తే… నన్నెవరూ ఆపలేరు

‘లోఫర్‌’తో తొలిసారి కెమెరా ముందుకొచ్చింది దిశా పటానీ (పట్నీ). కానీ.. ఆ సినిమా ఫ్లాప్‌! తెలుగులో అవకాశాలు రాకపోతేనేంటి? బాలీవుడ్‌లో బడా స్టార్ల సినిమాల్లో నటించింది. జాకీచాన్‌తోనూ వెండితెర పంచుకొనే ఛాన్స్‌ దక్కించుకొంది. ఇప్పుడు ప్రభాస్‌ ‘ప్రాజెక్ట్‌ కె’లో సూపర్‌ ఛాన్స్‌ రావడంతో తెలుగునాట మరోసారి దిశ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆమె గురించిన కొన్ని ఆసక్తికరమైన కబుర్లు ఇవి…
పటానీ కాదు… పట్నీ…

దిశా పటానీ… అని పిలిస్తే దిశకు నచ్చదు. తనను ‘దిశాపట్నీ’ అని పిలవమంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో రాజ్‌పుత్‌ కుటుంబంలో పుట్టింది. తండ్రి పోలీస్‌ ఆఫీసర్‌. తల్లి హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. అక్క ఖుష్బూ పట్నీ ఆర్మీలో చేరారు. ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు.
పైలట్‌ కావాలనుకుని..చిన్నప్పటి నుంచీ దిశకు పైలట్‌ కావాలనే కోరిక ఉండేది. అందుకోసం చదువుపై శ్రద్ధ పెట్టింది. కానీ… అనుకోకుండా సినిమాల్లోకి వచ్చింది. అలా ముంబై వచ్చింది. సంపాదన కోసం కొన్ని కమర్షియల్‌ యాడ్స్‌లో కనిపించడం మొదలెట్టింది. క్రమంగా కెమెరా వైపు ఆకర్షితురాలైంది. తెలుగులో ‘లోఫర్‌’ తన తొలి చిత్రం. ఆ సినిమా ఫ్లాప్‌ అయినా బాలీవుడ్‌లో ‘ధోని’తో తొలి హిట్‌ కొట్టింది. ‘భాగీ 2’ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో ఇక వెనుదిరిగి చూసుకోలేదు.

స్వీట్స్‌ చూస్తే ఆగలేనుకథానాయికలంతా గ్లామర్‌ని కాపాడుకొనే యత్నంలో.. ఆహార నియమాల్ని నిష్టగా పాటిస్తారు. దిశ కూడా అంతే. క్యాలరీల లెక్క చూసుకొని మరీ… డైనింగ్‌ టేబుల్‌ ముందు కూర్చుంటుంది. ఆదివారం మాత్రం ఈ రూల్స్‌కి బ్రేక్‌ ఇచ్చేస్తుంది. ఆరోజు తనకిష్టమైనవన్నీ లాగించేస్తుంది. ‘‘ఆదివారం వస్తే ఫుడ్‌ విషయంలో నన్నెవరూ ఆపలేరు. ఆ రోజు చీటింగ్‌ డే. ఇష్టమైనవన్నీ తింటా. స్వీట్స్‌ అంటే చాలా ఇష్టం. చూస్తే టెమ్ట్‌ అయిపోతా’’ అని తన ఇష్ట్టాల్ని బయటపెట్టింది.

సల్మాన్‌.. చికెన్‌..సల్మాన్‌ ఖాన్‌ అంటే దిశకు చాలా ఇష్టం. తనతో నటించాలనే కోరిక ‘భరత్‌’తో తీరిపోయింది. సెట్లో సల్మాన్‌ తనని చూసుకొన్న విధానానికి ఇప్పటికీ పొంగిపోతుంటుంది. దిశకు చికెన్‌ అంటే ఇష్టమని తెలుసుకొన్న సల్మాన్‌.. ప్రతీ రోజూ ఇంటి నుంచి ఏదో ఓ చికెన్‌ ఐటెమ్‌ స్పెషల్‌గా చేయించి తీసుకొచ్చేవారట. జాకీచాన్‌తో ‘కుంగ్‌ఫూ యోగా’లో నటించి చైనీస్‌లోనూ అభిమానుల్ని సంపాదించుకొంది.

ఆ ‘బంధం’… మాకే తెలుసు…ప్రేమ విషయంలోనూ దిశకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రేమలో నిజాయితీ, స్వచ్ఛత చాలా ముఖ్యమని చెబుతుంటుంది. తనకూ కొన్ని బ్రేకప్‌ లవ్‌ స్టోరీలు ఉన్నాయట. అయితే అవేం పెద్దగా తనని బాధించలేకపోయాయని… దేన్నయినా సరే, తేలిగ్గా తీసుకొనే స్వభావం తనకుందని చెబుతుంది. టైగర్‌ ష్రాఫ్‌తో దిశ ప్రేమాయణం నడుపుతోందని బాలీవుడ్‌ కోడై కూస్తుంది. ఎక్కడికెళ్లినా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తుంటారు. ‘‘మా ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అది మాకే తెలుసు’’ అని తప్పించుకుంటుంది తెలివిగా దిశ.

ఫిట్‌నెస్‌ రహస్యం…సల్మాన్‌, జాకీచాన్‌లతో కలిసి పనిచేయడం వల్ల ఫిట్‌నెస్‌పై దృష్టి పెరిగిందని చెబుతుంటుంది దిశ. శరీరాకృతిని కాపాడుకొనేందుకు వాళ్ల దగర్నుంచి చాలా టిప్స్‌ నేర్చుకుందట. ‘‘నాకు స్నేహితులు చాలా తక్కువ. పార్టీలంటే అస్సలు ఇష్టం ఉండదు. దొరికిన సమయాన్ని ఎందుకు వదులుకుంటా? అందుకే జిమ్‌లో ఎక్కువసేపు గడుపుతా. డాన్స్‌, జిమ్నాస్టిక్స్‌, కిక్‌ బాక్సింగ్‌.. ఇవన్నీ నా ఫిట్‌నెస్‌ రహస్యాలు’’ అంటోంది దిశ