DailyDose

రేపు ఆంధ్ర రాష్ట్రానికి జేపీ నద్దా – TNI తాజా వార్తలు

రేపు ఆంధ్ర రాష్ట్రానికి జేపీ నద్దా  –  TNI  తాజా వార్తలు

* బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా సోమవారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. విజయవాడలోని పిన్నమనేని పాలిక్లినిక్‌ రోడ్డులోని సిద్ధార్థ హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో శక్తి కేంద్రాల ప్రతినిధులతో సమావేశమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అదే రోజు సాయంత్రం విజయవాడలో వివిధ రంగాలకు చెందిన మేధావులతో సమావేశమై రాష్ట్రంలో స్థితిగతులపై చర్చిస్తారు. మంగళవారం రాజమహేంద్రవరంలో రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.

*ప్రధాని మోదీ మోకాళ్లకు మసాజ్‌ చేయడానికే ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ పర్యటన చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ప్రధానికి ఎంత మసాజ్‌ చేసినా జగన్‌ జైలుకు వెళ్లడం తప్పదన్నారు. ‘హైకోర్టు తీర్పు- ప్రభుత్వ తీరు’ అనే అంశంపై విజయవాడలోని ఓ హోటల్‌లో శనివారం అమరావతి పరిరక్షణ సమితి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ పెద్దలు జగన్‌ను పిలవ నేలేదని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లను తాకట్టు పెట్టడానికే జగన్‌ స్వయంగా ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. మోదీ మోకాళ్లకు మసాజ్‌ చేసి, తనను కేసుల నుంచి బయటపడేయమని వేడుకున్నాడని ఆరోపించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లి సీఎం సాధించిందేమీ లేదన్నారు. రాజధానిని అమరావతిలో నిర్మించాలని హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం మొండిగా మూడు రాజధానులు అనడంలో అర్థం లేదన్నారు. తక్షణమే రాజీనామా చేసి, మూడు రాజధానుల అజెండాతో ఎన్నికలకు వెళ్లాలని సవాల్‌ విసిరారు. మిగిలిన పక్షాలు అమరావతి రాజధాని అంశంతో ఎన్నికలకు వెళ్తాయన్నారు.

*ఆర్టీసీ ఉద్యోగులకు వేతన ఒప్పందం, అలవెన్సులు, కరువు భత్యం ఇతర అంశాలపై ఇచ్చిన రెండు ఉత్తర్వులను పునఃసమీక్షించాలని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రహ్మణ్యం, కేఎస్‌ లక్ష్మణరావు, యండపల్లి శ్రీనివాసరెడ్డి, ఐ.వెంకటేశ్వరరావు, షేక్‌ సాబ్జీ డిమాండ్‌ చేశారు. ఆ ఉత్తర్వులు ఆర్టీసీ ఉద్యోగుల, కార్మికుల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉన్నాయని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీ కార్మికులలో తీవ్ర నిరసన ఉందని పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2021 వేతన ఒప్పందాన్ని విలీనం పేరుతో కనుమరుగు చేశారని, ఫలితంగా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఒక వేతన ఒప్పందాన్ని వారు కోల్పోయారని తెలిపారు. దీని వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయారని, రెండున్నర సంవత్సరాలుగా ఆర్టీసీ ఉద్యోగులకు రావలసిన గత వేతన బకాయిలు, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ బకాయిలు, ఐదు విడతల కరువు భత్యం బకాయిలు చెల్లించలేదని పేర్కొన్నారు. 11వ పీఆర్సీకి సంబంధించిన వేతన జీవోలు ఇచ్చేటప్పుడు గత వేతన ఒప్పందాన్ని, గతంలో ఆర్టీసీ ఉద్యోగులు నష్టపోయిన 19 శాతం వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. క్యాడర్‌ ఫిక్సేషన్‌లో కూడా అన్యాయం చేశారన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ జీవోలలో తక్షణమే మార్పులు చేసి, వారి పే స్కేల్‌ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ దూకుడు పెంచింది. నిన్న పవన్ కల్యాణ్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ భేటీలో జగన్ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. పొత్తులపై తగ్గేదేలే అని పవన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇవాళ మెగా అభిమాన సంఘాల ప్రతినిధులతో నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో భవిష్యత్తు కార్యాచరణపై అభిమానులకు దిశానిర్దేశం చేశారు.

*చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్తలు గోవా వీధుల్లో హల్‌చల్ చేశారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కారు తిప్పుతుండడంతో అక్కడి సెక్కూరిటీ పోలీసులు అడ్డుకున్నారు. వారికి తాము కాణిపాకం బోర్డు డైరెక్టర్మ నుషులని ఆ తర్వాత డిప్యూటీ సీఎం మనుషులమంటూ చెప్పుకొచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది. విచారిస్తే..పెనుమూరు మండలం చిప్పరపల్లెలోని వైసీపీ కార్యకర్తలు మునీంద్ర కేశవులు గ్రామ వలంటర్ పృధ్వీతో పాటు మరికొంతమంది గోవాకు వెళ్లినట్లు తెలిసింది.

*తిరుమలలో ఘనంగా శ్రీ భోగశ్రీనివాసమూర్తి ఆవిర్భావోత్సవం
శ్రీవారి పంచ బేరాలలో ఒకటైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవరాణి సామవై ప్రతిష్ఠించిన దినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక సహస్రకలశాభిషేకాన్ని టీటీడీ ఆదివారం నాడు వైభవంగా నిర్వహించింది. ఇందులో బాగంగా ఉదయం 6.00 నుంచి 8.00 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, శ్రీ విష్వక్సేనులవారిని వేంచేపు చేశారు. శ్రీ‌వారి మూల‌మూర్తికి ముందు గ‌రుడాళ్వార్ స‌న్నిధిలో కౌతుకమూర్తి అయిన‌ శ్రీ మనవాళపెరుమాళ్ ను, అయ‌న‌కు అభిముఖంగా శ్రీ విష్వక్సేనులవారిని ఉంచారు. త‌ర్వాత‌ శ్రీ‌వారి మూల‌మూర్తిని శ్రీ భోగ శ్రీ‌నివాస‌మూర్తికి క‌లుపుతూ దారం క‌ట్టి అనుసంధానం చేశారు. అన‌గా శ్రీ భోగ శ్రీ‌నివాస‌మూర్తికి నిర్వ‌హించే అభిషేకాధి క్ర‌తువులు మూల‌మూర్తికి నిర్వ‌హించిన‌ట్లు అవుతుంది. అనంత‌రం వేద పండితులు వేద పారాయ‌ణం చేయ‌గా, అర్చకస్వాములు ఏకాంతంగా ప్ర‌త్యేక సహస్రకలశాభిషేకం వైభ‌వంగా నిర్వహించారు. కాగా శ్రీవారి ఆలయంలోని ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెదజీయ్య‌ర్‌ స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్ దంప‌తులు, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు, పోటు పేష్కార్ శ్రీ పార్థ‌సార‌ధి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఫార్‌ప‌తేదార్ శ్రీ తుల‌సీ ప్ర‌సాద్‌, అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

*టెన్త్‌ ఫలితాల విడుదలలోనూ జాప్యం, అయోమయం ఎందుకింత గందరగోళమని ట్విటర్‌లో వేదికగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. పరీక్ష ఫలితాలు వాయిదా చేతకానితనమేనని విమర్శించారు. మొన్నటివరకు పరీక్షల పేపర్‌ లీక్.. ఇప్పుడు ఫలితాలు ప్రకటించలేని నిస్సహాయత అన్నారు.

*వేపాడ మండలంలోని వైసీపీ (YCP)కి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ (TDP)లోకి భారీగా చేరికలు జరిగాయి. మాజీ ఎమ్మెల్యే లలితకుమారి సమక్షంలో సింగరాయి గ్రామం నుంచి సుమారు 50 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. వారికి పసుపు కండువాలతో కోళ్ల రాంప్రసాద్, వేపాడ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గొంప వెంకటరావు స్వాగతం పలికారు.

*పాలకుల మైండ్‌ సెట్‌ మారాలని లేదంటే ప్రజలే మారుస్తారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగుతుందని, ఆ ప్రాంతంలో అందరి ఆస్తుల విలువ పెరుగుతుందన్నారు. 900 రోజులుగా ఉద్యమిస్తున్న రాజధాని రైతులకు అభినందనలు తెలిపారు. శనివారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తుందని తాను భావించడం లేదన్నారు. అప్పీలుకు గడువు ముగిసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లినా అక్కడ మొట్టికాయలు తప్పవన్నారు. తమ పార్టీ ప్రభుత్వం వచ్చాక అమరావతిని సర్వనాశనం చేసిందనడంలో అతిశయోక్తిలేదన్నారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల ఆవిరైన ప్రజల ఆస్తి విలువ రూ.2 లక్షల కోట్లు ఉంటుందని వెల్లడించారు. మంత్రులు, ప్రభుత్వ పెద్దలు తమ మైండ్‌లో ఏముందో తెలియక ఇష్టారీతిన మాట్లాడుతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. పాలకుల మైండ్‌ సెట్‌ మారాలని లేదంటే ప్రజలే మారుస్తారని స్పష్టం చేశారు.

*నేర ఘటన జరిగిన స్థలంలో తాను లేననే కారణం చూపి నిందితుడు బెయిల్‌ మంజూరు చేయాలని కోరలేరని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ కేసులో నిందితుడి బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఎర్రచందనం అక్రమ రవాణా తీవ్రమైన నేరమని కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఇటీవల తీర్పు ఇచ్చారు. ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా శ్రీసిటీ హైటెక్‌ సిటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

*అధికార వైసీపీ నేతలు, అనుచరగణం కన్ను పడితే చాలు… భూమి ఏదైనా స్వంతం కావాల్సిందే. అందుకోసం వివాదాలు సృష్టిస్తారు. దౌర్జన్యానికి దిగుతారు. పోలీసులనూ మేనేజ్‌ చేస్తారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అదే జరిగింది. స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి సోదరుడి అండతో కబ్జాకోరులు కొందరు చెలరేగిపోయారు. సదరు భూమికి తామే వారసులమంటూ హడావుడి చేశారు. నిర్మాణంలో ఉన్న ఇళ్లను పొక్లెయినర్‌ పెట్టి కూల్చివేశారు. అడ్డుకునేందుకు యత్నించిన బాధితులపై దౌర్జన్యానికి దిగారు. గత్యంతరంలేని బాధితులు మార్కాపురం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి వారికి మద్దతుగా నిలిచారు.

*తిరుమల శ్రీవారి దర్శనానికి నడకమార్గంలో వెళ్లే భక్తుల కోసం టీటీడీ గ్రీన్‌ కార్పెట్‌ సౌకర్యం కల్పిస్తోంది. మండిపోతున్న ఎండలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలిపిరి-తిరుమల నడక మార్గంలో 24 గంటల్లో గ్రీన్‌ కార్పెట్‌ ఏర్పాటు చేయాలని శనివారం టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం నుంచి నడకమార్గంలో నీళ్లు చల్లి, గ్రీన్‌ కార్పెట్‌ పరిచే ఏర్పాట్లు చేస్తున్నారు.

*శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గౌతు శిరీషకు శనివారం రాత్రి సీఐడీ నోటీసులు జారీ అయ్యాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని అభియోగం మోపుతూ సోమవారం ఉదయం 10 గంటలకు మంగళగిరి సీఐడీ కార్యాలయానికి హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈమేరకు సోంపేటలోని ఆమె స్వగృహంలో శనివారం రాత్రి 11 గంటలకు నోటీసులందించారు. తనపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పలుమార్లు శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు లేకపోగా.. తిరిగి ఆమెపైనే కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది.

*టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఓ ఇంటిని నిర్మించుకోనున్నారు. దీనికి అవసరమైన భూమి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ శనివారం పూర్తయింది. శాంతిపురం మండలం కడపల్లె వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 99.77 సెంట్ల విస్తీర్ణం గల స్థలాన్ని ఆయన సుబ్బమ్మ అనే వృద్ధురాలి నుంచి కొనుగోలు చేశారు. దశాబ్దాలుగా చంద్రబాబు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా ఆయనకంటూ సొంత ఇల్లు కుప్పం నియోజకవర్గంలో లేకపోవడం విమర్శలు చేయడానికి విపక్షాలకు అవకాశమిచ్చింది. దీంతో చంద్రబాబు సొంత ఇల్లు కట్టుకోవాలన్న నిశ్చయానికి వచ్చారు. ఇందుకోసం కడపల్లె వద్ద జాతీయ రహదారిని అనుకుని ఉన్న స్థలాన్ని ఎంపిక చేశారు. చంద్రబాబు ఈ స్థలాన్ని పరిశీలించి, రిజిస్ట్రేషన్‌ పత్రాలపై సంతకం కూడా చేసేశారు. ఆయన ప్రతినిధిగా చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలపై శనివారం సంతకాలు చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ విజయకుమార్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ నెలాఖరులోగా ఇక్కడ ఇంటి నిర్మాణానికి చంద్రబాబు భూమి పూజ చేయనున్నట్లు సమాచారం

*రాష్ట్రంలో హత్యలను సీఎం జగన్‌ ప్రోత్సహిస్తున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. పల్నాడులో రెచ్చిపోతున్న వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బహిరంగంగా ఎన్‌కౌంటర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పల్నాడులోని జంగమేశ్వరపాడులో హత్యకు గురయిన టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన శనివారం విజయవాడలోని తన నివాసం నుంచి బయలుదేరారు. అయితే, అనుమతి లేదంటూ వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వెంకన్న రోడ్డుపై బైఠాయించి పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. పల్నాడులో గతంలో తనపై కూడా హత్యాయత్నం చేశారని, అక్కడ పిన్నెల్లి అరాచకాలకు అంతులేకుండా పోయిందని, అతనిని బహిరంగంగా ఎన్‌కౌంటర్‌ చేయాలని అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేక జగన్‌ హత్యలను ప్రోత్సాహిస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్త జల్లయ్య హత్యకు గురయితే, అతనికి పార్టీ నాయకులుగా తాము నివాళి అర్పించడానికి వెళ్లకుండా అడ్డుకోవడమేమిటని నిలదీశారు.

* వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో హత్యకుగురైన కారు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం కుటుంబానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించిన రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని శనివారం సామర్లకోటలోని మృతుని భార్య ఇంటికి వెళ్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ ఆధ్వర్యంలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎ్‌స.రాజు, మాజీ మంత్రి జవహర్‌ అందజేశారు.

*ఏపీఐఐసీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వచ్చిందంటూ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారం తప్పని ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది శనివారం తెలిపారు.

*వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ నేత నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు. ఇంత దరిద్ర, అరాచ‌క‌ పాలన చరిత్రలో ఎప్పుడూ చూడలేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆఖరికి పదో తరగతి ఫలితాల విడుదలలో కూడా రాజకీయమా? అని ప్రశ్నించారు. మంత్రికి సమాచారం లేదని ఫలితాల తేదీని అకస్మాత్తుగా వాయిదా వేస్తారా అని నిలదీశారు. పిల్లల భవిష్యత్తుతో వైసీపీ ప్రభుత్వం ఆటలాడుతోందని దుయ్యబట్టారు. ఇంతకీ వాయిదా వేసింది మంత్రిగారు అలిగారనా?.. లేక ఫలితాల్లో జగన్ మార్క్ మార్కుల‌ మార్పుల కోసమా? అని లోకేష్‌ ప్రశ్నించారు.

*జూలై 2,3,4 తేదీల్లో సొంత నియోజకవర్గంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు పర్యటించనున్నారు. ప్రధాని మోదీ జూలై 4న భీమవరం వస్తున్న సందర్భంగా ప్రధాని పర్యటన నిమిత్తం రఘురామ సొంత నియోజకవర్గానికి రానున్నారు. ఈ నేపథ్యంలో తనకు అదనపు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ సెక్రటరీకి రఘురామ లేఖ రాశారు. రెండున్నర సంవత్సరాల తర్వాత నరసాపురం పార్లమెంటు పర్యటనకు రఘురామ వస్తున్నారు.

* నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. కుటుంబ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు.వైసీపికి దమ్ముంటే ఓట్లు కొనకుండా స్వచ్ఛందంగా ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. టీడీపికి స్థిరమైన సిద్ధాంతం లేదన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఆత్మకూరులో ఎందుకు పోటీ చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీకి చేతనయితే మంత్రులను ఎన్నికల ప్రచారంలోకి దింపకుండా కేవలం అభ్యర్థులే ప్రచారంలో పాల్గొని లక్ష మెజారిటీతో గెలుపొందాలన్నారు.

*భారత దేశంలోనే సూపర్ క్రిటికల్ అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన దామోదర సంజీవయ్య విద్యుత్ కేంద్రాన్ని ప్రైవేటీకరణ చేయడం సిగ్గు చేటని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అధికార దుర్వినియోగంతోనే బూడిద తొట్టిలు కూలిపోయాయని… 40మంది ప్రాణాలు నష్టపోయేదని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడంతో రోజుకు 10 కోట్ల నష్టం కలుగుతోందన్నారు. ఓడ రేవు లేని తెలంగాణ రాష్ట్రంలో సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉంటే ప్రక్కనే కృష్ణ పట్నం ఓడరేవు పెట్టుకుని పవర్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వం చేతకాని తనాన్ని నిదర్శనమని మండిపడ్డారు. టీడీపీ హయాంలో టన్ను బొగ్గు ఐదు వేల రూపాయలు అని.. ఇప్పుడైతే టన్ను ఇరవై నాలుగు వేల రూపాయలకు కొనుగోలు చేస్తున్నారని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

*ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే జగన్‌ పాలన పోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సోదరుడు, పార్టీ పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు అన్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శుక్రవారం నగరంలోని మాధవధార వుడా కాలనీలోని పార్టీ కార్యాలయంలో జనసైనికులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో పర్యావరణానికి చేటు చేస్తూ రుషికొండను నామరూపాల్లేకుండా చేశారని దుయ్యబట్టారు. విద్యాసంస్థల నిర్వాహకుడిగా వున్న పి.నారాయణ ఒక అధ్యాపకుడన్న విషయం కూడా పరిగణనలోకి తీసుకోకుండా అరెస్టు చేసి జైలులో పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

*బయెలాజికల్‌-ఇ సంస్థ రూపొందించిన కార్బెవాక్స్‌ టీకాను బూస్టర్‌ డోసుగా ఉపయోగించేందుకు భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) పచ్చజెండా ఊపింది. 18 ఏళ్లు పైబడిన వారికి కార్బెవాక్స్‌ను బూస్టర్‌ డోస్‌గా ఇచ్చేందుకు శనివారం అనుమతినిచ్చింది. గతంలో కొవిషీల్డ్‌ లేదా కొవాక్సిన్‌ టీకాలు తీసుకున్న వారు కూడా కార్బెవాక్స్‌ను బూస్టర్‌గా తీసుకోవచ్చు. అయితే, ఆ టీకాలు రెండు డోసులు తీసుకుని 6 నెలలు పూర్తైన తర్వాతే కార్బెవాక్స్‌ను వైద్యుల సూచనలతో తీసుకోవాలి. తమ టీకాకు బూస్టర్‌గా డీసీజీఐ ఆమోదం లభించడంపై బయోలాజికల్‌-ఇ ఎండీ మహిమ దాట్ల హర్షం వ్యక్తం చేశారు.

*బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ హైదరాబాద్‌లో శనివారం కాంగ్రెస్‌, సీపీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీల నాయకులు ఆందోళనలు నిర్వహించారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద యువజన కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా పోలీసులు అడ్టుకుని అరెస్టు చేశారు. దీంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కొద్దిసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. పోలీసులు వారిని బలవంతంగా అరెస్టు చేసి రాంగోపాల్‌పేట, వివిధ స్టేషన్‌లకు తరలించారు.

*ఎన్నో సంవత్సరాల వరదముంపు సమస్యకు SNDP కార్యక్రమంతో శాశ్వత పరిష్కారం కానున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాద అన్నారు. శనివారం సికింద్రాబాద్ లోని SP రోడ్ లో గల పికెట్ నాలా పై SNDP కార్యక్రమంలో భాగంగా 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను MLA సాయన్న తో కలిసి పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిజాం కాలంలో నిర్మించిన నాలాలు నేటి వరకు సరైన పర్యవేక్షణ లేక, ఆక్రమణ లతో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నగరంలోని నాలాలకు ఎగువ నుండి వచ్చే వరదనీటితో సమీప కాలనీలు ముంపుకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.

*మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా వీలైనం తర్వగా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపారు. ఫడ్నవీస్‌ కరోనా బారినపడడం ఇది రెండోసారి. ఇంతకు ముందు ఆయన 2020లో వైరస్‌ బారినపడగా.. ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.

*జూబ్లీహిల్స్ పీఎస్‌ను ముట్టడించిన బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. మంది బీజేపీ నాయకులు కార్యకర్తలపై కేసు నమోదైంది. మీడియా కథనాల ఆధారంగా ఆందోళనకారులను గుర్తించారు. అత్యాచారం కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ…  రోజుల క్రితం పీఎస్‌ ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మిగతావారిని గుర్తించేపనిలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.

*బెంగళూరులో శనివారం గ్రాండ్‌ ప్రీ బ్యాడ్మింటన్‌ లీగ్‌ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు. ఈ లీగ్‌ వచ్చేనెల 1 నుంచి 10 వరకు జరగనుంది. సింధుతో పాటు శ్రీకాంత్‌, సాయి ప్రణీత్‌, గుత్తా జ్వాల, సాత్విక్‌లాంటి టాప్‌ షట్లర్లు లీగ్‌లో పోటీపడతారు.

*ప్రయాణికుల డిమాండ్‌ మేరకు తిరుపతి-కాచిగూడ, కామాఖ్య-బెంగళూరు కంటోన్మెంట్‌ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. జూన్‌ 5న 19.50 గంటలకు తిరుపతి నుంచి ప్రత్యేక రైలు(07596) బయలుదేరి తర్వాత రోజు 8.10 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందని పేర్కొన్నారు. అలాగే జూన్‌ 6న కామాఖ్యలో 7.00గంటలకు బయలుదేరి ప్రత్యేక రైలు (02522) బెంగళూరు కంటోన్మెంట్‌కు రెండో రోజు 9.00గంటలకు చేరుకుంటుందని తెలిపారు. జూన్‌ 11న 6.45 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్‌లో బయలుదేరే ప్రత్యేక రైలు (02521) రెండోరోజు 8.40గంటలకు కామాఖ్యకు చేరుకుంటుందని పేర్కొన్నారు. జూన్‌ 5, 12 తేదీల్లో తిరుపతి నుంచి 17.20గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు (07531)తర్వాత రోజు 5.00గంటలకు కాకినాడటౌన్‌కు వెళ్తుందని తెలిపారు.

*కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ గత నెల 24న చేపట్టిన ఆందోళన అదుపు తప్పి అల్లర్లు, విధ్వంసకర పరిస్థితులకు కారణమైన నిందితుల అరెస్టులు కొనసాగుతున్నాయి. అమలాపురం అల్లర్ల ఘటనలో మరో 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ ఘటనలో 112 మంది అరెస్ట్‌ చేశారు. అమలాపురం అల్లర్లు, విధ్వంసకర ఘటనలకు సంబంధించి ఏడు ఎఫ్‌ఐఆర్‌‌లు నమోదు చేశారు. ఈ కేసుల్లో నిందితుల గుర్తింపు కోసం ఏడు ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేశారు. నిందితులను సీసీ ఫుటేజ్‌, సోషల్‌ మీడియాలో చాటింగ్స్‌, వీడియో కెమెరాల ద్వారా నిందితుల గుర్తిస్తున్నారు. జిల్లాలో ఇంకా సెక్షన్‌ 30, 144 సెక్షన్లు అమలులో ఉంది.

*ఏపీ రాజధాని అమరావతి ఉద్యమానికి 900 రోజులు అయింది. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు ఇచ్చాయి. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఇప్పటికీ మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని చెబుతోంది. అయితే రాజధాని ఉద్యమం మాత్రం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించే వరకూ పోరాటం చేస్తామని రాజధాని రైతులు అంటున్నారు.

*జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ప్రకాశం జిల్లా రైతు ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అన్నంపెట్టే రైతన్న బహిరంగంగా మోసపోతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ముఠాగా ఏర్పడి రైతుకష్టం దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. మిల్లర్లు కనీస ధర ఇవ్వకున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గడపగడప కార్యక్రమంలో సమస్యలు పరిష్కరించమని అడిగితే బెదిరిస్తున్నారని విమర్శించారు. గడపగడపకు వెళ్తే జేజేలు కొడతారని ఎలా అనుకున్నారు అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు

*రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఈనెల 7 నుంచి డాక్టర్‌ వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈనెల 7న గుంటూరులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవం సందర్బంగా వ్యవసాయ యంత్రాల మేళ నిర్వహించనున్నారు. ఈ పథకం కింద తొలివిడతలో రైతులకు 3,800 ట్రాక్టర్లు, 300 కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌ అందించను న్నారు. ఈనెల 7న తొలివిడతగా 1,215 ట్రాక్టర్లు, 77 కంబైన్డ్‌ హార్వెస్టర్స్‌ను అందించనున్నారు. పథకం ప్రారంభోవ్తం సందర్భంగా నిర్వహించనున్న మేళా ఏర్పాట్లను వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.ఈ మేరకు ట్రాక్టర్‌ కంపెనీల ప్రతినిధులతో పాటు- తొలివిడతలో ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను అందుకోనున్న పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్టా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలోని లబ్దిదారులయిన రైతులతో అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు-చేసి విదివిధానాలను వివరిస్తున్నారు. మేళా నిర్వహించే ప్రాంతానికి ట్రాక్టర్లను ముందుగానే తీసుకురావాలనీ, ట్రాఫిక్‌ కు అంతరాయం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు.

*అసోంలోని కార్బి ఆంగ్లాంగ్‌ జిల్లా సరుపథార్‌లోని బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టిన ఘటనను ఆ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నుమల్ మోమిన్ ఆదివారంనాడు తీవ్రంగా ఖండించారు. ఘటనా స్థలిని సందర్శించిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సరుపథార్ కౌన్సిల్ నియోజకవర్గంలోని ప్రజలను ఎవ్వరు బెదరించినా విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ మద్దతుదారులు కానీ కాంగ్రెస్ మద్దతుదారులు కానీ ఎవ్వరికైనా ఇది వర్తిస్తుందని ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో గూండా రాజ్‌ను అనుమతించమని అన్నారు.