NRI-NRT

రూపాయి విలువ భారీగా పతనంతో .. రూటు మార్చుతున్న ఎన్నారైలు..

రూపాయి విలువ భారీగా పతనంతో .. రూటు మార్చుతున్న ఎన్నారైలు..

అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గుతున్న నేపథ్యంలో NRI ల పెట్టుబడి వ్యూహాలు మారుతున్నాయి. ఇటీవల కాలంలో ఎన్నారైలు..రియల్ ఎస్టేట్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులకు తోడు ప్రపంచవ్యాప్తంగా కేంద్రబ్యాంకులు వడ్డీ రేట్ల విషయంలో కఠిన వైఖరి తీసుకోవడం డాలర్ రూపాయి మారకం విలువపై ప్రతికూల ప్రభావం పడుతోంది. 2022లో ఇప్పటివరకూ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 5.2 శాతం మేర తగ్గింది. ఈ నేపథ్యంలో అనేక మంది ఎన్నారైలు ప్రీమియం, లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులతో పాటూ మధ్యస్థాయి ప్రాజెక్టుల్లోనూ పెట్టుబడులు మళ్లిస్తున్నట్టు ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే.. ఇండియా మాత్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తూ మదుపర్ల పెట్టుబడులకు భరోసా ఇస్తోంది. కేవలం ఇన్వెస్ట్‌మెంట్లను ఆకర్షించేందుకే కాకుండా.. దీర్ఘకాలంలో సంపద సృష్టికి కూడా భారత రియల్ ఎస్టేట్ రంగం అవకాశమిస్తోంది.’’ అని రియల్ ఎస్టేట్ సంస్థ హీరానందానీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

రూపాయితో పోలిస్తే డాలర్ బలపడటంతో ఎన్నారైలకు రియల్ ఎస్టేట్ డీల్స్ మునుపటి కంటే లాభదాయకంగా మారాయని చెప్పారు. ఒక డాలర్ పెట్టుబడికి మునుపటి కంటే ఎక్కువ స్థలం సొంతం చేసుకుంటున్నారని చెప్పారు. దీనికి తోడు రియల్ రంగంలో డిజిటైజేషన్ ఒరవడి కూడా ఎన్నారైలకు అనుకూలంగా మారిందన్నారు. ‘‘రూపాయి విలువ తగ్గుతున్న ఈ సమయం.. రియల్ పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలకు బాగా అనుకూలమైనది. పాశ్చాత్య దేశాలతో పాటూ అరబ్ దేశాల్లోని ఎన్నారైల ‘రియల్’ ఆసక్తి ఇదే చెబుతోంది’’ అని రహేజా హోమ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రమేశ్ రంగనాథన్ పేర్కొన్నారు.

భారతీయుల జనాభా అధికంగా ఉండే యూఏఈ, సౌదీ అరేబియా దేశాల కరెన్సీల విలువ కూడా డాలర్‌పై ఆధారపడి ఉంటుంది. దీంతో.. ఆయా దేశాల కరెన్సీతో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గుతోంది. ఫలితంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లోని ఎన్నారైల్లో రియల్ పెట్టుబడులపై ఆసక్తి పెరిగింది. ‘‘గల్ఫ్ మాకు మొదటి నుంచీ మంచి మార్కెట్. అయితే.. ఈ మధ్య ఎన్నారైలు భారత్‌లో రియల్ పెట్టుబడుల పెట్టేందుకు మునుపటి కంటే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు’’ అని Isprava group సీఈఓ ధిమాన్ షా పేర్కొన్నారు. టైర్-1 నగరాలతో పాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణె నగరాల్లోని ప్రీమియం రియల్ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నారైలు ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా.. బీచ్‌లు, హిల్ స్టేషన్లలోని ప్రాజెక్టుల్లోనూ పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు.