DailyDose

అమరావతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం – TNI తాజా వార్తలు

అమరావతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం –  TNI  తాజా వార్తలు

*అమరావతిలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం నిర్మించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈనెల 9న ప్రాణప్రతిష్ట, మహా సంప్రోక్షణ నిర్వహిస్తామని తెలిపారు. గవర్నర్ హరిచందన్‌, సీఎం జగన్, స్వరూపానందస్వామికి ప్రథమ దర్శనం కల్పిస్తామని తెలిపారు. టీటీడీ ఆలయాల్లో అమరావతిలోనిదే అతిపెద్ద నిర్మాణమన్నారు. తిరుమల ఆలయం తర్వాత అమరావతిలోని ఆలయమే అతిపెద్దదని పేర్కొన్నారు. రూ.40 కోట్లతో 25 ఎకరాల్లో శ్రీవారి ఆలయ నిర్మించామని పేర్కొన్నారు. ఆర్టీసీతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

*ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం వీళ్ల భేటీ జరగనుంది. మర్యాదపూర్వకంగానే గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

*ఏసీబీ 14400 మొబైల్ యాప్‌పై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారుల అవినీతి అరికట్టడానికి ఏసీబీ యాప్‌ పెట్టారు సరే.. మరి వైసీపీ పాలకుల అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలపై ఫిర్యాదులకు ఏ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అవినీతి నిరోధించడానికి ఏసీబీ ప్రత్యేక మొబైల్‌ యాప్‌ రూపొందించింది. ‘ఏసీబీ 14400’ పేరుతో రూపొందించిన ఇటీవల తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని సూచించారు. యాప్‌లో బటన్‌ నొక్కి వీడియో, ఆడియో రికార్డు చేసి ఏసీబీకి పంపాలని సూచించారు.

* జనసేన పార్టీ నేతలు హరిప్రసాద్, కిరణ్‌రాయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ సీఎం కావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తులున్నా.. లేకున్నా.. జనసేనదే అధికారమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్లు జనసేన నేతలు తెలిపారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి జరుతుందని, అందుకే బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్నామని చెప్పారు. బీజేపీలో 90 శాతం మంది పవన్ అభిమానులే ఉన్నారని హరిప్రసాద్, కిరణ్‌రాయల్‌లు వ్యాఖ్యానించారు.

*గన్నవరం విమానాశ్రయం వద్ద బీజేపీ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లోపలికి అనుమతిండం లేదంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జాబితాలో లేని పేర్లను పంపడం సాధ్యం కాదని ఎయిర్‌పోర్టు అధికారులు తేల్చిచెప్పారు. దీంతో విమానాశ్రయం వద్ద బీజేవైఎం కార్యకర్తలు ధర్నాకు దిగారు.

*తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఛలో మాచర్ల కార్యక్రమానికి వెళుతున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొల్లు రవీంద్ర పోలీసుల చర్యలను ప్రతిఘటించారు.

*గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వ్యవసాయ కమిషనర్ కార్యాలయానికి వెళుతున్న కిసాన్ కాంగ్రెస్ నాయకులను గాంధీభవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి అన్వేష్ రెడ్డితో పాటు కిసాన్ కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు వదిలి పెట్టడంతో కమిషనరేట్ కార్యాలయానికి కిసాన్ కాంగ్రెస్ నేతలు వెళ్లారు.

*సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు తెదేపా నాయకురాలు గౌతు శిరీషకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరయ్యే ముందు తన న్యాయవాదులతో కలిసి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. తనకు జారీ చేసిన నోటీసుల్లో ఎలాంటి వివరాలు పొందుపరచలేదన్నారు. వ్యక్తుల కంటే సంస్థలపై గౌరవం ఉందని.. అందుకే సీఐడీ విచారణకు వెళ్తున్నానని తెదేపా నాయకురాలు గౌతు శిరీష చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు సీఐడీ అధికారులు.. గౌతు శిరీషకు రెండు రోజుల క్రితం శ్రీకాకుళంలో నోటీసులు అందజేశారు. విచారణకు హాజరయ్యే ముందు గౌతు శిరీష తన న్యాయవాదులతో కలిసి మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయానికి వచ్చారు. తనకు జారీ చేసిన నోటీసులలో నేరానికి సంబంధించిన ఎలాంటి వివరాలు పొందుపరచలేదన్నారు.

*నిజామాబాద్: జిల్లాలోని నందిపేట మండలం సీహెచ్ కొండూరులో రాజ్యలక్ష్మి సమేత లక్ష్మి నర్సింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం మూడోరోజుకు చేరుకున్నది. ఉదయం సేవాకాలం, నివేదన, మంగళాశాసనము, వేద విన్నపాలు, శాత్తువమోర్తె, ద్వారతోరణ ధ్వజ కుంభారాధన, చతుఃస్థానార్చన అన్నిముఖం, మూలమంత్ర మూర్తి, మంత్ర వావనం, మృత్తికాస్నపనం, నయనోన్మీలనం, పంచసూక్త పరివార ప్రాయశ్చిత హవనం, నిత్య పూర్ణాహుతి, తీర్థప్రసాద గోష్టి కార్యక్రమాలు జరుగనున్నాయి.

*ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలో భారీ వర్షం కురిసింది. ఇక్కడ 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. మండలంలోని గ్రామాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిట్రపట్టి, గూళెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మెదేహాల్‌ వద్ద తాత్కాలిక వంతెన కోతకు గురైంది.నెల్లూరు, కావలి, గుడ్లూరులో ఈదురు గాలులతో వర్షం కురిసింది . తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సైతం పలుచోట్ల వర్షం రాజమహేంద్ర వరం, కోనసీమలో కుండపోత వర్షం పడింది . విశాఖ జిల్లా రుషికొండ, ఎండాడ, డెయిరీఫామ్‌ ప్రాంతాల్లో వర్షం నమోదయింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపల కంచేరులో పిడుగుపాటుకు కారి చిన్న (16) అనే బాలుడు మృతి చెందాడు.

*పల్నాడు జిల్లాలోని ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలెం రైతు భరోసా కేంద్రానికి తాళం పడింది. భరోసా కేంద్రానికి గత ఏడాదిగా అధికారులు అద్దె చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేశారు. అద్దె విషయంపై యజమాని బత్తుల రోశయ్య పలుసార్లు విన్నవించినా పట్టించుకోని పరిస్థితి. దీంతో రైతు భరోసా కేంద్రానికి తాళం వేశాడు. తన ఆరోగ్య పరిస్థితి సరిగాలేదని అద్దె ఇవ్వాలని యజమాని డిమాండ్ చేశాడు.

*ఆలూరులో రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కల్లివంక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటేందుకు ఓ కారు ప్రయత్నించగా వరద ఉధృతికి కొట్టుకుపోయింది. గుంతకల్లు నుంచి ఆలూరు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. వాగులో కారు కొట్టుకుపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కారు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రాత్రి కావడం, నీటి ఉధృతి పెరుగుతుండడంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. సోమవారం ఉదయం కారు కోసం గాలింపు చర్యలు చేపడతమని పోలీసులు తెలిపారు. వరద ఉధృతి కారణంగా ఆలూరు-గుంతకల్లు మధ్య రాక పోకలు నిలిపివేశారు. కాగా కర్నాటకకు చెందిన కారుగా గుర్తించారు. కారులో ఎంతమంది ఉన్నారన్నది తెలియరాలేదు.

*అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం బ్రాండిక్స్‌ సెజ్‌లో మరోసారి విషవాయువు కలకలం రేపింది. శుక్రవారం బ్రాండిక్స్‌ ఆవరణలోని సీడ్స్‌ కంపెనీలో విషవాయువు విడుదలై సుమారు మంది మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురైన విషయం విదితమే. దీంతో కంపెనీలో ఉత్పత్తిని నిలిపివేశారు. ఆదివారం సుమారు ఉదయం ప్రాంతంలో బ్రాండిక్స్‌ ఆవరణలో ఘాటైన వాసన రావడంతో సెక్యూరిటీ సిబ్బంది గమనించి వెంటనే యాజమాన్యానికి ఫోన్‌ చేసి చెప్పారు. యాజమాన్య ప్రతినిధులు విశాఖలోని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు సమాచారం ఇచ్చారు. విశాఖ నుంచి పీసీబీ బృందం వచ్చి తనిఖీలు నిర్వహించి ప్రమాదం లేదని చెప్పినట్టు తహసీల్దార్‌ రాంబాయి తెలిపారు.

*‘‘అంధకారంలోకి వెళ్లిపోతున్న రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అభిమాన సంఘాలు రాజకీయ ప్రక్రియలో భాగంగా మారాలి. రాజకీయంగా జనసేన పార్టీ లాంటి ఒక క్లీన్‌ ప్లాట్‌ ఫామ్‌ మనకు ఉంది. పార్టీని గెలిపించుకుని పవన్‌ కల్యాణ్‌ని సీఎం చేయడానికి అంతా కలిసి రావాలి’’ అని ఆ పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పిలుపు ఇచ్చారు. ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర చిరంజీవి యువత ప్రతినిధులు ఆయనతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘ఈ ప్రయాణంలో ఎక్కడా బేదాభిప్రాయాలు లేకుండా కలిసికట్టుగా ముందుకు సాగుదాం. రాష్ట్రంలో ఎంతో మంది సీఎంలు వ చ్చారు. ఇటువంటి పాలన ఎప్పుడూ చూడలేదు. పవన్‌ కల్యాణ్‌ లక్ష్యంగా చేసుకుని ఆయనకు నష్టం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఎంతో మంది నష్టపోయారు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పని చేస్తోంది. అభిమానులు 100 శాతం జనసేన జెండా మోసేందుకు సిద్ధంగా ఉండాలి. గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకూ పార్టీని తీసుకువెళ్లాలి. మండల, గ్రామ స్థాయి కమిటీల్లో మీకు ప్రాధాన్యం ఉండేలా చూస్తాం’’ అని మనోహర్‌ స్పష్టం చేశారు. సమావేశానికి నాయకత్వం వహించిన చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామి నాయుడు మాట్లాడుతూ… జనసేన పార్టీ విజయంలో తమ వంతు పాత్ర పోషించేందుకు సంసిద్ధతంగా ఉన్నామని తెలిపారు.

* టమాటా ధర ఠారెత్తిస్తోంది. నిరుడు కిలో రూ.10కూడా పలకలేదు. కోత కూలి దండగని రైతులు తోటల్లోనే వదిలేశారు. ఈ ఏడాది చూస్తే.. కిలో టమాటాలు వంద నోటుకు సరితూగాయి. గత నెలలోనే సెంచరీ కొట్టిన టమాటా ధరను అదుపు చేసేందుకు ప్రభుత్వం ఇతర ప్రాంతాల నుంచి దాదాపు వంద టన్నులను తెప్పించి, రైతుబజార్లలో విక్రయించింది. సబ్సిడీ లేకుండా బయట మార్కెట్‌ కంటే కిలోకి రూ.10-15తక్కువకు అమ్ముతున్నారు. అయితే నాశిరకం టమాటాలను సేకరించి, సరసమైన ధరకు అందుబాటులోకి తెచ్చామని మార్కెటింగ్‌ శాఖ అధికారులు ప్రచారం చేసినా.. సబ్సిడీ లేకపోవడంతో పేద, మధ్యతరగతి వర్గాలు తప్ప.. సంపన్న వర్గాలు రేటు ఎక్కువైనా బయట మార్కెట్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. దీంతో బయట మార్కెట్‌లో కిలో రూ.100 వరకు ఉన్న ధర కాస్త తగ్గింది.

*అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ఉదయం షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో రోగులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆపరేషన్‌ థియేటరు పక్కన ఉన్న స్విచ్‌ బోర్డులో ఉదయం 9 గంటల ప్రాంతంలో షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మంట లు చెలరేగాయి. పెద్ద శబ్దంతో నిప్పులు ఎగసిపడి, దట్టమైన పొగ వ్యాపించడంతో రోగులు భయాందోళనకు గురయ్యారు. అడ్మిషన్‌లో ఉన్న రోగులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు బయటకు పరుగులు పెట్టారు. సెక్యూరిటీ గార్డులు మంటలు వ్యాపించకుండా నియంత్రించారు.

* వారిద్దరిది ఒక దేశం కాదు.. అయితేనేం.. ఉపాధి కోసం మరో దేశానికి వెళ్లిన వీరి మనస్సులు కలిశాయి. మూడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లితో ఒక్కటవుదామనుకున్న ఈ జంటకు.. తిరుపతి జిల్లాలోని వాకాడు మండలం బాలిరెడ్డిపాళెంలోని శ్రీపట్టాభిరామాలయం వేదికైంది. బంధువుల సమక్షంలో ఆదివారం హిందూ సంప్రదాయబద్ధంగా ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. కోట మండలం విద్యానగర్‌కు చెందిన ఆసం నాగార్జున జపాన్‌లోని ఓ కంపెనీలో స్టాఫ్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. శ్రీలంక కొలంబియాలోని కలుతర పట్టణానికి చెందిన లక్ష్మీప్రియమళి ఉన్నత చదువుల కోసం జపాన్‌కు వెళ్లారు. చదువు పూర్తికాగానే నాగార్జున పనిచేసే కంపెనీలోనే జాబ్‌లో చేరారు. ఇరువురి పరిచయం కొద్దిరోజులకే ప్రేమగా మారింది. వరుడు నాగార్జున తన కుటుంబ సభ్యులను ఒప్పించి హిందూ సంప్రదాయం ప్రకారంగా బంధుమిత్రుల సమక్షంలో బాలిరెడ్డిపాళెంలో పెళ్లి చేసుకున్నాడు. వఽధువు కుటుంబానికి ఈ పెళ్లి ఇష్టమే అయినప్పటికీ ఆ దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా పెళ్లికి రాలేకపోయారు. వరుడి కుటుంబ సభ్యులు, స్థానిక పెద్దలు వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.

*ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి పేరిట విద్యుత్‌ మీటరు ఉందని చూపారు. నెలకు రూ.400 బిల్లు వస్తుందని అమ్మఒడి కట్‌ చేశారు. జాబితాలో చోటులేకపోవడంతో ఆ విద్యార్థి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సందిగూడలో వెలుగుచూసిందీ ఘటన. గ్రామానికి చెందిన బిడ్డిక రాజేష్‌ కురుపాం ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. అమ్మఒడికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయంలో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించారు. అందులో రాజేష్‌ తల్లి సావిత్రమ్మ పేరు లేదు. ఇదేమని సచివాలయ సిబ్బందిని ప్రశ్నిస్తే రాజేష్‌ పేరిట విద్యుత్‌ మీటరు ఉందని.. నెలకు రూ.400కు పైగా విద్యుత్‌ బిల్లు వస్తుందని చెప్పడంతో షాక్‌కు గురయ్యారు.

* రాబోయే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లంతవడం ఖాయమని రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షుడు కుంచెం వెంకటసుబ్బారెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం సమితి ప్లీనరీ సమావేశం, బహిరంగ సభ కర్నూలులోని అంబేడ్కర్‌ భవన్‌లో నిర్వహించారు. సీఎం జగన్‌ కేవలం కేసుల కోసం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలుస్తున్నారని, అంతే తప్ప సీమ గురించి ప్రస్తావించలేడం లేదన్నారు. రాజధానిని రాయలసీమలో పెట్టాలని డిమాండ్‌ చేశారు.

*దెందులూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌కు బెదిరింపు కాల్‌ వచ్చింది. ‘నీ హత్యకు షూటర్‌ని మా బాస్‌ నియమించాడు’ అని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడని చింతమనేని ప్రభాకర్‌ ఏలూరు త్రి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు. ఆగంతకుడి ఫోన్‌కాల్‌పై దర్యాప్తు చేసి తన భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు. గన్‌మెన్‌ జీతాలకు వ్యక్తిగతంగా డబ్బు చెల్లించే ఆర్థిక స్థోమత తనకు లేదని, ప్రభుత్వమే ఉచితంగా భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ‘‘ఇటీవల నన్ను ఎన్‌కౌంటర్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. రెండు సార్లు ప్రయత్నించింది. మా టీడీపీ నాయకులు స్పందించకుంటే ఎప్పుడో చనిపోయేవాడిని. నా లాయర్‌కు ప్రభుత్వ సలహాదారు సజ్జల వార్నింగ్‌ ఇచ్చారు’’ అని ఇటీవల చింతమనేని ఏలూరులోని మొబైల్‌ కోర్టులో ప్రైవేట్‌ కేసు వేసిన సంగతి తెలిసిందే.

*తిరుమలలో ఆదివారం కూడా రద్దీ కొనసాగింది. వేసవి సెలవుల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచే తిరుమలకు భక్తుల రాక పెరిగిన విషయం తెలిసిందే. శ్రీవారి ఆలయంతోపాటు మాడవీధులు, అఖిలాండం, లడ్డూ కౌంటర్‌, బస్టాండ్‌, అన్నదాన భవనం, గదులు కేటాయించే కేంద్రాలు, కల్యాణకట్టలు యాత్రికులతో రద్దీగా మారాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యావనంలోని షెడ్లు సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి. కాగా, రాత్రి ఏడు గంటల సమయానికి సర్వదర్శనం క్యూలైన్‌ లేపాక్షి సర్కిల్‌ వరకు వ్యాపించింది. వీరికి 12 గంటల దర్శన సమయం పడుతోంది. కాగా, కరోనా తర్వాత రెండోసారి.. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు 90వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

* నివాస, కార్యాలయ పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించి భవిష్యత్‌ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం అమరావతి సచివాలయంలో ఆయన మొక్కలు నాటారు. ఎన్నికల కార్యాలయాల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిర్ణీత కాలంలో నియంత్రించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. గ్రీన్‌ ప్రొటోకాల్‌ కింద ప్లాస్టిక్‌, నాన్‌ సస్టయినబుల్‌ ఐటమ్స్‌ను నియంత్రిస్తూ భవిష్యత్తులో ఎన్నికలు నిర్వహించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

*హజ్‌ కమిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఈ ఏడాది 1185 మందికి హజ్‌ యాత్రకు అవకాశం లభించిందని హజ్‌ కమిటీ చైర్మన్‌ షేక్‌ గౌసుల్‌ అజామ్‌ శనివారం గుంటూరులో తెలిపారు.

*ట్యాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్న పేద బ్రాహ్మణులకు రాయితీపై కార్లు అందజేయనున్నట్లు బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్‌ తెలిపింది. స్విఫ్ట్‌ డిజైర్‌ కార్లపై రూ.2 లక్షలు రాయితీ లభిస్తుందని పేర్కొంది. ఈ పథకానికి ఆదివారం నుంచి ఈనెల 15 వరకూ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.

* రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జూలై 3న హుజురాబాద్‌లో రైతు ఉద్యమ మహాసభ నిర్వహించనున్నట్టు రెడ్డి సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పమ్మగారి రాంరెడ్డి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు స్వామిరెడ్డి తెలిపారు. ఈ మహాసభ కరపత్రాన్ని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆదివారం ఆవిష్కరించారని చెప్పారు. జేఏసీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ హుజురాబాద్‌లో వేలాది మంది రైతులతో సభ నిర్వహిస్తామని తెలిపారు. ఓసీ సామాజిక సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు రైతు ఉద్యమ సభకు సంపూర్ణ మద్దతు తెలిపారు.

*రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ సోమవారం ఉదయం కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సంద్భంగా లక్ష్మణ్‌కు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. అనంతరం అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రాలను లక్ష్మణ్‌కు ఆలయ ప్రధానార్చకులు అందజేశారు.