NRI-NRT

ఖతర్‌లో వెంకయ్యకు అవమానం

ఖతర్‌లో వెంకయ్యకు అవమానం

మహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని తీవ్ర అవమానానికి గురిచేశాయి. అర్ధ శతాబ్దానికి పైగా మంచి మిత్ర దేశంగా ఉన్న ఖతర్‌తో స్నేహ సంబంధాలపై నీలినీడలు కమ్ముకొన్నాయి. యాభై ఏండ్ల దౌత్య సంబంధాలకు ప్రతీకగా జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖతర్‌కు వెళ్లిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలవడానికి ఖతర్‌ ఎమిర్‌ అయిన అమీర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ అహ్మద్‌ ఇష్టపడలేదు. ఇద్దరి మధ్య ముందుగా నిర్ణయించిన విందు సమావేశం అర్ధాంతరంగా రద్దు అయింది. వైద్య కారణాల వల్ల విందు సమావేశం రద్దు చేసుకొంటున్నట్టు ఖతర్‌ అధికార వర్గాలు భారత ప్రభుత్వానికి సమాచారం అందించాయి. దీంతో సమావేశం అనంతరం ఇద్దరు నేతల సంయుక్త మీడియా సమావేశం కూడా రద్దయినట్టు వెల్లడించాయి. పేరుకు వైద్య కారణాలు చెప్తున్నప్పటికీ.. అసలు కారణం మాత్రం భారత్‌లో బీజేపీ నేతలు మహ్మద్‌ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలే కారణమని అర్థమవుతున్నది. ఆదివారం ఖతార్‌ ప్రధాని ఖలీద్‌ బిన్‌ ఖలీఫా బిన్‌ అబ్దుల్‌అజీజ్‌ ఆల్‌ థానీ, మంత్రి షేక్‌ ఖలీద్‌ బిన్‌ ఖలీఫాతో భేటీ అయిన వెంకయ్యతో డిప్యూటీ ఎమిర్‌ మాత్రం సమావేశం కాలేకపోయారు. ఒక పక్క వెంకయ్య ఖతర్‌ పర్యటనలో ఉండగానే.. మరో పక్క అక్కడి ప్రభుత్వం భారత దౌత్యవేత్తకు సమన్లు ఇచ్చి భారత్‌లో బీజేపీ నేతల వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేసింది.

ఆరని మంటలు
మహమ్మద్‌ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం తీవ్రమవుతున్నది. ఈ వ్యాఖ్యలను ఖండించిన దేశాల జాబితాలో తాజాగా ఇరాక్‌, లిబియా, మలేషియా, టర్కీ కూడా చేరాయి. ఇలాంటి హానికరమైన వ్యాఖ్యలను కట్టడి చేయకపోతే ప్రశాంతంగా జీవిస్తున్న పౌరుల మధ్య విద్వేష వాతావరణం ఆవరిస్తుందని, ఇది తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఇరాక్‌ హెచ్చరించింది. నూపుర్‌ అవమానకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు లిబియా పేర్కొంది. హింస, విద్వేషాన్ని విడనాడాల్సిన సమయం వచ్చిందని వెల్లడించింది. ఈజిప్ట్‌ కేంద్రంగా పనిచేస్తున్న అరబ్‌ పార్లమెంట్‌ కూడా నూపుర్‌ వ్యాఖ్యలపై మండిపడింది.

ఆమె వ్యాఖ్యలు ఎంతో బాధ్యతారాహిత్యంగా ఉన్నట్టు పేర్కొంది. నూపుర్‌ వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్న మలేషియా.. దేశంలో ప్రశాంత వాతావరణానికి హాని తలపెట్టే ఇలాంటి వారిని నిలువరించడానికి భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే, అక్కడి భారత దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. నూపుర్‌ వ్యాఖ్యలు ముస్లింలను కించపరచడమేనని టర్కీ మండిపడింది. నూపుర్‌ శర్మ, జిందాల్‌ అనుచిత వ్యాఖ్యలను సౌదీ అరేబియా, బహ్రెయిన్‌, యూఏఈ, జోర్డాన్‌, యెమెన్‌, అఫ్గానిస్థాన్‌, మాల్దీవులు, ఓమన్‌ సోమవారం ఖండించాయి. ఇరాన్‌, ఖతార్‌, కువైట్‌, పాకిస్థాన్‌ ఇప్పటికే భారత రాయబార్లకు సమన్లు పంపి తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి. తాజాగా ఇండోనేషియా కూడా సమన్లు జారీ చేసింది.

విచారణకు హాజరవ్వండి
ఈ నెల 22న తమ ముందు విచారణకు హాజరుకావాలని నూపుర్‌కు మహారాష్ట్ర పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. ఆమె వ్యాఖ్యల వీడియో క్లిప్పులను ఇవ్వాల్సిందిగా సంబంధిత న్యూస్‌ చానల్‌కు విజ్ఞప్తి చేశారు. తనను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో నూపుర్‌కు, ఆమె కుటుంబ సభ్యులకు ఢిల్లీ పోలీసులు భద్రతను కల్పించారు.