Devotional

ఏ పీఠమెక్కినా..శ్రీవారి పాద నృత్యమే!

ఏ పీఠమెక్కినా..శ్రీవారి పాద నృత్యమే!

‘కేదార్‌నాథ్‌ యాత్రికులకు హెచ్చరిక..’, ‘ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి.. చలి తీవ్రత అధికమైంది..’, మంచు ప్రభావంతో ప్రాణాపాయం తలెత్తవచ్చు..’ ఇవీ వాతావరణ శాఖ సందేశాలు. ఇలాంటి కఠిన సమయంలో.. మే 24న హైదరాబాద్‌ నుంచి ఒక బృందం బయల్దేరింది. మే 27 రాత్రి పదింటికి కేదార్‌నాథ్‌లో మంచు వర్షంలా కురుస్తున్నది. మంచు ముంచెత్తుతున్నా.. హిమగిరులు చలించేలా శివతాండవం నర్తించిందామె. దేశంలోని జ్యోతిర్లింగ క్షేత్రాలు, శక్తిపీఠాలే వేదికలుగా శాస్త్రీయ నృత్యాన్ని ప్రదర్శిస్తున్న నల్లా రమాదేవి పరిచయం.. ఆమె మాటల్లో..

మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు. భూదేవిపేటలో అమ్మమ్మ దగ్గర కొంతకాలం పెరిగాను. మా నాన్న సింగరేణి కార్మికుడు. భద్రాద్రి రామయ్య పాదాల చెంతనుంచే నా ప్రస్థానం ప్రారంభమైంది. ఒకవైపు సీతారాముల కల్యాణ మహోత్సవం, మరోవైపు నా నాట్య ప్రదర్శన. అదృష్టంగా భావించాను.

రామయ్య సన్నిధిలో..
నాలుగేండ్ల వయసులో నాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. భద్రాచలంలో గిరిజాదేవి గారి దగ్గర నేను భరతనాట్యం అభ్యసించాను. మా కుటుంబంలో ఎవరికీ సంగీతంతో గానీ, నాట్యంతో గానీ సంబంధం లేదు. నిజానికి గిరిజాదేవిగారు ట్యూషన్స్‌ చెప్పడానికి భద్రాచలం వచ్చారు. చాలామంది వెళ్తుంటే మా అమ్మానాన్న నన్నూ పంపారు. నాకేమో చదువుకంటే డ్యాన్స్‌ మీదనే ఎక్కువ ఆసక్తి ఉండేది. నా ఆసక్తిని ఆమె గమనించారు. సుదీర్ఘకాలం తన దగ్గరే శిక్షణ పొందాను. భరతనాట్యంతోపాటు కూచిపూడి కూడా నేర్చుకున్నా. అరంగేట్రం తర్వాత ఇంటర్‌ పూర్తయ్యేవరకు భద్రాద్రి, చుట్టుపక్కల ఆలయాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. తర్వాత మేం హైదరాబాద్‌ వచ్చేశాం. నాట్యం కొనసాగించాలని ఉన్నా గురువు దొరకలేదు. మరోవైపు కుటుంబ పరిస్థితులూ అంతంత మాత్రమే. కొంతకాలం నాట్యాన్ని పక్కనపెట్టి మార్కెటింగ్‌ సూపర్‌వైజర్‌ ఉద్యోగంలో చేరాను.
kcr5
the owl and the pussycat poem
వెంకన్నే అండ..
ఉద్యోగం చేస్తున్నానన్న మాటే కానీ, నా మనసంతా నాట్యం చుట్టే తిరిగేది. ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఆగిపోవడం ఏమిటి? అని ఆత్మ పరిశీలన చేసుకున్నా. ఏ రంగంలో ఉన్నా నాట్యమే అంతిమ లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నా. ఉద్యోగం చేస్తూనే నాట్య ప్రదర్శనలు ఇచ్చాను. మరింత ప్రావీణ్యం కోసం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సర్టిఫికెట్‌ కోర్సు చేశాను. డాక్టర్‌ ఇందిరా హేమగారు ఎంతో సాయం చేశారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను కష్టపడి నాట్యం నేర్చుకొని ఇక్కడిదాకా వచ్చాను. నాలాగే ఆసక్తి ఉన్నవాళ్లకు నాట్యం నేర్పాలనే సంకల్పంతో 2015లో మారేడ్‌పల్లిలో అకాడమీ ప్రారంభించాను. ఎవరి సహకారం లేకపోయినా, తిరుమల వెంకన్నే కొండంత అండ అనుకొని అకాడమీకి ‘శ్రీవారి పాదాలు’ అని పేరు పెట్టాను.

జ్యోతిర్లింగ శక్తిపీఠాలే
నలుగురి మెప్పు కోసం ప్రదర్శించేది కాదు నాట్యం. అలా చేస్తే నాకంటూ ప్రత్యేకత ఏముంటుంది? సాంస్కృతిక కార్యక్రమాల్లో మాత్రమే కాకుండా, ఆలయాలే వేదికలుగా నాట్య ప్రదర్శనలు ఇవ్వాలని నిర్ణయించుకున్నా. నిజానికి పూర్వం ఏ నాట్య ప్రదర్శన అయినా ఆలయాల్లోనే చేసేవాళ్లు. ఇంకా ఏదైనా చేయాలి అని ఆలోచిస్తుండగా శక్తిపీఠాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు మనసులో తట్టాయి. నాట్యం నేర్చుకొని ఈ రంగంలో ఉన్నందుకు ఇలాంటి ప్రయోగమేదైనా చేస్తేనే దానికి సార్థకత ఉంటుంది అనిపించింది. దీనివల్ల సాక్షాత్తు శివుడి ముందే ప్రదర్శన ఇస్తున్నామనే అనుభూతి కలుగుతుంది. అలా శక్తిపీఠాలు, జ్యోతిర్లింగ క్షేత్రాల్లో నాట్య ప్రదర్శనలు మొదలుపెట్టాను. ఇప్పటివరకు అష్టాదశ శక్తిపీఠాల్లో 10 క్షేత్రాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఆరు పూర్తయ్యాయి.

కేదార్‌నాథ్‌లో శివతాండవం
మా బృందంతో కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌ ఆలయాల ముందు ప్రదర్శనలు ఇవ్వాలని భావించాం. అయితే వాతావరణం అనుకూలంగా లేదని ప్రకటించారు. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలో సాహసం అవసరమా అన్నారు. ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదమూ ఉందన్నారు. అయితే, నేను వెళ్తున్నది సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడి చెంతకు. ఆయన ఆశీర్వాదం ఉంటే అందరం క్షేమంగా తిరిగి వస్తామని ధైర్యం చేశాం. గత నెల 24న హైదరాబాద్‌ నుంచి 22 మంది శిష్యురాళ్లతో బయల్దేరాను. మే 27 రాత్రి పది గంటల సమయం.

మంచు దట్టంగా కురుస్తున్నది. యాత్రికులంతా బిక్కుబిక్కుమంటున్నారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా నాట్య ప్రదర్శన ఇచ్చాం. అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. 29న బదరీనాథ్‌లోనూ మరో ప్రదర్శన ఇచ్చాం. ఒక కళాకారిణిగా నాకు ఇంతకన్నా సంతృప్తి ఏం కావాలి? కేదార్‌నాథ్‌, బదరీనాథ్‌ తదితర క్షేత్రాల్లో నాట్య ప్రదర్శనలు చేసేవాళ్లు లేరని కాదు. ప్రామాణికంగా శాస్త్రీయ నృత్యం ప్రదర్శించే వాళ్లు నాలుగు శాతం మాత్రమే ఉన్నారు. వారిలో నేనూ ఉన్నందుకు గర్వంగా ఉంది. పుష్పాంజలి నుంచి మొదలుపెడితే థిల్లాన వరకు అన్ని ఘట్టాలనూ సశాస్త్రీయంగా ప్రదర్శించాం. కేదార్‌నాథ్‌లో ప్రదర్శన నా జీవితంలో మరచిపోలేనిది.

చలో అమర్‌నాథ్‌
వచ్చే ఏడాది అమర్‌నాథ్‌, మానస సరోవరం, ఆ తర్వాత గంగోత్రి, యమునోత్రి క్షేత్రాల్లో ప్రదర్శనలు ఇవ్వాలని భావిస్తున్నాం. మా ప్రదర్శనలకు అధికారిక అనుమతులు, పోలీసుల భద్రత ఉంటుంది. 2018లో రుషికేశ్‌లో ఒక ప్రదర్శన ఇచ్చాం. హిమాలయాల నుంచి దిగివచ్చే గంగానదిలోకి దిగి కొన్ని ముద్రలతో నాట్యం చేశాం. అప్పట్లో ఇదొక చర్చనీయాంశమైంది. విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చాం. 2017లో దీపావళి ఉత్సవాల్లో భాగంగా మలేషియాలో, 2018లో దుబాయ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇచ్చాం. 2019లో వియత్నాం, ఇండోనేషియా, శ్రీలంకలోనూ నాట్యం చేసే అవకాశం దొరికింది. మా ఇద్దరు పిల్లలు సహా 150 మంది విద్యార్థులు నా దగ్గర నాట్యం నేర్చుకుంటున్నారు. నా విద్యార్థిని ఇటీవల సింగపూర్‌లో నృత్య అకాడమీ ఏర్పాటుచేసింది.