NRI-NRT

భారతీయ విద్యార్థులకు పండగలాంటి వార్త.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో వీసాల జారీకి ప్లాన్!

భారతీయ విద్యార్థులకు పండగలాంటి వార్త.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో వీసాల జారీకి ప్లాన్!

అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు పండగలాంటి వార్త. 2021ని మించి ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యార్థుల వీసాలను జారీ చేయనున్నట్లు ఢిల్లీలోని US Embassy అధికారిణి పాట్రిసియా లసినా మంగళవారం వెల్లడించారు. గతేడాది రికార్డు స్థాయిలో సుమారు 62 వేల మంది Indian Students కు వీసాలు జారీ చేశామని ఆమె తెలిపారు. అయితే, 2022లో అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ఏకంగా లక్ష దరఖాస్తులు తమ పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంబసీలో మంగళవారం నిర్వహించిన స్టూడెంట్ వీసా డేలో ఆమె ఈ మేరకు వివరాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా పాట్రిసియా లసినా మాట్లాడుతూ.. విదేశీ విద్యల పట్ల భారతీయుల ఆసక్తిని అర్థం చేసుకోవడంలో US ఆలస్యం చేసింది. విదేశీ విద్యార్థులను భారీ సంఖ్యలో స్వాగతించడం ద్వారా ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల ఆదాయాల్లో పెరుగుదలను చూసిన తర్వాత అమెరికాలో Student visa ప్రాసెస్‌ను సరళతరం చేయడం జరిగింది. అమెరికా విద్యాసంస్థలకు, సమాజానికి తోడ్పాటునందిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు అగ్రరాజ్యం ఎంతో విలువనిస్తుందని చెప్పారు. అమెరికాలోని విదేశీ విద్యార్థుల సంఖ్యలో భారతీయలు రెండో స్థానంలో ఉన్నారని ఆమె తెలిపారు. అలాగే ప్రస్తుతం రెండు లక్షలకు పైగా Indian Students అమెరికాలోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్న విషయాన్ని గుర్తు చేశారు. మొత్తం విదేశీ విద్యార్థుల్లో వారి సంఖ్య 20 శాతానికిపైగా ఉందని పాట్రిసియా లసినా పేర్కొన్నారు.