DailyDose

మరణ శిక్షల రద్దుకు మలేసియా అంగీకారం

మరణ శిక్షల రద్దుకు మలేసియా అంగీకారం

హత్య, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలకు మరణ శిక్ష విధించడాన్ని నిషేధించేందుకు అంగీకరిస్తున్నట్లు మలేసియా ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రకటనను మానవ హక్కుల సంఘాలు స్వాగతించాయి. అయితే మానవ హక్కుల అమలును మెరుగుపరుస్తామని గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని గుర్తు చేశాయి.
మలేసియాలో కొన్ని నేరాలకు పాల్పడినవారికి తప్పనిసరిగా మరణ శిక్ష విధించాలని చట్టాలు చెప్తున్నాయి. హత్య, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలు రుజువైతే, దోషులకు కచ్చితంగా మరణ శిక్ష విధించాలి. 2018లో అధికారం చేపట్టిన ప్రభుత్వం మరణ శిక్షను పూర్తిగా రద్దు చేస్తామని ప్రకటించింది. అయితే రాజకీయ ప్రత్యర్థులు, హత్యకు గురైనవారి బంధువులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ఈ ప్రతిపాదన నిలిచిపోయింది.
మలేసియా న్యాయ శాఖ మంత్రి వాన్ జునయిది టువాంకు జాఫర్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, మ్యాండేటరీ కేపిటల్ పనిష్‌మెంట్‌ను నిషేధించేందుకు కేబినెట్ అంగీకరించిందన్నారు. మరణ శిక్షకు బదులుగా విధించదగిన శిక్షలపై అధ్యయనం చేస్తామన్నారు. అందరి హక్కులకు రక్షణ, హామీ లభించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ నిర్ణయంతో వెల్లడవుతోందన్నారు.జునయిది ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, మరణ శిక్షను రద్దు చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. దీనికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంటు ఆమోదించవలసి ఉంటుందన్నారు. ఇది అనుకున్నంత సులువు కాదని చెప్పారు.హ్యూమన్ రైట్స్ వాచ్ డిప్యూటీ ఆసియా డైరెక్టర్ ఫిల్ రాబర్ట్‌సన్ మాట్లాడుతూ, కొన్ని నేరాలకు తప్పనిసరిగా విధించే మరణ శిక్షను రద్దు చేయాలని మలేసియా ప్రభుత్వం నిర్ణయించడం ముఖ్యమైన ముందడుగు అని తెలిపారు. అయితే ఈ నిర్ణయం అమల్లోకి రావడానికి అవసరమైన చట్ట సవరణలను చేసే వరకు వేచి చూడాలన్నారు.