NRI-NRT

హైద‌రాబాద్ నుంచి అమెరికా వెళ్లి ….. టెక్ గురుగా సుధీర్ కోనేరు

హైద‌రాబాద్ నుంచి అమెరికా వెళ్లి ….. టెక్ గురుగా  సుధీర్ కోనేరు

‘ఒక విషయాన్ని నువ్వు సరళంగా చెప్పలేకపోతున్నావంటే.. అది నీకు సరిగ్గా అర్థం కాలేదని అర్థం’ అంటారు ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌. అందుకే ‘ఏం చెప్పాలి? ఏం చెయ్యాలి అన్నది మనకూ ఓ క్లారిటీ ఉండాలి’ అంటారు జెనోటీ సీయీవో సుధీర్‌ కోనేరు. ఆ నైపుణ్యం వల్లనే హైదరాబాద్‌ నుంచి అమెరికా వెళ్లి ‘టెక్‌ గురు’గా పేరు తెచ్చుకున్నారు.

మీకు నచ్చిన సబ్జెక్ట్‌లో నూటికి 99 మార్కులు వస్తే.. ఎగిరి గంతేస్తారు కదా! అయితే, సుధీర్‌ కోనేరు వాళ్ల నాన్న మాత్రం ‘ఆ ఒక్క మార్కు ఎలా పోయింది? ఎందుకు రాలేదు? ఆ మార్కు రాకపోవడానికి నా కొడుకు చేసిన పొరపాటు ఏమిటి?’ అంటూ ఆరా తీసేవారట. అంతేకాదు, ఆ తప్పును తెలుసుకొని విశ్లేషించేవారట. మరోసారి జరగకుండా జాగ్రత్తపడేవారట. ఇలా తనకు ఇష్టమైన మ్యాథ్స్‌లో 99 మార్కులతో క్లాస్‌ఫస్ట్‌ వచ్చినా.. కోల్పోయిన ఆ ఒక్క మార్కూ.. తదుపరి ఎగ్జామ్‌లో చేజారిపోకుండా పక్కా పథకం వేసుకునేవారు సుధీర్‌. ఆ జాగ్రత్తే అతనికి వందల కోట్ల రూపాయల వ్యాపారాలను సమర్థంగా నిర్వహించడం ఎలాగో నేర్పింది. దాదాపు 22 ఏండ్లుగా సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని తనదైన శైలిలో శాసిస్తున్న సుధీర్‌.. ప్రస్తుతం ‘జెనోటీ’ పేరుతో ఎన్నో కంపెనీలు, సంస్థలకు క్లౌడ్‌ ఆధారిత సేవలు అందిస్తున్నారు.
0bcb9e23-13-crop-48d8b2
**ఎవరీ సుధీర్‌ ?
హైదరాబాద్‌ తెలుగు తేజం సుధీర్‌ కోనేరు. మద్రాస్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేశారు. తరువాత టెక్సాస్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో పీజీ చేశారు. తన ఉద్యోగ ప్రస్థానాన్ని మైక్రోసాఫ్ట్‌లో ప్రారంభించారు. ఆ కంపెనీలో దాదాపు 8 ఏండ్లు విధులు నిర్వర్తించి డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై చాలాకాలం పనిచేశారు. ఆ తర్వాత ‘ఇంటెల్లిప్రెస్‌’, ‘క్లిక్‌టులెర్న్‌ ఇంక్‌’ కంపెనీల బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత తనే సొంతంగా ‘సమ్‌టోటల్‌ సిస్టమ్స్‌’ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ప్రారంభించారు. ఆ సంస్థ వ్యాపారాన్ని వంద మిలియన్‌ డాలర్లకు తీసుకెళ్లారు. ఇప్పటికీ ‘సమ్‌టోటల్‌ సిస్టమ్స్‌’కు ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు ఉన్నాయి. అంతేకాదు, ఇండియాలో అనేక స్టార్టప్‌లకు ముఖ్య సలహాదారుగా ఉన్నారు సుధీర్‌. ప్రతి బాధ్యతనూ ఓ సవాలుగా తీసుకునే స్వభావం తనది.

**క్లౌడ్‌ ఆధారిత సేవలు
సమ్‌టోటల్‌ సిస్టమ్స్‌ నుంచి వీడ్కోలు తీసుకున్న తర్వాత ‘మేనేజ్‌మైస్పా’ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ప్రారంభించారు సుధీర్‌. కొన్నేండ్లుగా దానిని సమర్థవంతంగా నిర్వహిస్తూ.. వందల కోట్ల లాభాలు ఆర్జించారు. ప్రస్తుతం ‘మేనేజ్‌మైస్పా’ పేరును ‘జెనోటీ’గా మార్చారు. తన సోదరుడు ధీరజ్‌ కోనేరుతో కలిసి హైదరాబాద్‌ కేంద్రంగా ఫిట్‌నెస్‌ సెంటర్లు, మెడికల్‌ స్పాలు, యోగా స్టూడియోలు, బ్యూటీ సెలూన్‌లు, హెల్త్‌కేర్‌ క్లబ్‌లు ప్రారంభించారు. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సెంటర్లకు ఆదరణ పెరుగుతున్నది. కానీ, వ్యాపార నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలు యజమానులను ఇబ్బంది పెట్టాయి. ఈ సంక్షోభాన్ని ఓ వ్యాపార అవకాశంగా భావించారు సుధీర్‌. ఆ రంగానికి ‘జెనోటీ’ పేరుతో క్లౌడ్‌ ఆధారిత సేవలు అందిస్తున్నారు. సాంకేతిక సహకారం మొదలు.. సాఫ్ట్‌వేర్‌, మార్కెటింగ్‌, మొబైల్‌ యాప్‌ వగైరా విభాగాలకూ విస్తరించారు.
0bcb9e23-13-crop-48d8b1
**వందలాది మందికి ఉపాధి
సొంతంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ప్రారంభిస్తూ.. 22 ఏండ్లుగా ఎంతోమందికి ఉపాధి కల్పించారు సుధీర్‌ కోనేరు. జెనోటీ ద్వారా 50కి పైగా దేశాల్లో 12వేలకు పైగా సంస్థలు వీరి సేవలు పొందుతున్నాయి. వెయ్యికిపైగా బ్రాండ్‌లకు సాంకేతిక సహకారం అందిస్తున్నారు. ‘జెనోటీ ఫౌండేషన్‌’ ద్వారా ఎంతోమంది పేదలకు సేవ చేస్తున్నారు సుధీర్‌. కరోనా సమయంలో లక్షలాది బాధితులకు అండగా నిలిచారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఇండ్లు లేనివారికి ఆవాసం చూపిస్తున్నారు. విద్యార్థులకు టెక్నాలజీపై ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నారు. ఫుట్‌పాత్‌ మీద బతికే అనాథలకు ఉచితంగా క్షవరాలు చేయిస్తున్నారు. కంపెనీ నిర్వహణలోనూ అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నారు. ఉద్యోగుల పనితీరును నిశితంగా గమనిస్తూ.. కష్టపడేవారికి తగిన ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు సుధీర్‌.

నేను రోజును ముందుగానే ప్రారంభిస్తాను. రేపు ఏం చెయ్యాలో నాకు ఈరోజే ఓ క్లారిటీ ఉంటుంది. నా లక్ష్యాలను సాధించడానికి సంస్థలో ఎప్పుడు ఎలాంటి మార్పులు చెయ్యాలో నాకు బాగా తెలుసు.– సుధీర్‌ కోనేరు